close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అటు ఎండ కాస్తోంది... ఇటు మంచు కురుస్తోంది..!

అటు ఎండ కాస్తోంది... ఇటు మంచు కురుస్తోంది..!

కుటుంబసభ్యులతో విహారయాత్రలకు వెళ్లడం, ఆనందంగా గడపడం...  ఎవరికైనా మరిచిపోలేని తీపి జ్ఞాపకమే. కానీ స్నేహితులతో కలిసి పర్యటించడం, సరదాగా తిరగడం కూడా... ఎప్పటికీ కావాలనిపించే మధురానుభూతే. అందుకే అప్పుడప్పుడూ స్నేహితులతో కలిసీ విహరించాల్సిందే...’ అంటూ తన ఉత్తర భారత పర్యటన అనుభూతుల్ని మనతో పంచుకుంటున్నారుహైదరాబాద్‌కు చెందిన కె. కార్తీక్‌ కుమార్‌.

మిత్రులమంతా కలిసి ఓ ట్రావెల్‌ సంస్థ ఆధ్వర్యంలో దిల్లీ, సిమ్లా, కులూమనాలి, అమృత్‌సర్‌, వాఘా బోర్డర్‌, ఆగ్రా, మధుర... అన్నీ చూడాలనుకుని బయలుదేరాం. దాదాపు పదిరోజులు... పది క్షణాల్లా దొర్లిపోయాయి. మహబూబ్‌నగర్‌ నుంచి దిల్లీ బయలుదేరాం. రైలు దిగగానే ట్రావెల్‌ సంస్థ వాళ్లు మమ్మల్ని బస్సులో ఎక్కించుకుని, దిల్లీ వీధులన్నీ తిప్పుతూ తీసుకెళ్లారు. నగర శివార్లలోని ఓ దాబా దగ్గర బస్సు ఆపారు భోజనం కోసం. మళ్లీ ప్రయాణం మొదలు. మర్నాడు ఉదయం ఏడు గంటలకల్లా హిమాచల్‌ప్రదేశ్‌ రాజధాని సిమ్లాకు చేరుకున్నాం.

సిమ్లాలో...
ఎటుచూసినా ఎత్తైన కొండలూ లోయలే కనిపిస్తున్నాయి. కొండలన్నీ గుబురుగా పెరిగిన చెట్లతో చిక్కని పచ్చరంగుని పులుముకున్నట్లు ఉన్నాయి. ఉష్ణోగ్రత ఐదు డిగ్రీలకు మించదు. పట్టణానికి చేరుకున్నాక స్నానాదికాలు, అల్పాహారం ముగించుకుని బయటకు వచ్చాం. వెన్నులోంచి వణుకుపుట్టేంత చలిగా ఉంది. అయినా చుట్టూ ఉన్న పచ్చని పర్వతాలు రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. వేడి వేడి కాఫీ తాగుతూ ఆ అందాలను కళ్లతో ఆస్వాదించడం మరచిపోలేని అనుభవం. ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా రంగురంగుల చెక్క ఇళ్లే ఉన్నాయి. మా టూర్‌ గైడ్‌ సూచన మేరకు సిమ్లాకు 20 కి.మీ. దూరంలోని కుఫ్రీ అనే పర్వత ప్రాంతానికి వెళ్లాం. ఇది సముద్ర మట్టానికి 8,630 అడుగుల ఎత్తులో ఉంది. అరగంట ఘాట్‌ రోడ్డు ప్రయాణం తరవాత అక్కడికి చేరుకున్నాం. అక్కడ స్వయంగా ప్రకృతే మమ్మల్ని ఘనంగా ఆహ్వానించింది. బస్సు దిగేసరికి ఆకాశం నుంచి హిమపాతం చిన్న చిన్న దూదిపింజెల్లా రాలిపడుతోంది. అవి మమ్మల్ని తాకుతుంటే ‘జల్లంత కవ్వింత... ఒళ్లంత తుళ్లింత...’ అంటూ మనసు 90లనాటి ‘గీతాంజలి’ని గుర్తుచేసుకుంది.

క్రమంగా చలి తీవ్రత పెరిగింది. అందరం చేతులకి గ్లోవ్సూ పాదాలకి సాక్సూ ఒంటికి స్వెట్టర్లూ వేసుకున్నాం. అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరం గుర్రమ్మీద స్వారీ చేస్తూ కుఫ్రీలో అత్యంత ఎత్తైన ప్రాంతానికి చేరుకున్నాం. అక్కడ ఉన్న పురాతన శివాలయంలో స్వామిని దర్శనం చేసుకుని, పక్కనే ఉన్న టెలీస్కోప్‌ పాయింట్‌ నుంచి గ్రేట్‌వాల్‌ ఆఫ్‌ చైనాను చూసి సంబరపడ్డాం. చుట్టుపక్కల ఉన్న పార్కుల్లో తిరుగుతూ అక్కడి అందాలను కెమెరాలో బంధించే పనిలో పడ్డాం. చూస్తుండగానే మధ్యాహ్నమైపోయింది. అంతలో మరో అద్భుతం జరిగింది. మిట్టమధ్యాహ్నం సూరీడు ఫెళ్లున ఎండను కాయిస్తుంటే, ఆకాశంలోని మేఘాలు మా పని మాదే అన్నట్లు మంచువానని కురిపిస్తున్నాయి. ఆ అపురూపమైన దృశ్యాన్ని స్వయంగా చూసి తీరాల్సిందే. సాయంత్రం వరకూ అక్కడే గడిపి, స్థానిక వంటకాలు రుచి చూసి బసకు చేరుకున్నాం.

