close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చెత్తకు చాలా సీనుంది!

చెత్తకు చాలా సీనుంది!

అమ్మ నేత చీర పాతదైపోతే పిల్లలు కప్పుకునే వెచ్చని దుప్పటవుతుంది. నాన్న పాత పంచె తుడుచుకునే తువ్వాలవుతుంది. పాత దుప్పటి కాళ్లు తుడుచుకునే పట్టా అవుతుంది. ధాన్యం బస్తాలు పేదలకు గొడుగులవుతాయి. అన్నం మిగిలిపోతే మర్నాడు నిమ్మకాయ పులిహోరో, పెరుగన్నమో అవుతుంది. తిండీ బట్టలనే కాదు, ఏ వస్తువునీ వృథాగా పారేయడమనేది మన పెద్దలకు తెలియదు. వస్తువు పునర్వినియోగమూ పూర్తి వినియోగమూ మన సంస్కృతిలోనే ఉంది.

సారి పేదరాశి పెద్దమ్మ ఇంటికి వేళకాని వేళ నలుగురు అతిథులొచ్చారు. అప్పటికప్పుడు వారికి వండిపెట్టడానికి ఇంట్లో కూరగాయలు ఏమీ లేవే అని చింతిస్తున్న ఆమెకు పెరట్లో ఏపుగా పెరిగిన పచ్చగడ్డి కన్పించింది. గబగబా కాస్త కోసింది. శుభ్రంగా కడిగి, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు వేసి పచ్చడి నూరింది. వేడివేడిగా అన్నం వండి అతిథులకు వడ్డించింది. పచ్చడన్నమే పెట్టినా అద్భుతంగా ఉందంటూ వారు కడుపునిండా తిని తేన్చుతూ వెళ్లిపోయారు.

ఆలోచన ఉండాలే కానీ ఈ సృష్టిలో ఏదీ పనికిరానిది కాదు. ప్రతి వస్తువూ నూటికి నూరుపాళ్లూ ఉపయోగపడుతుంది. ఒక రూపంలో వాడాక దాన్నే మరో రూపంలో మరో ప్రయోజనానికీ వాడొచ్చు. ఓ వందేళ్ల క్రితం వరకూ జనాభా పరిమితుల్లో ఉన్నంతవరకూ అలాగే జరిగేది. మెల్లగా జనాభాతోపాటూ అవసరాలూ పెరిగాయి. పారిశ్రామికీకరణ పెరిగింది. సాంకేతికత పెరిగింది. అవి అవసరానికి అర్థాన్ని మార్చేశాయి. ఫలితం... టన్నులకొద్దీ చెత్త. రకరకాల చెత్త. ఇళ్లల్లో, రోడ్ల మీదా, ఆఫీసుల్లో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోవడం మొదలెట్టింది. ఇంట్లో చెత్త తీసి బయటపడేయడం, దాన్ని తీసుకెళ్లి ఊరవతల పడేసి తగలబెట్టడంతో సమస్య తీరడం లేదు. కొత్త సమస్యలు వస్తున్నాయి. వాతావరణం కలుషితమై ప్రజారోగ్యం దెబ్బతింటోంది. అది భూమిలో కలిసిపోవడం వల్ల భూగర్భ జలాలతో సహా జలవనరులన్నీ కలుషితమవుతున్నాయి. అందుకే ‘వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌’- అంటే చెత్తను వదిలించుకోవడం కాదు, సరిగా ఉపయోగించుకోవడం నేటి అవసరం.

కోట్ల రూపాయల చెత్త!
పనికిరానివాటిని చెత్తతో పోల్చడం మనకు అలవాటు. కానీ చెత్త మొత్తంగా పనికి రానిది కానేకాదు! మన దేశంలో రోజుకు లక్షన్నర టన్నుల చెత్త తయారవుతోంది. 2025కల్లా ఇది రోజుకు 3,77,000 టన్నులకు చేరుతుందని ప్రపంచబ్యాంకు అంచనా. దాని విలువ లక్ష కోట్ల రూపాయలు ఉండొచ్చట. కానీ అవగాహనా లోపం వల్ల కేవలం నగరాల్లోనే రోజుకు ముప్పై లక్షల ట్రక్కుల చెత్త దేనికీ ఉపయోగపడకుండా వృథా అవుతోంది. రోడ్డు మీద ఒక్క చెత్త బండి వెళ్తుంటేనే పక్కనుంచి వెళ్లడానికి ఇబ్బంది పడతాం. అలాంటిది అన్ని లక్షల లారీల చెత్తని ఒక్కచోట కుప్పగా పడేస్తే ఎంత కాలుష్యాన్ని సృష్టిస్తుందో ఊహించండి. ప్రపంచమంతా ఎదుర్కొంటున్న వాతావరణ మార్పుల సమస్యకు ఇదీ ఓ ప్రధాన కారణమే. ఇళ్లల్లో పనికిరానివన్నీ చెత్తబుట్టలో పడేస్తాం.

