close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ ఆప్‌ వేసవి కోసం..!

ఈ ఆప్‌ వేసవి కోసం..!

వేసవి వచ్చిందంటే చాలు ప్రయాణాల సందడి మొదలైపోతుంది. పిల్లలకు హాలిడేస్‌ ట్రిప్పో, పెద్దవాళ్లను తీసుకుని తీర్థయాత్రలకో బయలుదేరుతుంటారు. మనం వెళ్లాల్సిన ప్రాంతానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని సేకరిస్తాం. కానీ, అక్కడి వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మాత్రం కొంచెం కష్టమే. అయితే ఇదంతా ఒకప్పటి మాట. స్మార్ట్‌ఫోన్ల పుణ్యమా అని వాతావరణ వివరాలను బ్రేకింగ్స్‌, యానిమేషన్‌, కార్టూన్ల రూపంలో నిమిష నిమిషానికి అందించే ఆప్‌లు ఇప్పుడు మన అరచేతిలోకే వచ్చేశాయి.
కప్పుడు వాతావరణ వివరాలను పంటలు పండించే రైతులో, వేటకు వెళ్లే మత్స్యకారులో అడిగి తెలుసుకునేవారు. ఇప్పుడా జాబితాలో పర్యటకులు కూడా చేరిపోయారు. ముఖ్యంగా వేసవి కాలంలో ఇంట్లోంచి అడుగు తీసి అడుగేయాలంటే బయట ఎండలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటే తప్ప వెళ్లలేని పరిస్థితి. ఒకప్పుడు రేడియో ఆ తర్వాత టీవీలకు మాత్రమే పరిమితమైన వాతావరణ వివరాలు ఇప్పుడు స్మార్ట్‌ ఫోనుల్లోనూ లభ్యమవుతున్నాయి. మన ఇంటి దగ్గర, మన ఊర్లో, మనం వెళ్లబోతున్న ప్రాంతంలో... ఇలా మనకు కావల్సిన ప్రదేశంలోని వాతావరణ పరిస్థితులను కచ్చితంగా చెప్పడమే కాదు, మారుతున్న వాతావరణాన్ని కూడా ఎప్పుటికప్పుడు అందించే ఆప్‌లు చాలానే అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు. దీంతో ఏ సమయంలో బయటకు వెళ్లొచ్చు, ఏ ప్రాంతం వేసవి ట్రిప్‌కి అనుకూలంగా ఉంటుందనే వివరాలను సులువుగా తెలుసుకోవచ్చన్నమాట.

ద వెదర్‌ ఛానల్‌
వాతావరణ వివరాలు అందించే అన్నింటిలో ఎక్కువ ఉపయోగకరమైన ఆప్‌గా దీనికి పేరుంది. ఈ ఆప్‌ ద్వారా గడిచిన రెండురోజుల స్థితిగతులతోపాటు రాబోయే పది రోజుల వరకూ మనం ఎంచుకున్న ప్రదేశంలోని వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు. ఇందులో ఉన్న వెదర్‌ మ్యాప్స్‌ ద్వారా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల వాతావరణాన్ని చిత్రాలతో సహా చూసేవీలుంటుంది. అదేవిధంగా న్యూస్‌ ఛానల్‌ మాదిరిగా వాతావరణ వివరాలను ఎప్పటికప్పుడు బ్రేకింగ్స్‌, అలర్ట్స్‌ రూపంలో అందిస్తుంది. తుపాను, వాన, ఎండ, చలి... ఇలా అన్నింటినీ నోటిఫికేషన్‌ రూపంలో తెలపడం దీని ప్రత్యేకత.

ఆక్యూ వెదర్‌
ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి బాగా ఉపయోగపడే ఆప్‌ ఇది. లేటెస్ట్‌ వెదర్‌ మ్యాపులూ, మినిట్‌ కాస్ట్‌ లాంటి ఫీచర్లతో దీన్ని రూపొందించడమే ఇందుకు కారణం. మామూలు రోజుల్లో ప్రతి గంటకూ వాతావరణ వివరాలు అందించే ఈ ఆప్‌ వర్షం కురిసేటప్పుడు మాత్రం నిమిష నిమిషానికీ వర్ష తీవ్రతను తెలియజేస్తుంది.ముప్ఫై మూడు భాషల్లో ఈ ఆప్‌ అందుబాటులో ఉంది.

టుడే వెదర్‌
వాతావరణ వివరాలను అందంగా అందించే విధంగా రూపొందించిన ఆప్‌ ఇది. మనం ఉన్న ప్రదేశం, వెళ్తున్న చోటు లేదా నచ్చిన ప్రాంతాలను ఈ ఆప్‌లో అనుసంధానించడం ద్వారా ఆయా ప్రదేశాల్లోని వాతావరణ పరిస్థితులను అందమైన చిత్రాల రూపంలో చూడొచ్చు. తాజా వాతావరణ వివరాలతోపాటు రాబోయే 24 గంటల్లో వాతావరణం ఎలా ఉండబోతోంది, సూర్యోదయం, సూర్యాస్తమయం, గాలిలోని తేమ శాతం మొదలైన వివరాలకు యానిమేషన్‌ని జతచేసి ఆకట్టుకునేలా అందిస్తుంది.

వెదర్‌ అండర్‌ గ్రౌండ్‌
ఇది పూర్తిగా స్థానిక వివరాలను అందించే ఆప్‌. దాదాపు లక్షా ఎనభైవేల ప్రయివేట్‌ వెదర్‌ స్టేషన్ల నుంచి వచ్చే వివరాలని క్రోడీకరించి అందిస్తుంది. కచ్చితమైన సమాచారాన్ని అందించే ఆప్‌గా దీనికి మంచి పేరుంది. ఒకే అప్లికేషన్‌లో మొత్తం వాతావరణ వివరాలన్నింటినీ పొందాలనుకునేవారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

మై రాడార్‌ వెదర్‌ రాడార్‌
వాతావరణానికి సంబంధించిన వార్తలను చిత్రాల రూపంలో అందించే ఆప్‌ ఇది. వర్షం వస్తున్నదీ, దట్టమైన మేఘాలు అలుముకున్నదీ, వర్షం ఆగిపోయిందీ, ఎండ తీవ్రత ఎలా ఉన్నదీ... ఇలా ప్రతీ అంశాన్ని చిత్రాల రూపంలో మనకందిస్తుంది. దీంతో చదువుకోని వ్యక్తులూ సులువుగా వాతావరణ వివరాలు తెలుసుకోవచ్చు.
యో విండో ఆప్‌ కూడా ఈ కోవకు చెందిందే. కాకపోతే ఇది కాంతికి సంబంధించిన వివరాలను ఎక్కువగా అందిస్తుంది. వర్షం, ఎండ, చలి మొదలైన వివరాలను కార్టూన్ల రూపంలో అందించడం వల్ల ఈ ఆప్‌ ఎక్కువమందికి చేరువైందని చెప్పొచ్చు.
వీటితోపాటు యాహూ వెదర్‌, వెదర్‌ టైంలైన్‌ ఫోర్‌కాస్ట్‌, డార్క్‌ స్కై, మోర్‌కాస్ట్‌, వెదర్‌ బగ్‌ లాంటి ఆప్‌లు కూడా ఎప్పటికప్పుడు వాతావరణ అంశాల అప్‌డేట్‌లు అందిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీకు కావల్సిన ఫీచర్లున్న ఆప్‌ని వెంటనే డౌన్‌లోడ్‌ చేసేసుకోండి మరి!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.