close
ఆ రికార్డుని ఆరోజే మర్చిపోయా!

ఆ రికార్డుని ఆరోజే మర్చిపోయా!

కన్నూర్‌ లోకేష్‌ రాహుల్‌... టీమ్‌ ఇండియా ఆటగాడు. పుజారాలానే టెస్ట్‌ క్రికెట్లో తనదైన ముద్ర వేసుకున్నవాడు. కానీ ఆ ముద్రే అతడి కెరీర్‌కి అడ్డంకిగా మారింది. ఎంత కాదన్నా టీ20లకు ఇటీవల ప్రాధాన్యం పెరిగింది.  నాలుగేళ్లుగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్నాడు కానీ పొట్టి క్రికెట్‌లో రాహుల్‌కి సరైన గుర్తింపు రాలేదు. కానీ ఐపీఎల్‌ చరిత్రలో మొదటిసారి 14 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి రికార్డు సాధించి ఫార్మాట్‌ ఏదైనా తానుంటానని చాటిచెప్పాడు. ఈ సందర్భంగా రాహుల్‌ క్రికెట్‌ ప్రయాణం గురించి అడిగితే చెబుతున్నాడిలా...
ిన్నప్పట్నుంచీ టెస్ట్‌ క్రికెట్‌ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నాను. నాన్న, నా కోచ్‌ కూడా నన్ను టెస్ట్‌ క్రికెటర్‌గానే చూడాలనుకున్నారు. నా అంతర్జాతీయ కెరీర్‌ 2014లో టెస్టు మ్యాచ్‌తోనే మొదలైంది.  అలాంటి నేను ‘ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ’ సాధించడం ఊహించలేని విషయం. ఎందుకంటే టీమ్‌ ఇండియా తరఫున క్రికెటర్‌గా అన్ని ఫార్మాట్‌లలోనూ ఆడాలని కొన్నాళ్ల కిందట అనుకున్నాను. ఆడగలనన్న ధైర్యం ఈ రికార్డుతో వచ్చింది.
అసలు నేను క్రికెట్‌లోకి ఎలా వచ్చానో మీకు చెప్పలేదు కదూ! నా గురించి చెప్పాలంటే కర్ణాటకలోని సూరత్కల్‌ వెళ్లాలి. నాన్న లోకేష్‌ అక్కడి ఎన్‌ఐటీలో ప్రొఫెసర్‌. కాలేజీ రోజుల్లో క్రికెట్‌ బాగా ఆడేవారట. గవాస్కర్‌కి వీరాభిమాని. అతడి కొడుకుపేరే నాకూ పెట్టాలనుకున్నాడు. ఎవర్నో అడిగితే గవాస్కర్‌ కొడుకు పేరు రాహుల్‌ అని చెప్పారట. అందుకే నాకు ఆ పేరుపెట్టారు. తర్వాత రాహుల్‌ కాదు రోహన్‌ అని తెలిసినా అప్పటికే రికార్డుల్లోకి వెళ్లడంతో మార్చలేకపోయారు. నాకు పదేళ్లు వచ్చేవరకూ నాతో క్రికెట్‌ ఆడేవారు నాన్న.  

అద్దాలు పగిలాయి...
ఎన్‌ఐటీ క్వార్టర్స్‌లో ఉండేవాళ్లం. అక్కడ నేను కొట్టిన బంతి తగిలి ఇంటి అద్దాలు పగిలిపోతున్నాయని ఇరుగుపొరుగు వాళ్లు రోజూ నాపైన కంప్లైంట్‌ చేసేవారు. దాంతో మాకు 20కి.మీ. దూరంలోని మంగళూరులోని క్రికెట్‌ అకాడమీలో చేర్పించారు. రోజూ బస్సులో వెళ్లి వచ్చేవాణ్ని. 11ఏళ్లపుడు మంగళూరు జిల్లా అండర్‌-13 జట్టు సెలక్షన్లు జరిగితే వెళ్లా... కానీ ఎంపిక కాలేదు. ఆ  తర్వాత రోజునుంచి గ్రౌండ్‌లో అందరికంటే నేనే ముందుండేవాణ్ని. మరోసారి సెలక్షన్లు జరిగినపుడు కచ్చితంగా జట్టులో ఉండాలని గట్టిగా అనుకున్నాను. ఆ తర్వాత ఏడాది అండర్‌-13 జట్టుకీ, తర్వాత అదే విభాగంలో రాష్ట్ర జట్టుకీ ఎంపికయ్యాను. అప్పుడు మంగళూరు-బెంగళూరు మధ్య తరచూ తిరగాల్సి వచ్చేది. కోచ్‌  జైరాజ్‌ కూడా నాపైన ప్రత్యేక దృష్టిపెడుతూ వచ్చారు. వికెట్‌ కీపింగ్‌ కూడా ప్రాక్టీసు చేయించేవారు. దీనివల్ల బౌలర్‌ యాక్షన్‌నీ, బంతి గమనాన్నీ నిశితంగా పరిశీలించŸడం అలవాటుచేసుకున్నాను.
