close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఊరికోసం ఒక్కడు!

ఊరికోసం ఒక్కడు!

మారుమూల పల్లెల నుంచీ నిరుపేద కుటుంబాల నుంచీ వచ్చి బాగా చదువుకునేవారూ ఉన్నత స్థానానికి ఎదిగేవారూ ఎందరో. కానీ తమతోపాటు పుట్టి పెరిగిన ఊరుకూడా బాగుపడాలని తపించేవాళ్లు మాత్రం ఎక్కడో కొద్దిమందే కనిపిస్తారు. అలాంటి వ్యక్తే బాల ప్రసాద్‌. బీడీ కార్మికులుగా పేదరికంలో నలిగిపోతున్న తన ఊరివాళ్లను అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యతను భుజాన వేసుకున్నాడతడు.

క్కడి రైతులకు పొలాలుంటాయి. కానీ ఆ నేల తడవాలంటే నీటికోసం ఆకాశం వైపు చూడాల్సిందే. ఆ ఎదురుచూపులు ఫలిస్తే పంట వేసుకోవడం, అదును దాటిపోతే ‘ఈ ఏడాది కూడా సమయానికి వర్షాలు పడలేదు’ అని బాధపడటం... అంతకుమించి ఏమీచేయలేని పరిస్థితి తెలంగాణలోని కామారెడ్డిజిల్లా దోమకొండ ప్రజలది. అందుకే, కడుపునింపుకునేందుకు బీడీలు చుట్టే వృత్తిని ఎంచుకున్నారు. ఏంలాభం... రోజుకి పదీ పదిహేనుగంటలు చుడితే వచ్చేది మనిషికి వందా నూటయాభై రూపాయలు. ఇంటిల్లిపాదీ కష్టపడినా తరతరాలుగా పేదరికం తప్ప ఏమీ మిగల్లేదు. బోనస్‌గా ఆ పొగాకు పొడుంలో ఉండే కార్సినోజెన్‌ ఒంట్లోకి వెళ్లి క్యాన్సర్‌తో సహా రకరకాల అనారోగ్యాలు. దేవరగట్టు బాలప్రసాద్‌ తల్లి లక్ష్మి కూడా అలాగే క్యాన్సర్‌ బారిన పడింది. ప్రసాద్‌ తండ్రి తిరుపతి బీడీల ప్యాకర్‌గా పనిచేస్తే తల్లి బీడీలు చుట్టేది. వారి కష్టాన్ని కళ్లారా చూసిన ప్రసాద్‌ ఎప్పటికైనా తను బాగా చదివి ఊరిని బాగు చెయ్యాలనుకునేవాడు. ఆ పట్టుదలతోనే డిగ్రీ పూర్తిచేసి, కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకుని పదేళ్ల కిందట సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం సంపాదించాడు. హైదరాబాద్‌లో పనిచేస్తూనే ఊరికోసం 2013లో ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. ‘లైఫ్‌(లివ్‌ ఇన్‌ ఫర్‌ ఎవ్రీవన్‌)’ పేరుతో ప్రారంభమైన ఈ సంస్థ విద్య, ఉపాధి, వ్యవసాయం... ఇలా అన్ని అంశాల్లోనూ దోమకొండ ప్రజలకు సాయం చేస్తోంది.

ఎంతోమందిని చదివిస్తున్నాడు
డబ్బున్నవారికి అయిదూ పదివేలంటే పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ గ్రామాల్లో పేద కుటుంబాల్లోని పిల్లలు నాలుగైదువేల రూపాయల కాలేజీ ఫీజు కట్టలేక కూడా చదువుకి దూరమైపోతుంటారు. అందుకే, ప్రతిభ ఉండీ పేదరికంతో చదువుకోలేని గ్రామంలోని విద్యార్థుల్ని చదివించడం మొదలుపెట్టాడు బాలప్రసాద్‌. ఏటా పదిమందిని ఎంపికచేసి ఒక్కొక్కరికీ పదివేల చొప్పున మొత్తం లక్షరూపాయల్ని వారి చదువుకోసం అందిస్తున్నాడు. అలా ఇప్పటికి 40మందికి పైగా విద్యార్థులు ఉన్నత చదువులు చదివారు. ప్రసాద్‌ ద్వారా అతడు పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీ కూడా సామాజిక సేవా కార్యక్రమాల నిధుల నుంచి కొద్దిరోజుల కిందట రూ.ఏడు లక్షల సొమ్ముని పదిహేను మంది విద్యార్థులకు అందించింది. దీంతోపాటు, మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మూడేళ్ల నుంచీ రూ.రెండున్నర లక్షల విలువైన నోటుపుస్తకాల్నీ అందించింది లైఫ్‌ సంస్థ. తను చదివిన ఉప్పల్‌వాయి గురుకుల పాఠశాలనూ మర్చిపోలేదు ప్రసాద్‌. ఆ బడికి శుద్ధజల కేంద్రాన్నీ ఫర్నిచర్‌నూ అందించాడు.

