close
షార్ట్‌ఫిల్మ్‌తో హైదరాబాద్‌ వచ్చేశా!

షార్ట్‌ఫిల్మ్‌తో హైదరాబాద్‌ వచ్చేశా!

టాలీవుడ్‌ని యువతరం ఏలేస్తోంది. అందుకు నిదర్శనం యువ హీరోలూ, దర్శకులే. ఆ దర్శకుల్లో మేర్లపాక గాంధీ ఒకరు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌ రాజా సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాంధీ... తాజాగా నానీ చేత ‘కృష్ణార్జునయుద్ధం’ చేయించాడు. ఆ సినిమా విడుదలవుతున్న సందర్భంగా అతడి సినిమా యుద్ధం గురించి అడిగితే బదులిచ్చాడిలా...

నాన్న... ప్రముఖ రచయిత మేర్లపాక మురళి. మా ఇంటినిండా పుస్తకాలే ఉండేవి. నాన్న ఎప్పుడూ చదవడం, రాయడంలోనే మునిగితేలేవారు. నాకూ చిన్నప్పట్నుంచీ పుస్తకాలే ప్రపంచం. ‘ఈ పుస్తకం చదివితే పాతిక రూపాయలిస్తా’ అని చెప్పేవారు నాన్న. అవి క్లాసు పుస్తకాలు కాదు, బాల సాహిత్యం. కథలూ, కవితలూ ఉండేవి. మూడు నాలుగు తరగతుల నుంచే ఆ పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. హైస్కూల్‌కి వచ్చేసరికి నవలలూ అలవాటు చేశారు. నాన్నిచ్చే డబ్బు కోసం పుస్తకంలో ఒక్క పేజీ కూడా వదలకుండా ఆసాంతం చదివేసేవాణ్ని. కొన్నేళ్లకు పుస్తకాలు చదవకపోతే నేను ఉండలేకపోయేవాణ్ని. నా దగ్గరున్న డబ్బుల్ని నాన్నకిచ్చి ఓ మంచి పుస్తకం కొని తెమ్మని చెప్పేవాణ్ని. అలా అక్షరాలతో ఆడుకోవడం చిన్నపుడే అలవాటైంది.

నాన్నకోరిక... ఇంజినీరింగ్‌
మొదట్లో మేం చిత్తూరు జిల్లా వెదుళ్లచెరువులో ఉండేవాళ్లం. నాలుగో తరగతి వరకూ అక్కడే.   తర్వాత రేణిగుంటకు వచ్చేశాం. హైస్కూల్‌కి వచ్చాక సినిమాలపైనా ఆసక్తి కలిగింది. వారంలో ఒకసారైనా థియేటర్‌కి వెళ్లి సినిమా చూసేవాణ్ని. డ్యాన్సులూ, ఫైట్లకంటే కూడా కథని ఎలా చెబుతున్నారో చూసేవాణ్ని. ఇంటర్మీడియెట్‌కి వచ్చాక కాలేజీ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లేవాణ్ని. నా దగ్గర డబ్బుల్లేకుంటే నా పుస్తకాలు కూడా ఫ్రెండ్స్‌కి అమ్మేసి సినిమాలు చూసిన రోజులున్నాయి. ఆ దెబ్బతో మార్కులు బాగా తగ్గిపోయాయి. ఇంటర్‌ పూర్తయ్యాక సినిమాల్లోకి వెళ్తాననీ, ఫిల్మ్‌కోర్స్‌ చేద్దామనుకుంటున్నాననీ నాన్నకి చెప్పాను. ‘ముందు ఇంజినీరింగ్‌ చెయ్యి’ అన్నారు. నాచేత బీటెక్‌ చేయించాలనే ఆలోచన బలంగా ఉండేది నాన్నకు. ఇంటర్‌ బైపీసీ చదివినా బయోటెక్నాలజీలో ఇంజినీరింగ్‌ చేశాను. నేను ఎక్కడ సినిమాల పిచ్చిలో పడి చదువుని నిర్లక్ష్యం చేస్తానో అని నాతోపాటు అమ్మని నేను చదువుకుంటున్న ఆళ్లగడ్డ పంపించారు నాన్న. అమ్మ అక్కడ మా కాలేజీ గర్ల్స్‌ హాస్టల్‌కి వార్డెన్‌గా ఉండేది. అమ్మ ఉండటంవల్లనో, లేకపోతే ఎలాగూ  తర్వాత సినిమాల్లోకి వెళ్తానన్న ధీమానో తెలీదు కానీ ఇంజినీరింగ్‌లో బాగా చదువుకున్నాను.

