close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
క్షమయా ధరిత్రి

క్షమయా ధరిత్రి
- జి.వి.శ్రీనివాస్‌

ఠాత్తుగా మెలకువ వచ్చింది మనోహర్‌కి. బెడ్‌ పక్కనే ఉన్న సెల్‌ తీసి టైమ్‌ చూశాడు. ఉదయం నాలుగయింది. మరలా పడుకోబోతూ పక్కన చూశాడు. బెడ్‌లైట్‌ మసక వెలుతురులో బ్లాంకెట్‌ ఖాళీగా కనిపించింది. ఆ టైమ్‌లో బాత్‌రూమ్‌కి వెళ్ళడం వసుంధరకి అలవాటే. మెల్లగా కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకున్నాడు.
సెల్‌లో అలారం కేకలు వేస్తుంటే కళ్ళు విప్పి అలారం ఆఫ్‌ చేస్తూ టైమ్‌ చూశాడు, ఏడయింది. బ్రష్‌ చేసుకుని వచ్చి బాల్కనీలో కూర్చుని పేపర్‌ చూస్తూ ‘‘ఓయ్‌ మొద్దూ, కాఫీ’’ అని ఆర్డర్‌ వేశాడు. లోపలనుంచి సమాధానం రాలేదు. ‘ఎన్నిసార్లు తిట్టినా బుద్ధిరాదు ఈ ఆడవాళ్ళకు’ అనుకుంటూ ‘‘ఓయ్‌’’ అని గట్టిగా గర్జించాడు. ఎందుకోగానీ అతని గొంతు వణికినట్లు అతనికే అనిపించింది.
కోపంతో గబగబా ఇంట్లోకి నడిచాడు. వంటింట్లో భార్య కనబడలేదు. బెడ్‌రూమ్‌లో వెతికాడు. బాత్‌రూమ్‌ కూడా చూశాడు. ఇంట్లో ఎక్కడా కనబడలేదు. ‘ఎక్కడకు వెళ్ళి ఉంటుందీ’ అనుకుంటూ చెప్పుల స్టాండ్‌ వైపు యథాలాపంగా చూశాడు. భార్య చెప్పులూ వాకింగ్‌ షూస్‌ కూడా అక్కడే ఉన్నాయి. అయితే వాకింగ్‌కి కూడా వెళ్ళలేదన్నమాట.
‘మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుందీ?’ అని ఆలోచిస్తూ పేపర్‌ చూస్తున్నాడన్న మాటేగానీ, ‘ఎక్కడికి వెళ్ళి ఉంటుందీ’ అనే ఆలోచన కందిరీగలా కుట్టేస్తోంది.
ఏదో ఆలోచన వచ్చి గబగబా ఎదురునే ఉన్న సుబ్బారావుగారింటి వైపు వెళ్ళాడు. కాలింగ్‌బెల్‌ నొక్కగానే సుబ్బారావుగారు బయటకు వచ్చి ‘‘రావోయ్‌ మనోహర్‌, ఏమిటీ విశేషాలు...’’ అంటూ ఆప్యాయంగా పలకరించారు.
సుబ్బారావుగారు స్టేట్‌ గవర్నమెంటులో ఏదో పెద్ద ఉద్యోగం చేసి రిటైర్‌ అయ్యారు. పిల్లలిద్దరూ మంచి పొజిషన్లలో సెటిలయ్యారు. ‘సొంత ఇల్లు, మంచి బ్యాంకు బ్యాలెన్సు...అదృష్టవంతుడు’ అనుకుంటూ ఒక నిట్టూర్పు విడిచాడు మనోహర్‌.
‘‘ఏం లేదండీ, వసుంధర మీ ఇంటికి వచ్చిందేమోననీ...’’ అంటూ అర్ధోక్తిగా ఆగిపోయాడు.
