close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ కుర్రాళ్లు ‘కేక’..!

ఈ కుర్రాళ్లు ‘కేక’..!  

నలుగురికీ నచ్చినదీ నాకసలే ఇక నచ్చదురో... నరులెవరూ నడవనిదీ ఆ రూట్లో నే నడిచెదరో... అని పాడతాడు ఓ తెలుగు సినిమాలో హీరో. వీరిదీ అదే తీరు. ప్రపంచాన్ని సరికొత్తగా ఆవిష్కరించాలని కలలు కంటారు. ఆ కలల్ని నెరవేర్చుకోడానికి కొత్త దారులు వేసుకుంటారు. సృజనే పెట్టుబడిగా ముందుకు సాగే జనరేషన్‌ జడ్‌ తరమిది. సంక్షోభాలకు భయపడరు. అవరోధాల్లోంచే అవకాశాలను వెదుక్కుంటారు. ఆలోచనతో గెలుస్తారు. అందుకే ప్రపంచం మెచ్చింది. ఫోర్బ్స్‌ జాబితాలో చోటిచ్చింది.
 

టా ఫోర్బ్స్‌ పత్రిక సంపన్నుల జాబితాలనే కాదు, సృజనశీలురైన యువతరం సాధిస్తున్న విజయాల జాబితాలనూ ప్రచురిస్తుంటుంది. అలాంటిదే ‘30 అండర్‌ 30 ఆసియా’ జాబితా. 24 దేశాలనుంచి అందిన కొన్ని వేల నామినేషన్లను వడపోసి, షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులను ఫోనులో ఇంటర్వ్యూ చేసి మొత్తం 20 విభాగాల్లో  600 మంది యువకెరటాలను ఎంపిక చేశారు. అందులో 65 మంది భారతీయులే. వారిలో కొందరి స్ఫూర్తిగాథలివి.

ఈ - వాహనాలు చౌక గురూ!
రాహుల్‌, గాయం మోటార్‌ వర్క్స్‌  

తండ్రి పారిశ్రామికవేత్త కావడంతో హైదరాబాద్‌కి చెందిన అన్నదమ్ములు రాజా, రాహుల్‌ల చదువు సాఫీగా సాగింది. అనారోగ్యం కారణంగా తాను నిర్వహిస్తున్న బస్‌ బాడీ బిల్డింగ్‌ పరిశ్రమను తండ్రి మూసేయగా చదువు అవగానే సోదరులు దాన్ని తెరిచి ఇప్పటి సమాజ అవసరాలకు తగినట్లు ఆటోలు తయారుచేయడం మొదలెట్టారు. అయితే ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీ తయారీ అంశం మీద రాహుల్‌ పీహెచ్‌డీ చేయడంతో అన్నదమ్ములిద్దరి దృష్టీ అటు మళ్లింది. పర్యావరణానికి హాని చేయని విద్యుత్‌ వాహనాలే భవిష్యత్తుకు మంచిదనుకున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు కార్లను తయారుచేస్తున్నాయి కాబట్టి తాము అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువగా వాడే ఆటోలపై దృష్టిపెట్టారు. అందుకు ఒకవైపు పరిశోధన చేస్తూనే మరో వైపు సంప్రదాయ ఆటోలు తయారుచేసి ఇతర దేశాలకు ఎగుమతి చేశారు. అలా తమ పెట్టుబడి తామే సంపాదించుకున్నారు. విద్యుత్‌తో నడిచే వాహనాల వాడకంలో ఎదురయ్యే సమస్యల్ని అధిగమించేందుకు బ్యాటరీ స్వాపింగ్‌ టెక్నాలజీని తొలిసారిగా వీరే ప్రవేశపెట్టారు. దాంతో తక్కువ ఖర్చుతో నడిచే వీరి ఆటోలను సరుకులను హోండెలివరీ చేసే ఫ్లిప్‌కార్ట్‌, బిగ్‌బాస్కెట్‌ లాంటి సంస్థలు విరివిగా వాడసాగాయి. కాలుష్యం ఉండదు కాబట్టి స్మార్ట్‌ సిటీ అభివృద్ధిలో భాగంగా విజయవాడ, తిరుపతి, విశాఖ లాంటి నగరాల్లో చెత్త తరలింపునకు కూడా వీటిని వాడుతున్నారు. వీళ్లు తయారుచేసిన ఎలక్ట్రిక్‌ బైక్‌ని బైక్‌గానూ, సైకిల్‌గానూ వాడుకోవచ్చు. దీన్ని విదేశాల్లో ఉబర్‌ సంస్థ ఫుడ్‌ డెలివరీకి వాడుతుండగా ఏపీలో పోలీసులు ఉపయోగిస్తున్నారు. ఇప్పటివరకూ సొంతంగా నిధులు సమకూర్చుకున్న వీరు భవిష్యత్తులో బయటినుంచి నిధులు సేకరించి సంస్థను విస్తరించాలనే ఆలోచనలో ఉన్నారు.  రాహుల్‌ సంస్థ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసరుగా ఫోర్బ్స్‌ దృష్టిని ఆకర్షించగా, రాజా సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో సమాజం పట్ల తమ బాధ్యతను నిర్వర్తిస్తూనే వ్యాపారంలోనూ రాణిస్తున్నారు. 

