close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జ్వరం

జ్వరం
- ముచ్చి ధనలక్ష్మి

నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ కోరుకుంటున్నా - జ్వరం రావాలని. అదీ మామూలు జ్వరం కాదు, పెద్ద జ్వరం. కనీసం పది రోజులైనా ఉండే జ్వరం. చక్కగా స్కూల్‌ కెళ్ళకుండా ఇంట్లో ఉండొచ్చు. అమ్మని బతిమాలక్కర్లేదు, టీచర్‌తో దెబ్బలు తినక్కర్లేదు, హోమ్‌వర్క్‌, ఎగ్జామ్స్‌ తలనొప్పే ఉండదు. హాయిగా టీవీ చూస్తూ ఇంట్లోనే కూర్చోవచ్చు.
అప్పుడొకసారి అక్కకిలాగే జ్వరమొచ్చింది. ఎన్ని రోజులు స్కూల్‌ ఎగ్గొట్టిందో! నేను స్కూల్‌కెళ్ళేటప్పుడు లేచేది. అయినా, అమ్మ తిట్టేది కాదు. బ్రష్‌ చేయగానే నాన్న- చిన్నా కొట్టుకెళ్ళి ఇడ్లీలు తెచ్చేవారు. తెల్లని ఇడ్లీలు ఎంత మెత్తగా ఉంటాయో! చట్నీ సాంబారూ వేసిన వేడివేడి ఇడ్లీలు- అది వరండాలో తింటుంటే నాకు వంటింట్లోకి వచ్చేది వాసన.
‘అబ్బా, నాకొద్దమ్మా...’ రెండు ముక్కలు నోట్లో పెట్టుకోగానే పక్కన పెట్టేసేది అక్క. దీనికేం పిచ్చో, చక్కగా తినకుండా వద్దనటానికి. పోన్లే, అది తినకపోతే నాకే ఇస్తారనుకుంటే నాన్న వదిలితేనా... ‘తినమ్మా, బంగారుతల్లివి కదా... తింటే నీకు కొత్త బ్యాగ్‌ కొంటా’ అని బతిమాలి మరీ బలవంతంగా తినిపించేవారు.
ఏదైనా మిగులుతుందేమో అని అక్కడక్కడే తిరుగుతుంటే చివరికి ఖాళీ ప్లేటు కనిపించేది. ఏడుపు మొహంతో స్కూల్‌ దారి పట్టేదాన్ని నేను. సాయంత్రం దానికోసం నాన్న బన్ను తెచ్చేవారు. అమ్మ గ్లాసు నిండా టీ ఇచ్చేది. అసలు అన్నమే తినేది కాదు. ఎంత కోపమొచ్చేదో దాన్నిచూస్తే.
జ్వరం తగ్గాక కూడా స్కూల్లో టీచర్లు ఏమనేవారు కాదు. పనిష్మెంట్‌ కూడా ఇవ్వలేదు. అదంతా చూసి చాలాసార్లు అందరూ ఇంటర్వెల్‌కెళ్ళాక క్లాసులో కూర్చుని ఏడ్చాను.
రెండుసార్లు సాయిబాబా గుడిలో మూడు రూపాయలు వేశాను, ప్రదక్షిణలు చేశాను - జ్వరం రావాలని. అయినా రావట్లేదు. బస్సులో కిటికీ పక్కన కూర్చున్నప్పుడు కూడా దారిలో కనిపించిన దేవుళ్ళందరికీ దండం పెట్టాను. ఎన్నిచేసినా జ్వరం వస్తేనా..!చిన్నప్పటి నుంచీ ఇంతలా అనుకుంటున్నా - సెవెన్త్‌క్లాస్‌ కొచ్చాను - ఒక్కసారి కూడా జ్వరం రాలేదు. వారం రోజుల నుంచీ సరిత రావట్లేదు. దానికి కూడా జ్వరమొచ్చిందట. అందరికీ వస్తుంది పిచ్చి జ్వరం, చెత్త జ్వరం, మెంటల్‌ జ్వరం... నాకెందుకు రాదు?