మర్నాడు ఉదయమే సిమ్లా నుంచి కులూమనాలికి బయలుదేరాం. దోవ పొడవునా కొండలూ లోయలూ వాటి చుట్టూ తిరిగే మలుపులే. ఓ పక్క కొండలూ మరోపక్క లోయలూ మాతోపాటే పరుగులు తీస్తోన్న మేఘాలూ... చూస్తుండగానే గ్రీన్‌వ్యాలీకి చేరుకున్నాం. పేరుకు తగ్గట్లే అది పచ్చని చెట్లతో నిండిపోయింది. కాసేపు ప్రకృతి అందాలను తిలకించి, మళ్లీ కులూమనాలికి బయలుదేరాం. మార్గమధ్యంలో ఓ చోట బస్సు ఆపి భోజనాలు చేసి, లోయలోకి పరుగులుదీశాం. ఎటుచూసినా పొడవాటి చెట్లూ వాటి కొమ్మలమీద ఊగాడే కోతులూ రెమ్మలమీద వాలిన రంగురంగుల పక్షులూ దారిలో అక్కడక్కడా పరుగులు తీస్తోన్న కుందేళ్లూ ఉడతలూ బాట పక్కనే ప్రవహించే సెలయేళ్లూ వాటిలో ఎగిరిపడే చేపలూ... అన్నీ అందాలే. వర్ణించనలవికాని సుందర దృశ్యాలే. కాసేపు మేం ఆ అందాల్లో తడిసిముద్దయి బస్సెక్కాం. తెల్లవారుజామున మనాలీకి చేరుకున్నాం.

మనాలీలో...
అప్పుడే ఉదయిస్తోన్న భానుడి కిరణాల కాంతిలో తడిసిన మనాలీ మంచుకొండలు మేలిమి బంగారు వర్ణంలో మెరిసిపోతున్నాయి. కిటికీలోంచి చలిగాలులు తెగ గుచ్చేస్తున్నాయి. అయినా ఎప్పుడెప్పుడు ఆ కొండలెక్కేద్దామా...అన్న ఉత్సాహం మమ్మల్ని కుదురుగా ఉండనీయడం లేదు. బస్సు హోటల్‌కి చేరుకోగానే స్నానాలు చేసి అల్పాహారం చేసి బయటకు వచ్చాం. కాఫీ ఇస్తే తాగేలోగానే చల్లగా అయిపోయేది. సోలంగ్‌ వ్యాలీకి బయలుదేరాం. మనాలీ నుంచి 13 కి.మీ. దూరంలో ఉన్న ఆ ప్రాంతానికి వెళ్లాలంటే ప్రైవేటు వాహనాలు మాట్లాడుకోవాలి. తెల్లని పర్వతాలు పాలరాతి కొండల్లా ధగధగలాడుతున్నాయి. అంతా మంచు పేరుకుపోయింది. అప్పటికే అక్కడ వందల సంఖ్యలో పర్యటకులు మంచులో ఆడుతూ కనిపించారు. వాళ్లని చూసి మేమూ చిన్నపిల్లల్లా మారిపోయాం. మంచుముద్దలు విసురుకుంటూ ఆడుకున్నాం. పారాచూట్‌ డైవింగులూ స్కేటింగులూ మోటార్‌కారు డ్రైవింగులూ... అన్ని ఆటలూ ఆడుకుని హోటల్‌కు బయలుదేరాం. మార్గమధ్యంలో హిడింబీ దేవి ఆలయాన్నీ స్థానిక దేవాలయాలనీ దర్శించుకున్నాం. అనంతరం హోటల్‌కు చేరుకున్నాక ట్రావెల్‌ నిర్వాహకులు ప్రత్యేకంగా మాకోసం హోటల్లోని ఓ పబ్బులో డీజె ఏర్పాటుచేశారు. హోరెత్తించే పాటలతో అందరం చిందులేశాం.