పెళ్లి ఫొటోలూ తీయొచ్చని...
బీటెక్‌ అవ్వగానే నాన్న దగ్గర మరోసారి సినిమాల గురించి ప్రస్తావించాను. అప్పుడూ ఆయన ప్రోత్సహించలేదు. ‘డైరెక్టర్‌ అయ్యావే అనుకో ఒకట్రెండు సినిమాల తర్వాత రాణించలేకపోతే, అప్పుడు కథ మళ్లీ మొదటికే వస్తుంది’గా అన్నారు. ఆ ప్రశ్నకు బదులుగా సినిమాటోగ్రఫీ కోర్సు చేస్తానన్నాను. ఒకవేళ సినిమాల్లో సక్సెస్‌ కాకపోయినా బయట ఫొటోగ్రాఫర్‌గా, కెమెరామేన్‌గానైనా పెళ్లిళ్లు షూట్‌ చేయొచ్చన్నాను. చివరికి అంగీకరించారు. చెన్నైలోని ఎల్వీ ప్రసాద్‌
ఇన్‌స్టిట్యూట్‌లో దరఖాస్తు చేసుకున్నాను. అక్కడ సీటుకి పోటీ ఎక్కువ. ఏడాదికి ఒక్కో విభాగంలో 12 సీట్లే ఉంటాయి. నాకున్న పరిజ్ఞానంకంటే సినిమాపైన ఉన్న పిచ్చి అభిమానం వాళ్లకి నచ్చింది. లక్కీగా సీటు వచ్చింది, లేకపోతే నా కెరీర్‌ వేరేలా ఉండేది. అప్పటివరకూ సినిమాపైన నాకున్న ఆలోచనల్నీ, అభిప్రాయాల్నీ ఫిల్మ్‌ స్కూల్‌ పూర్తిగా మార్చేసింది. అక్కడ చేరాక ఫ్రెంచ్‌, జపనీస్‌, ఇరానీ... ఇలాంటి ప్రపంచ భాషలకు చెందిన సినిమాల్ని పరిచయం చేశారు. చిన్న, సున్నితమైన అంశాల్ని కూడా ఎంచుకుని సినిమాని ఎంత అందంగా, ఆకట్టుకునేలా తీయొచ్చో వాటిని చూశాకే అర్థమైంది. అంతకు ముందు వరకూ నా ఊహల్లో భారీ కథలే ఉండేవి. సినిమా ప్రధానంగా ఒక ఆర్ట్‌, దాంతోపాటే కమర్షియల్‌ కోణం ఉండాలని ఫిల్మ్‌స్కూల్‌కి వెళ్లాక అర్థమైంది. మొదటి ఏడాది అన్ని కోర్సులవాళ్లకీ ఒకేలాంటి పాఠాలు ఉంటాయి. అందరికీ ‘24 ఫ్రేమ్స్‌’నీ పరిచయం చేస్తారు. అది ఎంతో పనికొచ్చింది.