ఏ పాఠమైనా ఇక్కడ ఉచితం!
గౌరవ్‌ ముంజల్‌, అన్‌అకాడమీ  

గౌరవ్‌ ముంజల్‌ ముంబయిలో ఇంజినీరింగ్‌ చదివేటప్పుడు సరదాగా తనకు నచ్చిన పాఠాలను వీడియోలో రికార్డు చేసి యూట్యూబ్‌లో పెట్టేవాడు. తరగతిగది పాఠాలకు భిన్నంగా ఉండాలని తన వీడియో పాఠాల ఛానల్‌కు ‘అన్‌అకాడమీ’ అని పేరు పెట్టాడు. చాలామంది ఆ పాఠాలు విని బాగున్నాయని ప్రశంసించడంతో ఉత్సాహంగా కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ పాఠాలనూ అప్‌లోడ్‌ చేశాడు. ఉద్యోగం చేస్తూ కూడా ఆ పనిని కొనసాగించాడు. ఈలోగా చిన్ననాటి స్నేహితుడు రోమన్‌ సైనీ మెడిసిన్‌ పూర్తిచేసి సివిల్స్‌లోనూ విజయం సాధించాడు. దాంతో సైనీ చేత సివిల్స్‌ పాఠాలూ రికార్డు చేయించి తన ఛానల్‌లో అప్‌లోడ్‌ చేసేవాడు ముంజల్‌. ఈ క్రమంలో ఇద్దరూ చర్చించి నాణ్యమైన విద్యకు ప్రాధాన్యమిస్తూ ఆన్‌లైన్‌ రంగంలోనే సీరియస్‌గా పనిచేయాలనుకున్నారు. అప్పటికే ముంజల్‌ మరో స్నేహితుడు హేమేశ్‌తో కలిసి సార్టింగ్‌ హ్యాట్‌ టెక్నాలజీస్‌ అనే సంస్థను ప్రారంభించాడు. ఐఏఎస్‌ ఉద్యోగం వదులుకుని సైనీ కూడా వారితో చేరిపోయాడు. ఇప్పుడు అదే సంస్థ ఆధ్వర్యంలో అన్‌అకాడమీ ఛానల్‌తో పాటు మొబైల్‌ ఆప్‌, వెబ్‌ పోర్టళ్లను నిర్వహిస్తున్నారు. లక్షన్నర పాఠాలు ఈ ఛానల్‌లో అందుబాటులో ఉన్నాయి. వైద్యవిద్య నుంచి ఐటీ వరకూ సివిల్‌ సర్వీసులనుంచి విదేశీ భాషలవరకూ ఏ పరీక్షకైనా సరే, ఏం నేర్చుకోవాలనుకున్నా సరే... ఇక్కడ ఉచితంగా నేర్చుకోవచ్చు. ఒక్క మనదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడున్నవారైనా ఈ పాఠాలను ఉపయోగించుకునేలా అతిపెద్ద ఆన్‌లైన్‌ వేదికను రూపొందించడమే తమ ఆశయం అంటారీ స్నేహబృందం. మూడేళ్లుగా సేవలందిస్తున్న ఈ ఛానల్‌ ద్వారా నేర్చుకుని యూపీఎస్‌సీ పరీక్షలు పాసైనవారున్నారు. వీరి సంస్థకి వెంచర్‌ ఫండింగ్‌ సంస్థల నుంచి పెద్ద ఎత్తున నిధులు కూడా అందాయి. నాణ్యమైన విద్యను  విద్యార్థి ముంగిట్లో అందించాలన్న తమ ఆశయం నెరవేరిందంటున్నారీ యువ సారథులు.