ద్రవిడ్‌ మెచ్చారు...
అండర్‌-13 మ్యాచ్‌లో మంగళూరు తరఫున ఆడుతూ బెంగళూరుపైన చిన్నస్వామి స్టేడియంలో డబుల్‌ సెంచరీ చేసినపుడు రాహుల్‌ ద్రవిడ్‌ ఆ మ్యాచ్‌ చూశారు. నా గురించి కోచ్‌ని అడిగి, ‘మంచిగా చూస్కోండి’ అని చెప్పారట. నాకు చిన్నపుడు ఓ మంచి అవకాశం దొరికింది. కర్ణాటకలో ‘టాలెంట్‌ రిసోర్స్‌ డవలప్‌మెంట్‌ ఆఫీసర్‌’లు ఉంటారు. యువ క్రికెటర్లలో ప్రతిభావంతుల్ని గుర్తించి శిక్షణ ఇప్పించడం వీరి పని. నాకు 12 ఏళ్లపుడు ఆ శిబిరాల్లో చేర్చేందుకు ఒక ఆఫీసర్‌ ప్రయత్నించారు. కానీ నిబంధనల ప్రకారం కనీసం 14 ఏళ్లు ఉండాలి. అయితే నా పేరు నమోదు చేయకుండానే అనధికారికంగా అకాడమీలో ప్రాక్టీసుకి అనుమతించేలా కర్ణాటక బోర్డుకి సిఫార్సు చేస్తే బోర్డు కూడా అంగీకరించింది. అండర్‌-14 ఇంటర్‌ జోనల్‌ మ్యాచ్‌లలో వరసగా రెండు డబుల్‌ సెంచరీలు చేశాను. తర్వాత జాతీయ జట్టుకీ ఎంపికై అండర్‌-19 ప్రపంచకప్‌ ఆడాను. ఆపైన రంజీ జట్టుకి ఎంపికయ్యాను.
బెంగళూరులో మ్యాచ్‌లకీ, శిక్షణకీ వచ్చినప్పుడు స్టేట్‌ క్రికెట్‌ అకాడమీ డార్మిటరీలో ఉండేవాణ్ని. ఏడాదిలో 6-8 నెలలు అక్కడ ఉండేవాణ్ని. అక్కడ నేను తప్ప ఎవరూ ఉండేవారు కాదు. భయంకరంగా ఉంటుంది. నేనప్పుడు అక్కడ ఎలా ఉన్నానో నాకే తెలీదు. ఇప్పుడైతే ఉండలేకపోయేవాణ్నేమో. 17ఏళ్లు వచ్చినప్పట్నుంచీ బెంగళూరులో రూమ్‌ తీసుకుని ఉన్నాను. అనిల్‌ కుంబ్లే, రాహుల్‌ ద్రవిడ్‌బెంగళూరులో ఉన్నపుడు చిన్నస్వామి స్టేడియంలో ప్రాక్టీసు చేసేవారు. వాళ్లెంత క్రమశిక్షణతో శ్రమిస్తారో చాలా దగ్గర్నుంచి చూశాను. అంతర్జాతీయ క్రికెటర్‌ అంటే ఏ స్థాయిలో కష్టపడాలో అర్థమైంది. 2013-14 సీజన్లో కర్ణాటక రంజీ ట్రోఫీ గెల్చిన జట్టులో ఉన్నాను. ఆ  సీజన్లో వెయ్యికిపైగా పరుగులు చేశాను. 2014-15 సీజన్‌లో సౌత్‌ జోన్‌కి ఆడుతూ దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో రెండు ఇన్సింగ్స్‌లోనూ సెంచరీలు చేసిన వారానికే 2014లోనే ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికచేశారు.

మొదటి సెంచరీ...
