close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అడుగడుగున గుడి ఉంది... ఆ గుడిలో దైవముంది..!

అడుగడుగున గుడి ఉంది... ఆ గుడిలో దైవముంది..!

‘అక్కడ జలపాతాల జడినీ సుందర నదీతీరాలనీ వీక్షిస్తే పౌరాణిక గాథల్ని వినిపిస్తాయి. ఎర్రనినేలనీ రాతి కొండల్నీ గుహల్నీ పలకరిస్తే శతాబ్దాల చరిత్ర లోతుల్లోకి తీసుకెళతాయి. ఆ గోడలని కళ్లతో ఆర్తిగా తడిమితే నాటి శిల్పుల ఉలి విన్యాసాలు సాక్షాత్కరిస్తాయి. అటు ప్రకృతి అందాలకూ ఇటు చాళుక్యుల కళావైభవానికీ వేదికలుగా నిలిచిన  ఆ ప్రాంతాలే ఐహోలె, పట్టడకల్‌, బాదామి...’ అంటున్నారు విశాఖవాసి డా.మాదాబత్తుల తిరుమలరావు.
విశాఖపట్నం నుంచి అమరావతి ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరి, కర్ణాటకలోని హోస్పేట్‌లో దిగి, అక్కడినుంచి ప్యాసింజర్‌లో బయల్దేరి బాదామి చేరుకున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న ఒకే ఒక్క రైల్వేస్టేషన్‌ బాదామి. అక్కడ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగకపోవడం, ప్యాసింజర్‌ రైళ్లు కూడా నిమిషమే ఆగడంతో ఈ ప్రాంతం అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. కానీ కర్ణాటకలోని భాగల్‌కోట్‌ జిల్లాలోని మలప్రభ నదీతీరంలోని బాదామి, పట్టడకల్‌, ఐహోలె ప్రదేశాల గురించి సినీపరిశ్రమకి బాగా తెలుసు. అందుకే అక్కడ సందర్శకుల తాకిడి కన్నా సినిమా షూటింగులే ఎక్కువ. తమిళ, కన్నడ చిత్రాలతో బాటు తెలుగు చిత్రాలు కూడా షూట్‌ చేశారు. విక్రమార్కుడు, ఢమరుకం, దరువు, రౌడీ రాథోడ్‌, శక్తి, త్రిపుర...తదితర సినిమాలన్నీ చిత్రీకరించారక్కడ.

బసశంకరీదేవి...
ముందుగా మేం బసశంకరీదేవి ఆలయానికి బయల్దేరాం. బాదామికి దక్షిణాన నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందీ ఆలయం. చాళుక్యుల ఆరాధ్యదేవత బసశంకరి. కర్ణాటక, మహారాష్ట్రల్లోని ఎందరికో ఆమె కులదేవత. చారిత్రకంగా చూస్తే- బాదామి చాళుక్యుల కన్నా ముందే ఇక్కడ బసశంకరీదేవి ఆలయం ఉన్నట్లు తెలుస్తోంది. చుట్టూ ఎత్తైన గోడలతో ముఖమండపం, అర్ధమండపం ఉన్నాయి. బసశంకరీదేవి సింహం మీద కూర్చుని, ఎనిమిది చేతులతో దుర్గాదేవి అవతారంలో దర్శనిమిస్తుంది. దేవాలయంలో ఉన్న ఓ శాసనం ప్రకారం- చాళుక్య రాజైన జగదేకమల్లుడు పురాతన దేవాలయానికి చాలా మార్పులు చేసి కట్టించినట్లు తెలుస్తోంది. ఆ తరవాత 9వ శతాబ్దంలో రాష్ట్రకూటులు ఈ గుడిని పునర్నిర్మించగా, ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని మాత్రం విజయనగర రాజులు నిర్మించారట. తరవాత శివయోగ మందిరానికి బయల్దేరాం. ఇది బాదామికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ రెండు మందిరాలు ఉన్నాయి. ఒక మందిరంలో హనగల్‌ కుమారస్వామిజీ, హనగల్‌ సదాశివ స్వామీజీ సమాధులు ఉన్నాయి. ఈ స్వామీజీలకి అతీతశక్తులుండేవని చెబుతారు. అక్కడి నుంచి అనేక ఆలయాల కూటమి అయిన మహాకూటకి వెళ్ళాం. దీన్నే ఒకప్పుడు దక్షిణ కాశీ అనేేవారు. ఇందులో అతి పెద్దది మహాబలేశ్వర ఆలయం. చాళుక్యరాజైన మొదటి పులకేశి ఈ శివాల¯యాన్ని నిర్మించాడట.