పదో తరగతిలోనే మొదలైంది!
అశ్విన్‌ రమేశ్‌, సైనప్‌

మంచి బిజినెస్‌ ప్లాన్‌ ఉంది, చదువు మానేసి వ్యాపారం చేస్తానని పదిహేనేళ్ల కుర్రాడు చెప్తే ఏ తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకుంటారు? అశ్విన్‌ రమేశ్‌ది మధ్యతరగతి కుటుంబం. ఇంట్లో కంప్యూటర్‌ కాదు కదా టీవీ కూడా లేదు. ఆ అబ్బాయికి మాత్రం ఏవేవో చేసెయ్యాలన్న ఉత్సాహం ఉంది. కంప్యూటర్‌ కొనిపెట్టమంటే లెక్కల్లో నూటికి నూరు మార్కులు తెచ్చుకోమన్నాడు తండ్రి. దాంతో ఇంటర్నెట్‌ సెంటర్లకు వెళ్లేవాడు. అతడి చురుకుదనం చూసి మాకు పనిచేసిపెట్టు, డబ్బులిస్తామన్నారు అక్కడి నిర్వాహకులు. అశ్విన్‌ చేసి పెట్టాడు కానీ ఆన్‌లైన్‌లో డబ్బులు వేయడానికి అతనికి అకౌంట్‌ లేదు. అప్పుడొచ్చింది అతనికి ఓ వ్యాపారాలోచన. కంప్యూటర్‌ ఉంటే ఇంట్లోనే రోజంతా పనిచేసి బోలెడు డబ్బు సంపాదించిపెడతానని తండ్రికి చెప్పాడు. తండ్రి వీల్లేదన్నాడు. కనీసం డిగ్రీ అయినా పూర్తిచేయమని బతిమాలాడు. దాంతో చదువుతూనే తన ఆలోచనలను ఆచరణలో పెట్టడం మొదలెట్టాడు అశ్విన్‌. బంధువుల గోడౌన్‌ అద్దెకు తీసుకుని అక్కడ ఆఫీసు పెట్టాడు. స్నేహితులనూ వారికి తెలిసిన నిరుద్యోగులనూ కూర్చోబెట్టి పనిచేయించేవాడు. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ డిగ్రీలో చేరేటప్పటికే అతని దగ్గర పాతిక మంది ఉద్యోగులున్నారు. రెండు డిజిటల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు నిర్వహిస్తూ సంపాదన పెరగడంతో రెండో సెమిస్టర్‌లోనే కాలేజీ మానేసి మరో పాతిక మందికి ఉద్యోగమిచ్చాడు. బెంగళూరుకు మకాం మార్చి 2013లో ‘సైనప్‌’ పేరుతో కొత్త కంపెనీ పెట్టాడు. కొత్త కొత్త ఆలోచనలూ చేయాలన్న ఆరాటమూ తప్ప పక్కా ప్రణాళిక అంటూ లేకపోవడంతో ఎదురుదెబ్బలు బాగానే తగిలాయి. సంపాదించిన డబ్బంతా పోయింది. అయితే చేసిన తప్పులు తెలుసుకుని అనుభవంతో పాఠాలు నేర్చుకున్న అశ్విన్‌ త్వరలోనే మళ్లీ గెలుపు బాట పట్టాడు. అతని కంపెనీ చిన్న చిన్న వ్యాపారస్తులకు వారి సంస్థల గురించి ఆన్‌లైన్‌లో సమాచారాన్ని పొందుపరిచే పని చేసిపెడుతుంది. ఫలానా దుకాణం ఎక్కడ ఉంది, ఎన్ని గంటలకు తెరుస్తారు లాంటి సమాచారమంతా ఒకసారి నమోదు చేసి వదిలేయకుండా మార్పులుంటే ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తారు. ఇప్పుడు అశ్విన్‌ సంస్థకు వివిధ దేశాల్లో వినియోగదారులున్నారు. ఉద్యోగులూ ఉన్నారు. మరింతగా విస్తరించడానికి నిధులూ లభించాయి. డబ్బు సంపాదించడం కన్నా ఇలా వ్యాపారం చేయడమూ ఇంత మందికి ఉద్యోగాలివ్వడమూ తనకి సరదాగా ఉందంటాడు 27 ఏళ్ల అశ్విన్‌.