ఒకే ఒక్క షార్ట్‌ ఫిల్మ్‌...
ఫిల్మ్‌ స్కూల్లో చేరిన ఏడాది తర్వాత ఒక షార్ట్‌ ఫిల్మ్‌ తీశా. కాలేజీ రోజుల్లో నాన్నని బైక్‌ కొనమని చాలాసార్లు అడిగాను. అడిగిన ప్రతిసారీ వద్దురా అనేవారు. ‘ఒకవేళ బైక్‌ కొన్నానే అనుకో అని మొదలుపెట్టి దానివల్ల వచ్చే సమస్యల గురించి చాలా చెప్పేవారు. అదే అంశంమీద ‘కర్మరా దేవుడా’ షార్ట్‌ఫిల్మ్‌ తీశాను. దానికి మంచి స్పందన వచ్చింది. అది చూసి చాలామంది హైదరాబాద్‌ నుంచి నాకు ఫోన్‌ చేశారు. ఇక్కడికి వస్తే సినిమా తీయొచ్చన్నారు. నాకు కావాల్సిందీ అదే కదా, అందుకనే ఫిల్మ్‌ కోర్సు మధ్యలోనే విడిచిపెట్టి 2012లోనే హైదరాబాద్‌ వచ్చాను. అప్పుడే ఒక ఫ్రెండ్‌ద్వారా సందీప్‌ కిషన్‌ని కలిశాను. తనకి కథ చెబితే బాగా నచ్చింది. తర్వాత సినిమాకి కావాల్సినవన్నీ తనే చూసుకున్నాడు. ఓసారి నాకు ట్రైన్‌ కొద్దిలో మిస్సయ్యే పరిస్థితి ఎదురైంది. ఆరోజే ఒక ఆలోచన వచ్చింది. హీరో హైదరాబాద్‌లో ఎక్కాల్సిన రైలు మిస్సయి, తిరుపతిలో అది అందుకోవాలి... ఆ లైన్‌ అనుకున్నాక మిగతావన్నీ జోడించాను. అదే ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’. నాకు వినోదం బాగా నచ్చుతుంది. దాంతోపాటే సినిమాలో ఒకవిధమైన ఛేజింగ్‌, రేస్‌ ఉండాలనుకుంటాను. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో అవన్నీ పెట్టాను. 2013లో రిలీజైన ఆ సినిమా మంచి హిట్‌ అయింది.  నేనెవరి దగ్గరా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానూ చేయలేదు. కేవలం ఒక షార్ట్‌ ఫిల్మ్‌ తీశానంతే. కానీ నామీద నమ్మకంతో ఎందరో సీనియర్లని మా టీమ్‌లోకి తెచ్చాడు సందీప్‌. సినిమాటోగ్రాఫర్‌ ఛోటా కె.నాయుడు, నిర్మాత జెమిని కిరణ్‌, ఎడిటర్‌ గౌతమ్‌ రాజు లాంటి గొప్పవాళ్లతో మొదటి సినిమాకే పనిచేసే అవకాశం కల్పించాడు. భవిష్యత్తులో నేను ఏస్థాయికి వెళ్లినా ముందు గుర్తుపెట్టుకునేది సందీప్‌నే.

ఆ సినిమా స్ఫూర్తితో
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ తర్వాత కొన్ని ప్రాజెక్టులు అనుకున్నా అవి వర్కవుట్‌ కాలేదు. దాదాపు ఏడాదిన్నర గ్యాప్‌ తర్వాత శర్వానంద్‌కి ఒక కథ వినిపించాను. అదే ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’. తనకి నచ్చడంతో తర్వాత యూవీ క్రియేషన్స్‌కి వినిపించాం వాళ్లకీ నచ్చి నిర్మాణానికి ముందుకువచ్చారు. ‘ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక కుక్కని కిడ్నాప్‌ చేస్తారు’ అని ఒక సీన్‌ రాసుకున్నాను, ఎందుకు, ఎప్పుడు, ఎలా... అని దాని చుట్టూ కథ అల్లుకున్నాను. దీని స్క్రీన్‌ప్లేకి హాలీవుడ్‌ సినిమా ‘వాంటిజ్‌ పాయింట్‌...’ స్ఫూర్తి. ఆ సినిమాలో ప్రతి పదిహేను నిమిషాలకో కొత్త క్యారెక్టర్‌ పరిచయమవుతుంది. అది బాగా నచ్చింది. దాన్ని వినోదాత్మక కోణంలో ఈ సినిమాలో చూపించాను. 2016 సంక్రాంతికి ముగ్గురు స్టార్‌ హీరోల సినిమాలతోపాటు రిలీజైన ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’ మంచి విజయం సాధించింది.  శర్వా అందరిలో ఎంతో సులభంగా కలిసిపోతాడు. మేమైతే ఆ సినిమా పూర్తయ్యే సమయానికి చాలా క్లోజ్‌ అయిపోయాం. తను సీరియెస్‌ పాత్రలే కాకుండా, నవ్వించే తరహావీ చేయగలడని ఆ సినిమాలో చూపించాం.

