close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పేదల పెళ్లికి పెద్ద పందిరి!

పేదల పెళ్లికి పెద్ద పందిరి!

ఏ వ్యక్తికయినా జీవితంలో జరిగే అతికొద్ది ముఖ్యమైన ఘట్టాల్లో పెళ్లి ఒకటి. అందుకే దాన్ని సాధ్యమైనంత ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటారు. ఆప్తులందరి మధ్యా ఆ శుభకార్యాన్ని పూర్తిచేసుకోవాలని ఆశపడతారు.
కానీ పేదరికం అందరికీ ఆ అవకాశాన్ని కల్పించదు. అలాంటి వాళ్లకు తానున్నానంటూ ముందుకొచ్చి, కొన్ని వందల నిరుపేద జంటల పెళ్లిళ్లను అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు మర్రి జనార్దన్‌రెడ్డి. కష్టాల రుచే తనను
ఈ దిశగా నడిపించిందంటారాయన..
ష్టాల నుంచి పైకొచ్చిన వాళ్లు చాలామందే ఉంటారు. కానీ తనకు కలిగిన బాధ ఎదుటివారికి కలగకూడదు అని భావించేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్లలో నాగర్‌కర్నూల్‌ శాసన సభ్యుడు మర్రిజనార్దన్‌రెడ్డి ఒకరు. లేమి కారణంగా తన చెల్లెలి పెళ్లి వైభవంగా చేయలేకపోయాననే బాధ ఆయనకు డబ్బు విలువ తెలిసేలా చేసింది. తన చుట్టుపక్కల ఉన్న ఎందరో పేదల పెళ్లిళ్లను ఘనంగా చేయించే దిశగా పురిగొల్పింది. ఏళ్లక్రితం జరిగిన ఆ సంఘటనే ఆయన చేతుల మీదుగా మూడువందల జంటలు ఆనందంగా ఒక్కటయ్యేందుకు కారణమైంది.
అలా కాకూడదని...
నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండలం నేరెళ్లపల్లి గ్రామంలోని ఓ పేద కుటుంబంలో మర్రి జనార్దన్‌రెడ్డి జన్మించారు. తన సోదరి వివాహం 1990లో అదే గ్రామంలోని వ్యక్తితో నిశ్చయమైంది. అయితే, పేదరికం వల్ల జేబులో ఒక్క పైసా లేదు. అప్పుకోసం బంధుమిత్రుల వద్ద ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. చివరికి యాదగిరిగుట్టలో కేవలం 15మంది సన్నిహితుల మధ్య చెల్లెలి వివాహం చేశారు. అప్పుడే ఆయన మనసులో ఓ దృఢ సంకల్పం కలిగింది. తన చెల్లెలు మాదిరే మరొకరి వివాహం ఇలా కానిచ్చేశామన్నట్టు జరగకూడదనుకున్నారు. ఎప్పటికైనా బాగా సంపాదించి పేద కుటుంబాలకు చెందిన వాళ్ల పెళ్లిళ్లను గొప్పగా చేయాలని సంకల్పించారు. ఆర్థిక స్తోమత కలిగితే అలాంటి వివాహాలకు సాయమందిస్తానని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి మొక్కుకున్నారు. హైదరాబాద్‌లో ఓ బట్టల దుకాణంలో పనిచేస్తూ డబ్బును కూడబెట్టుకున్నారు. తర్వాత తానే  బట్టల దుకాణాన్ని ఏర్పాటుచేసి లాభాలను ఆర్జించారు. పేదలకు సేవ చేయాలన్న తన ఆలోచనను అమలు చేసేందుకు తండ్రి మర్రి జంగారెడ్డి పేరుతో ఎంజేఆర్‌ ట్రస్టును ఏర్పాటు చేశారు. మొదట్లో నాగర్‌కర్నూల్‌ ప్రాంతంలో ఎక్కడ పేద జంటకు వివాహం జరిగినా అక్కడికి చేరుకుని ఆ జంటకు రూ.10 