close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
భారత్‌ యాత్ర... ఆటోలో!

భారత్‌ యాత్ర... ఆటోలో!

భారత్‌ ఓ ఉప ఖండం, మినీ ప్రపంచం. భారత్‌ను చూడాలంటే పల్లెల్లోని సంప్రదాయాల్ని చూడాలి, పట్టణాల్లోని మార్పుని గమనించాలి, నగరాల్లోని అభివృద్ధిని వీక్షించాలి. అప్పుడే ఆ పర్యటన పరిపూర్ణమవుతుంది. మనదేశంలో ఇలాంటి పర్యటన చేయడానికి ఏటా వందల మంది విదేశీయులు వస్తున్నారు. వారుచేసే ఆ పర్యటన పేరు ‘రిక్షా రన్‌’.
శ్మీర్‌ నుంచి కేరళ వరకూ అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి గుజరాత్‌ వరకూ ఏ రెండింటి మధ్య చూసినా మూడువేల కిలోమీటర్లకంటే ఎక్కువ దూరమే. కానీ భారతయాత్ర జీవితకాలం గుర్తుండిపోవాలంటే ఒక చివరినుంచి మరో చివరకు పర్యటించాల్సిందే. ఈ విషయాన్ని అర్థంచేసుకున్న బ్రిటన్‌కు చెందిన ‘ది అడ్వంచరిస్ట్స్‌’ సంస్థ భారత్‌లో అలాంటి పర్యటనల్ని నిర్వహించడానికి ముందుకు వచ్చింది. ఈ పర్యటనను విమానాలూ, రైళ్లూ, బస్సుల్లోకాకుండా ఆటోరిక్షాల్లో ఏర్పాటుచేస్తోంది. అందుకే దీని పేరు ‘రిక్షా రన్‌’. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సాహసయాత్రల్ని నిర్వహిస్తుంది. భారత్‌లో సుదీర్ఘమైన యాత్రని ఆటోలో చేయడం సాహసమే కదా! అదే సమయంలో ఆటోకంటే భారత్‌ను దగ్గరగా చూసేందుకు అవకాశం ఉండే వాహనం మరోటి ఉండదు కూడా. అందుకే ఆటోరిక్షా యాత్రల్ని ప్రారంభించారు. ఈ ఏడాది ఏప్రిల్‌1న కొచ్చీలో ఒక యాత్ర మొదలై, ఆరు రాష్ట్రాలూ, 17 నగరాలమీదుగా 3000 కి.మీ. కొనసాగి 14న రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ముగిసింది. 70 ఆటోల్లో 210 మంది యాత్రికులు ఈ సాహసయాత్రలో భాగమయ్యారు.

