close
అమ్మ కావాలి

అమ్మ కావాలి
- కామేశ్వరీ దేవి

ర్ధరాత్రి ఒంటిగంటకు ఫోన్‌ రింగ్‌ అయింది. నిద్రకళ్ళతో ఫోన్‌ తీసి చూసేసరికి ఇండియా నుండి నాన్న. ఫోన్‌ లిఫ్ట్‌ చేసి ‘‘హలో నాన్నా’’ అన్న మాట పూర్తికాకుండానే భోరున ఏడుస్తూ ‘‘మీ అమ్మ నన్ను వదిలేసి దేవుడి దగ్గరకు వెళ్ళిపోయిందిరా’’ అన్న నాన్న మాటలు వినేసరికి గుండె ఆగినంత పనైంది.
‘‘అమ్మ చనిపోయిందా...’’ అయోమయంగా చుట్టూ చూస్తూ ఆ ఒక్క మాట అనగలిగాను. ఆ మాట విని, నిద్దట్లో ఉన్న వసుంధర ఒక్క ఉదుటున లేచి నా చేతిలో ఫోన్‌ తీసుకుని ‘‘మావయ్యగారూ, ఏం జరిగింది అత్తయ్యగారికి?’’ అని, అట్నుంచి నాన్నేదో చెప్తుంటే విని ‘‘మేము వెంటనే బయలుదేరి వస్తాం’’ అని చెప్పి ఫోన్‌ పెట్టేసి నా పక్కన కూర్చుని ఓదార్చడానికి చాలాసేపు ప్రయత్నించింది.
అమెరికాలోనే ఉంటున్న మా తమ్ముడికి వసుంధర ఫోన్‌ చేసి విషయం చెప్పగానే ఉదయం 5 గంటలకల్లా ఫ్లైట్‌ టిక్కెట్లతో సహా వచ్చి, వాడే ఏదో పెద్దాడిలా నన్ను ఓదార్చి, తర్వాత జరగాల్సిన కార్యక్రమాల గురించి అందరికీ ఫోన్లు చేసి మాట్లాడుతున్నాడు. అమ్మకి షుగర్‌ కానీ బీపీ కానీ ఏమీ లేవు. అమ్మా నాన్నా పోయినవారమే ఫుల్‌ బాడీ చెకప్‌ చేయించుకున్నారు. ఏ అనారోగ్యంలేదని డాక్టర్లు చెప్పారని కూడా అమ్మ చెప్పింది.
మొన్న ‘స్కైప్‌’లో మాట్లాడినప్పుడు ‘జీవితం ప్రశాంతంగా సాగితే వృద్ధాప్యం కూడా బాల్యంలాగే చాలా ఆనందంగా ఉంటుందిరా’ అంది. అమ్మకు ఇంకా చాలా చేయాలనుకున్నాను. నాకా అదృష్టం భగవంతుడివ్వలేదు. అమ్మకు సంబంధించిన ఆలోచనలన్నీ నా చుట్టూరా తిరుగుతున్నాయి. ఇంకేదీ పట్టించుకోకుండా ఆ ఆలోచనల్లోనే ఉండిపోయాను. 48 గంటల్లో ఇండియా చేరుకున్నాం. అప్పటికే పంతులుగారితో సహా అందరూ సిద్ధంగా ఉన్నారు.
