close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పొందులాభం

పొందులాభం
- కె.కె.భాగ్యశ్రీ

‘‘ఇదేమిటండీ, మనం ఒకందుకు ఇల్లద్దెకిస్తే ఇంకొకటి జరుగుతోంది’’ మేడపైనున్న వాటాలో నుంచి వినిపిస్తున్న అరుపులూ కేకలను వింటూ విచారంగా అంది శకుంతల.
‘‘ఏం చేస్తాం చెప్పు, ఈ వయసులో మనకి మంచికీ చెడ్డకీ కాస్త మాటసాయంగా ఉంటారని కదా... వీళ్ళకి ఇల్లద్దెకిచ్చింది. మాటసాయం దేముడెరుగు... వీళ్ళు చూస్తే ఉప్పూ నిప్పులా అనుక్షణం చిటపటలాడుతూనే
ఉంటున్నారు’’ నిట్టూర్చాడు భానుమూర్తి.
‘‘అవునండీ, అతగాడు ఇంట్లో ఉండేదే తక్కువ. ఉన్న కాసేపూ కూడా కుక్కా పిల్లుల్లా పోట్లాడుకుంటూనే ఉంటారు. ఏదో గిల్లికజ్జాలు అని సరిపెట్టుకునేందుకు లేదాయె! ఒక్కోరోజు వాళ్ళ కీచులాటలు శ్రుతిమించి అతగాడు ఆ అమ్మాయి మీద చేయి చేసుకునేదాకా వెళ్తోంది. ఇదిలాగే కొనసాగితే మనకి పిచ్చెక్కడం ఖాయం’’ అంది శకుంతల.
‘‘మనకి పిచ్చెక్కడం మాట అటుంచు, వీళ్ళ దెబ్బలాటలు వీళ్ళనేస్థాయికి చేరుస్తాయోనని భయంగా ఉంది’’ వాపోయాడు భానుమూర్తి.
‘‘పోనీ, మనం వెళ్ళి నచ్చచెబుదామా!’’ ఆశగా అడిగింది శకుంతల.
‘‘ఇంకా నయం... భార్యాభర్తల మధ్యన తగువులలో తలదూరిస్తే ఫూల్స్‌ అయ్యేది మనమే’’ తల అడ్డంగా ఊపాడు భానుమూర్తి.
మేడమీది దంపతుల యుద్ధం మాంఛి రసవత్తరంగా సాగుతున్నట్లుగా తెలియజేస్తున్నాయి - సామాన్లు విసిరికొడుతున్న శబ్దాలు.
‘‘వీళ్ళ అఘాయిత్యం కూలా...కోపతాపాలొస్తే కూర్చుని పరిష్కరించుకోవాలి కానీ, ఇలా సామాన్లు సొట్టలుపడేలా విసురుకుంటారా ఎవరన్నా?’’ బుగ్గలు నొక్కుకుంది శకుంతల చోద్యంగా.
‘‘వాళ్ళ స్టైల్‌ అంతేమరి! సరేగానీ, దవడలు లాగేస్తున్నాయి... నా ముఖాన ఇన్ని కాఫీనీళ్ళు పోసేదేమన్నా ఉందా లేదా? అన్నానని తెచ్చి ముఖాన పోసేవు సుమా’’ హాస్యమాడాడు భానుమూర్తి.
‘‘హయ్యో, ఈ వెటకారాలకేమీ తక్కువలేదు’’ మూతి ముడిచి లోపలికి వెళ్ళింది శకుంతల.
శకుంతలావాళ్ళది కిందో వాటా, మీదో వాటా ఉన్న ఇండిపెండెంట్‌ హౌస్‌. మోకాళ్ళ నొప్పులతో మీదకి ఎక్కలేమని, కింద వాటాలోనే ఉంటున్నారు. చాలామంది తల్లిదండ్రుల్లాగానే విదేశాలలో స్థిరపడిన పిల్లల మీద ఆశలు వదిలేసుకుని, ఇక్కడే జీవనం సాగించడానికి నిశ్చయించుకున్నారు.