కూరగాయల తొక్కులూ, మిగిలిపోయిన వంటలూ, పాలపాకెట్లూ, పిల్లలు చించేసిన కాగితాలూ, వాడి పారేసిన పెన్నులూ పెన్సిళ్లూ, పగిలిన పింగాణీ కప్పులూ, వాడేసిన బ్లేడ్లూ, షాంపూ బాటిళ్లూ, టూత్‌పేస్టు ట్యూబులూ, మొండిబారిన కత్తెరా... అన్నీ మనం ఒక్క చెత్తబుట్టలోనే వేస్తాం. దాన్ని పనిమనిషి తీసుకెళ్లి చెత్తకుండీలో పడేసి వస్తుంది. ఈ ఒక్క అలవాటు వల్ల మనదేశం రీసైక్లింగ్‌ ప్రయోజనాల్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోతోంది. చెత్త ప్రయాణం మొదలయ్యేచోటే రకరకాల చెత్తని వేర్వేరుగా విడదీయాలి. మన దగ్గర ఇంకా తడి, పొడి అన్న రెండు రకాల చెత్తనే విడదీయడం సాధ్యంకావడం లేదు కానీ విదేశాల్లో అయితే లోహాలు, గాజు, ప్లాస్టిక్‌, కాగితాలు, వంటింటి పదార్థాలు... ఇలా ఐదు రకాల చెత్తను విడివిడిగా డబ్బాల్లో వేస్తారు. అప్పుడు వాటిని నేరుగా రీసైక్లింగ్‌కి తీసుకెళ్లడం సాధ్యమవుతుంది. చెత్త ఉత్పత్తి అయ్యే దగ్గరే వేరుచేయకపోవడం వల్ల మన దగ్గర రీసైక్లింగ్‌కి వీలు కావడం లేదు. విడదీసి రీసైక్లింగ్‌కి వెళ్లిన చెత్తను మినహాయిస్తే మిగిలినదంతా ఇప్పటికీ ఊరిచివరి డంపింగ్‌యార్డులకే చేరుతోంది. కొంతకాలం క్రితం వరకూ ఈ డంపింగ్‌యార్డుల్లో చెత్తను తగలబెట్టడమే తెలుసు మనకు. ఇప్పుడు ఆ చెత్తనుంచీ విద్యుదుత్పత్తి చేయడం ప్రారంభించారు. దిల్లీ పరిసరాల్లో రోజూ రెండు వేల మెట్రిక్‌ టన్నుల చెత్తను ఉపయోగించి 24 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడం గత ఏడాదే ప్రారంభమైంది.

పాంచ్‌ పటాకా
చెత్త విషయంలో ఈ ఐదూ తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
1. మన డబ్బు మనిష్టం అన్నది నిజమే కానీ కొనే ప్రతి వస్తువూ మనం నివసించే భూమి మీదా, చుట్టూ ఉన్న పర్యావరణం మీదా ప్రభావం చూపుతుంది. డబ్బుంది కదా అని మోజుగా బోలెడన్ని వస్తువులు కొని పారేస్తే కొన్నాళ్లకి వాటిని వ్యర్థాలుగానూ పడేయక తప్పదు. అందుకని- మనకు అవసరం లేనివి కొనకుండా వందరూపాయలు మిగిలిస్తే అది మనకే కాదు, భూమికీ లాభమే. కొన్ని కిలోల కలుషిత వాయువుల్ని తగ్గించినవాళ్లమవుతామన్నమాట.
2. ‘ఇంపల్స్‌ షాపింగ్‌’ అంటారే, అంటే ఏదైనా కొనాలనిపించగానే కొనేయడం... అది ఎంతమాత్రం మంచిది కాదు. ఎక్కువగా ఉపయోగపడే వస్తువులనే కొనాలి. కొన్న వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. అప్పుడే భూమి మీద వ్యర్థాలు తగ్గుతాయి.
3. ఒక్కసారి వాడి పారేసే డిస్పోజబుల్‌ వస్తువుల వాడకం తగ్గించి మళ్లీ మళ్లీ వాడుకునే వస్తువుల్నే కొనుక్కోవాలి. ఒక్కసారే వాడి పారేసే వస్తువులు చెత్తను పెంచుతాయి, హానికారక వాయువుల తయారీకి కారణమవుతాయి.
4. ఏ వస్తువైనా పనికిరాదని పారేసేముందు దాన్ని మరెలాగైనా ఉపయోగించవచ్చా అని ఆలోచించాలి.
5. ఇక ఎందుకూ పనికిరాదనుకున్నప్పుడు దాన్ని రీసైక్లింగ్‌కి ఇవ్వాలి. లోహం, గాజు, ప్లాస్టిక్‌, కాగితం, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, కలప, దుస్తులు... వేటినైనా రీసైక్లింగ్‌ చేయవచ్చు.

