close
మనిషితనం

మనిషితనం
- చివుకుల కృష్ణకుమారిశాస్త్రి

‘‘ఏవండోయ్‌, మీకీ సంగతి తెలుసా... మీ అమ్మగారు ఉద్యోగం వెలగబెడుతున్నారు’’ అని ఒకింత అవహేళనగా నవ్వుతూ చెబుతున్న భార్య జయవైపు చేస్తున్న పని ఆపి, చిరాగ్గా చూస్తూ-
‘‘ఛీ, నోర్ముయ్‌... ఏంటా పిచ్చివాగుడు. మా అమ్మ నీకేమవుతుందీ?’’ అన్నాడు శంకరం.
తడబడుతూ ‘‘అదేలెండి, అత్తగారు’’ అంది.
‘‘ఆ, ఇప్పుడు చెప్పు... మా అమ్మ ఉద్యోగం చేస్తోందా? ఏం ఉద్యోగం, ఎక్కడ, ఎవరిచ్చారు? ఆవిడ వానాకాలం చదువుకి... అదీ ఈ వయసులో’’ అన్నాడు వరస ప్రశ్నలుగా.
‘‘నాకు మాత్రం ఏం తెలుసు. అయినా, ఉద్యోగానికి చదువే అవసరంలేదుగా.
వివరాలు అయితే నాకు తెలియవు. మొత్తానికి ఎక్కడో ఏదో పనిచేస్తున్నారు. ఏ పనీ చేయకపోతే ఆమధ్య బాబిగాడు క్రికెట్‌ బ్యాట్‌ కొనుక్కుంటానని మారాం చేస్తే, మీరు మీ దగ్గర డబ్బులు లేవంటే వాడి ఏడుపు చూసి ఆవిడే డబ్బులిచ్చారు వాడికి. మొన్నటికి మొన్న చంటిదాని పుట్టినరోజుకి గౌను కొనమని నాకు డబ్బులిచ్చారు. అంతేకాదు, ఈ నెల ఇంటికి కావాల్సిన వెచ్చాలన్నీ ఆవిడే తెచ్చారు’’ అంది జయ.
‘‘మరి, నువ్వు
అడగలేదా... ఈ డబ్బు ఎక్కడిదని? ఆవిడిచ్చింది గుట్టు చప్పుడు కాకుండా పుచ్చుకున్నావు. ఇప్పుడు మా అమ్మమీద కొండేలు చెబుతున్నావు’’ అన్నాడు శంకరం కోపంగా.
కుక్కినపేనులా మళ్ళీ నోరెత్తలేదు జయ.
తనుగా ఈమధ్య కాలంలో అమ్మకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. తన పరిస్థితే అంతంత మాత్రంగా ఉంది. ఏ పనీ చేయకపోతే అమ్మ దగ్గర డబ్బెక్కడిది. తల్లిమీద జయ నేరంగా చెప్పిందనుకున్నాడే కానీ, జయ మాటల్లో నిజం లేకపోలేదుగా అన్పించింది శంకరానికి.
అమ్మ ఇంట్లో ఉందా లేదా అన్న విషయాన్ని ఈమధ్య తను పట్టించుకోవడం లేదు. ఆఫీసు పనయ్యాక రెండు మూడుచోట్ల పద్దులు రాసే పని కుదరటంతో, ఇంటికి రాగానే ఆ పనిలోపడి అమ్మ కనపడకపోతే ఏ గుడికో, గోపురానికో వెళ్ళుంటుందని అనుకున్నాడే కానీ జయని కూడా అడగలా! ఇదిగో ఇప్పుడు తెల్సింది విషయం. అందుకే తల్లి రాకకోసం ఎదురుచూస్తున్నాడు.