మేడమీద ఖాళీగా ఉన్న వాటాని ఒక చిన్న కుటుంబానికి అద్దెకివ్వడం ద్వారా, ఆపదలోనూ అవసరానికీ తమకి సహాయంగా ఉండే మనుషులని సంపాదించుకోవచ్చన్న ఆలోచన కలిగింది ఆ దంపతులకి.
దాని ఫలితంగానే ఈ జంట వచ్చి చేరిందా వాటాలోకి. వాళ్ళకి పెళ్ళయి రెండేళ్ళు దాటుతోంది. పిల్లలు లేరు. అబ్బాయి ఏదో ప్రైవేటు ఆఫీసులో చెప్పుకోదగిన స్థాయిలోనే ఉన్నాడు. అమ్మాయి డిగ్రీ వరకూ చదివింది.
విషయం ఇదీ అని ఇదమిద్దంగా తెలియకపోయినా ఇద్దరికీ పడటంలేదని మాత్రం చెప్పవచ్చు. తరచూ ఏదో ఒక విషయానికి గొడవపడుతూ, ఒకరి మీద ఒకరు కేకలేసుకుంటూ ఉంటారు. వారి అరుపులకి- ప్రశాంతతకి ఆలవాలమైన ఆ ఇంట అశాంతి చోటుచేసుకుంది.
బిగ్గరగా అరుచుకుంటూ ఒకరిపై ఒకరు అభియోగాలు మోపుకోవడం శకుంతల దంపతుల దృష్టికి వచ్చింది.
‘‘ఆ అమ్మాయికి అంత మొండిపట్టు కూడదు. నేను ఆ అబ్బాయిని చూశాను కదా... ఎప్పుడూ నవ్వుముఖంతో చక్కగా పలకరిస్తాడు. ఆ అమ్మాయి మాత్రం ముఖం ముడుచుకుని తిరుగుతుంది. ఏనాడూ ఆ ముఖంలో నవ్వు కన్పించిన పాపానపోలేదు’’ ఆరు నెలలుగా ఆ అమ్మాయిని గమనిస్తూ వచ్చిన శకుంతల అందోసారి.
‘‘ముఖాలనిబట్టి మనుషుల మనస్తత్వాలు మనం ఎలా అంచనా వేయగలం చెప్పు’’ భానుమూర్తి ఏకీభవించలేదు ఆమెతో.
‘‘ఫేస్‌ ఈజ్‌ ద ఇండెక్స్‌ ఆఫ్‌ మైండ్‌- అన్నారు కదా! ఆ అమ్మాయి ముఖం చూస్తే తెలిసిపోవడంలేదూ’’ కొట్టిపారేసింది శకుంతల.
‘‘ఏమోలే, కావచ్చు’’ ఒప్పేసుకున్నాడు భానుమూర్తి.
ఆ జంట తగవులు భరించలేక చాలాసార్లు ఇల్లు ఖాళీ చేయించేయాలనుకున్నాడు భానుమూర్తి. కానీ, శకుంతల ఒప్పుకోలేదు.
‘‘అది వాళ్ళ స్వవిషయం. మనమెందుకు అనవసరంగా చెడ్డకావడం. పైగా మనకి కొంచెం కాలక్షేపంగా కూడా ఉంది కదా!’’
ఇతరుల గొడవలు తమకి వినోదాన్ని కలిగించే అంశాలు అన్న అభిప్రాయం మచ్చుకన్నా లేని శకుంతల ఆసారి మాత్రం అలా అనడం భానుమూర్తికి కించిత్‌ ఆశ్చర్యాన్ని కలిగించింది.
మరొక ఆరు నెలలపాటు ఆ దంపతుల కీచులాటలు నిర్విఘ్నంగా కొనసాగాయి. మధ్యమధ్యలో అమ్మాయి తల్లిదండ్రులూ అబ్బాయి కన్నవారూ వచ్చిపోతూ ఉన్నారు. అలా వచ్చినప్పుడు వాళ్ళ తల్లులు విడివిడిగా శకుంతల దగ్గర తమ గోడు వెళ్ళబోసుకునేవారు.