కరెన్సీ నోట్లూ కంప్యూటర్‌ కీబోర్డూ..!
అవును, రద్దయిన పెద్దనోట్లతో సహా కాదేదీ రీసైక్లింగ్‌కి అనర్హం. మనం బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన ఆ నోట్లన్నీ రిజర్వ్‌ బ్యాంకుకి చేరాయి. అక్కడినుంచి వాటిని ప్లైవుడ్‌ కంపెనీకి అమ్మగా వారు ఆ నోట్లను కాగితపు గుజ్జుగా మార్చి హార్డ్‌వుడ్‌ బోర్డుల తయారీలో వాడారు. పెద్ద పెద్ద గుడుల్లో దేవుడికి వాడిన పూలన్నీ ఏమవుతాయో తెలుసా? కొన్నేళ్ల క్రితం వరకూ అవి వృథాగా చెత్తలో కలిసిపోయేవి. గుడులు నదుల పక్కనుంటే నదుల్లో కలిసి నీటిని కలుషితం చేసేవి. ఇప్పుడు ఆ పూలను సేకరించి కొందరు ఎరువు తయారుచేస్తోంటే మరికొందరు అగరుబత్తీల తయారీలో, పరిమళ ద్రవ్యాలూ, సబ్బుల తయారీల్లో వాడుతున్నారు. ఇవే కాదు, ఎన్ని రకాల చెత్తయినా సరే. ఇళ్లల్లో నుంచి సేకరించే దాన్ని తడి చెత్త, పొడి చెత్త అని విడదీస్తారు. ఇవి కాకుండా ప్లాస్టిక్‌ వస్తువులూ, ఎలక్ట్రానిక్‌ పరికరాల్లాంటివి ఉంటాయి. ఇళ్లలో రోజూ తయారయ్యే తడి చెత్తతో మొక్కలకు ఎరువు తయారుచేసుకోవచ్చు. బయోగ్యాస్‌ తయారుచేయవచ్చు. ఈ పనులు వ్యక్తిగతంగానూ పదిమంది కలిసీ చేసుకోవచ్చు. కాలనీల్లో, పల్లెల్లో సమష్టిగా చేస్తే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి. పాత వార్తాపత్రికలనూ, పిల్లలు వాడేసిన పుస్తకాలనూ చెత్తలో పడేయకుండా విడిగా అమ్మితే వాటిని రీసైకిల్‌ చేసి పెన్సిళ్లూ, కేలండర్లూ, పెన్‌స్టాండ్లూ లాంటి ఆఫీసుల్లో వాడే పలు రకాల వస్తువులు తయారుచేస్తారు. ఇక ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగం ఎంతగా పెరుగుతోందో అంత సృజనాత్మకంగానూ వాటి పునర్వినియోగం జరుగుతోంది. పాత సీసాలనే పూలకుండీలుగా చేసి మొక్కలు పెంచుతున్నారు. భవనాలు సైతం కడుతున్నారు. పాత దుస్తులు షాపింగ్‌ బ్యాగులుగా మారుతున్నాయి. పేదల బొంతలుగా, కాళ్లు తుడుచుకునే పట్టాలుగా... రకరకాల రూపాలు దాల్చుతున్నాయి. పాడైన లోహసామగ్రిని సైతం అందమైన కళాఖండాలుగా మార్చి పార్కుల్లో పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. స్కూటరు టైరు పాడైతే పిల్లలు ఆడుకుంటారు. ఆ తర్వాత అవతల పారేస్తారు. ఆందోళనకారులు వాటిని తగలబెట్టి ఆవేశం తీర్చుకుంటారు. కానీ టైర్లను రీసైకిల్‌ చేసి పర్సుల దగ్గర్నుంచీ ఫర్నిచర్‌వరకూ, పూలకుండీలనుంచి పార్కుల్లో పిల్లలు ఆడుకునే సాధనాల వరకూ ఎన్నో రకాల వస్తువుల్ని తయారుచేస్తున్నారు. మనదేశంలో ఏటా దాదాపు పదికోట్ల టైర్లను రీసైక్లింగ్‌ చెయ్యాల్సిన అవసరం ఉంది. కానీ అందులో 5 శాతం కూడా చెయ్యలేకపోతున్నాం. అంటే 95 శాతం టైర్లు చెత్తకుప్పల్లో చేరి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఆ పరిస్థితిని తప్పించాలనుకునేవాళ్లు పాత టైర్ల గురించి సమాచారం tyrelessy.com వెబ్‌సైట్‌లో నమోదు చేస్తే వాళ్లే వచ్చి తీసుకెళ్తారు. వాటిని గ్రేడింగ్‌ చేసి సరైన రీతిలో రీసైక్లింగ్‌ చేయిస్తారు.