మాదే ఆలస్యం. మేము వెళ్ళిన గంటకి అమ్మ అంతిమ ప్రయాణం మొదలైంది. ఇంటికి పెద్దకొడుగ్గా పంతులుగారు చెప్పిన కార్యక్రమాలన్నీ చేస్తున్నాను. నేను వెక్కెక్కి ఏడుస్తుంటే ‘‘ఏడవకండి, బాధ ఉంటుంది. కానీ శ్రాద్ధకర్మలు శ్రద్ధగా చేస్తేనే ఆమె స్వర్గానికి వెళ్తారు’’ అని పంతులుగారు పదేపదే చెప్పేసరికి బాధను పంటి బిగువున దాచుకుని ప్రతీ కార్యక్రమాన్నీ శ్రద్ధగా చేస్తూ అప్పుడప్పుడూ అమ్మ కళ్ళ వైపు చూస్తున్నాను. ‘ఏ క్షణంలోనైనా అద్భుతం
జరక్కపోతుందా! ఎక్కడో విన్నట్టు పడుకున్న అమ్మ కళ్ళు తెరవకపోతుందా!’ అన్న పిచ్చి ఆలోచనతో. అమ్మ పూర్తిగా దహనమైపోయాక నిర్ధారించుకున్నాను- ‘అమ్మ ఇంకెప్పుడూ రాదు, చూడాలనుకుంటే నేనే వెళ్ళాలి’ అని.
ఆ 11 రోజులూ పరామర్శించడానికి వచ్చిన వాళ్ళందరూ అమెరికాలో ఉంటున్న మమ్మల్ని తప్పు పట్టలేదు కానీ, ‘‘ఇప్పట్నుంచీ కష్టమంతా మీ నాన్నగారిదే. ఈ సమయంలో ఒంటరిగా ఉండటం చాలా కష్టం. సంవత్సరీకాలు అయ్యేవరకూ జాగ్రత్తగా చూసుకోండి. బెంగపడిపోతారు... బెంగకి మందులేదు’’ అని చెప్పి సంప్రదాయం ప్రకారం వెనక్కి చూడకుండా వెళ్ళిపోయారు. తమ్ముడికి సెలవు దొరక్కపోవడం వల్ల 5వ రోజే వెళ్ళిపోవాల్సి వచ్చింది. 11 రోజులయ్యాక నాన్నని నాతోపాటు అమెరికా వచ్చెయ్యమన్నాను.
‘‘నాకు మిగిలినవి ఈ జ్ఞాపకాలే. ఈ ఇంటిని వదిలి నేనెక్కడికీ రాను. మీరు వెళ్ళండి, నాకేం ఫర్వాలేదు’’ అంటూ ఎప్పుడూ చెప్పనంత నిర్మొహమాటంగా తన మనోగతాన్ని వెల్లడించారు. మేమక్కడ్నుంచీ రాలేక, ఈయన్ని ఇక్కడ వదిలేయడం తప్ప వేరే మార్గంలేక పనిమనిషి భర్తకి పదివేలిచ్చి రోజూ రాత్రిళ్ళు వచ్చి నాన్నకు సాయం పడుకోమని చెప్పాను. అప్పుడప్పుడూ నాన్నకి ఫోన్‌ చేయమని చుట్టాలకి చెప్పాను. నాన్న దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలో తెలియక కాళ్ళకు దండం పెట్టి ఆశీర్వచనాలు తీసుకుని ‘‘ఆరోగ్యం జాగ్రత్త నాన్నా, టైమ్‌కి తినండి. ఏమైనా అవసరమైతే పనిమనిషి వాళ్ళాయనకు చె..ప్పి... తెప్పించుకోండి.’’ ఆ మాట చెప్పిన తర్వాత నా మనసు నన్ను చాలాసేపు అసహ్యించుకుంది. కొనసాగింపుగా ‘‘నేను రోజూ స్కైప్‌లో మాట్లాడుతూంటాను’’ అన్నాను.
నాన్న ఏ మాటకూ బదులు చెప్పకుండా ‘‘నువ్వు జాగ్రత్త’’ అన్నారు.