నాలుగు టెస్టుల సిరీస్‌కు ఎంపికైనా మొదటి రెండు మ్యాచ్‌లలో ఆడే అవకాశం రాలేదు. మెల్‌బోర్న్‌లో జరిగిన మూడో టెస్టులో ఆడే అవకాశం వచ్చింది. ఆ మ్యాచ్‌కు సిద్ధంకావాలని కెప్టెన్‌, కోచ్‌ నాల్రోజులు ముందే చెప్పారు. దేశవాళీ మ్యాచ్‌లలో ఓపెనింగ్‌ బ్యాట్స్‌మేన్‌ని. కానీ ఏ స్థానంలోనైనా ఆడడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఆ మ్యాచ్‌లో ఆరో నంబర్‌ బ్యాట్స్‌మేన్‌గా క్రీజ్‌లోకి దిగేముందు నాలుగు గంటలు ప్యాడ్‌లు కట్టుకుని ఉన్నాను. నాకది అలవాటులేదు. క్రీజ్‌లోకి వచ్చాక ఒక్క బౌండరీ సాధిస్తే కుదురుకున్నట్టేనని ఫీలయ్యాను. ఆ ప్రయత్నించే క్రమంలో తొందరగానే ఔటయ్యాను. సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ బాగా ఆడలేదు. కానీ సిడ్నీ టెస్టులో ఓపెనింగ్‌కి అవకాశం వచ్చింది. ‘బంతికీ బంతికీ మధ్య స్క్వేర్‌ లెగ్‌వైపు వెళ్తూ శ్వాసమీద దృష్టిపెట్టు. తర్వాత బంతి గురించి ఆలోచించకు. అది వచ్చినపుడు నీదైన తీరులో సహజంగా ఆడు’ అని నా తోటి ఓపెనర్‌ విజయ్‌ ఇచ్చిన సలహాని పాటించాను. అది పనిచేసింది. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియామీద సెంచరీ చేశాను. దాంతో నాపైన ఉన్న ఒత్తిడి పూర్తిగా పోయినట్టనిపించింది. తర్వాత శ్రీలంక, వెస్టిండీస్‌లో సెంచరీలు చేశాను.
ఐపీఎల్‌ మార్చేసింది!
2014, ’15 ఐపీఎల్‌ సీజన్లలో హైదరాబాద్‌ జట్టుకి ఆడాను. కానీ పెద్దగా రాణించలేదు. ప్రతి బంతినీ బౌండరీ దాటించాలని చూసేవాణ్ని. అక్కడ వీవీఎస్‌ లక్ష్మణ్‌ మాకు మెంటార్‌. ‘నువ్వు బాగా ఆడగలిగే షాట్లనే ఆడు’ అని సలహా ఇచ్చేవారు. 2016లో ఆర్‌సీబీకి ఆడాను. అక్కడ డివిలియర్స్‌, క్రిస్‌గేల్‌, కొహ్లీలతో చాలా ఎక్కువ సమయం గడిపాను. అది వరకు సీనియర్లతో క్రికెట్‌ గురించి చర్చిస్తే వాళ్లని డిస్టర్బ్‌ చేసినట్లవుతుందని ఫీలయ్యేవాణ్ని. కానీ ఈసారి మాట కలిపాను. మంచి ఆరంభాన్ని భారీ స్కోర్లుగా మల్చుకోవడం గురించి అడిగాను. ‘రెండు హాఫ్‌ సెంచరీలు చేసి చూడు అంతా కుదురుకుంటుంది’ అని సలహా ఇచ్చారు. కేవలం స్ట్రైక్‌ రొటేట్‌ చేయడంకాకుండా నచ్చిన షాట్లు ఆడే స్వేచ్ఛను కొహ్లీ ఇచ్చాడు. ఆ సీజన్లో బాగా రాణించి 397 పరుగులు చేశాను. ఐపీఎల్‌ద్వారానే టీ20 ఫార్మాట్‌లోనూ ఆడగలనన్న నమ్మకం వచ్చింది. ఇప్పుడు లూజ్‌బాల్‌ పడితే టెస్టుల్లోనూ సిక్సులు కొట్టాలనుకుంటా. మూడు ఫార్మాట్‌లలో ఉంటే ఏడాదిలో 200 రోజులు ఆడాలి. అందుకు ఫిట్‌నెస్‌ ముఖ్యమని అర్థమైంది. ఈ విషయంలో విరాట్‌ కొహ్లీ నాకు స్ఫూర్తి.