దాదాపుగా తొమ్మది గంటలవుతుండగా ఇంటికొచ్చిన సూర్యాంబ వరండాలో కూర్చుని ఏదో రాసుకుంటున్న కొడుకుని చూసి ఉలిక్కిపడింది. కానీ, ఏదయితే అదవుతుందని లోపలికెళ్ళి కాళ్ళూ చేతులూ కడుక్కుని, మంచినీళ్ళు తాగొచ్చి, మనవడు హోంవర్కు చేసుకుంటుంటే తనూ పక్కనే కూర్చుంది.
వాకింగ్‌స్టిక్‌ ఆధారంతో నడుస్తూ వరండాలోంచి లోపలికొచ్చిన శంకరం ‘‘ఎక్కడికెళ్ళావమ్మా, ఇంత లేటయింది?’’ అన్నాడు తల్లివైపు చూస్తూ.
కొడుకు అలా అడుగుతాడని ఊహించని సూర్యాంబ ‘‘అది...అది...’’ అంది తత్తరపాటుగా ఎలా చెప్పాలో తెలియక.
‘‘నా దగ్గర కూడా దాపరికం ఎందుకమ్మా, ఎక్కడ పనిచేస్తున్నావు?’’ అని సూటిగా అడిగాడు తల్లిని శంకరం.
విషయం తెల్సిపోయింది, ఇక ముసుగులో గుద్దులాట ఎందుకన్నట్లుగా ‘‘కోడలు చెప్పిందా నీకు?’’ అందావిడ.
‘‘ఎవరు చెబితే ఏం కానీ, ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పు... నిజమేనా?’’ అన్నాడు శంకరం.
‘‘అవును, చేస్తున్నాను. ఇందులో దాపరికం ఏముంది?’’ అందావిడ.
‘‘ఈ వయసులో పని చేయటానికి నీకేం ఖర్మ పట్టింది. నీకు తిండి పెట్టడంలేదా? లేకపోతే పెట్టటానికి కష్టంగా ఉందని నీతో ఎప్పుడైనా అన్నానా?’’ అన్నాడు శంకరం బాధగా.
‘‘చూడు నాన్నా శంకరం, నువ్వు నా విషయంలో ఖర్మ అనుకున్నది, నేను నా కర్తవ్యం అనుకుంటున్నాను. ఒంట్లో ఓపికా, మనసులో కోరికా ఉన్నప్పుడు చేతనైన పని చెయ్యటంలో తప్పులేదుగా. వయసుడిగాక ఎటూ నీ పాలపడక తప్పదు.’’
‘‘ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నాకెంత అవమానమో ఆలోచించావా నువ్వు?’’
‘‘ఇందులో నలుగురికీ తెలియాల్సిన పనేముంది. నేను చెప్పను, నువ్వెవరికీ చెప్పకు. కోడల్ని కూడా చెప్పొద్దను. చేసేది తప్పుపని కానప్పుడు ఎందుకు భయపడాలి, ఎవరికి భయపడాలి? ఆడయినా మగయినా దొంగతనమో దోపిడీయో చేస్తే తప్పుకానీ, శరీరంలో సత్తువ ఉన్నప్పుడు కడుపు కోసం కష్టపడటంలో తప్పులేదుగా? ఆర్నెల్లనాడు నీకు యాక్సిడెంటయి దాదాపుగా మంచానికి పరిమితమయ్యావు. రాబడి తగ్గి, ఖర్చులు పెరిగాయి. అందుకే, నాకు చేతనయినంత ఇంటిభారాన్ని మీదేసుకోవాలనుకుంటున్నా’’ అంది సూర్యాంబ.
‘‘ఇప్పుడు నయమయి మళ్ళీ ఆఫీసుకెళుతున్నా కదా. మరో రెండుచోట్ల పార్ట్‌టైమ్‌గా కూడా పనిచేస్తున్నాను. ఇప్పటి వరకూ చేసింది చాలు, ఇకనైనా మానేసి ఇంటిపట్టునుండు’’ అన్నాడు హెచ్చరింపుగా.
‘‘ఈ విషయంలో నన్ను అడ్డుపెట్టకు. నాకు ఎప్పుడు వద్దనిపిస్తే అప్పుడే మానేస్తాను, సరేనా?’’ అని ఒక్క ముక్కలో కొడుక్కి సమాధానం చెప్పి, అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది సూర్యాంబ.
