close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
స్టీఫెన్‌ హాకింగ్‌కి మాటల్నిచ్చారు!

స్టీఫెన్‌ హాకింగ్‌కి మాటల్నిచ్చారు!

ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి, టీసీఎస్‌ మాజీ సీఈఓ రామదొరై, సత్యం రామలింగరాజు.. మనదేశంలో ఐటీ పరిశ్రమ వేళ్లూనుకోవడానికి కారకులైనవారు! అరుణ్‌మెహతా కూడా వీళ్ల సమకాలీనుడే. కాకపోతే ఆయన ఐటీని పరిశ్రమ దృష్టితో కాకుండా సామాన్యుల కోణం నుంచి చూశారు. ఈ క్రమంలో 13 సాఫ్ట్‌వేర్‌ ఆవిష్కరణలను మనముందుంచారు. వాటిని ఉచితంగా అందిస్తున్నారు. ఇటీవల మరణించిన విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌కి గళాన్నిచ్చిన ‘ఎలక్యూటర్‌’ వాటిలో ఒకటి!

న 20వ ఏటే ‘ఏఎల్‌ఎస్‌’ (అమియోట్రోఫిక్‌ లేటరల్‌ స్ల్కిరోసిస్‌) సమస్యతో శారీరక కదలికలు కోల్పోయిన స్టీఫెన్‌ హాకింగ్‌.. ఆ తర్వాత కేవలం ఒక్క వేలు కదలికతోనే తన భావాలు వెల్లడిస్తూ ఎంత పెద్ద శాస్త్రవేత్తయ్యారో మనకి తెలుసు! అలా ఆయన ఎదుటివాళ్లతో సంభాషించడానికి ‘ఈక్వలైజర్‌’ అనే సాఫ్ట్‌వేర్‌ ఉపయోగపడేది. కాకపోతే ఆ సాఫ్ట్‌వేర్‌ ఓ దశలో మందకొడిగా మారి ఆయన్ని చికాకు పెట్టింది. పైగా ఆ సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన ‘సోర్స్‌ కోడ్‌’ కూడా లేదు. దాంతోపాటూ ఆయన రాసినవాటిని మాటలుగా మార్చి వినిపించే ‘డెక్‌టాక్‌ బాక్స్‌’ పరికరం కూడా అంతంతమాత్రంగానే పనిచేసేది. కొన్నాళ్లకు దాని తయారీ కంపెనీ ఆ ఉత్పత్తిని ఆపేసింది. ఈ నేపథ్యంలోనే స్టీఫెన్‌ హాకింగ్‌ అరుణ్‌మెహతా సాయం కోరారు!

సున్నా నుంచి..
2001లో స్టీఫెన్‌ హాకింగ్‌ మొదటిసారి భారతదేశానికి వచ్చారు. ఆయన ‘మాటలకి’ సాయపడగల ఐటీ సంస్థల కోసం వెతకడం మొదలుపెట్టారు. అలా అరుణ్‌మెహతా, ఆయన స్నేహితుడు విక్రమ్‌ కృష్ణా నడుపుతున్న ‘రేడియోఫోనీ’ సంస్థని సంప్రదించారు. ఇద్దరూ స్టీఫెన్‌ హాకింగ్‌ని కలిశారు. ఆయన పనిచేసే తీరుని గమనించారు. ‘ఒక్క క్లిక్‌తో వందలాది వాక్యాలని రాయగలిగేలా, ఎన్నుకోగలిగేలా, ఎడిట్‌ చేయగలిగేలా ఓ సాఫ్ట్‌వేర్‌ రాయాలన్నది మా లక్ష్యం. దానికి ‘విజువల్‌ బేసిక్‌ 6.0’ అనే ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ సరిపోతుందనుకున్నాం. దాన్ని మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఉత్పత్తి చేస్తుండేది. కానీ మేం ఈ పని మొదలుపెట్టిన వారానికే దాని ఉత్పత్తిని ఆ సంస్థ నిలిపేసింది! దాంతో జీరో నుంచి ప్రారంభించాల్సి వచ్చింది. అదివరకెక్కడాలేని కొత్త లాంగ్వేజ్‌ని తయారుచేసుకుని.. హాకింగ్‌ కోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాం!’ అంటారు అరుణ్‌మెహతా. ఆ సాఫ్ట్‌వేర్‌కి ‘ఎలక్యూటర్‌’ అని పేరుపెట్టారు.

