close
‘అత్త’ అని పిలిపించొద్దని గొడవచేశా!

‘అత్త’ అని పిలిపించొద్దని గొడవచేశా!  

రంగస్థలం సినిమా, అందులోని రంగమ్మా మంగమ్మా... పాటా ఎంత హిట్‌ అయ్యాయో రంగమ్మత్త పాత్ర కూడా జనం మనసుని అంతగా గెలుచుకుంది. జబర్దస్త్‌గా తన అందచందాలతో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన
అనసూయా భరద్వాజ్‌ రామ్‌చరణ్‌కి అత్త పాత్రలో ఒదిగిపోయి ఈ సినిమాతో కొత్త ఇమేజ్‌ని సృష్టించుకుంది. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానంటున్న ఆమె తన గురించి చెబుతోందిలా...
రంగస్థలం సినిమా రిలీజ్‌ ముందురోజు నాకసలు నిద్రపట్టలేదు. అప్పటికే విదేశాల్లో సినిమా విడుదలైపోయింది. అక్కడి ఫ్రెండ్స్‌ ఫోన్‌చేసి ‘చాలాబాగా చేశావు, నీ పాత్ర బాగుంద’ని చెప్పడంతో సంతోషంగా అనిపించింది. కానీ వాళ్లు మరీ ఎక్కువ పొగుడుతుంటే భయం వేసేసింది. థియేటర్‌కి వెళ్లి సినిమా చూసేవరకూ మనసు మనసులో లేదు. చూశాక నా ఆనందానికి హద్దుల్లేవు. ఇప్పటికీ ఆ పాత్రను మెచ్చుకుంటూ వస్తున్న ఫోన్లు ఆగడంలేదు. డైరెక్టర్‌గారూ మా రచయితలూ ‘నీ పాత్రకి చాలా ప్రాధాన్యం ఉంది’ అని ముందే చెప్పారు. కానీ అది ఈ స్థాయిలో ఉంటుందని నేను ఊహించలేదు. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఎంత మంచి పాత్ర దక్కిందో ఇప్పుడు అర్థమవుతోంది.
ఇక, మా కుటుంబం విషయానికొస్తే నాన్న సుదర్శన్‌రావువాళ్లది భూదాన్‌ పోచంపల్లి. భూదాన్‌ ఉద్యమం మొదలైనపుడు వినోబాభావేకు చాలా ఎక్కువ భూముల్ని ఇచ్చింది మా తాతయ్యేనట. ఆ ఊళ్లో 101 దర్వాజాల ఇల్లు మాదే. తాతయ్య సుందర్‌రావు అక్కడ సర్పంచ్‌ కావడంతో ఆ ఊరెళ్లినపుడు అందరూ నన్ను దొరసానమ్మా అనేవారు. నేను పుట్టకముందే నాన్న హైదరాబాద్‌కి మకాం మార్చేశారు. నేను పుట్టిందీ, పెరిగిందీ అంతా ఇక్కడే. నాకు ఇద్దరు చెల్లెళ్లు అంబిక, వైష్ణవి. మా చిన్నపుడు నాన్న స్టేట్‌ కాంగ్రెస్‌ సెక్రటరీగా పనిచేసేవారు. ఇంట్లో ఎప్పుడూ కార్యకర్తలతో  మీటింగులు జరుగుతుండేవి. ముగ్గురు ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని అలా రోజూ జనాన్ని తీసుకురావడం, నాన్న బిజీబిజీగా బయట తిరగడం చూసి అమ్మ చాలా కంగారుపడుతుండేది. నాన్నకు నేనంటే ఎంత ఇష్టమంటే ఏదైనా అడిగితే కాదనేవారు కాదు. ఆ చనువుతోనే పట్టుబట్టి ఆయనతో రాజకీయాలు మాన్పించాను. తర్వాత హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌లో అసిస్టెంట్‌ ట్రెయినర్‌గా పనిచేసేవారు. మాకు చాలా గుర్రాలుండేవి. స్కూలుకి సెలవు దొరకడం ఆలస్యం, నేను వాటిదగ్గరికి