2016 ఐపీఎల్‌ తర్వాత జింబాబ్వేపైన వన్డే, టీ20ల్లో ఆడే అవకాశం వచ్చింది. ఆడిన మొదటి వన్డేలో సెంచరీ చేశాను. తర్వాత వెస్టిండీస్‌మీద టీ20ల్లోనూ సెంచరీ చేశాను. వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌లతో టెస్టు సిరీస్‌లలో ఆడాను. 2017లో మనదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో రెండో అత్యుత్తమ స్కోరర్‌గా నిలిచాను. నా కెరీర్‌లో అత్యంత సంతృప్తికరమైన సిరీస్‌ అది. ఏడు ఇన్సింగ్స్‌లో ఆరు అర్ధ సెంచరీలు చేశాను. ‘కేఎల్‌ రాహుల్‌ గుడ్‌ ప్లేయర్‌ నుంచి క్లాస్‌ ప్లేయర్‌గా మారాడు’ అని మంజ్రేకర్‌ ట్వీట్‌ చేశాడు. మంచి ఫామ్‌లో ఉండగా గాయమైంది. దాని కారణంగా 2017 ఐపీఎల్‌లో ఆడలేదు. 2017 ప్రారంభానికి నా కెరీర్‌ను ఒక స్థాయిలో పెట్టుకున్నాను. కానీ గాయం
కారణంగా మళ్లీ కిందకు రావాల్సి వచ్చింది. కెరీర్‌లో ఈ ఎత్తుపల్లాలు ఎప్పుడూ ఉండేవే. కానీ ఇక్కడివరకూ వచ్చినందుకు సంతోషిస్తాను. మరోవైపు క్రికెటర్‌గా నేను సాధించాల్సింది ఇంకా ఉందనుకుంటాను. మొదట్నుంచీ నా సమస్య టెక్నిక్‌కి సంబంధించినది కాదు, మానసికపరమైన సంసిద్ధతే తేడా. అది సిరీస్‌ సిరీస్‌కూ మెరుగవుతోంది.
గేల్‌ పాత్ర ఉంది!
ఈసారి ఐపీఎల్‌లో 14 బంతుల్లో అర్ధ సెంచరీ వెనక క్రిస్‌గేల్‌ పాత్ర కూడా ఉంది. ఆర్‌సీబీకి ఆడినప్పట్నుంచీ గేల్‌ని గమనిస్తున్నాను. అతడితో ఇన్నింగ్స్‌ వేగంగా ఆడే విషయం గురించి చాలాసార్లు చర్చించాను కూడా. ముందు క్రీజ్‌లో కుదురుకుంటే తర్వాత ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్‌ ఆడొచ్చని చెప్పేవాడు గేల్‌. చాలారోజులుగా దీనిపైనే దృష్టిపెట్టి ఆడుతున్నాను. ఇప్పుడు విజయవంతమయ్యాను. యువరాజ్‌ సింగ్‌ క్రీజులోకి వచ్చి చెప్పాక కానీ అది ఐపీఎల్‌లో వేగవంతమైన అర్ధ సెంచరీ అన్న సంగతి నాకు తెలీదు. ఆరోజు బౌలర్‌ ఎప్పుడు బంతి వేస్తాడా కొడదామా అన్న ఫీలింగ్‌లో ఉన్నాను. ఆ రికార్డుని ఆరోజే మర్చిపోయి ఆటమీద దృష్టి పెట్టాను. అతి విశ్వాసం పనికిరాదుగా. అయితే, ‘టెస్ట్‌ క్రికెటర్‌’గా నాపైన ఉన్న ముద్ర ఈ ఇన్నింగ్స్‌తో పోయింది. ఆ విధంగా మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకుంటాను!

ఇంకొంత...  

రాహుల్‌ తల్లి రాజేశ్వరి కూడా ప్రొఫెసర్‌. రాహుల్‌ మంచి విద్యార్థి. పదో తరగతిలో 90శాతం మార్కులు వచ్చాయి. అతడిని ఇంజినీరింగ్‌ చదివించాలనుకున్నాడు తండ్రి. క్రికెట్‌ మీద దృష్టిపెట్టి ఇంజినీరింగ్‌ చేయలేడని బీకామ్‌ చేస్తానంటే సరేనన్నారు.
* విదేశాల్లో ఆడేటప్పుడు ఆయా నగరాల్లో బాగా తిరుగుతాడు. జట్టు సహచరులతో కొత్త రెస్టారెంట్లకీ, థీమ్‌ పార్కులకూ వెళ్తూ సరదాగా గడుపుతాడట. దానివల్ల స్నేహబంధం కూడా దృఢపడుతుందంటాడు.
* షిర్డీ సాయి భక్తుడు. తన స్నేహితుడికితోడుగా కలిసి బాబా గుడికి వెళ్తుండేవాణ్ననీ, అక్కడ ప్రశాంతత లభించడంతో తానూ
భక్తుడిగా మారాననీ చెబుతాడు.
* ఇండియా తరఫున టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్‌లలో రోహిత్‌ శర్మ, రైనాలతోపాటు సెంచరీలు చేసింది
రాహుల్‌ మాత్రమే.
* ఆడిన మొదటి వన్డేలోనే సెంచరీ చేసిన మొదటి భారతీయ బ్యాట్స్‌మేన్‌.
* వికెట్‌ కీపర్‌గానూ ప్రాక్టీసు చేస్తుంటాడు. అత్యవసర పరిస్థితుల్లో చాలాసార్లు కీపింగ్‌ చేశాడు.
* ఎప్పటికప్పుడు హెయిర్‌స్టయిల్స్‌ని మార్చుతాడు. టాటూలు వేయించుకోవడం అంటే చాలా ఇష్టం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.