అదే స్ఫూర్తితో...
‘వైకల్యం ఉన్నవారికి సాంకేతిక నైపుణ్యం ఎంతబాగా ఉపయోగపడగలదో.. వారిలోని ప్రతిభాపాటవాలని ఎంత చక్కగా వెలికితీసుకురాగలదో చెప్పడానికి స్టీఫెన్‌ హాకింగ్‌ ఓ ఉదాహరణ. అదే స్ఫూర్తితో మరిన్ని సాఫ్ట్‌వేర్‌లు తయారుచేయాలని అనుకున్నాం. అందుకే 2009లో ‘బాప్సీ’(బైడైరెక్షనల్‌ యాక్సెస్‌ ప్రమోషన్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా)ని స్థాపించాం..’ అనంటారు అరుణ్‌. ఈ సంస్థ ద్వారా బధిరులూ, అంధులూ, బధిరాంధులూ ఎదుటివాళ్లతో తమ భావాలు పంచుకోవడం కోసం పాకెట్‌ ఎస్సెమ్మెస్‌, అఖ్తర్‌, నారంగి, స్లేట్‌ వంటి మొబైల్‌ యాప్‌లూ, సాఫ్ట్‌వేర్‌లని తయారుచేశారు అరుణ్‌. సాధారణంగా ఇప్పటిదాకా వీళ్లకి ఉపయోగిస్తున్న పరికరాలు ‘బ్రెయిలీ కన్వర్టర్‌’ సాయంతో నడుస్తాయి కాబట్టి.. వాటి ధర లక్షల్లో ఉంటుంది. అరుణ్‌ బ్రెయిలీకి బదులు ‘మోర్స్‌ కోడ్‌’ సాంకేతికతను వాడి.. వంద రూపాయలకంటే ఎక్కువ ఖర్చు లేకుండా చేశారు. స్టీఫెన్‌ హాకింగ్‌లా కేవలం ఓ చేతివేలో, కంటిరెప్పో కదపగలిగినవారికి వేర్వేరు అవసరాల కోసం ఎలక్యూటర్‌తోపాటూ సన్యోగ్‌, శ్రుతి అనే సాఫ్ట్‌వేర్‌లు తయారుచేశారు. డిస్లెక్సియా, సెరిబ్రల్‌ పాల్సీ వంటి సమస్యలున్న పిల్లల కోసం అర్పిత్‌, స్కిడ్స్‌ పేరుతో యాప్‌లూ రూపొందించారు.

వెయ్యి రూపాయలకే రేడియోస్టేషన్‌!
అరవై నాలుగేళ్ల అరుణ్‌ది దిల్లీ. 1975లోనే అక్కడి ఐఐటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ చేశారు. తిరిగి వచ్చి ఇండియాడాటా సంస్థలో ఎండీగా పనిచేశారు. అప్పట్లోనే అమెరికా పిట్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం కోసం ఆల్జీమర్స్‌ని ముందుగా ఎలా పసిగట్టవచ్చో చెప్పే సాఫ్ట్‌వేర్‌ని తయారుచేసి ఇచ్చారు! సరిగ్గా అప్పుడే ఆయన దృష్టి ప్రజాహక్కులూ, సమస్యలపై పడింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సంస్థలో చేరారు. అప్పట్లో పల్లెల్లో కమ్యూనిటీ రేడియో ఉపయోగాన్ని పెంచాలనుకున్న కేంద్రప్రభుత్వం కోసం వెయ్యిరూపాయల రేడియోస్టేషన్‌లకు రూపకల్పన చేశారు. ఇందుకోసం ‘రేడియో ఫోనీ’ సంస్థని స్థాపించారు. దాని ద్వారా కర్నూలు జిల్లా ఓర్వకల్లులోనూ వెయ్యిరూపాయల రేడియోస్టేషన్‌ ఏర్పాటుచేశారు. ఆ సంస్థ ద్వారానే స్టీఫన్‌ హ్యాకింగ్‌కి ఆ సరికొత్త సాఫ్ట్‌వేర్‌ చేసిచ్చారు!

ఇవి అందరికీ...
అరుణ్‌మెహతా తయారుచేసిన సాఫ్ట్‌వేర్‌ల సోర్స్‌కోడ్‌లన్నింటినీ ఉచితంగా ఆన్‌లైన్‌లోనే ఉంచారు! వాటిని ఎవరైనా నేర్చుకోవచ్చు. పైగా ఇందుకోసం ఆన్‌లైన్‌లోనే ఉచితంగా శిక్షణా అందిస్తారాయన. ఆసక్తి ఉన్నవారెవరైనా ‘బాప్సీ’ (www.bapsi.org) ని సంప్రదించవచ్చు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.