వద్దులే, తిడితే కోపమొచ్చి అసలు రాదేమో. అసలీ జ్వరాలెందుకొస్తాయి, ఎలా వస్తాయి? కొంతమందికి ఎందుకు రావు..! మా సైన్సు సార్‌ చెప్పినట్టు నాకు వ్యాధినిరోధకశక్తి ఎక్కువేమో..? ఛ, ఈ జన్మకి జ్వరం వచ్చేలా లేదు.
ఎప్పటిలా సాయంత్రం అందరం కలిసి సరితా వాళ్ళింటికెళ్ళాం- బ్రెడ్‌, జామ్‌ ఇవ్వటానికి. మా ఫ్రెండ్స్‌లో ఎవరికి జ్వరమొచ్చినా అలాగే ఇస్తాం. అందరూ వాళ్ళ ఇల్లు చూస్తుంటే, నేను నెమ్మదిగా సరిత పక్కన కూర్చుని అడిగేశా- ‘జ్వరమెలా వచ్చిం’దని.‘‘మొన్న వర్షంలో బాగా తడిచానే, గొడుగు పోయింది కదా! అదిగో అప్పటి నుంచీ’’ ‘హాచ్‌’ అని తుమ్ముతూ చెప్పింది.
సూపర్‌ ఐడియా! ఇన్ని రోజులూ ఈ ఆలోచన నాకెందుకు రాలేదు... ఈ దెబ్బకి జ్వరం చచ్చినట్లు రావాల్సిందే, స్కూలు ఎగ్గొట్టాల్సిందే.
‘‘వర్షంపడేలా ఉంది, గొడుగు తీసుకెళ్ళు’’ అమ్మ అరుపులు వినిపించుకోకుండానే స్కూలుకి పరిగెత్తా. మధ్య దారిలోనే పెద్ద వర్షం, చాలా పెద్ద వర్షం. బుక్స్‌ తడుస్తున్నా అలాగే వర్షంలో ఉన్నాను. కావాలనే ఏ చెట్టుకిందా నిలబడలేదు.
తడుస్తూనే స్కూలుకెళ్ళాను. ‘‘అలా తడుస్తూ రాకపోతే కాసేపాగి రావొచ్చుగా’’ క్లాసులోకెళ్ళగానే తిట్టింది టీచర్‌. బట్టలన్నీ తడిచిపోయాయి. చల్లగాలికి కాళ్ళూ చేతులూ వణికిపోతున్నాయి. అయినా తల తుడుచుకోలేదు.
సాయంత్రం ఇంటికెళ్ళేసరికి అమ్మ బాగా తిట్టింది- బుక్స్‌ తడిచిపోయాయని. ‘‘ఎందుకు తడిచావా వర్షంలో’’ అంటూ అరిచింది.
‘‘నాకేం తెలుసు వర్షమొస్తుందని?’’ అన్నాను.
‘‘నోర్ముయ్‌, ఇంకా ఎదురు సమాధానాలు చెప్తున్నావ్‌’’ కొట్టడానికి చెయ్యెత్తుతూ అంది కోపంగా.
‘‘పోన్లే, పోన్లే’’ ఆపింది అక్క.
బుక్స్‌ తడిచాయని తిట్టింది కానీ నువ్వూ తడిచిపోయావా అనలేదు ఒక్కసారైనా. బాగా ఏడుపొచ్చింది.
ఏం తినకుండానే పడుకున్నాను. హోమ్‌వర్కయినా చేయలేదు.
నాన్న పదిగంటలకొచ్చి లేపారు. మెలకువొచ్చినా అలాగే గట్టిగా కళ్ళు మూసుకున్నాను. ‘‘లేమ్మా, నా బుజ్జివి కదా, నీకేం తెచ్చానో చూడు’’ అన్నారు నాన్న.
కొంచెం కళ్ళు తెరిచాను. కారం పూసినట్టు మండుతున్నాయి కళ్ళు. ముక్కునుండీ కళ్ళనుండీ నీళ్ళు కారుతున్నాయి. ‘హాచ్‌ హాచ్‌’ అంటూ తుమ్ములూ మొదలయ్యాయి. నాన్న నా నోట్లో బజ్జీ పెట్టారు. మామూలుగా బజ్జీ ఎంత బాగుంటుంది... పుల్లగా కారంగా! అలాంటి బజ్జీ తింటున్నా అసలు రుచే లేదు. ఏం బాగాలేదు.