హిమగిరుల మధ్య ప్రవహించే నదిలో రివర్‌రాఫ్టింగ్‌ చేయడం మాటల్లో చెప్పలేని అనుభూతి. చల్లని నీళ్లు ఎగసిపడుతూ మమ్మల్ని మొత్తంగా తడిపేశాయి. ఆ సాయంత్రం అక్కడే క్యాంప్‌ ఫైర్‌ ఏర్పాటు చేసుకుని సేదతీరాక కులూకి బయలుదేరాం. ఉదయాన్నే స్థానిక ఆపిల్‌ తోటల్లో సేదతీరి, అనంతరం పక్కనే ఉన్న ఊలు ఫ్యాక్టరీ ఔట్‌లెట్‌కు వెళ్లాం. అక్కడి స్థానికుల జీవనోపాధి చేనేత పరిశ్రమే. శాలువాలూ స్వెట్టర్లూ బ్లాంకెట్లూ తయారుచేసి ఫ్యాక్టరీ ఔట్‌లెట్లలో విక్రయిస్తారు. మధ్యాహ్నం అక్కడే భోజనం చేసి మర్నాడు అమృత్‌సర్‌కు చేరుకున్నాం.

అమృత్‌సర్‌లో...
ముందుగా గుర్రపు టాంగాల్లో స్వర్ణమందిరానికి వెళ్లాం. ఆలయంలోకి వెళ్లాలంటే తలమీద ఒక వస్త్రం కట్టుకోవాలని చెప్పడంతో అందరం అక్కడ అమ్మే కాషాయపు రంగు గుడ్డల్ని కట్టుకుని లోపలకు వెళ్లాం. గురుద్వారా ముఖద్వారం దగ్గరకు వెళ్లగానే సరోవరం మధ్యలో స్వర్ణమందిరం ధగధగలాడుతోంది. అక్కడ అడుగుపెట్టగానే మనసంతా ఆధ్యాత్మిక భావన సంతరించుకుంది. లోపలికి వెళ్లగానే ఆధ్యాత్మిక సంకీర్తనలు వినిపిస్తున్నాయి. ఆ గీతాల అర్థాలు తెలియలేదు కానీ వినడానికి ఆహ్లాదంగా అనిపించాయి. అనంతరం పక్కనే ఉన్న జలియన్‌వాలా బాగ్‌ చూడ్డానికి వెళ్లాం. చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో చదివిన చరిత్ర మొత్తం కళ్లముందు కనిపించింది. స్వాతంత్రోద్యమంలో జాతీయ నాయకులు సత్యపాల్‌, డాక్టర్‌ సైఫుద్దీన్‌ కిచ్లూ అరెస్టులకు నిరసనగా 1919 ఏప్రిల్‌ 13న సమావేశమైన ఆ ప్రదేశంలో బ్రిటిషర్లు జరిపిన మారణహోమాన్ని తలచుకుంటే మనసు దుఃఖసాగరమైంది. వెయ్యిమందికి పైగా ఉద్యమకారులు సైనికుల తూటాలకు బలయ్యారు. కొందరు అక్కడే బావిలోకి దూకి చనిపోయారు. అవన్నీ చూసి భారమైన మనసుతో సాయంత్రం ఇండియా-పాకిస్తాన్‌ వాఘా సరిహద్దుకు చేరుకున్నాం. రోజూ ఉదయం, సాయంత్రం ఇరుదేశాల
సరిహద్దులో చేసే సైనిక విన్యాసాలు చూడ్డానికి వందలాదిమంది పర్యటకులు అక్కడికి తరలివస్తారు. భారత్‌-పాక్‌ మధ్య అదే ప్రధాన రోడ్డుమార్గం కావడంతో అక్కడ ఎప్పుడూ కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఆ సమయంలో మాత్రం కిలోమీటర్లమేర ట్రాఫిక్‌ నిలిచిపోతుంది. ఆ సైనిక విన్యాసాలు చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. భారత్‌ మాతాకీ జై అంటూ వినిపించే ఆ నినాదాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. అక్కడి నుంచి చలో దిల్లీ...

దిల్లీలో...

ఉదయాన్నే బయలుదేరి దిల్లీ వీధుల్లో షాపింగు చేశాం. మర్నాడు ప్రముఖ ప్రాంతాలను సందర్శించాం ముందుగా బిర్లామందిర్‌కి వెళ్లాం. దీన్ని ఎర్రనిరాతితో నిర్మించారు. అక్కడి నుంచి కుతుబ్‌మీనార్‌, లోటస్‌టెంపుల్‌, పార్లమెంటు భవనం, ఇండియాగేట్‌, జంతర్‌మంతర్‌, బాపూఘాట్‌... వంటి చారిత్రక ప్రదేశాలన్నీ చూశాం. చివరగా అక్షరధామ్‌లోని కళాకృతులను చూసి మైమరిచిపోయాం. అక్కడ లేజర్‌ షో  బాగుంది. సంగీతంతో పోటీపడి ఉవ్వెత్తున ఎగసిపడే నీటి నృత్యాన్ని చూస్తే సాక్షాత్తూ పరమశివుడే తాండవం చేస్తున్నాడా అన్న సందేహం కలుగుతుంది. ఆ షో చూస్తున్నంతసేపూ మనసంతా భక్తిపారవశ్యంతో పులకించిపోయింది. మర్నాడు ఆగ్రా కోటనీ, యమునాతీరంలోని తాజ్‌నీ చూసి, చివరగా కృష్ణుడు జన్మించిన మధురకి వెళ్లి దర్శనం చేసుకుని వెనుతిరిగాం.