వెళ్లిపోయి, దాణా కలిపి పెట్టేదాన్ని. చదువు, క్రమశిక్షణ విషయంలో నాన్న చాలా స్ట్రిక్ట్‌. అందుకే, ఇల్లూ స్కూలూ స్విమ్మింగ్‌ క్లాసులూ... చిన్నపుడు ఇదే మా ప్రపంచంలా ఉండేది. ఆ మధ్యలో ఖాళీ దొరికితే అమ్మ సంగీతం తరగతులకి పంపించేది. నేను కర్ణాటక సంగీతం, హిందుస్థానీ రెండిటినీ నేర్చుకున్నా. సెలవులకి అమ్మమ్మ వాళ్ల ఊరు ఘట్‌కేసర్‌కి వెళ్లిపోయేవాళ్లం. అమ్మమ్మ పచ్చడన్నం ముద్దలు కలిపి తినిపించడం, చెల్లెళ్లకూ నాకూ కొత్త బట్టలు తెస్తే ముగ్గురం ఒకే డ్రెస్సు కోసం కొట్టుకోవడం... ఇలా బాల్యంలో ఎన్నో తీపి జ్ఞాపకాలు.
ఐపీఎస్‌ అవ్వాలని...
స్కూల్లో ఏ సాంస్కృతిక కార్యక్రమం ఉన్నా ముందుండే నేను చదువులో మాత్రం ఎప్పుడూ వెనక బెంచే. డిగ్రీకొచ్చాక పొలిటికల్‌ సైన్స్‌, ఎకనమిక్స్‌, ఇంగ్లిష్‌ లిటరేచర్‌ మీద ఆసక్తి పెరగడంతో బాగా చదవడం మొదలుపెట్టా. తర్వాత బద్రుకా కాలేజీలో ఎంబీఏ(హెచ్‌.ఆర్‌) చేశాను. నిజానికి నేను ఐపీఎస్‌ అవ్వాలన్నది నాన్న కోరిక. అందుకే, ఎన్‌సీసీలో సర్టిఫికెట్‌ ఉంటే ఐపీఎస్‌కి పనికొస్తుందని ఎన్‌సీసీ క్యాంపులో చేర్పించారు. అక్కడికి వెళ్లడంవల్ల నాకు ఐపీఎస్‌ రాలేదు కానీ సుశాంక్‌ భరద్వాజ్‌తో పెళ్లయింది. అవును, మాది ప్రేమ వివాహం. సెయింట్‌ ఆన్స్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్నపుడు ఎన్‌సీసీలో భాగంగా రిపబ్లిక్‌డే పరేడ్‌ కోసం దిల్లీ వెళ్లినపుడు తనతో పరిచయం అయింది. డిగ్రీకొచ్చేసరికి అది ప్రేమగా మారింది. తను ప్రపోజ్‌ చెయ్యగానే అమ్మకూ అమ్మమ్మకూ చెప్పి, సుశాంక్‌ని పరిచయం చేశా. వాళ్లకీ తను నచ్చడంతో మా పెళ్లయిపోతుందిలే అని ధైర్యంగా ఉన్నాం. అయితే, డిగ్రీ పూర్తయ్యేవరకూ నాన్నకు మా విషయం తెలియదు. ఆ తర్వాత పెళ్లి సంబంధాలు చూస్తుంటే ఇంట్లోవాళ్లు చెప్పారు. అంతే, పెద్ద యుద్ధమే జరిగింది. సుశాంక్‌వాళ్ల సొంతూరు బీహార్‌లోని బెతియా. ముప్ఫైఏళ్లకిందట ఇక్కడ స్థిరపడ్డారు. వాళ్లది బీహార్‌ అనేసరికి నాన్నకు ఒకలాంటి భయం ఉండేది. మా అత్తగారింట్లో ఒప్పుకున్నా నాన్ననీ ఒప్పించాకే పెళ్లి చేసుకోవాలని దాదాపు అయిదేళ్లు ప్రయత్నించాం. చివరికి ఆయన ఒప్పుకోవడంతో తొమ్మిదేళ్ల మా ప్రేమ 2010లో పెళ్లి పీటలెక్కింది. పెళ్లికి ముందే పిక్స్‌లాయిడ్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌గా ఉద్యోగం చేసేదాన్ని. అక్కడికి సినిమా వాళ్లు చాలామంది వచ్చేవాళ్లు. నన్ను చూసి ‘పొడుగ్గా చూడ్డానికి బాగున్నావు... సినిమాల్లో చెయ్యొచ్చుగా’ అంటుండేవారు. అవకాశాలూ వచ్చాయి.