ఉపాధి మార్గం...
పదోతరగతి, ఇంటర్మీడియట్‌ చదివి మానేసిన అమ్మాయిలకు ఆపిల్‌ సంస్థ సహకారంతో నర్సు ట్రెయినింగ్‌ ఇప్పించి వారికి నగరాల్లోని ఆసుపత్రుల్లో ఉద్యోగాలు వచ్చేలా చేస్తోంది లైఫ్‌ సంస్థ. యువకులకు జీఎంఆర్‌ సంస్థ సాయంతో స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాల్ని ఏర్పాటుచేస్తున్నారు. ఇలా చదువుకున్నవారికైతే ఏదైనా ఉద్యోగాలు దొరికితే చేసుకుంటారు. కానీ గ్రామంలో ఉండే గృహిణులు బీడీలు చుట్టే పని మానేయాలంటే వారికి ఇంటిదగ్గరే ఉండి సంపాదించుకునే మరో మార్గం ఏదైనా చూపించాలి. అందుకే, స్థానికంగా ఉన్న దోమకొండ గడీల ట్రస్టు, జీఎంఆర్‌, నిర్మాణ్‌, ఆపిల్‌... వంటి సంస్థల సహకారంతో ముందుగా కొందరికి ఫినాయిల్‌, సర్ఫ్‌, కొవ్వొత్తుల తయారీలో శిక్షణ ఇప్పించాడు ప్రసాద్‌. అంతేకాదు, వారు తయారుచేసిన ఉత్పత్తుల్ని అమ్మిపెట్టే బాధ్యతను కూడా తనే తీసుకుని ఆసుపత్రులతో పాటు, వివిధ సంస్థలు వాటిని కొనుగోలు చేసే ఏర్పాట్లుచేశాడు.

ఇక, రైతుల విషయానికొస్తే... భూగర్భజలాలు లేనిమాట వాస్తవం. కానీ వర్షాలు బాగా పడినపుడైనా సరైన ఆదాయం రావడంలేదు. అందుక్కారణం రైతులు రసాయన ఎరువుల కోసం విపరీతంగా పెట్టుబడులు పెట్టడమే. దీనివల్ల అప్పులపాలవడమే కాదు, నేలలోని సారం కూడా ఏడాదికేడాదీ తగ్గిపోతోంది. అందుకే, వారిని సేంద్రియ వ్యవసాయం వైపు మరల్చేదిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది లైఫ్‌. గోమూత్రం, పేడతో వ్యవసాయం చేసేందుకు గోశాల ఫెడరేషన్‌ సాయంతో గ్రామంలో గోశాలను ఏర్పాటుచేశారు. ఇక్కణ్నుంచి వచ్చే ఎరువుని రైతులు తమ పంటలకు వేసుకోవచ్చు. ప్రస్తుతం పద్నాలుగు ఆవులున్న ఈ గోశాల నిర్వహణ బాధ్యతను గ్రామంలోని ఓ పేద కుటుంబానికి అప్పగించి అందుకుగానూ వారికి ఏడాదికి కొంత వేతనం ఇస్తున్నాడు ప్రసాద్‌. అంతేకాదు, ఆసక్తి ఉన్న రైతులకు ఒక్కొక్కరికీ రెండు ఆవుల చొప్పున ఉచితంగా పంపిణీ చేశారు. దోమకొండ, ముత్యంపేట... తదితర గ్రామాల్లో గుడిసెల్లో ఉండేవారికి బట్టలూ సౌరదీపాలనూ, చలికాలంలో దుప్పట్లనూ అందిస్తోంది లైఫ్‌ స్వచ్ఛంద సంస్థ.

‘పేదరికం వల్ల మా ఊళ్లో ఎవరూ చదువు మానకూడదు. ఊరి నుంచి కనీసం ఒక్కరైనా ఐపీఎస్‌/ఐఏఎస్‌ అవ్వాలి... అదే నా లక్ష్యం’ అంటాడు బాలప్రసాద్‌. పుట్టిపెరిగిన ఊరి అభివృద్ధికోసం ఆయన పడుతున్న తపనను అభినందించాల్సిందే!

- పులి అనిల్‌ కుమార్‌, ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.