పేదలకు పాదరక్ష
శ్రేయాన్ష్‌ భండారీ, గ్రీన్‌సోల్‌

మిత్రులిద్దరూ అథ్లెట్లు. ఆటలాడుతుంటే మూడు నెల్లకే బూట్ల జత పై భాగం పనికిరాకుండా పోయేది. కొత్త జత కొనక తప్పేది కాదు. మధ్యతరగతి కుటుంబాలనుంచి వచ్చిన వారికి ఖరీదైన బూట్లను అలా పారేయడానికి మనసొప్పేది కాదు. తెగ ఆలోచించారు. చివరికి పాత బూట్ల అడుగు భాగాన్నీ, అడుగు భాగం పాడైపోయిన చెప్పుల పై భాగాన్నీ తీసి రెంటినీ జత చేసి చెప్పుల జత తయారుచేసుకుని సరదాగా వేసుకునేవారు. ఆ ప్రయత్నమే ఓ సంఘసేవాకార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘గ్రీన్‌సోల్‌’కి పునాది అయింది. ఎందరో పేద పిల్లలు కాళ్లకు చెప్పుల్లేకుండా బడికెళ్లడం చూసిన ఈ స్నేహితులకు తాము తయారుచేస్తున్న పాదరక్షలనే ఇంకాస్త బాగా చేసి పేదలకు ఉచితంగా ఇస్తే బాగుంటుందనిపించింది. ఐదేళ్లక్రితం- ఆ ఆలోచనకు ఆచరణరూపమిచ్చిననాటికి ఇద్దరూ ఇంకా టీనేజర్లే. కొత్తలో తమకు కాలేజీలో, పోటీల్లో వచ్చిన బహుమతుల డబ్బునే ఈ పనికి వాడేవారు. వారి ఆలోచన లోతును తెలుసుకున్న పలువురు అండగా నిలిచారు. ఇప్పుడు పలు నగరాల్లోని కార్పొరేట్‌ సంస్థలు తమ ఉద్యోగుల పాతచెప్పులను సేకరించి గ్రీన్‌సోల్‌కి సరఫరా చేస్తున్నాయి. అవే కాకుండా పాఠశాలలూ, పార్కుల్లాంటి చోట్ల డ్రాప్‌బాక్సులు పెట్టి పాదరక్షలను సేకరిస్తారు. వాటిని ముంబయిలోని తమ ఫ్యాక్టరీలో కొత్తవాటిగా మార్చి గ్రామాల్లో పేదలకు పంచుతున్నారు. ముందుగా ఓ గ్రామానికి వెళ్లి అక్కడ ఎంతమందికి ఏయే సైజు పాదరక్షలు అవసరమో తెలుసుకుని అందుకు తగినట్లుగా తయారుచేసి పంపిస్తారు. ఈ పనుల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థల సహాయం తీసుకుంటున్నారు. ఈ యువకుల ఆలోచనకు టాటా గ్రూప్‌, రోల్స్‌ రాయిస్‌, జస్ట్‌ డయల్‌ లాంటి సంస్థల మద్దతు లభించింది. దాంతో కొనుక్కోగల స్తోమత ఉన్నవారికోసం ఆన్‌లైన్‌లో రీటైల్‌ పాదరక్షల శ్రేణిని కూడా ప్రారంభించారు. కొనుక్కోవడానికే కాదు, తమ తరఫున పేదలకు డొనేట్‌ చేయాలనుకున్నవారు కూడా ఈ వెబ్‌సైట్‌ చూడవచ్చు. ఓ పక్క ఈ పనులన్నీ చేస్తూనే రమేశ్‌ మారథానర్‌గా కొనసాగుతున్నాడు. శ్రేయాన్ష్‌ అమెరికాలో ఎంబీఏ చేసి వచ్చి సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు..