కానీ సినిమా ఇండస్ట్రీ అంటే ఉన్న భయంతో అప్పట్లో ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. ఆ కంపెనీలో రెండేళ్లు పనిచేశాక ఓ ఛానెల్లో న్యూస్‌రీడర్‌గా చేరా. నేను చాలా సరదాగా ఉండే టైపు. అలాంటి నాకు సీరియస్‌గా ఉంటూ ఆ న్యూస్‌ చదవడం చాలా కష్టంగా అనిపించేది. అందుకే, ఆరేడు నెలలు చేసి, నావల్లకాదని బయటకొచ్చేశా. అప్పుడే యాంకరింగ్‌ అవకాశాలు వచ్చాయి. అలా 25ఏళ్ల వయసులో పెళ్లయ్యాక ఇక్కడ కెరీర్‌ ప్రారంభించా. సినిమా ప్రచార కార్యక్రమాలూ, సినిమావాళ్ల ప్రత్యేక ఇంటర్వ్యూలూ, ఈటీవీలో, మా మ్యూజిక్‌లోనూ ప్రోగ్రామ్‌లూ చేసేదాన్ని. ఆ సమయంలోనే ఈటీవీ క్యాష్‌ ప్రోగ్రామ్‌కి నన్ను అతిథిగా పిలిచారు. ఆ షో డైరెక్టర్‌ సంజీవ్‌గారు నన్ను చూసి ఈటీవీలో వచ్చే ఓ పాటల కార్యక్రమానికి యాంకర్‌గా చెయ్యమని అడిగారు. కానీ అనుకోకుండా తర్వాత జబర్దస్త్‌కి తీసుకున్నారు. అది నా అదృష్టం. ఆ ప్రోగ్రామ్‌తో చాలా పేరొచ్చింది. నా పేరే జబర్దస్త్‌ అనసూయగా మారిపోయింది. జబర్దస్త్‌లాంటి షో ఇంతకుముందు లేదు కాబట్టి అది అంతలా క్లిక్‌ అయింది. అందరూ ఆ గంట స్ట్రెస్‌ రిలీఫ్‌గా ఫీలవుతారు.  