‘‘తెలీదయ్యా... నేను ఇప్పుడే నిద్రలేచాను. రాత్రి టీవీలో మంచి పాత సినిమా వస్తుంటే అలా చూస్తూ ఉండిపోయా. బాగా లేట్‌ అయింది పడుకునేసరికి. ఉండు, మీ ఆంటీని పిలుస్తాను’’ అని వెళ్ళబోతూ, ‘‘అవునయ్యా, రాత్రి మీ ఇంటినుంచి ఏవో శబ్దాలు వినిపించాయి, ఏమయిందీ?’’ అని అడిగారు.
గతుక్కుమన్నాడు మనోహర్‌. ‘‘ఏం లేదండీ...’’ అంటూ గబగబా ఇంటివైపు అడుగులు వేశాడు- వెనుకనుంచి పిలుస్తున్న సుబ్బారావుగారి గొంతు వినబడనట్లుగా.
ఇంటికి వచ్చి మరోసారి ఇల్లంతా వెదికాడు. ఎక్కడా భార్య అలికిడి వినబడలేదు. అలసటగా కళ్ళు మూసుకున్నాడు. రాత్రి జరిగిన సంఘటన కళ్ళముందు కదలాడసాగింది.
ఎన్నో పెళ్ళిచూపుల తరవాత ఈ సంబంధం ఖాయం చేసుకున్నాడు మనోహర్‌. కట్నం ఎక్కువ ఇస్తామనడం, అమ్మాయి అందంగా ఉండటం కూడా కారణాలు. వసుంధర చక్కని చుక్క.
‘కాకి ముక్కుకు దొండపండు’ అని తమ పెళ్ళికి వచ్చినవారు గుసగుసలాడుకోవడం తన చెవిన పడకపోలేదు. పెళ్ళయి పదేళ్ళు అవుతున్నా ఇంకా పిల్లలు లేకపోవడంతో భార్య ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది.
తనకున్న బిజినెస్‌ ఒత్తిడి వలన కొన్నిసార్లు చిరాకుపడటం, కేకలు వేయడం సామాన్యమే.
స్నేహితులతో కలిసి వారానికి రెండు మూడుసార్లు మందుపార్టీ చేసుకుని రాత్రుళ్ళు లేట్‌గా రావడం తన కలవాటే. నిన్న రాత్రి కూడా అలానే వచ్చాడు.
తలుపు తీస్తూనే ‘‘మళ్ళీ తాగొచ్చారా?’’ అంది.
ఆ మాట వినగానే తనకు మండిపోయింది. తను నానా కష్టాలుపడి బిజినెస్‌ చేస్తూ, టెన్షన్లు మర్చిపోవడానికనీ స్నేహితుల కోసమనీ ఏదో కాస్త తాగితే ఇలా గుమ్మంలోనే నిలబెట్టి అడుగుతుందా? దీని బాబుగారి డబ్బు ఏమైనా ఖర్చు పెడ్తున్నానా ఏంటి? నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులే కదా...
అంతే ఒళ్ళు తెలియని ఆవేశంతో చెంప ఛెళ్ళుమనిపించాడు... లేకపోతే తననే నిలదీస్తుందా? ’సంపాదించి తెస్తుంటే కూర్చుని తిని, కొవ్వు పెరిగింది...’ అనుకుంటూ ఇంకో రెండు తగలనిచ్చాడు.
ఎప్పుడూ కుక్కినపేనులా ఉండే భార్య ఈసారి ఎందుకోమరి ‘‘నేనేమన్నానని కొట్టారు? తాగితే మీ ఆరోగ్యం చెడిపోతుంది అనే కదా నా బాధ...’’ అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది. నోర్మూసుకుని లోపలికిపోక ఎదురుతిరిగి క్లాస్‌ పీకబోతుందన్న కోపంతో వంగదీసి నాలుగు గుద్దులు గుద్దాడు.