‘ఏనాడూ కాఫీగ్లాసు కూడా కడగడం ఎరగని పిల్ల ఇంటెడు చాకిరీ చేసి అలసిపోతోంది.
ఓ పనిమనిషినన్నా పెట్టడు మా అల్లుడు’ అన్నది అమ్మాయి తల్లి అభియోగమైతే...
‘నా దగ్గర ఉన్నన్నాళ్ళూ ఇటుపుల్ల తీసి అటు పెట్టడం ఎరగడు నా కొడుకు. ఈ పిల్ల పుణ్యమా అని ఎంగిలి కంచాలు కడుగుతున్నాడు’ వాపోయేది అబ్బాయి తల్లి. ఎటూ సర్ది చెప్పలేక సతమతమయ్యేది శకుంతల.
మొదట చిన్నగా మొదలైన ఆ యువజంట కలహాలు రానురానూ ముదిరి తీవ్రస్థాయికి చేరడంతో ఇరువైపుల పెద్దలకీ జోక్యం చేసుకోక తప్పలేదు.
ఎవరెంత నచ్చచెప్పినా వాళ్ళు కలిసి బతకడానికి ఇష్టపడకపోవడంతో అమ్మాయిని తమతో తీసుకుపోయారు తల్లిదండ్రులు. ఆ అబ్బాయి వేరేచోటుకి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుని ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోయాడు.
‘‘తాళి బంధం అంటే ఎంత పలుచన అయిపోయిందో చూశారా? కొట్టుకున్నా తిట్టుకున్నా ఒకే చూరుకింద కలిసి బతకాలనుకునేది మనతరం. ఇప్పటి పిల్లలకే కాదు వాళ్ళని కన్నవాళ్ళకి కూడా ఆ బాధలేదు. ‘దేనికైనా రెడీ’ అన్న చందాన వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే మతిపోతోంది’’ ఆవేదనగా అంది శకుంతల.
‘‘పిచ్చిదానా...నువ్వే అన్నావు కదా! ‘మనతరం’ అని. ఈతరం వేరు. ఏ విషయంలోనూ సర్దుకుపోవడానికి సిద్ధంగాలేరు ఇప్పటి పిల్లలు. మనమేం చేయలేం దీనికి’’ నిట్టూర్చాడు భానుమూర్తి.
‘‘సర్లెండి. వాళ్ళ గురించి మనం ఎంతగా విచారించినా ఫలితం లేదు. జరగాల్సిన అనర్థం జరిగే పోయింది’’ శకుంతల అంది నిర్వేదంగా.
ఆ తరవాత రెండు నెలలకి మరో యువజంట వీళ్ళింటి పోర్షన్‌లో వచ్చి చేరిపోయారు. పిల్లా పాపా ఉన్న ఒక చిన్న కుటుంబానికి ఇల్లు అద్దెకిస్తే, తమకు కాస్త కాలక్షేపంగా ఉంటుందని ఆశపడ్డ ఆ వృద్ధ దంపతులు, ఎంత ప్రయత్నించినా అది కుదరక, ఎవరో ఒకర్లే అని వీళ్ళకి అద్దెకిచ్చారు.
ఇంతకుముందు జంటలాగే వీళ్ళు కూడా కొత్తగా పెళ్ళయినవారే. వివాహమై ఇంకా ఏడాది కూడా నిండలేదు. అందంలో ఒకరికొకరు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నారు. ముఖాలలో వెల్లివిరిసే చిరునవ్వు, సదా
ఆహ్లాదంగా కనిపించే ముఖకవళికలు... ఇవన్నీ శకుంతలని బాగా ఆకట్టుకున్నాయి.
‘‘ఈడూ జోడూ చక్కగా కుదిరింది. జంట చూడముచ్చటగా ఉన్నారు. అయినా రూపురేఖలలో ఏముంది మనసులు కలవాలి కానీ...’’ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన పాత జంటని తలచుకుంటూ అంది.