మంటల్లో కూర్చున్నట్టుంది. వేడిగా, అసలు గాలే తగలనట్టుంది. నాన్న నుదుటిమీద చెయ్యేసి ‘‘జ్వరమొచ్చింది’’ అంటున్నారు అమ్మతో.
జ్వరం... నాకు జ్వరమొచ్చింది. ఒకవైపు ఆనందం, మళ్ళీ చిరాగ్గా కూడా అనిపిస్తోంది. నోరంతా చేదుగా ఉంది. పెదాలు ఎండిపోతున్నాయి. ఎన్ని నీళ్ళు తాగుతున్నా దాహం ఆగటం లేదు.
అమ్మ తల నిమురుతూ పక్కనే కూర్చుంది. నెమ్మదిగా కళ్ళు తెరిచాను. ఇల్లంతా గుండ్రంగా తిరిగిపోతోంది. కళ్ళు మూస్తే ఏవేవో ఆకారాలు రంగురంగుల్లో కనిపిస్తున్నాయి. కాస్త నిద్రపడితే చాలు... నేనలా గాల్లోకి లేచి పైకి వెళ్ళిపోతున్నట్టూ, అక్కడినుంచి దబ్బున కిందపడినట్టూ... రాత్రంతా అలాంటి కలలే!
‘‘ధరణీ, ధరణీ...’’ అమ్మ కదుపుతుంటే మెలకువ వచ్చింది. అక్క అప్పటికే రెడీ అయి ఉంది.
‘‘బ్రష్‌ చేయమ్మా, ఇడ్లీ తెస్తాను’’ అంటూ పైకి లేపుతున్నారు నాన్న. రాత్రి ఎందుకంత వేడిగా ఉందో, మరి ఇప్పుడేమో చాలా చలేస్తోంది. లేచి నిలబడదామంటే కాళ్ళూ చేతులూ వణుకుతున్నాయి. ఎంత నడుద్దామనుకున్నా అసలు అడుగులు పడటం లేదు. స్టూల్‌ మీద కూర్చోబెట్టి బ్రష్‌ ఇచ్చింది అక్క. అస్సలు బ్రష్‌ కూడా పట్టుకోలేకపోతున్నాను. తలంతా బరువుగా ఉంది. అటూఇటూ వాలిపోతోంది. నాన్న తలని గట్టిగా పట్టుకున్నారు. అక్క బ్రష్‌ చేయించింది.
‘‘తినమ్మా, ఇడ్లీ తిను’’ ప్లేట్‌ నా చేతికిచ్చిందమ్మ.
మంచి వాసన... చట్నీ, సాంబారూ నోరూరించాయి. ముక్క నోట్లో పెట్టుకున్నాను. నోరంతా చేదు చేదు. బలవంతంగా మింగాను. ఇడ్లీలేం బాలేవు, అమ్మతో చెప్పాను.
‘‘తినకపోతే నీరసమైపోతావు’’ అమ్మ బతిమాలుతోంది. నీళ్ళు తాగుదామని గ్లాసు పట్టుకున్నానో లేదో... చేతుల్లోంచి దానికదే పడిపోయింది. కానీ అమ్మ తిట్టలేదు. ఇంకో గ్లాసుతో నీళ్ళు తాగించింది. నీళ్ళు కూడా బాగాలేవు.
తలా చేతులూ కాళ్ళూ... ఒళ్ళంతా నొప్పులే. కూర్చోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను.
అమ్మా నాన్నా వెళ్ళిపోయాక ఇడ్లీ తిందామనిపించింది. ప్లేట్‌ పక్కనే ఉంది. నేనొదిలేసినా అక్క తినలేదెందుకో? లేచి ప్లేటు అందుకుందామంటే అసలు లేవలేకపోతున్నాను. నీరసంగా ఉంది.