బృంద పర్యటన
రిక్షా రన్‌లో ఎవరైనా బృందంగా మాత్రమే పాల్గొనాలి. ప్రతి ఆటోలో ముగ్గురు వ్యక్తులు ఓ బృందంగా ఉంటారు. ఆటోని వాళ్లే నడుపుతూ యాత్రని కొనసాగించాలి. ఈ యాత్రలో పాల్గొనాలంటే ప్రతీ బృందం రూ.2.5 లక్షల వరకూ చెల్లించాలి. అందులో కొంత మొత్తం పర్యావరణ విభాగంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకూ వెళ్తుంది. యాత్రకి అవసరమయ్యే ఆటోని నిర్వాహక సంస్థే అందిస్తుంది. యాత్ర పొడుగునా అయ్యే ఖర్చుల్ని ఆయా వ్యక్తులే పెట్టుకోవాలి. రెండ్రోజుల ముందే సభ్యులంతా యాత్ర ప్రారంభమయ్యే నగరానికి చేరిపోవాలి. ఆటోనడపడం రానివారికి ఆ రెండ్రోజులూ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఆటోల్ని తీసుకున్నాక ప్రతి బృందం తమకు నచ్చిన విధంగా ఆ ఆటోని రంగులతో అలంకరించుకోవాలి.  ప్రతి ఆటోకీ ఒక పేరు పెట్టాలి. ఆ బృందానికి అదే పేరు ఉంటుంది. ఆటోలో రోజూ దాదాపు 250-300 కి.మీ. ప్రయాణించాలి. ఆటోని ముగ్గురూ విడతలుగా నడుపుతూ పోనివ్వాలి. ఆటోకి ఎలాంటి రిపేర్లు వచ్చినా స్థానికంగా ఉండే దుకాణాల్లోనే చేయించుకోవాలి తప్ప ఎలాంటి సహాయ సిబ్బందీ వెంటరారు. ఇంకా దారి తెలుసుకోవడానికి గూగుల్‌ మ్యాప్స్‌లాంటివి వాడకూడదు. స్థానికుల సాయంతో, మార్గ సూచీలతోనే ముందుకు పోవాలి. ఆటో గరిష్ఠ వేగం గంటకు 55-60 కి.మీ. ఉంటుంది. ఆ వేగం అన్నిచోట్లా కుదరదు. కాబట్టి దారిలో అన్నింటినీ గమనించుకుంటూ పోవచ్చు. నచ్చినచోట ఆగి స్థానికులతో మమేకం కావొచ్చు. పంటపొలాలూ, పశువులూ, పరిశ్రమలూ అన్నిటినీ చూసుకుంటూ యాత్ర కొనసాగించవచ్చు. అందరూ ఒకే మార్గంలో వెళ్లాలని లేదు. ఎవరికి నచ్చిన దారిని వాళ్లు ఎంచుకోవచ్చు. ప్రతి రాష్ట్రంలో ప్రత్యేకమైన ఆలయాలూ, కట్టడాలూ చూసొచ్చేట్టు  ఈ యాత్రని ప్లాన్‌ చేస్తారు. రోజూ రాత్రి ఒకచోట బసచేసి మర్నాడు ఉదయం యాత్రని కొనసాగించాలి. అనుకోని సంఘటనలూ, ప్రమాదాలూ జరగొచ్చు. అవన్నీ ఎదుర్కోవాలి. యాత్రని అందరూ పూర్తిచేస్తారని లేదు. ఎంతవరకూ వెళ్లగలిగితే అంతవరకూ వెళ్తారు. కనీసం 80 శాతం మంది విజయవంతంగా గమ్యాన్ని చేరుకుంటారు. ప్రతి యాత్రకీ ప్రారంభ, ముగింపు వేడుకలు పెద్ద ఎత్తున ఉంటాయి.

పన్నెండేళ్లుగా...
మనదేశంలో రిక్షా రన్‌ యాత్రని 2006లో కొచ్చీ-డార్జిలింగ్‌ల మధ్య మొదటిసారి నిర్వహించారు. ఆ యాత్రలో 70 మంది పాల్గొన్నారు. ఆ తర్వాత నుంచీ ఏటా భారత్‌లో కనీసం మూడు యాత్రలైనా నిర్వహిస్తోంది అడ్వంచరిస్ట్స్‌ సంస్థ. హిమాలయాల్లోనూ పర్యటనల్ని ఏర్పాటుచేస్తోంది. రిక్షా రన్‌ యాత్రలో దాదాపు అందరూ విదేశీయులే పాల్గొంటారు. వారిలో చాలామందికి భారత్‌ పర్యటన తమ జీవితకాల లక్ష్యాల్లో ఒకటి. మనదేశానికి చెందిన రుతావి మెహతా 2015 రిక్షా రన్‌ యాత్రలో పాల్గొన్నారు. ఈమె బృందం తమ యాత్ర ఫీజుని క్రౌడ్‌ సోర్సింగ్‌ద్వారా సేకరించింది. గతేడాది నెదర్లాండ్స్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ఆరుగురు సభ్యులు ఈ యాత్రలో పాల్గొనడం విశేషం. ఇప్పటికే ఈ ఏడాది ఆగస్టు, వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించే రిక్షా రన్‌లో పాల్గొనడానికి ఖాళీలు లేవని నిర్వాహక సంస్థ (theadventurists.com) చెబుతోందంటే భారతయాత్రకి డిమాండ్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.