ఏడ్చుకుంటూనే అన్నం వడ్డించి, గిన్నెలు శుభ్రం చేసి, ఎర్రబడిన కళ్ళతో వెక్కివెక్కి ఏడుస్తూనే పడుకుంది. తాగిన మైకం శరీర అవసరాన్ని గుర్తు చేస్తూంటే, ఆక్రమణ మొదలుపెట్టాడు. భార్య మాత్రం ఏ ఫీలింగ్‌ లేకుండా బొమ్మలా ఉండిపోవడం ఇంకా చిరాకు తెప్పించింది.
ఉదయం లేచిచూస్తే భార్య కనబడటం లేదు.
‘ఎక్కడికి వెళ్ళి ఉంటుందీ? పక్క కాలనీలో ఉన్న వాళ్ళ అన్నయ్య ఇంటికేమైనా వెళ్ళి ఉంటుందా? పోనీ ఒకసారి వాళ్ళన్నయ్యకి కాల్‌ చేస్తే? ఛీ ఛీ, వెళ్ళినదానికి రావడం తెలియదా? అయినా ఎంతకాలం ఉంటుంది అక్కడ? ఎప్పటికైనా మొగుడి దగ్గరకు రావల్సిందే కదా?’
బుర్ర వేడెక్కిపోయి సిగరెట్టు వెలిగించాడు... ‘ఎక్కడికి వెళ్ళి ఉంటుందీ?’
ఒక్కసారిగా చెయ్యి చురుక్కుమంటే ఆలోచనలోంచి బయటకు వచ్చాడు. సిగరెట్టు చివరకు వచ్చి వేళ్ళు చురుక్కుమన్నాయి.
ఉన్నట్టుండి మనసులో ఏదో అనుమానం. మొన్నామధ్య ఒక ఆదివారం తన భార్యకి దూరపు చుట్టం ఒకడు వచ్చాడు ఇంటికి. వరసకి బావ అవుతాడట. బెంగుళూరులో బ్యాంకు మేనేజర్‌ ఉద్యోగం చేస్తున్నానని చెప్పాడు. కారణం చెప్పలేదుగానీ ఇంకా పెళ్ళి చేసుకోలేదని చెప్పాడు.
అతని చూపులు తన భార్యని చూసినప్పుడు మెరవడం, మాటల్లో జాలిపడటం, తన గద్ద చూపులను దాటిపోలేదు. తన భార్య కూడా అతను చాలా మంచివాడని సర్టిఫికెట్‌ ఇవ్వడం తనకు ఒళ్ళు మంటెక్కించ్చింది. ‘ఈ ఆడవాళ్ళకు మొగుడు తప్ప లోకంలో ప్రతి వెధవా మంచోడిలానే కనిపిస్తాడు గాబోలు’ అనుకున్నాడు.
ఓ రెండ్రోజులు చుట్టపుచూపుగా ఉండి వెళ్ళిపోయాడు. ‘కొంపదీసి ఇది వాడితోగానీ జెండా ఎత్తెయ్యలేదు కదా!’ ఒక్కసారిగా గుండె గుభిల్లుమంది మనోహర్‌కి.
‘సంఘంలో తలెత్తుకుని తిరగ్గలనా... కనిపించే ప్రతివాడూ అడిగే వెటకారపు ప్రశ్నలకూ పనికిమాలిన పలకరింపులకూ తట్టుకోగలనా?’ అనిపించింది.
‘భార్యా రూపవతీ శత్రుః’ అనేమాట గుర్తొచ్చింది.
ఒక్కసారిగా ఒళ్ళంతా చెమటలు  పట్టేశాయి మనోహర్‌కి.

*  *  *

పిలుస్తున్నా వినబడనట్లుగా గబగబా వెళ్ళి పోతున్న మనోహర్‌ వైపు వింతగా చూస్తూ ఇంట్లోకి నడిచారు సుబ్బారావుగారు. లోపల ఎక్కడా భార్య కనబడలేదు. ‘పొద్దునే ఎక్కడికి వెళ్ళుంటుంది...గుడికి వెళ్ళుంటుందా?’ అరగంట గడిచిపోయింది. కానీ భార్య రాలేదు. బాగా దగ్గర సంబంధం అని కాస్త నల్లగా ఉన్నా పెళ్ళి చేసుకున్నాడు తను. అప్పుడు స్నేహితులు ఎంత వెక్కిరించారో- డబ్బుకోసం చేసుకున్నాడని ఎన్నెన్ని మాటలన్నారో ఇంకా మర్చిపోలేదు.