ఇద్దరూ ఉద్యోగస్తులే కావడం మూలాన పొద్దున్న తొమ్మిదికి ఇంట్లోంచి బయటకెళ్తే మళ్ళీ రాత్రి దీపాలు పెట్టాకే తిరిగిరావడం.
తమ ఇంట్లో పనిచేసే పనామెనే వాళ్ళింట్లోనూ పనికి కుదురుద్దామనుకుంది శకుంతల. కానీ, ఆ అమ్మాయి వద్దంది.
‘‘మేముండేది ఇద్దరమేగా బామ్మగారూ, పెద్ద పనేముంటుంది చెప్పండి? ఇద్దరం కలిసి చేసేసుకుంటాం ఈపాటి దానికి పనిమనిషి దేనికి?’’ అంది ఆ అమ్మాయి.
‘‘ఏమిటీ, మీ ఆయన అన్ని పనుల్లోనూ సాయం చేస్తాడా?’’ ఆశ్చర్యపోయింది శకుంతల.
ఇంటిపనులు చక్కపెట్టడం ఆడవారికి మాత్రమే సంక్రమించిన జన్మహక్కు అన్నది పాతకాలపు భావాలున్న శకుంతల అభిప్రాయం. అందుకే ఆమెకి అమెరికాలో ఉన్న కొడుకు, కోడలికి సహాయం చేయడం కాస్త కంటగింపుగా అనిపిస్తుంది.
‘‘తప్పేముంది బామ్మగారూ? ఇద్దరం సమానంగా ఉద్యోగాలు చేస్తున్నాం. ఒకేలా సంపాదిస్తున్నాం. పనులు కూడా పంచుకుంటే తప్పేముంది?’’ ఎదురు ప్రశ్నించిందా అమ్మాయి.
ఆమె మాటలు శకుంతలకి ముచ్చటగొలిపినా, జీర్ణం మాత్రం కాలేదు.
తరవాత ఈ సంగతి భానుమూర్తితో చెప్పి బుగ్గలు నొక్కుకుంది.
‘‘పిచ్చిదానా! ఏ కాలంలో ఉన్నావే నువ్వు! ఈ రోజుల్లో ఆడా మగా తేడాల్లేవు. ఇంటిపనులూ బయట పనులూ భార్యాభర్తలిద్దరూ కలిసి చేసుకోవాల్సిందే’’ అంటూ నవ్వేశాడు.
ఆ అమ్మాయి పేరు సంహిత అని తరవాత తెలిసింది. ఆ అబ్బాయి పేరు సాకేత్‌.
మిగతా విషయాలెలా ఉన్నా సంహిత, సాకేత్‌ వచ్చాక వీళ్ళకి బాగానే టైమ్‌పాస్‌
అవుతోంది. శని, ఆదివారాల్లో ఇద్దరూ కిందికి వచ్చి ఈ దంపతులతో కబుర్లు చెప్తారు.
సాకేత్‌ చదరంగంలో చేయి తిరిగిన ఆటగాడనీ, కాలేజీ రోజుల్లో డిస్ట్రిక్ట్‌ ఛాంపియన్‌ అనీ తెలుసుకుని ఏనాడో అటకమీద పడి మూలుగుతున్న చెస్‌బోర్డ్‌ని కిందికిదించి దుమ్ము దులిపాడు భానుమూర్తి. ఏ కాస్త సమయం దొరికినా సరే, ఇద్దరూ ఎత్తుకి పైఎత్తులు వేస్తూ ఆటని ఆనందించసాగారు.
సంహితా అంతే, తాను యూట్యూబ్‌ చూసి నేర్చుకున్న వంటలని వీళ్ళకి రుచి చూపిస్తూ, పాతకాలపు సంప్రదాయ వంటకాలనీ పిండివంటలనీ శకుంతల దగ్గర నేర్చుకుంటూ పాకశాస్త్రంలో సరికొత్త ప్రయోగాలు చేస్తోంది. మొత్తానికి
ఆ యువజంట సంసారం కన్నులపండుగ చేస్తూ శకుంతల, భానుమూర్తిలను మురిపిస్తోంది.
