close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చుక్కల్ని లెక్కబెడుతూ సినిమా చూద్దామా...

చుక్కల్ని లెక్కబెడుతూ సినిమా చూద్దామా...

చల్లగా వీచే పిల్ల గాలుల్ని ఆస్వాదిస్తూ, మెరిసే చుక్కలతో ముగ్గుపెట్టినట్లున్న ఆకాశాన్ని చూస్తూ ప్రకృతి ఒడిలో కూర్చుని పేద్ద తెరమీద సినిమా చూస్తుంటే... ఏమి హాయిలే హలా... అని పాడుకోకుండా ఉండగలమా... దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఓపెన్‌ ఎయిర్‌ సినిమా థియేటర్ల ట్రెండ్‌ ఇప్పుడు ఆ ఆనందాన్నే పంచుతోంది.  వీటిలో కార్లో కూర్చునే సినిమా చూసేవీ ఉన్నాయి.
పెట్టెల్లాంటి అపార్ట్‌మెంట్లలోపలా ఏసీ ఆఫీసుల్లోనూ బందీలుగా మారిపోతున్న ఈతరానికి రోజూ ఆరుబయట కూర్చుని సేదతీరే అవకాశం ఎలాగో ఉండదు. వారాంతపు సెలవుల్లో సరదాగా ఏ సినిమాకో వెళ్తే అక్కడ కూడా తలుపులన్నీ మూసేసి చీకట్లో కూర్చోబెట్టి సినిమా చూపిస్తారు. అలా అని ప్రతిసారీ పార్కుకే వెళ్లి కూర్చోనూ లేము. అందుకే, జనం మనసు తెలుసుకున్న కొన్ని సంస్థలూ థియేటర్ల కంపెనీలూ ఆరుబయటే పెద్ద తెరను ఏర్పాటు చేసి సినిమాలను వెయ్యడం మొదలుపెట్టాయి. వీటికోసం విశాలమైన గడ్డి మైదానాల్లో పచ్చని చెట్ల మధ్య థియేటర్లలో ఉండేలాంటి పెద్ద తెరల్ని ఏర్పాటు చేసి, ఎదురుగా కూర్చునేందుకు పరుపులూ కుషన్లూ లేదా పడక కుర్చీలూ బీన్‌ బ్యాగుల్లాంటివాటిని వేస్తారు. ప్రేక్షకులు వాటిమీద నచ్చినట్లూ కూర్చునీ పడుకునీ అస్తమిస్తున్న సూర్యుడినీ సాయంత్రం గూటికి చేరే పక్షుల గుంపులనూ ఆ తర్వాత  ఆకాశంలో మెరిసే తారల అందాలను ఆస్వాదిస్తూ హాయిగా సినిమా చూడొచ్చు. ఆరుబయట థియేటర్లలో డ్రైవ్‌ ఇన్‌
థియేటర్లు అని మరోరకమూ ఉన్నాయి.
ఈ తరహా వాటిలో అయితే కుటుంబంతో కలసి వేసుకెళ్లిన కారులో కూర్చునే సినిమా చూడొచ్చు. దీనికోసం వందా రెండొందల కార్లు కొన్ని వరుసల్లో అమరేలా పార్కింగ్‌ని ఏర్పాటు చేసి ఆ కార్లలో కూర్చునేవారికి  కనిపించేంత భారీ తెరను ఏర్పాటు చేస్తారు. కారులో కూర్చునే కావల్సినవి తెప్పించుకుని తినొచ్చు. అలా కాదు, ఆరుబయటే కూర్చుంటాం అంటే మన ఇష్టం. ఈ డ్రైవ్‌ ఇన్‌ థియేటర్లలో పార్కింగ్‌ స్థలానికి పక్కనే పిల్లలు ఆడుకునేందుకు రకరకాల ఏర్పాట్లూ చేస్తారు. దాంతో పెద్దలకూ పిల్లలక్కూడా ఆహ్లాదంగా ఉంటుంది. అయితే, డ్రైవ్‌  ఇన్‌ థియేటర్లు మామూలు థియేటర్లలానే స్థిరంగా ఒకచోటే ఉంటాయి. కానీ  మిగిలిన ఓపెన్‌ థియేటర్లను మూవీ  ఫెస్టివల్‌ అంటూ కొద్దిరోజులకోసం ఏర్పాటు చేసి తీసేస్తుంటారు. ఆరుబయట సినిమా చూడాలంటే వాతావరణం కూడా అనుకూలంగా ఉండాలిగా మరి.