పెళ్ళయి నలభై ఏళ్ళయినా ఏరోజూ భార్యను గడపదాటి బయటకు తీసుకుని వెళ్ళలేదు. అందరూ నవ్వుతారనే భయం సుబ్బారావుగారికి.
ఇంకో అరగంట గడిచింది. ఇక ఉండబట్టలేక మనోహర్‌ ఇంటికి వచ్చారు సుబ్బారావుగారు.

*  *  *

సుబ్బారావుగారి పిలుపు విని బయటకు వచ్చాడు మనోహర్‌.
‘‘మనోహర్‌, మీ ఆంటీ కూడా ఇంట్లో లేదయ్యా, వీళ్ళిద్దరూ కలిసి ఇంత ఉదయమే ఎక్కడికి వెళ్ళుంటారంటావ్‌?’’
మనోహర్‌ ముఖంలో కూడా అదే ప్రశ్న కనిపించింది. అప్పుడే పక్కింటి రాజా వీళ్ళిద్దరినీ చూసి దగ్గరకు వస్తూ ‘‘ఏమండీ, మా ఆవిడ మీ ఇంటికేమైనా వచ్చిందా?’’ అని అడిగాడు.
‘మా పెళ్ళాలు కనబడక మేమేడుస్తుంటే, వీడొకడు’ అనుకుంటూ ‘‘లేదు’’ అని ముక్తసరి సమాధానం ఇచ్చారిద్దరూ ఒకేసారి. వీళ్ళు ఇలా మాట్లాడుతుండగానే మరి కొంతమంది మగవాళ్ళు చేరారక్కడకు. ‘తమ భార్యలు ఇటేమైనా వచ్చారా’ అంటూ.
ఒక్కసారిగా కాలనీ అంతా గుప్పుమంది- కాలనీ ఆడవాళ్ళంతా కనబడటంలేదని. అందరిలో అయోమయం. ప్రతి మగవాడి మనసులో కొద్దిగా రిలీఫ్‌... ‘హమ్మయ్య, నా భార్యే కాదు, అందరి భార్యలూ కనబడటంలేదు...’ అని.
ఇంతలో ఎవరో గట్టిగా అరిచారు- టీవీలో న్యూస్‌ చూడమని.
పరుగుపరుగున ఇంట్లోకి పరుగు తీసి టీవీ ఆన్‌ చేశాడు మనోహర్‌. సుబ్బారావుగారూ, మరికొందరూ వచ్చి గుమికూడారు మనోహర్‌ ఇంట్లో.
టీవీలో చెప్తున్న విషయం వినగానే అందరి గుండెలూ గుభిల్లుమన్నాయి. అందరి మెదళ్ళూ మొద్దుబారిపోయాయి. ఊహకైనా అందని విషయం కళ్ళెదురుగా సంభవిస్తే కొయ్యబారిపోయారు.
‘‘ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఒక్కసారిగా మాయమైపోయారు. అప్పుడే పుట్టిన పసిపాప నుంచి పండు ముసలి వరకూ... డాక్టర్లూ పేషెంట్లూ ఖైదీలూ పోలీసులూ ఇంగ్లాండ్‌ రాణీ, అమెరికా ఫస్ట్‌లేడీ... ఒక్కరనేమిటి, సమస్త భూమండలంలోని ఆడజాతి మొత్తం ఒక్కసారిగా మాయమైపోయారు’’- టీవీలో చెప్తున్న న్యూస్‌ వింటున్న వారందరిలోనూ ఒక విధమైన దడ మొదలైంది. మొత్తం స్త్రీ జాతి అకస్మాత్తుగా ఎలా మాయమైపోయి ఉంటారనే విషయంపై టీవీ చర్చావేదిక మొదలైంది. బహుశా గ్రహాంతరవాసులు మాయం చేసుంటారేమోనని ఊహాగానాలు మొదలయ్యాయి.