ఉసూరుమంది శంకరం మనసు. తల్లి మనస్తత్వం గురించి తనకు బాగా తెల్సు. ఏ పనయినా ఆవిడిష్టప్రకారమే చేస్తుంది తప్ప, ఎవరు చెప్పినా వినదు, మానదు. అందుకే నిర్ణయాన్ని తల్లికే వదిలేశాడు.

*  *  *

కార్తీక పౌర్ణమి, సోమవారం జతగా రావడంతో శివాలయం ఇసకేస్తే రాలనట్లుగా ఉంది. గుడంతా దీపాలతో కళకళలాడిపోతోంది. వత్తులు వెలిగించి, దర్శనం చేసుకుని, బ్రాహ్మణుడికి తాంబూలం ఇచ్చిన సూర్యాంబ గుడి బయట బిచ్చగాళ్ళ చేతిలో తలో రూపాయి పెడుతూ, ఆ ఆడమనిషి చేతిలోనూ రూపాయి పెట్టబోతూ, ఎక్కడో చూసినట్లుగా అన్పించటంతో మరోసారి పరీక్షగా చూసింది ఆమెవైపు. అచ్చం తన చిన్ననాటి స్నేహితురాలు కావేరిలా అన్పించటంతో మరోసారి చూసింది. ఛీ, ఎందుకలా అన్పించింది. మనిషిని పోలిన మనుషులుంటారు. ఎక్కడ కాకినాడ, ఎక్కడ కావేరి. ఇక్కడకొచ్చి, అదీ... గుడిముందు బిచ్చగాళ్ళ సరసన... మనసుకు కాదేమో అన్పించినా, కళ్ళకు మాత్రం అవునన్పించటంతో ఉండబట్టలేక దగ్గరగా వెళ్ళి ‘‘కావేరీ!’’ అంది. ఆ పిలుపుకి ఉలిక్కిపడింది ఆ మనిషి. నీరసంగా ఉండటంతో నిలబడలేకపోతోంది. మురికిపట్టిన చీరా, ఇంతెత్తున రేగిన జుట్టూ, కళ్ళు లోపలికి పీక్కుపోయి అచ్చం బిచ్చగత్తెలాగే ఉంది. చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి సూర్యాంబకి. తూలిపడబోతున్న ఆమెను పట్టుకుని, పక్కనే ఉన్న అరుగు మీద కూర్చోబెట్టింది. మనిషినోట మాట రావటంలేదు. తన బుట్టలోంచి రెండు అరటిపళ్ళు తీసి, తొక్కుతీసి కావేరి నోటికందించింది. ఆత్రంగా వాటిని తింటున్న ఆమెను చూస్తుంటే అన్నం తిని ఎన్నాళ్ళయిందో అన్పించింది. ఆ రెండు పళ్ళు తిని తనవంక ఆశగా చూడటం గమనించి, బుట్టలో ఉన్న జామపండు కూడా తీసిచ్చింది. ఆ పండు కూడా తిన్నాక పక్కనున్న పంపు దగ్గరకెళ్ళి గ్లాసునీళ్ళు పట్టుకొచ్చి తాగించింది. పది నిమిషాలకు మనిషి కాస్త తేరుకుంది. అప్పుడు మాట్లాడించటం ఇష్టంలేక రిక్షా మాట్లాడి తనతో బయల్దేరతీసింది. స్నానం చేసి ఎన్నాళ్ళయిందో... మనిషి దగ్గర వాసన వస్తోంది.
రిక్షాలోంచి మెల్లగా దింపి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. తనదో చీర, జాకెట్టు, టవలు, షాంపూ ప్యాకెట్టు చేతికిచ్చి ముందు తలారా స్నానం చేసి రమ్మనమని చెప్పింది- దూరంగా ఉన్న బాత్‌రూమ్‌ చూపిస్తూ.