పాత సామానుకు కొత్తందం!
రోహిత్‌ రామసుబ్రహ్మణ్యం, జెఫో

పాత వస్తువుల్ని కొత్తగా అమ్మే వ్యాపారానికీ కోట్లలో పెట్టుబడులు సంపాదించవచ్చని రుజువు చేస్తోంది ఈ మిత్రబృందం. రోహిత్‌ రామసుబ్రహ్మణ్యం, కరణ్‌ గుప్తా, హిమేశ్‌ జోషి, అర్జిత్‌ గుప్తా- ఈ నలుగురూ కలిస్తే జెఫో విజయగాథ అయింది. వీళ్లలో ముగ్గురు ఐఐటీ గ్రాడ్యుయేట్లు. ఓ సంస్థలో కలిసి పనిచేస్తూ సొంతంగా ఏదైనా చేయాలన్న ఆలోచనతో ఉద్యోగం మానేశారు. అర్జిత్‌ ట్రిపుల్‌ఐటీలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చదివాడు. అందరూ కలిసి ఆలోచించి విదేశాల్లో ఉన్న సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌ లాంటిది ఇక్కడా సృష్టించాలనుకున్నారు. అప్పటికే క్వికర్‌, ఓఎల్‌ఎక్స్‌ లాంటివి మార్కెట్లో సంచలనాలయ్యాయి. కానీ వీరు ఇంకా ముందుకు ఆలోచించారు. ఫర్నిచర్‌లాంటి వాటి జీవితకాలం ఎక్కువ. వాటిని పూర్తిగా వినియోగించేలా చేయాలంటే మరోసారి వాటికి జీవం పోసి కొత్తవాటిలా మార్చాలి. మనదేశంలో సెకండ్‌ హ్యాండ్‌ వస్తువులు ఎవరూ వాడరు పొమ్మంటూ చాలా మంది వారిని నిరుత్సాహపరిచారు. కానీ తమ ఆలోచన మీద నమ్మకం వారిని ముందుకు నడిపించింది. జెఫో అంటే జీరో ఎఫర్ట్‌. అంటే అమ్మేవారికైనా కొనేవారికైనా ఏమాత్రం కష్టం లేకుండా అన్ని పనులూ తామే చేసిపెడతామని చెప్పడానికి ఆ పేరు పెట్టారు. దేశంలోని ప్రధాన నగరాల్లో సేవలందిస్తున్న ఈ సంస్థ ఆన్‌లైన్‌లోనే పాత ఫర్నిచర్‌నీ, టీవీలూ ఫ్రిజ్‌లూ మొబైల్‌ఫోన్లూ వాషింగ్‌మెషీన్లూ లాంటి పరికరాల్నీ కొంటుంది, అమ్ముతుంది. వ్యాపారం అంటేనే నమ్మకం. సెకండ్‌ హ్యాండ్‌ వ్యాపారం అంటే రెట్టింపు నమ్మకం కావాలి. కేవలం నాణ్యత, పారదర్శకతలతో దాన్ని సాధించింది ఈ బృందం. పాత సామగ్రిని మొదట శుభ్రం చేస్తారు. తర్వాత నిపుణులు వాటిని నిశితంగా పరిశీలించి నాణ్యతా ప్రమాణాలను అంచనా వేస్తారు. అవసరమైన మరమ్మతులు చేసి నాణ్యతలో కొత్తదానికన్నా ఏమాత్రం తీసిపోకుండా తయారుచేస్తారు. కానీ సగం ధరకే విక్రయిస్తారు. ఈ పనులన్నీ కొద్ది రోజుల్లోనే పూర్తవుతాయి. వివిధ కారణాల వల్ల వేరే ఊళ్లో కొన్ని నెలల పాటు ఉండాల్సివచ్చినప్పుడు కొత్తగా ఇంటిని తీర్చిదిద్దుకోవడమంటే చాలా ఖర్చు. అలాంటప్పుడు తక్కువ ధరకి లభించే ఈ వస్తువులు ఉపయోగపడతాయి. అవసరం తీరాక మళ్లీ వారికే అమ్మేయొచ్చు. కొత్తలో అలాంటి వినియోగదారులతోనే మొదలైనా ఇప్పుడు జెఫో చాలామందికి తక్కువ ధరకే నాణ్యమైన వస్తువుల్నిచ్చే నమ్మకమైన సంస్థగా మారింది. అందుకే వారి అవసరాలను తీర్చడానికి పలు పెద్ద పెద్ద బ్రాండ్లతోనూ టైఆప్‌ పెట్టుకుంది జెఫో. వారి దగ్గర సెకండ్స్‌ని కూడా కొని తక్కువ ధరకే వినియోగదారులకు అందజేస్తోంది.