ఆలయాల సముదాయం... ఐహోలె..!
మహాకూటకి 25 కి.మీ. దూరంలో ఉంది ఐహోలె. ఇది కూడా అనేక ఆలయాల సమూహం. అన్నీ ఓ మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. వీటిల్లో ముఖ్యమైనవి దుర్గ్‌గుడి, లాడ్‌ఖాన్‌ దేవాలయం, సూర్యనారాయణ, హచిమల్లి దేవాలయం, జ్యోతిర్లింగ దేవాలయం, మల్లికార్జున దేవాలయాలు. ఇక్కడే ఓ మ్యూజియం ఉంది. అందులో శాసనాలూ శిల్పాలూ చాళుక్యుల పాలనకీ శిల్పకళావైభవానికీ సాక్ష్యంగా నిలుస్తాయి. ఈ ప్రాంతంలో 120కి పైగా హిందూ, జైన, బౌద్ధ ఆలయాలూ కట్టడాలూ ఉన్నాయి. అందుకే మ్యూజియంలో వాటికి సంబంధించిన మ్యాప్‌ కూడా సందర్శకుల సౌకర్యార్థం ఉంచారు. ఇక్కడి మలప్రభ నదీ తీరంలో గొడ్డలి ఆకారంలో ఓ రాయి ఉంది. ఇది పరశురాముడు సంచరించిన ప్రాంతమనీ, క్షత్రియుల్ని వధించాక గొడ్డలిని కడగడంవల్లే ఈ ప్రాంతంలోని నేలంతా ఎర్రబారిందనీ అంటుంటారు. నది ఒడ్డున ఉన్న రాతి పాదముద్రలు భార్గవరాముడివిగానే భావిస్తారు స్థానికులు.

శిల్పకళా సంపద
ఐహోలెకి 13 కి.మీ. దూరంలో ఉంది పట్టడకల్‌. బాదామి చాళుక్యుల శిల్పకళకి ప్రతీక పట్టడకల్‌. తొలినాటి ఉత్తర, దక్షిణ భారత ఆలయ వాస్తు సమ్మేళనాన్ని ఇక్కడ చూడొచ్చు అంటారు చరిత్రకారులు. ఇక్కడి ఆలయాలు రెండో విక్రమాదిత్య కాలానికి చెందినవి. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన కర్ణాటకలోని రెండు ప్రదేశాల్లో ఒకటి హంపి అయితే రెండోది పట్టడకల్‌. ఇక్కడ మొత్తం పది ఆలయాలు ఉన్నాయి. ఎనిమిది ఆలయాలు ఒకే కూటమిగా ఒకేచోట ఉండగా, పాపనాథ దేవాలయం ఆ సముదాయానికి దక్షిణాన 0.5 కి.మీ. దూరంలోనూ, జైన నారాయణ దేవాలయం పశ్చిమంగా 1.5 కి.మీ. దూరంలోనూ ఉన్నాయి. ఇక్కడి కడసిద్ధేశ్వర, జంబులింగ ఆలయాలు ఏడో శతాబ్దం నాటివి. గలగనాధ, సంగమేశ్వర, కాశీ విశ్వేశ్వర, మల్లికార్జున, విరూపాక్ష ఆలయాలు 8వ శతాబ్దం నాటివి. వీటిల్లో ముఖ్యంగా చూడదగ్గవి విరూపాక్ష ఆలయం, మల్లికార్జున ఆలయాలు. విరూపాక్ష ఆలయానికి తూర్పున నల్లరాతితో చెక్కిన నంది అద్భుతంగా ఉంది. విక్రమాదిత్యుడు కాంచీపురం మీద విజయానికి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించాడు. తూర్పుముఖంగా 18 ఎత్తైన స్తంభాలతో ద్రవిడ పద్ధతిలో ఈ ఆలయాన్ని కట్టించారు. మల్లికార్జున ఆలయం కూడా దాదాపు అదే పద్ధతిలో ఉంది. చరిత్రలోకివెళ్లి నాటి శిల్పుల ఉలి చాతుర్యాన్ని అణువణువూ తడిమే మనసు ఉండాలేగానీ పట్టడకల్‌ ఆలయాల శోభని చూడ్డానికి ఎంతకాలమైనా సరిపోదు.