కొన్ని రోజుల తరవాత వాళ్ళ దగ్గరకి ఇరువైపుల పెద్దల రాకపోకలు మొదలయ్యాయి. మొదట సంహిత తల్లిదండ్రులు వచ్చి ఒక వారం రోజులుండి వెళ్ళారు. ఆ తరవాత కొన్నాళ్ళకి సాకేత్‌ అమ్మానాన్నలు కూడా వచ్చారు.
ఇంతమంది వరసగా రాకపోకలు సాగిస్తున్నా కూడా సాకేత్‌, సంహితలు ఏమాత్రం అలసిపోకుండా, ముఖంలో చిరాకుని కనబడనీయకుండా వాళ్ళందరినీ మెప్పించారు. వీకెండ్స్‌లో వాళ్ళందరినీ తీసుకుని ఊరంతా చుట్టివచ్చారు. తమకు చేతనైన రీతిలో తమవారిని సంతోషపెట్టి, చక్కగా సాగనంపారు.

శకుంతలకిదంతా చూస్తే ముచ్చట కలిగింది. మామూలుగా వారిద్దరే ఉన్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఆడుతూ పాడుతూ గడిపేసే వాళ్ళు తమతమ పెద్దల దగ్గర ఎలా సంబాళించుకు వచ్చారోనన్న సందేహం కలిగింది.
ఎందుకంటే, ఇంటి దగ్గర పనిచేయడం అసలు అలవాటులేని కొడుకు, కోడలికి అన్ని పనుల్లో చేదోడువాదోడుగా ఉండటం చూసి తట్టుకోలేదు మగపిల్లాడి తల్లి.
అలాగే పుట్టింట్లో కాఫీగ్లాసు కడగడం కూడా అలవాటులేని తమ ముద్దుల కూతురు అబ్బాయికి పూటపూటా వండి వార్చుతుంటే తట్టుకోలేదు అమ్మాయి అమ్మ. ఆ విషయం ఇంతకు ముందున్న యువజంట తాలూకు పెద్దలు రుజువు చేశారు కూడా.
మరి... ఈ యువజంట ఈ ఇబ్బందినెలా అధిగమించారో, తమ కన్నవారిని ఎలా సముదాయించి, సంతృప్తిపరిచారో తెలుసుకోవాలన్న ఉత్సుకత మొదలైంది శకుంతలలో.
‘‘నీకెందుకే అంత ఆరాటం... ఎలాగోలా మేనేజ్‌ చేసి ఉంటారు’’ ఆమె అలా గింజుకోవడం చూసి మందలించాడు భానుమూర్తి.
‘‘ఆరాటం కాదండీ, పిల్లలకి నిండా పాతికేళ్ళన్నా ఉండి ఉండవు. ఏ గొడవలూ లేకుండా సంసారాన్ని అవలీలగా ఈదుతున్నారంటే కాస్త ఆశ్చర్యంగా ఉంది. ఆ చాకచక్యం వాళ్ళకెలా పట్టుబడిందో తెలుసుకోవాలని ఆసక్తి కలుగుతోంది’’ అంది తన ఉత్సాహం మీద నీళ్ళు జల్లుతున్న భర్తని చూసి మూతి ముడుస్తూ.
‘‘సరేలే, నీ సరదా నేనెందుకు కాదనాలి. ఆ కిటుకేదో అమ్మాయినే అడిగేస్తే సరిపోతుంది’’ నవ్వాడు భానుమూర్తి అర్ధాంగి ఆరాటం చూసి.
భర్త సలహాని వెంటనే ఆచరణలో పెట్టింది శకుంతల.