తాతా మనవరాళ్ల కథ!
అనూ మీనా, ఆగ్రోవేవ్‌

ఐటీలో చదివిన అనూ మీనా చాలామంది తోటివారిలా విదేశాల్లో పెద్ద ఉద్యోగం గురించీ లక్షల్లో జీతం గురించీ ఆలోచించలేదు. పల్లెలో తాతయ్యే గుర్తొచ్చేవాడామెకు. పంటకు గిట్టుబాటు ధరా  పండిన పంటను సరైన సమయంలో మార్కెట్‌కు చేరవేయడంలో ఎదురయ్యే రవాణా సమస్యలూ తదితరాల గురించి ఆయన పడే ఆందోళన గుర్తొచ్చేదామెకి. తన తాతయ్య సమస్య తీరిస్తే ఊళ్లో రైతులందరి సమస్యలూ తీరతాయని భావించి ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. దళారుల సమస్య లేకుండా రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోగలిగితే చాలు వారికి ఎంతో మేలు జరుగుతుందని భావించిన ఆమె ‘ఆగ్రోవేవ్‌’ని ప్రారంభించింది. సాంకేతికతా పరిశోధనా విశ్లేషణల సమన్వయంతో దాన్ని ఎంతో ప్రయోజనకారిగా మార్చింది. ఒకప్పుడు పొలం నుంచి ఓ కూరగాయ వినియోగదారుని చేరాలంటే మధ్యలో కనీసం నాలుగైదు చేతులు మారేది. ఈ సంస్థ రైతులనుంచి ఉత్పత్తులను కొని నేరుగా వాటిని నగరాల్లోని రీటైల్‌ వ్యాపారస్తులకు చేరవేస్తుంది. దాంతో రైతుకు లభించే ధర పెరిగింది. గుడ్‌గావ్‌నుంచి పనిచేస్తున్న ఈ సంస్థ హరియాణా, రాజస్థాన్‌, యూపీ రైతులకు సేవలందిస్తోంది. సులభంగా వినియోగించేందుకు వీలుగా రైతులకూ వినియోగదారులకూ కూడా విడివిడిగా ఆప్‌లను రూపొందించారు. ఆప్‌ ద్వారానే తమ ఉత్పత్తులకు ఎక్కడ డిమాండు ఉందో తెలుసుకుని నేరుగా అక్కడే అమ్ముకునేలా కూడా రైతులకు శిక్షణ ఇస్తుంది ఆగ్రోవేవ్‌. అందుకు అవసరమైన రవాణా ఏర్పాట్లూ సంస్థే చేస్తుంది. పాతికేళ్లు నిండని అనూ మీనా ఆలోచనా, ఆచరణ విధానాలు ఫోర్బ్స్‌నే కాదు, పెట్టుబడులనూ బాగానే ఆకర్షించాయి. ఆ నిధులతో సంస్థను అన్నిరకాలుగానూ పటిష్ఠం చేసి సేవలను విస్తృతం చేసే ప్రయత్నాల్లో ఉందామె. 