దుప్పటి కప్పుకున్నా ఇంకా చలేస్తోంది. మా ఫ్రెండ్స్‌ ఏం చేస్తున్నారో!? తెలుగు సార్‌ మంచి కథ చెప్తానన్నారు. ఈరోజు స్కూల్లో ఎగ్‌ పెడ
తారు. నేనెక్కడికో వెళ్ళిపోతున్నాను. తేలిపోతు
న్నాను, గాలిలో తేలిపోతున్నాను. ఎవరో నన్ను పిలుస్తున్నారు. అసలు నాకు నేను బరువే లేను. నొప్పులేం లేవు, అన్నీ తగ్గిపోయాయి.
ఒక్కసారి బరువెందుకు తగ్గింది... వసంతన్నయ్య చెప్పినట్టు నేను చచ్చిపోలేదు కదా... చచ్చిపోయినవాళ్ళకే బరువు తగ్గినట్టనిపి
స్తుందని అన్నయ్య చెప్పాడు- అంటే నేను చచ్చిపోయానా? అమ్మ ఎంత ఏడుస్తోందో, నాన్న ఏడుస్తున్నారో లేదో... నాన్న ఎప్పుడూ ఏడవరు. నానమ్మ చనిపోయినపుడు కూడా అలా దిగులుగా కూర్చున్నారు కానీ ఏడవలేదు.
అక్క ఏం చేస్తోందో... నా డ్రెస్సులన్నీ తీసుకో
వచ్చనుకుంటుందో, కొంచెమైనా బాధపడుతుందో?
ఎవరో నా దగ్గరకొస్తున్నారు... చచ్చినవాళ్ళని తీసుకెళ్ళటానికి యమభటులొస్తారంట... వాళ్ళేనేమో. ‘నేను రాను, బతికే ఉంటాను’ అరుస్తున్నాను, ఏడుస్తున్నాను, అయినా వదలటం లేదు.
‘‘నాన్నా, నాన్నా’’ ఏడుస్తూనే అరుస్తున్నాను.
చేతినేదో గుచ్చుతోంది. కళ్ళు తెరిచాను ఠక్కున. ఏదో తెల్లని ఆకారం కదులుతోంది. తెల్ల దెయ్యమా.?
‘‘ఉదయం నుంచీ బాగా కలవరిస్తోందండీ’’ ఇది అమ్మ గొంతే.
కళ్ళు నులుముకుంటూ ఇంకా బాగా చూశాను. అమ్మ, నాన్న, అక్క... ముగ్గురూ నావంకే చూస్తున్నారు.
‘‘ధరణీ, ధరణీ...’’ కొత్త గొంతు వినిపించటంతో అటుకేసి చూశాను. ‘అరుణ్‌ డాక్టర్‌’. ఆయన పక్క ఊరి డాక్టర్‌.
‘‘ఎలా ఉందిప్పుడు? ఒళ్ళంతా నొప్పులున్నాయా, చలేస్తోందా?’’ ఇంకా ఏవో అడుగుతున్నారు. మాటలు రావటం లేదు. అలా ఇలా తలూపాను.
హమ్మయ్య, నాకిప్పుడు ఆనందంగా ఉంది. నేను చచ్చిపోలేదు. ఒకవేళ చచ్చిపోతే- ‘అమ్మో’ ఒళ్ళంతా వణికింది.
అక్క నా మొహాన్ని తడిబట్టతో తుడిచింది. డాక్టర్‌ ఏ టాబ్లెట్లు ఎప్పుడు వేసుకోవాలో చెప్పి వెళ్ళిపోయాడు. అమ్మ వేడి టీ తెచ్చి ఇచ్చింది. టీలో రస్కులు పెట్టి తిందామనుకున్నా. ఓపిక లేదు. కాళ్ళూ చేతులూ లాగుతున్నాయి. అక్క స్పూన్‌తో తినిపిస్తోంది. గొంతంతా కూడా నొప్పే. మింగలేకపోతున్నాను.
నేనొద్దంటున్నా వాళ్ళిద్దరూ బలవంతంగా తిని
పించి, తర్వాత టాబ్లెట్లు నోట్లోపెట్టి మింగించారు.
నోరంతా చేదే, గొంతూ చేదే. ఈ టాబ్లెట్లూ చేదే. పిచ్చిపిచ్చిగా ఉంది. ఛీఛీ, జ్వరం
ఏం బాలేదు. చేతుల నొప్పికన్నా ఇంజెక్షన్‌ నొప్పే ఎక్కువగా ఉంది. ఏడుపొచ్చింది, ఏడ్చిఏడ్చి అలాగే నిద్రపోయాను.