ఒక హాస్పిటల్‌ సీసీ కెమెరాలో రికార్డ్‌ అయిన దృశ్యాలను పదేపదే టీవీలో చూపిస్తున్నారు. ఒక లేడీ డాక్టరు వయసు పైబడిన ఒకామెకు ఇంజెక్షన్‌ చేస్తూ ఉంది. పక్కన ఇద్దరు నర్సులు కూడా ఉన్నారు. ఉన్నట్టుండి వాళ్ళందరూ మాయమైపోయారు. సీసీ టీవీలో అప్పుడు సమయం అర్ధరాత్రి పన్నెండు గంటలు చూపిస్తోంది.
ఇంతలో బుజ్జిగాడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. బుజ్జిగాడు పక్కింటి రాజా పెద్దకొడుకు.
‘‘నాన్నా! నాన్నా! మరేమో తమ్ముడు ఏడుస్తున్నాడు నాన్నా’’ అంటూ రాజా లుంగీ పట్టుకుని లాగుతూ చెప్పాడు. అందరూ ఒక్కసారి జాలిగా రాజా వైపు చూశారు. రాజా చిన్నకొడుక్కి ఆరు నెలలు. తల్లి పాలకోసం ఏడుస్తున్నాడని అర్థం అయింది. రాజా తన ఇంటికి పరుగెత్తాడు.
ఆకలితో ఏడుస్తున్న పిల్లలూ, వారికి సర్దిచెప్పలేక సతమతమవుతున్న మగవాళ్ళూ, ప్రతిరోజూ చిరునవ్వుతో తమకు పరిచర్యలు చేసే నర్సమ్మలు కనబడక హాస్పిటల్‌లో బిక్కుబిక్కుమంటున్న రోగులూ, ఆకలికి ఏడుస్తున్న పిల్లలకు ఆకలి ఎలా తీర్చాలో, వంట ఎలా చెయ్యాలో తెలియక హైరానాపడే భర్తలను పదేపదే చూపిస్తున్నారు టీవీలో.
అమ్మ తినిపిస్తేగానీ అన్నం తినమని మారాం చేసే పసికూనలు... టీవీలో మగ యాంకర్‌ చెప్తున్నాడు- ‘నూటికి తొంభైతొమ్మిది మంది మగవాళ్ళు కొన్ని పనులు తమకు కేటాయించి
నవి కావని బలంగా నమ్ముతున్నారనీ, పిల్లలకు ఎప్పుడైనా ఒక్కసారైనా అన్నం తినిపిస్తే ఆ పసిపిల్లల ఆలనా పాలనా మగవాళ్ళకు అర్థమై, ఇప్పుడు ఇంతగా ఇబ్బంది ఉండేదికాదనీ...’
‘‘నా భార్య నాకెన్నో సేవలు చేసేది. పొద్దునే అయిదు గంటలకు లేచి, ఇల్లూ వాకిలీ శుభ్రంచేసి, పిల్లలను నిద్రలేపి, వాళ్ళు అల్లరి పెడ్తుంటే ఎంతో ఓపికగా వాళ్ళకు స్నానాలు చేయించి, వంటచేసి, వాళ్ళకు అన్నాలు తినిపించి, క్యారేజీలు కట్టి, స్కూలు ఆటో వచ్చేవరకూ ఓపికగా గుమ్మంలో నిలబడి పిల్లలను జాగ్రత్తగా ఆటో ఎక్కించి, ఆటో డ్రైవర్‌కు ఒకటికి పదిసార్లు జాగ్రత్తలు చెప్పి నవ్వుతూ పిల్లలకు టాటా చెప్తుంది’’ కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ ఎవరో ఒకతను టీవీ కెమెరాముందు ఆవేదనగా చెప్తుంటే, మనోహర్‌ ఇంట్లో టీవీ చూస్తున్న అందరి గుండెలూ బరువెక్కసాగాయి.