విశాఖలో డ్రైవ్‌ ఇన్‌
ఇప్పటికే హైదరాబాద్‌లో ఆరుబయటి థియేటర్లను ఏర్పాటు చేసి సినిమాలు  చూపిస్తున్నారు. గత డిసెంబర్‌లో ఇనార్బిట్‌ మాల్‌ దగ్గర కూడా ఆరుబయట సినిమా వేసి చూపించారు. ఆ సమయంలోనే  మాదాపూర్‌లో ఓపెన్‌ ఎయిర్‌ మూవీ అండ్‌ ఫుడ్‌ ట్రక్‌ ఫెస్టివల్‌ జరిగింది. ఈ తరహా సినిమా ఫెస్టివల్స్‌లో టిక్కెట్ల ధర వాటిని నిర్వహించే క్లబ్బుల్ని బట్టి మారుతుంటుంది. ఉచితంగా సినిమాలు వేసే క్లబ్బులూ ఉంటాయి.  ఇక, విశాఖపట్టణంలో అయితే కొద్దిరోజుల కిందట ఏకంగా డ్రైవ్‌ఇన్‌ థియేటర్‌నే ప్రారంభించేశారు. స్థానిక షీలా  నగర్‌లో ఉన్న ‘బాలాజీ డ్రైవ్‌ ఇన్‌ సినిమా’కి వెళ్తే కారుని ఎక్కడ  నిలపాలో తెలిపే స్లాట్‌ నెంబరున్న టిక్కెట్‌ను ఇస్తారు. అదే మన కారు  సీటన్నమాట. చిన్న కార్లను ముందువరుసలోనూ ఎత్తుగా ఉండే కార్లను వెనక వరుసలోనూ ఉంచడం వల్ల 77 అడుగుల వెడల్పు,  36 అడుగుల ఎత్తూ ఉండే సినిమా తెర అందరికీ సమంగానే కనిపిస్తుంది. కార్లలో ఉండి చూసేవారికి ధ్వని స్పష్టంగా వినపడడానికి వీలుగా కారులోని ఎఫ్‌.ఎం.ను ఆన్‌ చేసి థియేటర్‌ యాజమాన్యం ఇచ్చే ఫ్రీక్వెన్సీకి ట్యూన్‌ చేసుకుంటే సరిపోతుంది. బయట కూర్చుని చూడాలనుకునేవారి కార్ల దగ్గర ఫ్యాన్లు ఏర్పాటు చెయ్యడంతో పాటు కుర్చీలు కూడా వేస్తారు. ఒక్కోకారుకు పది టిక్కెట్ల వరకూ ఇస్తారు. ఈ డ్రైవ్‌ ఇన్‌ సినిమా ప్రాంగణంలో రెస్టారెంట్‌తో పాటు  పెద్దవారికి మసాజ్‌ చెయిర్లూ పిల్లలకు  రకరకాల ఆట వస్తువులూ స్విమ్మింగ్‌ పూల్‌ లాంటివీ ఉన్నాయి.  ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా ఇలాంటి డ్రైవ్‌ ఇన్‌ థియేటర్లు అయిదారు మాత్రమే ఉన్నాయి. మల్టీప్లెక్స్‌ కంపెనీలు మరికొన్ని చోట్లా వీటిని నిర్మించడానికి పూనుకున్నాయి. ఇదో కొత్త ట్రెండ్‌ అన్నమాట.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.