మరో పది నిమిషాలకు స్నానం చేసొచ్చిన కావేరిని చూస్తూ, ముఖం కాస్త తేటగా అన్పించటంతో ‘అమ్మయ్యా, మనిషి తెప్పరిల్లింది’ అనుకుంది.
ప్లేటులో భోజనం అందించింది. తినటం పూర్తయిన కావేరి వైపు చిరునవ్వుతో చూస్తూ ‘‘కాసేపు విశ్రాంతి తీసుకో, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం’’ అని చెప్పి, తన పనిలో జొరపడింది.

*  *  *

నిద్రలేచిన తనకు కాఫీగ్లాసు అందిస్తున్న సూర్యాంబ చంకలో ఉన్న చంటిపిల్లను చూస్తూ ‘‘ఈ పాప నీ మనవరాలా, ఈ వాతావరణం చూస్తుంటే ఇల్లులాలేదే, వీళ్ళంతా ఎవరు?’’ అనడిగింది కావేరి.
‘‘నా సంగతి తర్వాత. ముందు నీ గురించి చెప్పు. ఇక్కడికెలా వచ్చావు, ఈ అవతారం ఏమిటీ?’’ అనడుగుతున్న సూర్యాంబ ప్రశ్నలకు ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చి వలవలా ఏడవసాగింది కావేరి.
స్నేహితురాలి భుజాన చెయ్యేసి ఓదారుస్తూ ‘‘బాధపడకు, ఏం జరిగిందో చెప్పు’’ అంది.
‘‘ఏం చెప్పమంటావు. పెళ్ళయిన ఆడపిల్లలిద్దర్నీ దూరంగా పెట్టి, నా ప్రేమనంతా కొడుకుల మీదే చూపాను. వాళ్ళకి నేను భారమై అమ్మ నీదంటే నీదని వంతులాట మొదలయింది. నా పెద్దకొడుకు ఢిల్లీలో ఉన్నాడు. వాడికసలు నా ఊసే పనికిరాదు, ఎప్పుడూ రాడు, నన్ను చూడడు. రెండోవాడి దగ్గరే ఉంటున్నాను. వీడికీ నేను గిట్టకపోయినా తప్పదన్నట్లు ఇంత ముద్ద పడేస్తున్నాడు. అదే భాగ్యమనుకున్నాను. ఉన్నట్టుండి ఏమైందో మరి, యాత్రలకంటూ బయలుదేరదీశాడు. రైల్లో వాళ్ళందరికీ ఓచోట, నాకొక్కదానికీ వేరేగా బెర్తులొచ్చాయి. రాత్రి రెండు గంటలకు ఈ రైలు దిగి వేరే రైలు మారాలని చెప్పి, ఆ టైముకి వచ్చి లేపుతానని అన్నాడు నా కొడుకు. తెల్లవారి రైలు శుభ్రం చేసేవాళ్ళు వచ్చి లేపితేనే కానీ నాకు మెలకువ రాలేదు. బోగీ మొత్తానికి నేను ఒక్కదాన్నే, ఎవ్వరూ లేరు. ‘ఇదే ఊరు బాబూ’ అని వాళ్ళనడిగితే ‘తెలియకుండానే రైలెక్కావా మామ్మా’ అని నవ్వారు. దిగి చూద్దును కదా... రైలంతా ఖాళీ, ఒక్క మనిషి లేరు. భయంతో ఏడుస్తున్న నన్ను చూసి అంతా చుట్టుమూగినా తర్వాత ఎవరిదారి వాళ్ళదే. కొందరయితే నా వివరాలడిగి మా అబ్బాయి ఫోన్‌ నంబరడిగారు. నాకు తెలియదన్నాను.
‘ఆ, ఇటువంటివి తెల్లారిలేస్తే ఎన్ని చూడటం లేదు. బతికున్న తల్లుల్నే శ్మశానంలో వదిలేస్తున్నారు. ఇంకానయం, ఈవిడ కొడుకు ఈవిడ్ని నలుగురి మధ్యా వదిలాడు’ ఎవరో అంటున్న మాట విని అప్పటికిగానీ అర్థంకాలేదు నాకు జరిగిందేమిటన్నది.