కొనుక్కెళ్తారు!
టీవీ, ఫ్రిజ్‌, కూలర్‌, ఏసీ, కంప్యూటర్‌, ప్రింటర్‌, ఇక మొబైల్‌ ఫోన్లకైతే లెక్కే ఉండదు. ఈ వస్తువులన్నీ కొన్నేళ్లు వాడేసరికి పాతబడి పనిచేయడం మానేస్తాయి. వాటి స్థానంలో కొత్తవి కొంటాం కానీ పాతవి ఏం చేయాలో తెలియదు. అటకమీదో మరో చోటో పడేసి ఉంచుతారు చాలామంది. వాటిపై దుమ్మూధూళీ చేరి లేని సమస్యలు తెచ్చిపెడతాయి. చెత్తలో పడేస్తే పలు ప్రమాదాలకు కారణమవుతాయి. ఎలక్ట్రానిక్‌ పరికరాల చెత్త చాలా వేగంగా పెరుగుతోందనీ, అందులో ఐదు శాతం కూడా రీసైక్లింగ్‌ కావడంలేదనీ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు నిపుణులు. పాడైపోయినవాటిని సరైన చోట చేర్చక వృథాగా పడేయడమే అందుకు కారణం. అలాంటివాటిని తగిన ధర ఇచ్చి మరీ తీసుకెళ్తాం అంటున్నాయి కొన్ని సంస్థలు. ఫోన్‌ ద్వారా కానీ, వెబ్‌సైట్‌ ద్వారా కానీ వారికి  తెలియజేస్తే వాళ్లే వచ్చి ఇంటి దగ్గరే డబ్బు చెల్లించి సామాను తీసుకెళ్తారు. wasteventures.com, igotgarbage లాంటి వెబ్‌సైట్లు దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ ఈ సేవలందిస్తున్నాయి. ఇళ్లే కాదు, కార్యాలయాలు కూడా తమ దగ్గరున్న ఎలక్ట్రానిక్‌ వేస్ట్‌ని వీరికి అమ్మవచ్చు. ఆ పరికరాలను వాళ్లేం చేస్తారంటే- కాలుష్య నియంత్రణ మండలి అనుమతి పొందిన రీసైక్లింగ్‌ సంస్థలకు అమ్ముతారు. దీనివల్ల మనకు పనికిరాని వస్తువులు కూడా ప్రజలకూ పర్యావరణానికీ ఎలాంటి హానీ చేయకుండా ఎంతో కొంత ప్రయోజనాన్నే కలిగిస్తాయి. వస్తువుల పునర్వినియోగం, రీసైక్లింగ్‌లకు సంబంధించి భవిష్యత్తులో కొత్త స్టార్టప్‌లకూ ఉద్యోగాలకూ ఎన్నో అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు.