ఆస్పత్రిలో ఆ ఆలోచన...
రియా శర్మ, మేక్‌ లవ్‌ నాట్‌ స్కార్స్‌

ఎంతో ఇష్టంగా లండన్‌ వెళ్లి ఫ్యాషన్‌ కోర్సులో చేరిన కూతురు భవిష్యత్తులో గొప్ప ఫ్యాషన్‌ డిజైనర్‌ అయిపోతుందని కలలు కన్నారు ఆమె తల్లిదండ్రులు. కానీ రియా మాత్రం కల్లలైన యువతుల కలలను ఏరి కూర్చి వారి జీవితాలను చక్కదిద్దే సంఘసేవకురాలైంది. దిల్లీకి చెందిన రియా శర్మ నిజానికి చాలా మామూలు విద్యార్థిని. కొన్నాళ్లకే ఫ్యాషన్‌ కోర్సులో ఆసక్తి తగ్గి సినిమాలు తీస్తే బాగుంటుందనుకుంది. యాసిడ్‌ దాడి బాధితులపై డాక్యుమెంటరీ తీయాలన్నది ఆమె మొదటి ప్రాజెక్టు. షూటింగ్‌ కోసం ఓ ప్రభుత్వ ఆస్పత్రి బర్న్స్‌ వార్డుకి వెళ్లింది. బాధితుల పరిస్థితిని కళ్లారా చూసి వారి కథల్ని విని కదిలిపోయిందామె. ప్రపంచంలో ఇంత బాధ ఉంటుందని మొట్టమొదటిసారిగా తెలుసుకున్న రియాకి తన ముందు రెండే మార్గాలున్నాయనిపించిందట. వెనక్కి తిరిగి వెళ్లి ఫ్యాషన్‌ కోర్సు పూర్తి చేసి సంతోషంగా తన బతుకు తాను బతకడం, లేదా ఆ బాధితుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేయడం. రియా రెండో మార్గాన్నే ఎంచుకుంది. 22 ఏళ్ల వయసులో యాసిడ్‌ దాడి బాధితుల కోసం ‘మేక్‌ లవ్‌ నాట్‌ స్కార్స్‌’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. వారికోసం దేశంలోనే తొలి పునరావాస కేంద్రాన్ని దిల్లీలో తెరిచింది.
బాధితులెవరైనా అక్కడ ఉండవచ్చు. వారికి అవసరమైన వైద్య, న్యాయ, ఆర్థిక సహాయాలన్నీ సంస్థ అందిస్తుంది. మానసికంగా వారు కోలుకునేలా చేసి తమ కాళ్లపై తాము నిలబడేలా తీర్చిదిద్ది ఆనందంగా కొత్త జీవితం గడిపేలా ప్రోత్సహిస్తుంది. కొత్తలో నిధుల కోసం స్నేహితులతో కలిసి రకరకాల కార్యక్రమాలు నిర్వహించేది రియా. చిన్న వయసు కావడంతో మొదట ఎవరూ ఆమె చెప్పేదాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఓపిగ్గా ఒక్కో కార్పొరేట్‌ సంస్థనూ సంప్రదిస్తూ తాము చేస్తున్న కృషిని వివరిస్తూ నిత్యపోరాటం చేసింది. అనుకున్నది సాధించింది. క్రౌడ్‌ ఫండింగ్‌తో పనిచేస్తున్న ఆ సంస్థ నీడలో ఎందరో బాధితులు కొత్త జీవితాన్ని పొందారు. పలు సంస్థలు వీరి కేంద్రానికి వచ్చి మరీ బాధితులను ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్నాయి.రియాకి అంతర్జాతీయ స్థాయి గుర్తింపుతో పాటు పలు అవార్డులూ లభించాయి. యాసిడ్‌ విక్రయాలను నిలిపేయాలంటూ రియా సంస్థ చేపట్టిన ప్రచారం ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించింది. కేన్స్‌ గోల్డ్‌ లయన్‌ పురస్కారాన్నీ అందుకుంది.మరో పదేళ్ల తర్వాత అసలు తన సంస్థ లాంటి సంస్థల అవసరం ఉండకూడదన్నది రియా ఆకాంక్ష.