అంతా చిత్తూరు...
గతేడాది ప్రారంభంలో నానీ గారికి ‘కృష్ణార్జునయుద్ధం’ కథని ఒక పది నిమిషాలు చెప్పాను. అది వినగానే చేద్దాం అన్నారు. దీనికంటే ముందు కూడా వేరే ఒక కథ లైన్‌ చెప్పాను. కానీ దానికంటే ఈ కథే ఆయనకు నచ్చింది. తర్వాత షైన్‌ స్క్రీన్స్‌ సంస్థ నిర్మాణానికి ముందుకు వచ్చింది. చిత్తూరు జిల్లాలోని కృష్ణనీ, స్విట్జర్లాండ్‌లోని అర్జున్‌నీ పోల్చి చూపే కథ ఇది. తెలుగు సినిమాల్లో చిత్తూరు యాసలో హీరో మాట్లాడిన సినిమాలు ఎక్కువగా రాలేదు. నానీచేత ఆ యాస ప్రాక్టీసు చేయించడం ఎలాగా అని ఆలోచిస్తుండగా... తను మొదటిరోజు లొకేషన్‌కి వచ్చాక సీన్‌ పేపర్‌ చూసి ‘నువ్వయితే ఎలా చేస్తావో చేసి చూపించు’ అన్నారు. నేను చూపించాక, నా యాసలోనే అద్భుతంగా చెప్పేశారు. షూటింగ్‌ మధ్యలో ఇంట్లోవాళ్లతోనూ అలాగే మాట్లాడేవారు. ఈ సినిమాకి సంగీతం ఆది(హిప్‌ హాప్‌ తమిళ). ర్యాప్‌, ఇండియన్‌ సంగీతాల్ని బాగా ఫ్యూజన్‌ చేస్తాడు ఆది. తన సంగీతంలో ఒక కొత్త సౌండ్‌ ఉంటుంది. ఈ సినిమాలో అర్జున్‌ రాక్‌స్టార్‌. అందుకే అతడిని ఎంచుకున్నాను. నా పెళ్లిరోజున కల్యాణ మండపం నుంచి ఇంటికి చేరుకున్నాను. కారు దిగి ఇంట్లోకి కూడా వెళ్లలేదు. అక్కడున్న ఒక వ్యక్తిని నాన్న పరిచయం చేశారు. ఆయనే
పెంచల్‌ దాస్‌. ఆయన పక్కన డప్పు పట్టుకుని మరొకతను ఉన్నాడు. దాస్‌ వృత్తిరీత్యా టీచర్‌. జానపద గేయాల్ని సేకరించడం ప్రవృత్తి. దాస్‌ పాటలు బాగా పాడతారని చెబితే,  పాడమని చెప్పాను.  అలసిపోయి ఉన్న మమ్మల్ని  ఓ గంట నిలిపేసింది ఆయన పాట. అప్పుడే అనుకున్నాను... ఆయనకి సినిమాల్లో అవకాశం ఇవ్వాలని. కృష్ణార్జునయుద్ధంలో చిత్తూరు నేపథ్యంలో ఉండే పాట కావాలి. వెంటనే దాస్‌గారికి ఫోన్‌ చేసి పిలిచాను. నేను సందర్భం చెబితే కొన్ని పాటలు చెప్పారు. ‘దారిచూడు...’ పాట నచ్చింది. ఈ పాటని గంటలోపే రాశారు. దాన్ని ఆయనచేతే పాడించాం. ఆ పాటకు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. సినిమా ఆర్ట్‌ డైరెక్టర్‌దీ చిత్తూరే. స్థానిక విషయాల్ని బాగా చూపుతారని ఆయన్ని ఎంచుకున్నాను. ‘కృష్ణార్జునయుద్ధం’ నా కెరీర్‌లో మరో హిట్‌ అవుతుందన్న నమ్మకం ఉంది.