ఛాన్స్‌ అలా వచ్చింది
సినిమా అవకాశాలంటారా... అన్నీ అనుకోకుండానే వచ్చాయి. ‘క్షణం’ సినిమా రచయిత, నటుడు అడివి శేషు ఓరోజు కాఫీ షాప్‌లో నన్ను చూసి అక్కడే కథ చెప్పేసి ‘ఈ పాత్రకు నువ్వయితేనే సరిపోతావు చెయ్యి’ అన్నారు. దానికి ఒప్పుకోవడానికి నేను కొంత సమయం తీసుకున్నాను. అందుకే, నేను బాగా తిప్పుకున్నానని శేషు ఇప్పటికీ కంప్లైంట్‌ చేస్తుంటారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా విషయానికొస్తే ఆ సినిమా డైరెక్టర్‌ కళ్యాణ్‌కృష్ణ ఓ షోలో నన్ను చూసి నాగార్జున మరదలుగా చెయ్యమని అడిగారు. చిన్నప్పట్నుంచీ నాగార్జునగారూ రమ్యకృష్ణల్ని చూస్తూ పెరిగా. అలాంటిది వాళ్లిద్దరూ చేస్తున్న సినిమాలో అవకాశం వస్తే అంతకన్నా సంతోషం ఏముంటుంది... కానీ అంత పెద్ద హీరో పక్కన నటించడం అంటే ముందు కాస్త టెన్షన్‌ పడ్డా. సెట్‌లో మాట్లాడకుండా కామ్‌గా కూర్చున్న నన్ను చూసి ‘టీవీలో అంత మాట్లాడతావు, ఇప్పుడేంటీ అసలు మాట్లాడ్డంలా’ అని నాగార్జునగారే పలకరించారు. నాకు స్పెషల్‌ సాంగ్స్‌ అంటే అంత ఆసక్తి లేదు. ఆ కారణంతోనే అత్తారింటికి దారేదీ సినిమాకి అడిగినా చెయ్యనన్నా. విన్నర్‌ సినిమాలో పాటకు కూడా మొదట ఒప్పుకోలేదు. దాంతో నాకు ఆ పాటని ముందుగానే పంపించారు. ‘సూయ సూయ అనసూయ’ అంటూ నా పేరు మీదే పాట రాశారు రామజోగయ్య శాస్త్రి గారు. అది చూశాక కాదనలేకపోయాను. పాత్రల విషయానికొస్తే ప్రత్యేకంగా ఇది చెయ్యాలీ అది చెయ్యాలీ అని లేదు. ప్రకాష్‌రాజ్‌గారిలా ఏ పాత్ర చేసినా గుర్తుండిపోవాలన్నదే కోరిక. అందుకే, రంగమ్మత్త పాత్రకోసం డైరెక్టర్‌ నన్ను పిలిచినపుడు వెంటనే ఓకే చెప్పేశా. రంగస్థలంలో నటించిన రామ్‌చరణ్‌, సమంత, ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్‌రాజ్‌... ఇలా అందరికీ గొప్ప పేరూ ఇమేజ్‌ ఉన్నాయి. అలాంటి వారితో కలసి సినిమాలో కీలకమైన రంగమ్మత్త పాత్ర చెయ్యడం నాకు నిజంగా సవాలే. చాలా టెన్షన్‌గా అనిపించేది. షూటింగ్‌ రాజమండ్రి దగ్గర శివగిరిలో ప్రారంభమయ్యాక ఓ పదిరోజులకు నేను వెళ్లా. అప్పటికే అక్కడి ఎండలకు అందరూ తందూరీల్లా కందిపోయి నల్లగా అయిపోయారు. నేను రంగమ్మత్త గెటప్‌ వేసుకుని వెళ్లేసరికి ఆది, రామ్‌చరణ్‌ ‘నువ్వు ఇంత నీట్‌గా తెల్లగా ఉంటే మాలో కలవడంలేదు’ అంటూ నాచేతులకు మట్టి పూసేశారు.
అలా... షూటింగ్‌లో అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉండడంతో నా టెన్షన్‌ తగ్గింది. జబర్దస్త్‌ టీమ్‌లోని ఇద్దరుముగ్గురు రంగస్థలం సినిమాలో ఉన్నారు. దాంతో మేమంతా కూర్చుని జోకులు వేసుకునేవాళ్లం. మెగాస్టార్‌ కుటుంబమంతా జబర్దస్త్‌కి వీరాభిమానులు. అందుకే, చరణ్‌ కూడా మా జోకులకు బాగా ఎంజాయ్‌ చేసేవారు. కాకపోతే షూటింగ్‌ జరిగినన్ని రోజులూ ‘అత్త’ అని పిలిపించొద్దు అంటూ బాగా గొడవ చేశా. కానీ ఇప్పుడు ఆ పిలుపే నాకు చాలా నచ్చుతోంది.