‘తస్సాదియ్యా, కలికాలం కాకపోతే ఆడపిల్లల్ని వదిలిపెడుతున్నారు, అమ్మల్నీ వదిలిపెడుతున్నారు. ఏం రోజులో ఏమిటో’ అన్నారు ఇంకొకరు.
నా దగ్గర చిల్లిగవ్వ లేదు - సంచీలో ఉన్న నాలుగు చీరలు తప్ప. ఎక్కడికెళ్ళాలో ఏం చెయ్యాలో తెలియదు, ఏడవటం మినహాయించి. జాలితో ఎవరో టిఫిన్‌ పొట్లం తెచ్చిచ్చారు. అభిమానం అన్పించినా చివరికి ఆకలే జయించింది. ఎవరో పోలీసులకి చెప్పమంటున్నారు. చెప్పద్దూ, నాకు భయం అన్పించి అక్కడ్నుంచి తప్పుకున్నా. ఈ హడావుడిలో నా సంచీ కాస్తా ఎవరో కాజేశారు. స్నానం చేద్దామంటే మారు చీర లేదు. అసలు ఎక్కడ చెయ్యాలో కూడా తెలియదు. పిచ్చిదానిలా తిరుగుతూ కూడూగుడ్డా లేకుండా ఇలా బిచ్చగత్తెలా తయారయి నీ కంటపడ్డాను’’ అంది ఏడుస్తూనే.
కావేరిని ఓదారుస్తూనే ‘‘ఒకవేళ అర్ధరాత్రి రైలుదిగే హడావుడిలో బహుశా నిన్ను మర్చిపోయారేమో. నీ కొడుకు ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చెయ్యనా’’ అంది సూర్యాంబ.
‘‘వద్దు సూర్యా, జరిగిన ఘటనకి నా మనసు విరక్తితో నిండిపోయింది. కావాలని వదిలించుకోవటానికీ మర్చిపోయి వెళ్ళటానికీ తేడా గమనించలేనంతటి అమాయకురాల్ని కాదుగా. కటికవాళ్ళు వట్టిపోయిన గొడ్లను కబేళాకి
తరలిస్తున్నట్లే, కర్కోటకులైన కన్నకొడుకులు ఉపయోగంలేని, వయసుమళ్ళిన తల్లుల్ని ఏదో రకంగా వదిలించుకుంటున్నారు. చిన్నప్పుడు వాళ్ళకింత ఏదయినా వస్తే అన్నం, నీళ్ళూ మాని ఏడుస్తూ కూర్చునేదాన్ని, పెద్దయ్యాక నన్నిలా ఏడిపిస్తారని తెలియక.’’
‘‘పోనీ, ఆడపిల్లల దగ్గరికెళతావా?’’ అంది సూర్యాంబ.
‘‘ఏ ముఖం పెట్టుకుని వెళ్ళమంటావు సూర్యా! వాళ్ళకి అమ్మగా నా ప్రేమను పంచాను కనుకనా... ఈ పరిస్థితిలో వాళ్ళ ఆదరణ పొందటానికి! నాకసలు బతకాలని లేదు. చచ్చిపోతా’’నంటూ రెండు చేతుల్లో ముఖం దాచుకుని వెక్కివెక్కి ఏడుస్తున్న కావేరిని చూస్తుంటే గుండె బరువెక్కింది సూర్యాంబకి. ‘‘ఊరుకో కావేరీ, కొడుకులు కాదు పొమ్మన్నంత మాత్రాన లోకం గొడ్డుపోలేదుగా. ఎందుకలా అధైర్యపడతావు. పోవాలంటే పోతామా, బతకాలంటే ఉంటామా? అంతా పైవాడి దయ’’ అంది ఆప్యాయంగా కావేరిని దగ్గరకు తీసుకుని. కళ్ళు తుడుచుకుని ‘‘నీ కథా నా కథ లాటిదేనా?’’ అనడిగింది.