అటు సేవ... ఇటు ఉపాధి!
‘మీ దగ్గర వృథాగా పడివున్న వస్తువులను మాకు విరాళంగా ఇవ్వండి. ప్రతిగా ఓ పేద విద్యార్థిని చదివించినవారవుతారు...’ అంటూ ప్రచారం చేస్తోంది ముంబయిలోని ఓ పాఠశాల. ఈ ప్రభుత్వ పాఠశాల పేద విద్యార్థుల చదువుకు అవసరమైన నిధులు సేకరించడానికి ఇటీవలే ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. మొబైల్‌ నుంచి టీవీ వరకూ ఏవైనా సరే, చెడిపోయి ఇళ్లల్లో వృథాగా పడివున్న ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఇంటింటికీ తిరిగి సేకరిస్తారు. వాటిని రీసైక్లింగ్‌ చేసే కంపెనీలకు అమ్మి వచ్చిన సొమ్మును పేద విద్యార్థుల చదువుకు వినియోగిస్తారు. పైగా వృథాగా పారవేసే ఓ వస్తువుకి పేదవిద్యార్థిని చదివించే విలువ ఉందని చెప్పి ఇంటికొచ్చి మరీ తీసుకోవడంతో ప్రజలు  సానుకూలంగా స్పందించారు. దాంతో నగరాన్ని ఈ-వేస్ట్‌ రహిత ప్రాంతంగా మార్చే పనితో పాటు పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సాయమూ అందుతోంది.
* కోయంబత్తూరుకు చెందిన స్టార్టప్‌ ఒకటి పాఠశాలలనుంచి పాత వార్తాపత్రికలను తీసుకుంటుంది. వాటిని రీసైకిల్‌చేసి తయారుచేసిన పెన్సిళ్లను పాఠశాల విద్యార్థులకు
అందిస్తుంది. హైదరాబాద్‌లోనూ ఇలాంటి పరిశ్రమ ఒకటి ఇటీవలే ప్రారంభించారు.
* ‘కన్జర్వ్‌ ఇండియా’ అనే సంస్థ చెత్తను ఏరేవాళ్ల దగ్గర్నుంచీ దాన్ని సేకరించి రీసైకిల్‌ చేసి రకరకాల ఉత్పత్తులను తయారుచేసి విక్రయిస్తోంది. ఆ విధంగా అటు చెత్త ఏరేవారి ఉపాధికి తోడ్పడుతూ సంపాదించిన లాభాలనూ వారి సంక్షేమానికే వినియోగిస్తోంది. ఇటు చెత్త నిర్వహణలోనూ తన వంతు బాధ్యతను నిర్వహిస్తోంది.
* సిగరెట్‌ కాల్చి పారేయడమే తప్ప దాని పరిణామాల గురించి అంతగా ఆలోచించరెవరూ. పర్యావరణానికి ఎంతో హాని చేసే ఆ సిగరెట్‌ పీకలను నోయిడాలోని కోడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అనే సంస్థ కిలోకు రూ.250 ఇచ్చి మరీ తీసుకుంటుంది. ఆఫీసుల్లో వాటిని సేకరించేందుకు స్వయంగా ప్రత్యేకంగా తయారుచేసిన డస్ట్‌బిన్‌లను ఏర్పాటుచేస్తుంది. వాటిని రీసైకిల్‌ చేసి మొక్కలకు సేంద్రియ ఎరువుని తయారుచేస్తుంది. మిగిలిన పాలిమర్‌ మెటీరియల్‌తో కీచైన్లు, చిన్న చిన్న బొమ్మలు, కుషన్లు లాంటివి తయారుచేస్తుంది.
ఇలాంటి సంస్థలు మనదేశంలో ఇంకా ఎన్నో ఉన్నాయి. వ్యర్థానికి అర్థం చెప్పడంలో తమవంతు కృషిచేస్తున్నాయి.

* *  *

  ఓ ఆశ్రమంలో విద్యాభ్యాసం చేస్తున్న శిష్యుడి అంగవస్త్రం బాగా పాతదై చిరుగులు పట్టింది. గురువు రాగానే ఆ విషయం చెప్పి తనకో కొత్త అంగవస్త్రం ఇప్పించమని కోరాడు. ‘పాతదాన్ని ఏం చేస్తావు’? అడిగాడు గురువు.
‘తువ్వాలుగా వాడుకుంటాను.’
‘వాడుతున్న తువ్వాలుని..?’ ‘వంటగదిలో పాత్రలు పట్టుకోవడానికి వాడతాను.’
‘ఇప్పుడు అక్కడ వాడుతున్నదాన్ని ఏం చేస్తావు?’
‘అది పీలికలైపోయింది. దారం పోగులుగా తీసి దీపంలోకి వత్తులుగా చేసుకుంటాను.’
చిరునవ్వుతో తలూపిన గురువు శిష్యుడికి కొత్త అంగవస్త్రం ఇప్పించాడు.