- మధులత బొల్లినేని

మరికొంత...

ఇంటర్‌లో ఉన్నపుడు ఓసారి కాలేజీకి బంక్‌ కొట్టి ఫ్రెండ్స్‌ అందరం లిటిల్‌ ఫ్లవర్‌ కాలేజీలో కలిశాం. అనుకోకుండా  అక్కడ జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘నాగ’ సినిమా షూటింగ్‌ జరిగింది. వాళ్లకి బ్యాగ్రౌండ్‌ కోసం  విద్యార్థులు అవసరమై ‘అయిదువందలు ఇస్తాం షూట్‌లో పాల్గొంటారా...’ అని మమ్మల్ని అడిగారు. పాకెట్‌ మనీ కోసం మేం వెంటనే ఒప్పేసుకున్నాం. అలా ‘నాగ’తో మొదటిసారి వెండితెరమీద కనిపించా.
* మా ఆయన ఫైనాన్సర్‌, ఇన్‌వెస్ట్‌మెంట్‌ ప్లానర్‌. మాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్దబాబుకి ఏడేళ్లు. చిన్నబాబుకి నాలుగేళ్లు. వాళ్లు పుట్టాకే నాకు సినిమా అవకాశాలు పెరిగాయి. ‘ఇద్దరు పిల్లలున్నా గ్లామర్‌గా
కనిపిస్తున్నావు ఎలా’... అంటుంటారు చాలామంది. నిజానికి నేను తిండి మానేసి నోరు కట్టుకునే టైపు కాదు. రోజూ వ్యాయామం  చెయ్యడమే నా ఆరోగ్య రహస్యం. పగలు ఎంత తిన్నా సాయంత్రం అయితే తగ్గించేస్తా. ఇంట్లో ఉన్నపుడు చాలావరకూ వంట నేనే చేస్తా. అది నాకు ఒత్తిడిని దూరం చేసే మంత్రం.
* ఓ పక్కన పిల్లలూ మరోపక్క కెరీర్‌ సవ్యంగా సాగిపోతున్నాయంటే కారణం మావారూ నా కుటుంబమే. ఖాళీగా ఉంటే పిల్లలతోనే  గడుపుతా. హైదరాబాద్‌లోనే షూటింగ్‌ ఉంటే సుశాంక్‌ పిల్లల్ని సెట్స్‌కి  తీసుకొస్తారు.  కలసి బయటికెళ్లి భోజనం చేస్తాం. పిల్లల కోసమే శనివారం, ఆదివారం షూటింగుల్లేకుండా చూసుకుంటా. షూటింగ్‌ నుంచి రాత్రి లేట్‌ అయినా ఉదయం వాళ్లు స్కూల్‌కి వెళ్లేటపుడు నన్ను లేపమంటా.
* మా మామగారు వాళ్లది బెతియాలో బాగా పేరున్న కుటుంబం. చుట్టాలందరూ అక్కడే ఉంటారు కాబట్టి పిల్లలకు సెలవులివ్వగానే అందరం బీహార్‌కే వెళతాం. మనకు పెళ్లంటే ఎక్కువ పూజా కార్యక్రమాలుంటాయి. వాళ్లేమో బాగా తింటారు. అదీ తీపి వంటలే. పెళ్లయ్యాక నాలుగురోజులు నన్ను ఉప్పూకారం తిననివ్వలేదు. మొదట్లో వాళ్ల సంప్రదాయాలు చిత్రంగా అనిపించేవి. బంధువులందరూ రంగస్థలం సినిమా చూడ్డానికి అక్కణ్నుంచి వచ్చారు. నా వంకాయ కూరా, పనీర్‌ బిర్యానీ వాళ్లకి చాలా ఇష్టం. ఉత్తరాదిలో కాఫీ అలవాటు తక్కువ కదా అందుకే, నా కాఫీ అంటే వాళ్లకి చాలా ఇష్టం. రాగానే కాఫీ అడుగుతారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.