close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ అన్వేషణ గూగుల్‌ కోసం!

ఈ అన్వేషణ గూగుల్‌ కోసం!  

ప్రధానమంత్రి ఏ దుకాణంలో టీ అమ్మారు... జుట్టు రాలిపోవడానికి కారణాలేంటీ... పిల్లలు పక్క తడపకుండా ఏం చెయ్యాలి... ఇలా ఏ సందేహమైనా ఈతరం వెంటనే అడిగేది గూగుల్‌నే. ఇంతలా మన జీవితంలో భాగమైపోయిన గూగుల్‌ వెనుక మనకు తెలియని ఆసక్తికర అంశాలు ఎన్నో...
ప్రపంచ సెర్చ్‌ఇంజిన్‌ మార్కెట్లో గూగుల్‌ వాటా 86.87శాతం. దీన్లో ఒక నిమిషంలో 20 లక్షలకు పైనే అన్వేషణలు జరుగుతున్నాయి.
* ఇప్పటివరకూ గూగుల్‌ రెండొందలకు పైనే కంపెనీలను హస్తగతం చేసుకుంది. 2010-11 సంవత్సరాల్లో ఆ సంస్థ సగటున వారానికో కంపెనీని కొనేసింది.
* 1999లో గూగుల్‌ని దాని వ్యవస్థాపకులు ఎక్సైట్‌ (excite) అనే కంపెనీకి రూ.6.48 కోట్లకు అమ్మేయాలనుకున్నారు. దానికి ఆ కంపెనీ సీయీవో తిరస్కరించడం వాళ్ల దురదృష్టం.
* గూగుల్‌లో శోధించేటపుడు ‘డిడ్‌ యూ మీన్‌’ అంటూ సరైన వాక్యాలతో ఉన్న కొన్ని లింకులు కింద కనిపిస్తాయి. ఈ ఆప్షన్‌ పెట్టాక గూగుల్‌ ట్రాఫిక్‌ రెట్టింపైందట.
* గూగుల్‌ హోమ్‌పేజీలో సెర్చ్‌ బటన్‌ పక్కన కనిపించే ‘అయామ్‌ ఫీలింగ్‌ లక్కీ’ ఆప్షన్‌ కోసం ఆ సంస్థ ఏటా రూ.713 కోట్లు ఖర్చుపెడుతోంది. మనం శోధించాలనుకున్న వెబ్‌సైట్‌ పేరుని టైప్‌చేసి ఈ బటన్‌ మీద క్లిక్‌ చేస్తే నేరుగా ఆ వెబ్‌సైట్‌లోకే తీసుకెళ్తుంది ఇది. దీనివల్ల గూగుల్‌కి ప్రకటనల ఆదాయం ఉండదు.
* రూ.7.1 లక్షల కోట్లు... ఇది గతేడాది గూగుల్‌ ఆదాయం. దీన్లో 99 శాతం వాటా ప్రకటనలదే.
* 95,116 సంవత్సరాలు... గూగుల్‌లో ఉన్న వెబ్‌ పేజీలను నిమిషానికి ఒకటి చొప్పున తెరిచిచూడాలంటే పట్టే సమయం.
* గూగుల్‌ కంపెనీలో ప్రస్తుతం 72వేలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొత్తగా చేరిన ఉద్యోగుల్ని అక్కడ నూగ్లర్స్‌ అంటారు.
* 2013లో కాలికో (calico) అనే సంస్థను స్థాపించింది గూగుల్‌. దీన్లో మనిషి ఆయుర్దాయాన్ని పెంచే పరిశోధనలు జరుగుతున్నాయి.
* రూ.పదివేల కోట్లు... గూగుల్‌ 2006లో యూట్యూబ్‌ కొనుగోలు కోసం వెచ్చించిన సొమ్ము.
* 2013 సంవత్సరంలో గూగుల్‌ సేవలకు అయిదు నిమిషాల పాటు అంతరాయం కలిగింది. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్‌ ట్రాఫిక్‌ నలభైశాతం తగ్గిపోయిందట.
* గూగుల్‌ ఉద్యోగులు మరణిస్తే వారి భార్య లేదా భర్తకు తరవాతి పది సంవత్సరాలు ఉద్యోగి జీతంలో సగం జీతం వస్తుంది. చనిపోయిన ఉద్యోగులకు చిన్నపిల్లలుంటే వారికి 19ఏళ్లు వచ్చేవరకూ నెలకు వెయ్యి డాలర్ల భత్యాన్ని ఇస్తుంది సంస్థ.
* gooogle, gogle, googlr... ఇలా గూగుల్‌ పేరుకు దగ్గర్లో ఉన్న డొమైన్‌ పేర్లన్నిటినీ గూగుల్‌ కొనేసింది. అందుకే సెర్చ్‌ఇంజిన్‌లో గూగుల్‌ పేరుని తప్పుగా కొట్టినా ఫలితాల్లో సరైన గూగుల్‌ సైట్‌వే వస్తాయి.
* బ్లాక్‌రబ్‌... లారీపేజ్‌, సెర్గీ బ్రిన్‌ తమ సెర్చ్‌ ఇంజిన్‌కి మొదట పెట్టుకున్న పేరు ఇదే. తర్వాత దాన్ని googol (ఒకటి పక్కన వంద సున్నాలు ఉన్న సంఖ్యను ఇలా పిలుస్తారు)గా మార్చాలనుకున్నారు. డొమెయిన్‌లో స్పెల్లింగ్‌ తప్పు పడటంతో అదికాస్తా google అయింది.  