అతను ఇంకా చెప్తున్నాడు... ‘‘ ఇన్ని పనులు తను ఒంటరిగా చేస్తూ ఉంటే నేను మాత్రం ఉదయం ఎనిమిది వరకూ పడుకునేవాణ్ణి. పిల్లలు ఏడుస్తుంటే నిద్ర పాడవుతుందని కేకలు వేసేవాణ్ణేగానీ, లేచివెళ్ళి పిల్లలను రెడీ చేయడంలో గానీ, మరో పనిలోగానీ హెల్ప్‌ చేసేవాణ్ణి కాదు. పైగా, తీరిగ్గా పేపరు చదువుతూ టీ ఇవ్వడం ఆలస్యం అయిందని ఎప్పుడూ అరిచేవాణ్ణి. ఇప్పుడు తెలిసింది నా భార్య విలువ. ఇప్పుడు గనుక నా భార్య ప్రత్యక్షం అయితే పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా. ఇంటి పనులలో సాయం చేస్తా! దేవుడా, నా మహాలక్ష్మిని నాకు తిరిగి ప్రసాదించు తండ్రీ’’ పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు.
టీవీ చూస్తున్న మనోహర్‌కి ఒక్కసారిగా చెంప ఛెళ్ళుమన్నట్లుగా అనిపించింది- అతని బాధను చూసిన తరవాత. తనేం చేసేవాడో, భార్యను ఎంతలా బాధపెట్టేవాడో తలచుకోగానే సిగ్గని పించింది. అటువంటి మంచి ఇల్లాలి గురించి లేచిపోయి ఉంటుందేమోనని ఎంత తప్పుగా ఆలోచించాడో కదా అని వేదన మొదలైంది.
‘‘వసుంధరా, నన్ను క్షమించు. నిన్ను చాలా బాధపెట్టాను. మృగంలా ప్రవర్తించాను. నన్ను మన్నించు వసూ’’ గుండెల్లోని బాధ కరిగేలా గట్టిగా విలపించసాగాడు చేతుల్లో ముఖం దాచుకుని.
‘‘ఏమండీ, ఏమండీ’’ చెవిలో అమృతం పోసినట్లుగా భార్య పిలుపు వినబడేసరికి కళ్ళువిప్పి చూశాడు. కళ్ళెదురుగా భార్య కనబడేసరికి గబుక్కున కౌగిలించుకున్నాడు... ఎక్కడ మళ్ళీ మాయమైపోతుందో అన్నట్లుగా.
ఆనందం, ఆశ్చర్యం కలగలిసిన ముఖంతో భార్య చూస్తుంటే ప్రేమగా బుగ్గపై ముద్దు పెట్టాడు. అందంగా సిగ్గుపడుతున్న భార్యను చూస్తూ గమనించాడు... తాను హాల్లో టీవీ దగ్గర లేడు. తమ బెడ్‌రూమ్‌లో మంచంపైన పడుకుని ఉన్నాడు. రాత్రి తాగి రావడం, భార్యను కొట్టడం అంతా గుర్తుకువచ్చింది.
అయితే ఇదంతా కలన్నమాట!
‘భగవాన్‌... కళ్ళు తెరిపించావ్‌ తండ్రీ. నా వసును ఇకనుంచీ దేవతలా చూసుకుంటాను’ అనుకున్నాడు మనసులోనే.
భార్యను దగ్గరకు తీసుకుని ‘‘వసూ, ఐ లవ్‌ యూ, ఇంతకాలం నిన్ను చాలా బాధపెట్టాను, నన్ను క్షమించు’’ అంటూ గుండెలకు హత్తుకున్నాడు ప్రేమగా, తృప్తిగా.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.