వేలను ఆర్థికసాయంగా ఇచ్చేవారు. ఇలా కనీసం 600 జంటలకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.60 లక్షల దాకా సాయమందించారు. తర్వాత పెళ్లి చేసుకునే వారికి సాయం చేయడం కాదు, తానే వాళ్ల పెళ్లిళ్లు ఘనంగా చేస్తే బాగుంటుంది కదా... అనే ఆలోచన చేశారు. మరుసటి నెల నుంచే దానికి సంబంధించిన ప్రణాళికను అమలుచేశారు. నియోజకవర్గంలో వివాహాలు చేసుకొనే జంటల వివరాలను సేకరించారు. వారందరికీ ఓ శుభముహూర్తం చూసి ఒకే రోజు సామూహిక వివాహాలను చేయాలని నిశ్చయించారు. 2013లో నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గ పరిధిలోని 87 పేద జంటలకు సామూహిక  వివాహాలు చేశారు. అదేవిధంగా 2014లో 102 పేద జంటలు, 2015లో 134 పేద  జంటలకు సామూహిక వివాహాలు చేశారు. మూడు సంవత్సరాల్లో మొత్తం 323 సామూహిక వివాహాలను వైభవంగా చేయించారు.
కొత్త సంసారానికి...
పెళ్లి చేయడమంటే ఊరికే జంటలకు ఓ వేదిక మీద కూర్చోబెట్టి తాళి కట్టించడం కాదు. వాళ్లకు కావలసిన మంగళసూత్రాలు, మెట్టెలు, బాసికాలతో పాటు పెళ్లి కూతురికీ, పెళ్లి కొడుక్కీ వాళ్ల తల్లిదండ్రులకీ పట్టుబట్టలు అందజేస్తారు. వాళ్ల తరఫున ఎంతమంది బంధువులు వచ్చినా అందరికీ విందు భోజనం ఏర్పాటు చేస్తారు. ఒక్కో సామూహిక వివాహానికి కనీసం 20 వేల మందికి భోజనాలు అవసరమతుంటాయి. ఇక, పెళ్లి తర్వాత కొత్త కాపురాన్ని ప్రారంభించడానికి వీలుగా ఆ జంటలకు బీరువా, మంచం, పరుపులు, దుప్పట్లు, రెండు కుర్చీలతో పాటు గిన్నెలూ, బిందెలూ, స్పూన్లూ, గరిటెల్లాంటి ఇంటికి సరిపడా వంట సామగ్రి ఇస్తారు. వీటన్నింటికీ కలిపి ఒక్కో జంటకు కనీసం లక్షరూపాయల దాకా ఖర్చవుతుంది. మొత్తంగా ఒక్కో సామూహిక వివాహ కార్యక్రమానికీ 3 నుంచి 4 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇక, వివిధ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకూ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ‘మా ట్రస్టు సేవలను నాగర్‌కర్నూల్‌కే పరిమితం చేయకుండా ఉమ్మడి పాలమూరు జిల్లాకు విస్తరించాలనుకుంటున్నాం. ఈ కార్యక్రమాల నిర్వహణలో నా శ్రీమతి జమున, సోదరుడు వెంకట్‌రెడ్డిల సహకారం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈసారి సామూహిక వివాహాలు ఉమ్మడి జిల్లా పరిధిలో చేస్తాం. తద్వారా మరింత మంది పేద జంటలను ఒక్కటి చేసే అవకాశం చిక్కుతుంది’ అంటూ తన ఆలోచనను చెబుతారు జనార్దన్‌రెడ్డి. అందుకే ఆయన పెద్ద మనసంటే చుట్టుపక్కల పేద కుటుంబాలన్నింటికీ ఎంతో అభిమానం.

- ఏలేటి ప్రభాకర్‌రెడ్డి ఈనాడు, మహబూబ్‌నగర్‌  
ఫొటోలు: సురేశ్‌రావు  

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.