* గూగుల్‌ ఆఫీసుల్లో స్నాక్స్‌, డ్రింక్స్‌, మూడు పూటలా భోజనం అన్నీ ఉచితమే. ఉద్యోగి ఏం తినాలన్నా వంద అడుగుల లోపే క్యాంటీన్‌ సౌకర్యం ఉండాలన్నది ఆ సంస్థ నియమం.

* లారీ, సెర్గీల వ్యక్తిగత విమానాలు ల్యాండ్‌ అయ్యేందుకు నాసా పరిశోధన సంస్థలో రన్‌వేలు ఉన్నాయి. అక్కడ మరే ప్రైవేటు విమానాలు దిగేందుకూ అనుమతి లేదు.

* 1998లో తొలి గూగుల్‌ డూడుల్‌ పుట్టుకొచ్చింది. అది ఓ బర్నింగ్‌మ్యాన్‌ స్టిక్‌ ఫొటో. గూగుల్‌ వ్యవస్థాపకులు లారీ, సెర్గీలు నెవెడాలో జరిగే బర్నింగ్‌ మ్యాన్‌ ఫెస్టివల్‌ని చూడ్డానికి వెళ్లారట. తాము ఆఫీసులో లేము కాబట్టి ఏదైనా సర్వర్‌ క్రాష్‌ జరిగినా వెంటనే సరిదిద్దే అవకాశం లేదని వినియోగదారులకు తెలియజేయడానికే ఆ చిత్రాన్ని గూగుల్‌ డూడుల్‌గా చేర్చారట.

* గూగుల్‌ ప్లస్‌ ప్రొఫైల్‌లో మన పుట్టినరోజు తేదీని నిక్షిప్తం చేస్తే ప్రతి పుట్టినరోజుకీ మనకోసం ప్రత్యేకంగా రూపొందించిన గూగుల్‌ డూడుల్‌ మన కంప్యూటర్‌లో కనిపిస్తుంది.

* లారీ పేజ్‌, సెర్గీ బ్రిన్‌లు గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ని రూపొందించే సమయంలో 1998లో సుసాన్‌ వజస్కీ అనే మహిళ ఇంటి షెడ్డులో అద్దెకు ఉండేవాళ్లు. ఆమే ఇప్పుడు యూట్యూబ్‌ సీయీవో.

* గూగుల్‌ మౌంటెయిన్‌ వ్యూ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో గడ్డి పెరిగిన ప్రతిసారీ ఆ సంస్థ కొన్ని మేకలను అద్దెకు తీసుకొచ్చి ఓ వారంపాటు అక్కడ వదులుతుందట. మెషీన్లకు బదులు ఇలా చేస్తే మేకల కడుపు నిండుతుంది. పర్యావరణానికీ మంచిదన్నది వారి ఆలోచన.

 

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.