‘‘కాదులే. నా కొడుకు నన్ను బాగానే చూస్తాడు. వాడికి నేనంటే ప్రాణం’’ అంటూనే ‘‘నేనిక్కడ ఉద్యోగం చేస్తున్నా’’నంటున్న సూర్యాంబ మాటలకి అయోమయంగా చూసింది కావేరి అర్థంకానట్లుగా.
‘‘మా అబ్బాయికి యాక్సిడెంటయి నా కడుపు చలవవల్లా నా కోడలి తాళి గట్టివల్లా బతికి బయటపడ్డాడు. సంపాదించే మనిషి మూలబడటంతో కుటుంబం కుంటుపడింది. రెక్కాడితేనే కానీ డొక్కాడని బతుకులు. పెద్దవాళ్ళ పస్తుల మాట ఎలా వున్నా, నా మనవరాలి పాలకి కూడా ఇబ్బందిపడ్డ రోజులెన్నో. రోజుకు రెండువందల రూపాయల మందులు తప్పనిసరిగా వాడాల్సిన పరిస్థితి నా కొడుకుది. కాల్లో అదేదో రాడ్‌ వేస్తేనే కానీ పూర్తిగా నయమయి మామూలుగా నడవలేడట. కర్రపోటుతో నడుస్తున్న వాడ్ని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది. డాక్టర్లు ఆ ఆపరేషన్‌కు మరో ఆర్నెల్లు గడువుపెట్టారు. ఈ పరిస్థితిలో ఏం చెయ్యాలీ, ఏం చేసి కుటుంబాన్ని ఆదుకోవాలీ అన్న ఆలోచనే నాకీ దారి చూపించింది. అందుకే మరింక ఏం ఆలోచించకుండా ఇక్కడ చేరిపోయాను. మళ్ళీ వాడ్ని ఎంత త్వరగా మామూలుగా చూస్తానన్నదే నా తపన.’’
‘‘ఈ వయసులో ఉద్యోగమా, ఏమిటది?’’ అంది కావేరి ఆసక్తిగా.
‘‘అదిగో, ఆ చంటిపిల్లలందరికీ ఆయమ్మని. ఆ పక్క మంచాల మీదున్న పెద్దవాళ్ళందరికీ ఆత్మీయురాల్ని. ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. ఉద్యోగం చేసే భార్యాభర్తలకి పిల్లల్ని చూసే తోడు కావాలి. అందుకే వాళ్ళనిక్కడ చేరుస్తారు. ఉదయం నుంచీ సాయంకాలం వాళ్ళు వచ్చేదాకా ఆ పిల్లల్ని సాకాలి. వాళ్ళ బాగోగుల్ని చూడాలి. టైము ప్రకారం పాలుపట్టాలి, ఒకటికి రెండుసార్లు బట్టలు తడుపుకుంటే మార్చాలి. విసుగన్నది ఉండకూడదు. ముఖ్యంగా ఈ ఉద్యోగానికి డిగ్రీలూ సర్టిఫికెట్లూ అవసరంలేదు. కావాల్సిన అర్హతల్లా ఓర్పూ, సహనం, ప్రేమా, అభిమానం. ఏ చిన్న బాధ వచ్చినా ఏడుపుతో తెలియచేసే వాళ్ళని ఒక్కొక్కసారి భుజాన వేసుకుని రోజంతా తిప్పుతూనే ఉండాలి. ఇంక కాలొచ్చిన పిల్లలకి ఓపిగ్గా తినిపించాలి. వాళ్ళని వెయ్యి కళ్ళతో కాపాడాలి. ఎటూ పోకుండా, పడి దెబ్బలు తగిలించుకోకుండా వాళ్ళని ఆడించాలి. కబుర్లు చెప్పాలి. ఆ నోరులేని పసివాళ్ళు మన పిల్లలే అన్నంత ఆప్యాయంగా చూడాలి.’’