వినోదం ఉండాల్సిందే!
నేను కథ, డైలాగులు రాసే ప్రాసెస్‌ని బాగా ఎంజాయ్‌ చేస్తాను. సమయం ఎక్కువ తీసుకున్నా బౌండెడ్‌ స్క్రిప్టుతోనే షూటింగ్‌కి వెళ్తాను. అన్నింట్లో క్లారిటీ ఉండటంవల్ల ఒకసారి సెట్‌్్సమీదకి వెళ్లాక షూటింగ్‌ని వేగంగాపూర్తిచేయొచ్చు. నా సినిమాల్లో ఊహాతీత పాత్రలకంటే వాస్తవానికి దగ్గరగా ఉండే పాత్రల్నే తీసుకుంటాను. ప్రేక్షకులు కథలో ఇన్‌వాల్వ్‌ కావడానికి అది సాయపడుతుంది. ‘కర్మరా దేవుడా’కి ముందు నాకు చాలా సీరియస్‌ కథల ఆలోచనలు ఉండేవి. కానీ ఆ షార్ట్‌ఫిల్మ్‌లో వినోదం బాగా పండింది. దాంతో అది నా బలమని అర్థమైంది. అప్పట్నుంచీ వినోదాన్ని ప్రధానంగా చూపిస్తూ వస్తున్నాను. భవిష్యత్తులో భిన్నమైన కథలతో వచ్చినా కామెడీ మాత్రం ఎప్పటికీ ఉంటుంది.

పేరు మారింది...  

అమ్మ విజయ, గృహిణి. నాలో స్టేజ్‌ ఫియర్‌ పోవడానికి కారణం అమ్మ. నాన్న పుస్తకాలు చదవమని చెబితే స్కూల్‌ రోజుల్లోనే అమ్మ నాటకాలు వేయమని ప్రోత్సహించేది. ఆ రెండూ ఇప్పుడు పనికొస్తున్నాయి.
* చిన్నపుడు నా పేరు చెగువేరా. నాన్న చెగువేరా అభిమాని. కానీ ఆ పేరు పలకలేక నా స్నేహితులూ, కుటుంబసభ్యులూ ఇబ్బందిపడేవారు. అందుకే స్కూల్లో వేసినపుడు నా పేరుని గాంధీగా మార్చారు.
* నా శ్రీమతి సుష్మ. ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకూ క్లాస్‌మేట్‌. నేను ఇంజినీరింగ్‌కి వెళ్లిపోయాక తను తిరుపతిలో డిగ్రీ చేసింది. 2014లో మాకు పెళ్లయింది. మాకో పాప లిపి.
* ప్రాజెక్టుల మధ్య ఖాళీ దొరికితే నవలలు చదువుకుంటాను, సినిమాలు చూస్తాను, కుటుంబంతో కలిసి పర్యటనలకి వెళ్తాను. చలం, బుచ్చిబాబు, తిలక్‌, శ్రీశ్రీ రచనలతోపాటు నాన్న రాసిన నవలల్నీ చదివాను. జంధ్యాలగారి సినిమాలంటే బాగా ఇష్టం. హాలీవుడ్‌ దర్శకుడు గయ్‌రిచీ తరహా చిత్రీకరణ నాకు స్ఫూర్తి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.