*       *       *

అప్పుడే అమ్మ చనిపోయి సంవత్సరం అయిపోయింది. ఆ ఇంటి వాతావరణం, నాన్న తీరూ అంతా మారిపోయింది. నాన్న చూడ్డానికి బాగానే ఉన్నారు కానీ ఆయన మాటల్లో, ప్రవర్తనలో బెంగ స్పష్టంగా కనిపిస్తోంది.
‘‘ఆయనకు ఈ సంవత్సరం ఎలా గడుస్తుందో అనుకున్నాం. చాలా బెంగపడిపోయారు. మీ అమ్మగారిని తలచుకుని ఏడవని రోజంటూ లేదు. ఆ విషయం మీతో చెప్పొద్దని మరీమరీ చెప్పారు’’ అని చుట్టుపక్కలవాళ్ళు చెప్తుంటే, ‘మాలాంటి కొడుకులు ఉన్నా ఏం ప్రయోజనం?’ అనిపించింది. ‘ఏదో కష్టపడి ఇంకో ఏడాదికి అమెరికాలో ప్రాజెక్టు పూర్తిచేసుకుని ఇండియా అంటే రాగలం కానీ ఊళ్ళో నాన్న దగ్గర ఉండలేం. అప్పుడప్పుడూ వచ్చినా నాన్న బెంగను పోగొట్టలేం’ అని అర్థమైపోయింది. ఆయన బాధను నెమ్మదిగా దూరం చేసి ఆయన్ని మామూలు మనిషిని చేయాలంటే ఏం చేయాలో ఎంత ఆలోచించినా అర్థంకావట్లేదు. కానీ ఆలోచన మాత్రం కొనసాగుతోంది.
మర్నాడు నాన్న పడుకున్నాక నా కుటుంబాన్నీ, తమ్ముడి కుటుంబాన్నీ సమావేశపరిచాను. ‘‘పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం లేదని ఎవరైనా అంటే ‘ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. వయసులో ఉన్నప్పుడు ఏదోలా బతికేస్తాం. చెయ్యీ కాలూ ఆడనప్పుడు నీ వెనకాల ఇప్పుడున్నవాళ్ళు ఎవరూ ఉండరు. అప్పుడు భర్తకి భార్యా, భార్యకి భర్తా తోడు ఉంటారు. ఊరికినే పెట్టలేదు పెద్దవాళ్ళు ఈ పద్ధతులన్నీ’ అని నాన్న చెప్పేవారు’’ అని మొదలుపెట్టేసరికి అందరూ ఏమీ అర్థంకానట్టు నావైపు చూశారు. అర్థమయ్యేట్టు చెబుతాను అన్నట్లుగా వాళ్ళవైపు చూసి ‘‘నాన్నకు సరిగ్గా ఒక తోడు కావాల్సిన సమయం వచ్చేసరికి అమ్మ చనిపోయింది. మనందరం ఇంకో పది రోజుల్లో వెళ్ళిపోతాం. ఉండే పరిస్థితి మనిద్దరిలో ఎవరికీ లేదు. వారానికోసారి ‘స్కైప్‌’లో పలకరించి మన బాధ్యత తీర్చుకుంటాం. కానీ ఆయనకు అది సరిపోతుందా!?’’ అని ప్రశ్నించేలోగా తమ్ముడు ‘‘మనం చాలామందికంటే చాలా బాగా చూసుకుంటున్నాం, బాధ్యతగా ఉంటున్నాం కదా’’ అని ఇంకా ఏదో చెప్పబోతుంటే ‘‘అదే మన దౌర్భాగ్యం. మనం పోల్చుకోవాల్సింది తండ్రి కోసం అడవులకెళ్ళిన రాముడితోటి. పెళ్ళి అవగానే భోగభాగ్యాలూ పట్టాభిషేక మహోత్సవం, మంచి కెరీర్‌ తృణప్రాయంగా వదిలి క్షణాల్లో అడవులకు వెళ్ళిపోయాడు. నాన్న కోసం కనీసం అమెరికాలో ఉద్యోగాలు మానేసి ఊరికి దగ్గర్లో ఏ ఉద్యోగాలు దొరికితే ఆ ఉద్యోగాలు చేసుకుంటూ బతకగలమా? మనం బాధ్యతగా ఉంటున్నామా? బాధ్యత అంటే చనిపోయే వరకూ వాళ్ళని కాపలా కాయడం కాదురా... వాళ్ళ మనోగతాలను పంచుకోవడం. వాళ్ళ భావాలకు విలువ ఇవ్వడం. మనం నిజంగా అలా చేస్తున్నామో లేదో తెలుసుకోవాలంటే- వాళ్ళతో ఓ గంట మాట్లాడి చూడాలి. వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనకు బోర్‌ కొట్టినట్టు అనిపిస్తే మనం వాళ్ళని బాగా చూసుకోనట్టే.’’
‘‘ఆ వయసులో అందరూ అలాగే కాలక్షేపం చేస్తారు అన్నయ్యా’’ అని నన్ను సముదాయించే ప్రయత్నం చేశాడు తమ్ముడు.
‘‘అని మనం అనుకుంటున్నాం. నాన్న చాలా బోర్‌ ఫీల్‌ అవుతున్నారు. మనకంటే ఆయన బాగా మాట్లాడగలరు. మనకంటే చక్కగా ఏ విషయాన్నైనా విశ్లేషించగలరు. చాలా సమస్యలకు పరిష్కారమార్గం చూపగలరు. అలాంటి వ్యక్తి ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఒంటరిగా ఉండటం అంటే ఎంత నరకమో తెలుసా? అలా ఒంటరి జీవితాన్ని ఈదలేక ప్రముఖ నటులు రంగనాథ్‌ వంటి వాళ్ళు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు.’’
‘‘నువ్వు చెప్పింది నిజమే అన్నయ్యా కానీ మనకి వేరేమార్గం లేదు కదా?’’
‘‘ఉంది. చనిపోయిన అమ్మని ఎలాగూ తీసుకురాలేం, కనీసం నాన్నకి ఓ తోడు తీసుకొద్దాం.’’
‘‘అంటే?’’
‘‘అమ్మ స్థానాన్ని ఇంకో అమ్మతో భర్తీచేద్దాం.’’