ఆ పక్క మంచాల మీదున్న వృద్ధులు కూడా ఓ రకంగా పసివాళ్ళే. వాళ్ళందరికీ తలోరకపు అనారోగ్యం. ఉద్యోగం చేసే దంపతులకయితే వయసు మళ్ళినవాళ్ళు ఇంట్లో ఉంటే ఇబ్బందీ, అడ్డం కూడాను. వాళ్ళమీద ఒంటరిగా ఇల్లొదిలి వెళ్ళలేరు. వండిపెట్టినా కొందరయితే పెట్టుకుని తినలేరు. టైము ప్రకారం గుర్తుంచుకుని మందులేసుకోరు. ఇక్కడుంచితే వాళ్ళ మంచీ చెడ్డా మనమే చూస్తాం. వాళ్ళ భద్రతకు ఢోకా ఉండదు. తమకు బాదరబందీ ఉండదన్న మరో కారణంతో డబ్బులు కట్టి చేతులు దులుపుకుంటున్నారు. వీళ్ళల్లో కొందరు డైనింగ్‌టేబులు దగ్గరకొచ్చి కూడా తినలేరు. వాళ్ళకి మనమే తినిపించాలి. టైము ప్రకారం మందులివ్వాలి. మరికొందరు ఏ ఆధారంలేని అనాథలు. ముఖ్యంగా రోజులో ఎంతోకొంత సమయాన్ని వాళ్ళకి కేటాయించాలి. వాళ్ళకి కబుర్లు చెప్పాలి. వాళ్ళ అవసరాల్ని తీర్చాలి. వాళ్ళకి ఆత్మీయతను పంచాలి. వృద్ధాప్యానికి పలకరింపూ, ఆప్యాయతా పెద్ద కానుక లాంటివి. అదే కరువయి, దానికే వాళ్ళు ముఖం వాచిపోయారు. నవమాసాలు మోసినవాళ్ళని వాళ్ళ సంతానం మర్చిపోయినంత తేలికగా, పేగుబంధం వీళ్ళని మర్చిపోనివ్వదుగా. గుర్తొచ్చినప్పుడు ఏడ్చినా, మనం చెప్పే కబుర్లలోపడి తేరుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళకి అన్నీ మనమే అన్నట్లుగా బాధలన్నీ మర్చిపోయేలా చెయ్యాలి. దాదాపుగా ఆయాలతోపాటు, పనివాళ్ళం పదిమందిదాకా ఉన్నాం. ఆడవాళ్ళకి ఆడవాళ్ళూ. మగవాళ్ళకి మగవాళ్ళూ ఉన్నారు.
ఆశ్చర్యంగా చూస్తూ ‘‘సూర్యా,
ఈ పన్లన్నీ నువ్వెలా చెయ్యగలుగుతున్నావు?’’ అంది కావేరి.
‘‘ఆడజన్మ ఎత్తాక ఈ పన్లన్నీ మనకు తెల్సినవేగా కావేరీ. మనింట్లో మనవల్నీ మనవరాళ్ళనీ చూసినట్లే ఈ పిల్లల్ని చూస్తాం. ఇంట్లో పెద్దవాళ్ళని చూసినట్లే వీళ్ళని చూస్తాం. ఇందులో ప్రత్యేకంగా నేర్చుకునేదేముంది. ఈ పనులు ఇంట్లోచేస్తే ఒక్క తృప్తీ, ఆనందం మాత్రమే ఉంటాయి. ఇక్కడైతే మన అవసరాలకి నెల తిరగ్గానే శ్రమకు తగ్గ జీతం అందుతుంది. తిండి జరిగిపోతుంది. ఇష్టమై ఉండాలంటే ఇక్కడే ఉండొచ్చు. దీనికంతటికీ మూల విరాట్టు అక్కడ వాలుకుర్చీలో కూర్చున్నారే- ఆ పెద్దాయనే.