కలలంతా రంగురంగుల సున్నాలూ, ఇంకా రకరకాల బల్లులూ. తర్వాత రెండు రోజులు ఎలా గడిచాయో! అమ్మ లేపేది. బ్రష్‌ లేదు, స్నానం లేదు. లేవగానే ఏదో ఒకటి తినిపించి, టాబ్లెట్లు వేసేది. చాలా నిద్రొచ్చేది ఎందుకో మరి. తినడం, పడుకోవడం రెండే పనులు. టీవీ పెట్టినా కూడా కళ్ళు తెరవలేకపోయేదాన్ని.
‘‘ధరణీ, ధరణీ’’ అరుస్తున్నట్టే పిలుస్తున్నారు.
చాలా కష్టపడి కళ్ళు తెరిచి చూశాను.
మా ఫ్రెండ్స్‌ అందరూ వచ్చారు. సరిత నా పక్కనే కూర్చుని ఏం కాదనీ, తగ్గిపోతుందనీ ధైర్యం చెబుతోంది.
‘‘చాలా పెద్ద గండమే గడిచిందమ్మా. రెండు రోజుల నుంచీ తిండిలేదు. పడుకుందంటే చాలు గట్టిగా అరుస్తోంది, ఏడుస్తోంది, భయపడుతోంది. ఇప్పుడు కొంచెం తగ్గిందిలే’’ అమ్మ వాళ్ళందరికీ అంతా వివరిస్తోంది.
బ్రెడ్‌, జామ్‌ నా చేతిలోపెట్టి వెళ్ళిపోయారంతా. జామ్‌ ఎంత బాగుంటుందో... సాఫ్ట్‌గా, తియ్యగా. కానీ ఏవీ తినాలనిపించటం లేదు. అన్నీ ఎదురుగానే ఉన్నా తినలేకపోతున్నా.
పోనీ జ్వరం తగ్గాక తిందామంటే అప్పటి
వరకూ అక్క అన్నీ ఖాళీ చేస్తుందేమో. అయినా మా ఫ్రెండ్స్‌ నాకు తెస్తే అక్కెందుకు తింటుంది? అదేమాట అమ్మనడుగుదామనుకున్నా. కానీ, ఒళ్ళు నొప్పులు తగ్గినా గొంతునొప్పి తగ్గలేదు, మాట రావట్లేదు.
‘‘అమ్ములూ!’’ అటు చూశాను కదా అమ్మమ్మ.
‘‘అమ్మమ్మా’’ నేనూ నవ్వాను సంతోషంగా.
‘‘అయ్యో, ఎంత చిక్కిపోయింది పిల్ల. బంతిలా ఎగిరే పిల్ల ఏ కళ్ళు పడ్డాయో ఏమో? అసలు దిష్ఠి తీశావా? నీకన్నీ చెప్పాల్సిందే, వెళ్ళు వెళ్ళు’’ పురమాయించింది అమ్మని.
మరికాసేపటికి అమ్మమ్మ వచ్చి దిష్ఠి తీసి, దేవుడిబొట్టు నుదుటి మీద పెట్టింది. ఆంజనేయుడి తాయెత్తు భుజానికి కట్టింది.
‘‘నా బంగారుకొండ, ఎవరే నిన్ను కలల్లో భయపెట్టేది? ఇప్పుడు రమ్మను. ఇదిగో ఆంజనేయుడ్ని చూస్తే నీ దగ్గరకు కూడా రాలేరు’’ అంటూ అమ్మని చూసి ‘‘ఎంతసేపూ టీ ఇస్తే దానికి బలమెలా వస్తుంది? ఆ సంచిలో ఆవు పాలున్నాయి, వెళ్ళి మరిగించు’’ అంది.
‘‘ఈ వేడిపాలు తాగేశావనుకో, ఉదయానికల్లా లేచి పరిగెడతావు చూడు. మన దూడ ఎగిరినట్టు చెంగుచెంగున ఎగురుతావు’’ అని చెప్తూ బెల్లం కలిపిన వేడిపాలు పెద్ద గ్లాసుడు తాగించింది.
