close
పెళ్లి గాజుల సందడి..!

పెళ్లి గాజుల సందడి..!

హరివిల్లు వర్ణాలూ తారల తళుకులూ మంజులనాదాలూ కలగలిసి గలగల గాజులై... పెళ్లిగాజులై... గోరింట పండిన ఆ కొత్త పెళ్లికూతురి చేతుల్ని చుట్టుకుంటే ఆ అందం చూడతరమా... ఆ సోయగం వర్ణించతరమా... అటు సంప్రదాయం, ఇటు ఫ్యాషన్‌ కలగలిసిన ఆ డిజైనర్‌ పెళ్లి గాజుల గలగలలు ఓసారి విందామా..!
రంగురంగుల ఫ్యాన్సీ గాజుల్నీ రకరకాల బంగారు గాజుల్నీ వేసుకోవడం అంటే అమ్మాయిలకి ఎంతో ఇష్టం. బారసాల నుంచి పెద్దయ్యేవరకూ ఎన్నో గాజులు వేస్తుంటారు, తీస్తుంటారు. కానీ పెళ్లిగాజుల అందమే వేరు. అవి కేవలం చేతులకి అలంకారం మాత్రమే కాదు, వైవాహిక జీవితం హంసనావలాగ హాయిగా సాగిపోవాలని కోరుకుంటూ తొడుక్కునే చూడచక్కని అందాలే పెళ్లిగాజులు. ఏ అమ్మాయికైనా అవి ఎంతో ప్రత్యేకం. అందుకే మళ్లీమళ్లీ రాని ఆ మధుర ఘట్టంకోసం ఏరికోరి మరీ వాటిని ఎంచుకుని సెట్‌ చేసుకుంటోంది ఈ తరం. అయితే ఎంత డిజైనర్‌ గాజుల్ని సెట్‌ చేసుకున్నా వాటికీ ఓ లెక్క ఉంటుంది. సాధారణంగా మనదగ్గర అయితే అన్నీ కలిపి కుడిచేతికి 21, ఎడమ చేతికి 20 గాజులు ఉండేలా వేస్తారు. ఇవి ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. మొత్తమ్మీద బేసిసంఖ్య ఉండేలా వేస్తారు. పైగా వాటిని పదహారు రోజుల పండగ వరకూ తీయకూడదు. అదే పంజాబీలయితే ఏడాది వరకూ వాటిని తీయకూడదట. వాళ్లు వేసుకునేవి ప్లాస్టిక్కుతో చేసినవి కాబట్టి రంగుపోతే అత్తగారు మళ్లీ రంగు వేయిస్తుందట. అయితే ఇటీవల ఉద్యోగరీత్యా కుదరకపోవడంతో వాటిల్లో ఐదూ ఏడూ... ఇలా కొన్ని మాత్రం ఉంచి మిగిలినవి తీసేస్తున్నారు. కానీ ఉత్తరాదినయినా దక్షిణాదినయినా పెళ్లికి అందరూ అంతే పద్ధతిగా చీరకి నప్పేలా చేతినిండుగా గాజుల్ని వేస్తున్నారన్నది ఎంత నిజమో, వాటిల్లోనూ మట్టిగాజుల్ని కలగలిపి వేస్తున్నారన్నదీ అంతే నిజం.
మట్టిగాజుల సోయగం...