‘‘మీ సందేహం బాగానే ఉంది బామ్మగారూ, అమ్మ, అత్తమ్మ... ఇద్దరిలో ఎవరో ఒకరు ఉన్నప్పుడు మాకు పనిభారం ఏముంటుంది? అమ్మ ఉన్నప్పుడు అమ్మా, అత్తమ్మున్నప్పుడు ఆవిడా మాకు పనుల్లో సహాయం చేస్తారు కదా,
అలాంటప్పుడు పనిభారం పెరిగే అవకాశమే లేదు’’ నవ్వింది సంహిత ముసిముసిగా.
‘‘నవ్వడంకాదమ్మాయ్‌... నువ్వన్నదీ నిజమేననుకో. కానీ, ఎంత ఇంట్లో పెద్దవాళ్ళున్నా మీకలవాటైన పనులు మానుకోరుగా. కొడుకు ఎంగిలి కంచాలు తోముతున్నాడని మీ అత్తగారూ... కూతురు ఊపిరాడని పనులతో సతమతమవుతోందని మీ అమ్మా అనుకోకుండా ఎలా ఉన్నారో కాస్త చెప్పు’’ ఆసక్తిగా అడిగింది శకుంతల.
‘‘ఇందులో పెద్ద రహస్యం ఏమీలేదండీ... చాలా సింపుల్‌. అత్తమ్మావాళ్ళు వచ్చినప్పుడు నేనే కాస్త ఎక్కువ కష్టపడతాను. సాకేత్‌ని పెద్దగా పని చేయనివ్వను. దీంతో అత్తమ్మ ఆయన్నే మందలిస్తుంది. ‘పిల్ల ఇంటా బయటా అవస్థపడుతోంది, కాస్త సహాయం చేయొచ్చుగా’ అంటూ ఆయనకి బుద్ధులు చెబుతుంది.
అదే మా అమ్మావాళ్ళు ఉన్నప్పుడు సాకేత్‌ ఎక్కువ శ్రమ పడతాడు. నేను అడగకుండానే పనుల్లో సహాయం చేస్తాడు. దాంతో మా అమ్మ ప్లీజ్‌ అయిపోయి ‘మగపిల్లాడి చేత వంటింటి పనులు చేయించడమేమిటి. అవసరం అయితే పనమ్మాయిని పెట్టుకుని మానేజ్‌ చేసుకో. అంతేకానీ, అబ్బాయిని ఇబ్బందిపెట్టకు’ అంటూ నాకు చివాట్లు పెడుతుంది.
ఇలా చేయడం వలన అత్తమ్మా, మా అమ్మా కూడా హ్యాపీగా ఉంటారు. ఎవరికి కూడా బిడ్డలు ఎక్కువ అలసిపోతున్నారన్న ఫీలింగ్‌ రాదు. పైగా మా ఇద్దరిపట్లా ఒక సాఫ్ట్‌ కార్నర్‌ ఏర్పడుతుంది. సో, మామధ్య కూడా ఏ గొడవలూ ఉండవు. మా వలన పెద్దవాళ్ళు దెబ్బలాడుకునే పరిస్థితి రాకూడదు కదా బామ్మగారూ...’’ ఆరిందలా, కుటుంబ వ్యవహారాల్లో ఎంతో అనుభవం ఉన్నదానిలా తాను అవలంబిస్తున్న శాంతి సూత్రాన్ని వెల్లడిస్తున్న సంహితను చూసి ముక్కున వేలేసుకుంది శకుంతల.
ఆ పిల్లల గడుసుదనానికీ ఇరు కుటుంబాలలోనూ వైరుధ్య భావాలు తలెత్తకుండా వారు అవలంబిస్తున్న విధానానికీ అబ్బురపడింది.
పోరునష్టం-పొందులాభం అన్న రీతిలో వ్యవహరిస్తున్న వారి వైఖరిని మనసారా మెచ్చుకుంది. ఈ జంటలో ఉన్న పరిణితి ఉంటే ఏ ఇల్లయినా నందనవనమే కదా అనుకున్న శకుంతల సంహితను అభినందించకుండా ఉండలేకపోయింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.