‘‘మరేం అమ్మమ్మా, ఆంజనేయుడంటే అందరికీ ఎందుకంత భయం?’’ అమ్మమ్మ నానుకుని కూర్చుంటూ అడిగాను.
‘‘నీలాంటి చిన్నపిల్లల్ని ఎవరైనా భయపెట్టారనుకో వాళ్ళని ఊరి చివరి వరకూ తరిమికొడతాడమ్మా. ఈ తాయెత్తు కట్టాను కదా... నీకు ఆంజనేయుడంత బలం వస్తుంది. అసలు భయమే ఉండదు. అయినా, నేనూ
నీ పక్కనే ఉంటాను కదా.’’
నా తలని గుండెకు ఆనించుకుని, నన్ను గట్టిగా పట్టుకుని నా పక్కనే పడుకుంది.
చాలా ధైర్యమొచ్చిందిపుడు. హాయిగా పడుకున్నాను. ఈసారి కలలో హనుమంతుడు కనిపించాడు. ఇంకెప్పుడూ నాకు జ్వరం రాకూడదని దేవుడికి దండం పెట్టుకున్నాను.
నాకు ఇంట్లో ఉండాలని లేదు, స్కూలుకి వెళ్ళాలని ఉంది. తెలుగు సార్‌ చెప్పే కథలు వినాలనీ, లెక్కలు అందరికన్నా ఫస్ట్‌ చేసి ‘ధరణి చాలా తెలివైన పిల్ల’ అని టీచర్‌తో పొగిడించుకోవాలనీ, సరితతో ఆడుకోవాలనీ ఉంది.
రెండు రోజులయ్యేసరికి అమ్మమ్మ నా జ్వర
మంతా తగ్గించేసింది. నేనంటే తనకి చాలా ఇష్టం.
అమ్మ చెప్పకముందే లేచి స్కూలుకి బయల్దేరాను ఈరోజు అక్కతోపాటు. సాయంత్రం నేనొచ్చేవరకూ ఉండమని అమ్మమ్మకి చెప్పి స్కూలుకి వచ్చేశాం నేనూ అక్క.
అందరూ నా దగ్గరకొచ్చి ‘జ్వరం తగ్గిందా?’ అంటూ చుట్టూ చేరారు. టీచర్లూ సార్లూ కూడా అడిగారు. క్లాసులోకి వస్తుంటే ఏదోలా ఉంది. మా క్లాసులా అనిపించలేదు, ఎక్కడికో వచ్చినట్టుంది.
ఫస్ట్‌ పీరియడ్‌ తెలుగు సార్‌ వచ్చారు. ఏదో కథ చెప్పారు. నాకు తలంతా దిమ్ముగా ఉంది. ఏమీ వినాలనిపించటం లేదు. బల్లమీద తలపెట్టి పడుకున్నా- సార్‌ పనిష్మెంటేమీ ఇవ్వలేదు. తర్వాత లెక్కల టీచర్‌ వచ్చి బోర్డుమీద లెక్క
లేశారు. అప్పటికి తలదిమ్ము కాస్త తగ్గింది. ‘‘ధరణీ చూద్దామా... ఎవరు ముందు చేస్తారో?’’ అంది సరిత.
అంతే మ్యాథ్స్‌బుక్‌ తీసి స్పీడుగా చేసి టీచర్‌కి చూపించా. ‘వెరీగుడ్‌’ అని మెచ్చుకుని ఇంకొన్ని లెక్కలేశారు. సంతోషంగా అనిపించింది.
‘ఛీ... జ్వరం బాలేదు, ఇడ్లీలు బాలేదు. నాకు స్కూలే కావాలి. జ్వరం, ప్లీజ్‌ మరెప్పుడూ రావద్దు, నాకు స్కూలే బాగుంది.’
‘‘లెక్కలు ఫస్టు చేశావ్‌ కదా, సైన్సులో బొమ్మలెవరు బాగా వేస్తారో చూద్దామా’’ తలూపుతూ అడిగింది సరిత.
సైన్సు నోట్సు తీసి బొమ్మ వేస్తున్నాను. బాగా... చాలా బాగా... సరితకన్నా... అందరికన్నా బాగా..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.