కడివెడు సంతానం, కట్టలకొద్దీ సొమ్ములున్నాయి. పిల్లలంతా విమానాలెక్కి వెళ్ళేంత దూరంలో ఉండి వీళ్ళని పట్టించుకోపోగా, ‘మీరూ వద్దు, మీ డబ్బూ వద్దు’ అన్నారట. సడెన్‌గా భార్య మరణం ఈయన్ని ఒంటరిగా మిగిల్చింది. కాలక్షేపం కోసమో, పరోపకారమో అన్నట్లుగా తనింటినే ఇలా మార్చారు. అయినవాళ్ళుండీ అనాదరణకు గురయినవాళ్ళకూ, ఏ ఆధారమూలేని అనాథలకూ ఈ మహానుభావుడు కొండంత ఆసరా. వాళ్ళపాలిటి దేవుడు. నేను ఒక్కరోజు రాకపోయినా ‘సూర్యాంబా, మిమ్మల్ని చూడకపోయినా, మీరు చెప్పే కబుర్లు వినకపోయినా మా మనసులో చెప్పలేని వెల్తి’ అని వాళ్ళు మనసారా చెప్పే మాటలే వాళ్ళని మరింత ఆప్యాయంగా చూసే శక్తినిస్తాయి.’’
ఎంతో అనుభవజ్ఞురాలిలా, జీవితాన్ని కాచి వడబోచినదానిలా చెబుతున్న సూర్యాంబ మాటల్ని నోరు తెరుచుకుని వింటూ ఉండిపోయింది కావేరి.
‘‘చూడు కావేరీ, నీ కొడుకు నిన్ను వద్దనుకునే వదిలించుకున్నాడు. మళ్ళీ తిరిగి వెళ్ళాలన్న ఆలోచన నీ మనసుకీ లేదు. అందుకే చెబుతున్నాను. నీకిష్టమై చేస్తానంటే ఆ పెద్దాయనతో మాట్లాడి నీక్కూడా ఇక్కడ పనిచూస్తాను. కూడూ గుడ్డా, ఉండేందుకు నీడా దొరుకుతుంది. నా తోడూ, సాయం నీకెప్పుడూ ఉంటాయి. అంతకన్నా ఈ మలివయసులో కావాల్సిందేముంది. మనం పెట్టకపోయినా పెట్టేచోటు చూపాలన్నది నానుడి.
కష్టాలకూ కన్నీళ్ళకూ భయపడకుండా ఎన్ని ఇబ్బందులొచ్చినా ఎదుర్కొని అంతంత ఉమ్మడి సంసారాల్ని నడిపిన మనం జానెడు పొట్టకోసం, పిడికెడు మెతుకులు సంపాదించుకోలేమా చెప్పు. ‘కన్నాం కాబట్టి మన బాధ్యత మన సంతానానిదే, వాళ్ళే మనల్ని పోషించి తీరాలి. లేకపోతే చచ్చిపోవాలి’ అన్న అనారోగ్యపు ఆలోచన మన మనసులోకి రానీయనంతవరకూ ఏ సమస్య ఎదురైనా ఆత్మస్థైర్యంతో ఎదుర్కోగలం. ఓపికున్నంత వరకూ మనకు మనమే ఆధారమై మనల్ని మనమే పోషించుకోవటానికి మించిన ఆత్మ సంతృప్తీ, ఆనందం వేరే ఏముంటుంది చెప్పు. ఇది అందరు తల్లులకూ సాధ్యపడే విషయం కాదనుకో... ఓపికా, అవకాశం, అవసరం ఉన్న మనలాంటివాళ్ళు పనిచేస్తే తప్పేముంది... అయినా, తొందరేంలేదు, నిదానంగానే ఆలోచిం చుకో కావేరీ’’ అంటున్న సూర్యాంబతో-
‘‘ఆలోచించేదేం లేదు సూర్యా. నీ దారే నాదీనూ. ఆ పెద్దాయనతో మాట్లాడదాం పద’’ అంది కావేరి ఉత్సాహంగా పైకి లేస్తూ.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.