ఈ-పత్రిక కాలేజీ విద్యార్థులకోసం...
శ్రీచరణ్‌ లక్కరాజు, స్టుమ్యాగ్జ్‌

దువూ, ఉద్యోగమూ ఈ రెంటికీ మధ్యలో ఉన్న యువతీ యువకుల పరిస్థితి ఎలా ఉంటుందో హైదరాబాద్‌కి చెందిన శ్రీచరణ్‌ లక్కరాజుకు బాగా తెలుసు. తానూ ఆ దశ దాటివచ్చాడు కాబట్టి పట్టాతో పాటు విద్యార్థులు ఇంకా ఏమేం సంపాదించాలో ఆ నైపుణ్యాలను ఎలా వినియోగించుకోవాలో వారికి చెప్పాలనుకున్నాడు. అందుకు ఆన్‌లైన్‌ని వేదికగా ఎంచుకున్నాడు. కొంతకాలం ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేసిన ఈ ఎలక్ట్రికల్‌ ఇంజినీరు స్నేహితుడు ఫ్రెడరిక్‌ దేవరంపాటితో కలిసి ‘స్టుమ్యాగ్జ్‌’ అనే డిజిటల్‌ మ్యాగజైన్‌ ప్రారంభించాడు. ఏడు ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్న స్టుమ్యాగ్జ్‌.కామ్‌ ద్వారా విద్యార్థులు చాలా పనులు చేసుకోవచ్చు. ఒక విధంగా ఆన్‌లైన్‌ విశ్వవిద్యాలయంలా పనిచేస్తుందిది. ఐఐఎంలూ ఐఐటీలను మినహాయిస్తే చిన్న చిన్న నగరాలూ పట్టణాల్లో ఉండే మామూలు కళాశాలల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ఎలాంటి వేదికా లేదనీ, ఆ లోటును తాము తీరుస్తున్నామనీ అంటోంది స్టుమ్యాగ్జ్‌ బృందం. విద్యార్థుల్లో రకరకాల ప్రతిభానైపుణ్యాలుంటాయి. ఆ నైపుణ్యాలు అవసరమైన సంస్థలూ ఉంటాయి. ఇద్దరినీ కలిపే వేదికే ఈ డిజిటల్‌ మ్యాగజైన్‌. ఫీజుల్ని డిజిటల్‌ పేమెంట్స్‌ రూపంలో కట్టడం నుంచీ అసైన్‌మెంట్స్‌ సబ్‌మిట్‌ చేయడంవరకూ, విద్యార్థులు తమ నైపుణ్యాల గురించి రాసుకోవడం నుంచీ ఉద్యోగావకాశాల వివరాల వరకూ అన్నీ ఇందులో ఉంటాయి. కాలేజీలు ఇందులో సభ్యత్వం పొందడం ద్వారా ఈ సౌకర్యాలను వినియోగించుకోవచ్చు. మామూలు వెబ్‌సైట్లు చాలా ఉన్నా ఇలా రెండు పక్షాలూ నేరుగా కమ్యూనికేట్‌ చేసుకోవడానికి వీలయ్యే అవకాశం ఈ ఒక్క వెబ్‌సైట్‌కి మాత్రమే ఉంది. అందుకే ఇది ఫోర్బ్స్‌నీ ఆకర్షించింది. మొదట్లో సొంతంగా పెట్టుబడి పెట్టినా తర్వాత బయటినుంచి పెట్టుబడులు లభించాయనీ గ్లోబల్‌ స్టూడెంట్స్‌ ప్లాట్‌ఫామ్‌గా దీన్ని తీర్చిదిద్దడమే తమ ఆశయమనీ అంటోంది ఈ బృందం.

వీరే కాదు, ఫోర్బ్స్‌ జాబితాలో చోటుపొందిన కుర్రాళ్ళందరూ కొత్తగా ఆలోచించినవారే. ‘కష్టాలు రానీ కన్నీళ్ళు రానీ ఏమైన కానీ ఎదురేది రానీ’ అనుకుంటూ కొత్త దారుల్లో నడిచినవారే. ఎప్పుడైనా నలుగురూ నడిచే దారిలో నడక సుఖం. కానీ, సాహసించి కొత్తదారిలో వెళ్తే ఊహించని విజయం. అలా సాహసించారు కనుకే ఈ కుర్రాళ్లు ‘కేక’.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.