బాదామి రాతిగుహల్లో..!
తరవాత బాదామి చూడ్డానికి వెళ్లాం. బాదామి క్రీ.శ.500 నుంచి 757 వరకూ చాళుక్యుల రెండో రాజధానిగా ఉండేది. అందుకే వీళ్లకి బాదామి చాళుక్యులుగా పేరు.బాదామి, పట్టడకల్‌, ఐహోలె ప్రాంతాలు నాటి శిల్పుల ప్రయోగాలకు వేదికలు అని చెప్పవచ్చు. చాళుక్యులు వాళ్లను ఎంతగానో ప్రోత్సహించేవారు. అన్ని వందల ఆలయాలూశిల్పాలూ అక్కడ కనిపించడానికి అదే కారణం. బాదామిలో ముఖ్యంగా చూడాల్సినవి భూతనాథ ఆలయం, అగస్త్యతీర్థం, రాతి గుహాలయాలు. భూతనాథ దేవాలయంలో పెద్ద ముఖమండపం, సభామండపం, అంతరాలయం ఉన్నాయి. కొండలమధ్య ఉండే పెద్ద కోనేరే అగస్త్య తీర్థం. పూర్వం అగస్త్యమహర్షి ఇక్కడే వాతాపి అనే రాక్షసుడిని సంహరించినట్లు పౌరాణిక కథనం.
బాదామిలోని రాతి గుహాలయాలను చూడాల్సిందేే. పెద్ద కొండను తొలిచి నిర్మించిన ఈ నాలుగు ఆలయాల్లో మొదటి గుహనే శైవగుహ అంటారు. ఇందులో నటరాజమూర్తి కొలువుతీరాడు. 18 చేతులతో కమలంమీద నాట్యం చేస్తున్నట్లు ఉన్న ఆ మూర్తి నిజంగా అద్భుతం. ఇక్కడే మహిషాసుర మర్దని, అర్ధనారీశ్వర, హరిహర విగ్రహాలు కూడా ఉన్నాయి. రెండోది వైష్ణవ గుహ. దశావతారాల్లో ఐదవది అయిన వామనావతారాన్ని ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వామనుడితోబాటు బలి చక్రవర్తి, ఆయన భార్య వింద్యావతి, విష్ణుమూర్తి శిల్పాలు ఉన్నాయి. రెండో గుహ పక్కనే ఓ బౌద్ధ గుహ కూడా ఉంది. అందులో బుద్ధుని విగ్రహం కనిపిస్తుంది. మూడో గుహ మహావిష్ణువుది. రాజా కీర్తివర్మ పన్నెండేళ్ల పాలనకు గుర్తుగా అతని తమ్ముడు మంగళేష్‌ ఈ గుహని క్రీ.శ. 578లో రూపొందించాడని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇందులో ఎత్తైన విష్ణుమూర్తి విగ్రహం ఉంది. నాలుగో గుహ ఓ జైన దేవాలయం. జైనుల్లో 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుని విగ్రహం తపస్సు చేసుకుంటున్నట్లు చెక్కారు. ఇక్కడి కొండలమీద చెక్కిన ఆరో శతాబ్దం నాటి కన్నడ లిపిని కూడా చూడవచ్చు. నాటి చాళుక్యుల అభిరుచికి నిదర్శనంగా నిలుస్తుంది బాదామి కోట. ఎక్కడా హడావుడి లేకుండా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందా పట్టణం. జాలువారే జలపాతాల అందాన్నీ కొండగాలి గిలిగింతల్నీ మొత్తమ్మీద అక్కడి నిశ్శబ్ద ప్రకృతిని ఆస్వాదించాలనుకునేవాళ్లకి నాటి చాళుక్యుల రాజధాని  బాగుంటుంది అని చెప్పవచ్చు.
ఐహోలెకి 35 కి.మీ. దూరంలో కృష్ణా, ఘటప్రభ, మలప్రభ నదుల సంగమం ఉంది. ఆనాటి చాళుక్య శిల్పశైలికి నిదర్శనం ఈ కూడల సంగమేశ్వర ఆలయం. 12వ శతాబ్దంనాటి శైవ మత వ్యాప్తికి కృషిచేసిన సుప్రసిద్ధ శివభక్తుడు బసవేశ్వరుడు ఇక్కడే జన్మించాడట. అందుకే బసవేశ్వర సమాధి ఒక పక్క మండపంలో ఉంది. చివరగా కూడల సంగమానికి పది కి.మీ. దూరంలో ఉన్న అతి పెద్ద ఆలమట్టి డ్యాం చూడ్డానికి వెళ్లాం. దాని చుట్టూ ఎన్నో ఉద్యానవనాలు ఉన్నాయి. వాటిల్లో లవకుశ ఉద్యానవనమూ మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ ఉన్న ఉద్యానవనాలను చూసి వెనుతిరిగాం.