చేతినిండుగా బంగారం, వజ్రాల గాజులు ఎన్ని వేసినా వాటిమధ్యలో అయినా మట్టిగాజుల గలగలలు ఉండాల్సిందే. ఎన్ని రకాల గాజులున్నా మట్టిగాజుల అందమే వేరు. విభిన్న లోహాలూ ప్లాస్టిక్‌, ఆక్రిలిక్‌... వంటి వాటితో కూడా రంగురంగుల్లో గాజుల్ని చేసినా అవన్నీ గాజుని కరిగించి, పోతపోసి చేసే ఆ గాజుల గలగలల ముందు వెలవెల పోవాల్సిందే. దక్షిణాది పెళ్లిళ్లలో ఇప్పటికీ ఈ గాజులదే హవా. అందునా ఇటీవల పెళ్లిచీరల్నీ ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకుంటున్నారు. దాంతో వాటికి తగ్గట్లే మట్టిగాజులూ డిజైనర్‌ లుక్‌ని సొంతం చేసుకుంటున్నాయి. ఒకప్పుడు కేవలం రంగురంగుల్లో సాదాగానూ చమ్కీలు అద్దుకునీ మాత్రమే కనిపించే మట్టిగాజులు కూడా ఇప్పుడు ఎన్నో రాళ్ల సోయగాల్నీ అద్దుకుంటున్నాయి. రంగులరాళ్లూ, కుందన్లూ, ముత్యాలూ పొదిగి మరీ వీటిని తయారుచేస్తున్నారు. వీటికే బుట్టల్నీ వేలాడదీస్తున్నారు. చమ్కీల మెరుపులకు తోడుగా లోహపు బిందీల్నీ అద్దేస్తున్నారు. అచ్చంగా బంగారు గాజుల్ని తలపించేలా రకరకాల చెక్కుళ్లతోనూ సప్తవర్ణాలూ ఒకేగాజులో ఉండేలానూ కూడా చేసేస్తున్నారు. ఇక, రంగులకి వస్తే మనదగ్గర ఎరుపూ బంగారు లేదా ఆకుపచ్చా బంగారు వర్ణాల్ని కలగలపిన గాజుల్ని వేసుకోవడమే ఎంతోమంది శుభశకునంగా భావిస్తారు. బంగారుగాజుల్ని సంతానానికీ సంపదకీ
అదృష్టానికీ చిహ్నంగా భావిస్తే, ఆకుపచ్చ రంగు అదృష్టానికీ సంతానానికీ మంచిదనీ; ఎరుపు శక్తినీ సంపదనీ ఇస్తుందనీ; నీలం రంగు వివేకాన్నీ; నారింజ విజయానికీ తెలుపు కొత్తదనానికీ సంకేతమని చెబుతారు.
గలగలల కలబోత..!
అన్నీ మట్టిగాజులే కాకుండా కాస్త విభిన్నంగా ఉండాలనుకునేవాళ్లు లక్కతోనూ ఏనుగుదంతంతోనూ ప్లాస్టిక్‌తోనూ చేసిన రాజస్థానీ రాళ్లగాజుల్నీ తమ పెళ్లిగాజుల సెట్టులో జోడిస్తున్నారు. చీరలకి కచ్చితమైన మ్యాచింగ్‌ కోసం సిల్కుదారాలతో అల్లిన గాజుల్నీ జత చేస్తున్నారు కొందరు. ఇక, కెంపులూ పచ్చలూ ముత్యాలూ వజ్రాలూ పొదిగినవీ రకరకాల డిజైన్లలో చేయించుకున్న బంగారు గాజులూ కుందన్లూ అన్‌కట్‌ వజ్రాలతో చేసిన కంకణాలూ కూడా జోడించి వేసుకునే ముద్దుగుమ్మలు మరికొందరు. రంగురంగుల మీనాకారి అందాల్నీ చొప్పించేవాళ్లు ఇంకొందరు. మధ్యలో పేర్లు వచ్చేలానూ వధూవరుల ఫొటోలనూ అతికించి మరీ రాళ్ల గాజుల్ని డిజైన్‌ చేయించుకునేవాళ్లూ ఉన్నారు. ఎవరి డిజైన్లు వాళ్లవే. ఏ గాజుల అందం వాటిదే. కానీ జీలకర్రాబెల్లంతో తలమీదా చెయ్యి పెట్టినప్పుడో, కొంగుముడి వేసుకుని చిటికెన వేలు పట్టుకుని సప్తపది వేస్తున్నప్పుడో, దోసిటనిండుగా పచ్చని తలంబ్రాలు పోస్తున్నప్పుడో చూడాలి కదా... ఆ పెళ్లి గాజుల అందాన్నీ.. ఆ గలగలల సంబరాన్నీ... ఎవరైనా ఎంతసేపైనా అలా చూస్తూ ఉండిపోవాల్సిందే మరి..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.