'చెత్త 'కబుర్లు

మనదేశంలో రోజుకు 1,50,000 టన్నుల చెత్త తయారవుతోంది. ఎక్కువ చెత్త ఉత్పత్తి చేస్తూ ముంబయి దేశంలో మొదటి స్థానాన్నీ ప్రపంచంలో ఐదో స్థానాన్నీ ఆక్రమిస్తోంది. తయారవుతున్న చెత్తలో 83 శాతాన్ని మాత్రమే సేకరిస్తుండగా అందులో 30 శాతాన్ని విడదీసి పునర్వినియోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

దేశంలో రోజుకు 15,342 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు తయారవుతున్నాయి. అందులో రీసైకిల్‌ అవుతున్నది 60 శాతమే. మిగతా 6,100 టన్నుల ప్లాస్టిక్‌ వృథాగా ఉండిపోతూ భూమినీ జలవనరులనూ కలుషితం చేస్తోంది. ఇందులో కొన్ని రకాల ప్లాస్టిక్‌ అసలెప్పటికీ భూమిలో కలవనిదైతే కొన్ని రకాల ప్లాస్టిక్‌ మట్టిలో కలవడానికి 450 సంవత్సరాలు పడుతుంది.
అసోచామ్‌ అంచనా ప్రకారం 2018లో మన దేశంలో 130 మిలియన్‌ టన్నుల ఎలక్ట్రానిక్‌ వేస్ట్‌ తయారవుతుంది. 2016లో ఇది 93.5 మిలియన్‌ టన్నులే. 2020కల్లా ఇది 260 మిలియన్‌ టన్నులకు చేరుతుందని అంచనా.
2025కల్లా దేశంలో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ మార్కెట్‌ విలువ ఎంతుంటుందో తెలుసా... 91 వేల కోట్ల రూపాయలు! ఇది ఏటా 7శాతం చొప్పున పెరుగుతోంది. పట్టణాల్లో సేకరించే చెత్త అయితే వచ్చే పదేళ్లలో రెట్టింపు అవుతుందనీ, దీని విలువే లక్షకోట్ల రూపాయలు ఉంటుందనీ అంచనా. మనిషి ఆదాయం పెరిగే కొద్దీ చెత్త పెరుగుతోందట.
రోడ్లనిర్మాణంలో ప్లాస్టిక్‌ వాడకాన్ని తప్పనిసరి చేస్తూ భారత ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఆదేశాలు జారీ చేసింది. కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఇలా ఉపయోగించడం వల్ల చెత్త సమస్యా తీరుతుంది. రోడ్ల నాణ్యతా పెరుగుతుంది.
ఒక టెట్రాప్యాక్‌ కార్టన్‌ తయారీలో 75శాతం కాగితం, 20శాతం ప్లాస్టిక్‌, 5 శాతం అల్యూమినియం వాడతారు. వాటిని రీసైకిల్‌ చేసి స్కూల్‌ డెస్కులు, పార్కుల్లో బెంచీలు తయారుచేస్తున్నారు.
దక్షిణ కొరియా 2011లోనే డంపింగ్‌ యార్డును ఉపయోగించి విద్యుత్తు తయారుచేసే విధానానికి శ్రీకారం చుట్టింది. అక్కడ వాడుతున్న పునర్‌ వినియోగ ఇంధనంలో 60 శాతం ఇలా తయారయిందేనట.
మనదేశంలో తయారవుతున్న చెత్తనుంచి 1700 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే అవకాశం ఉండగా ఇప్పటికి 24 మెగావాట్లు మాత్రమే తయారుచేస్తున్నాం. రీసైక్లింగ్‌ ప్రాధాన్యాన్ని చాటిచెబుతూ 15 లక్షల ప్లాస్టిక్‌ సీసాలతో తైవాన్‌లో ఈకోఆర్క్‌ అనే పెద్ద భవనాన్ని కట్టారు. పర్యావరణానికి ఎలాంటి హానీ చేయని, అత్యంత తేలికైన, ఎక్కడికైనా తీసుకెళ్లగల అతి పెద్ద భవనం ఇది.
థాయ్‌లాండ్‌లో సీసాలతో ఏకంగా ఓ దేవాలయాన్నే నిర్మించారు. ‘ద టెంపుల్‌ ఆఫ్‌ మిలియన్‌ బాటిల్స్‌’ అంటారు దీన్ని.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.