 

‘‘ఏం మాట్లాడుతున్నావ్‌ అన్నయ్యా! అమ్మ స్థానంలో ఇంకొకర్ని తీసుకొస్తావా?’’

‘‘ఏం మాట్లాడుతున్నావ్‌ అన్నయ్యా! ఏదో బాధలో ఉన్నావ్‌ కదా అని ఊరుకుంటే ఏదేదో మాట్లాడుతున్నావే. మాకు లేదా బాధ? అమ్మ స్థానంలో ఇంకొకర్ని తీసుకొస్తావా?’’ ఊహించినట్లుగానే స్పందించాడు తమ్ముడు.
వాడు చెప్పిందంతా విని వాడు కూడా ఆలోచించుకోవడానికి సమయమన్నట్లు కొంతసేపు మౌనం వహించి, ‘‘అమ్మ స్థానంలో ఇంకొకర్ని తేవడం తప్పు పనేమీ కాదు. ఈ వయసులో మనం మళ్ళీ పెళ్ళి చేసుకోవాల్సి వస్తే ‘పిల్లలకు తోడు కోసం’ అని సమర్థించుకుని చేసేసుకుంటాం. ఒప్పుకోకపోతే మన తల్లిదండ్రులే ఒప్పించి మరీ పెళ్ళి చేసేస్తారు. నాన్న భావాలను పంచుకోవడానికి ఒక నమ్మకమైన తోడు కావాలి. ఆ తోడు మనం కాలేకపోయాం. కనీసం ఆ తోడు తెచ్చే బాధ్యతైనా తీసుకుందాం. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మ స్థానాన్ని భర్తీ చేయడానికి సిద్ధపడి వచ్చే మహానుభావురాలు ఎవ్వరినైనా ‘అమ్మా’ అని పిలవడం పుణ్యంగా భావించాలి’’ అని తమ్ముడికి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తుంటే -‘‘తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చనిపోతే, అప్పుడు ఇంకో పెళ్ళి చేస్తావా?’’ అన్నాడు విసుగ్గా.
‘‘నువ్వు చెప్పింది కరక్టే. మళ్ళీ ఎవరో ఒకరే ముందు చనిపోతారు. కానీ అప్పుడే కాదు, కనీసం ఇంకో 10 సంవత్సరాలకు.’’
‘‘గ్యారంటీ ఏమిటీ..?’’
‘‘దేనికి గ్యారంటీ ఇవ్వగలం. నమ్మకం. అన్ని అర్హతలూ చూసి మనకు ఎలా పిల్లను వెతికారో, మనం కూడా ఆరోగ్యం, మంచితనం ఉన్న వ్యక్తిని వెతకాలి.’’
‘‘ఇదంతా అవసరమా? చాలామంది పెళ్ళి చేసుకోకుండానే బతుకుతున్నారు కదా.’’
‘‘కానీ నాన్న అలా బతకలేదు కదా ఇప్పటివరకూ. అన్నీ అలవాటైన ప్రాణం. ప్రస్తుతానికి నాన్న చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అందువల్ల ఒంటరిగా బతకడం కష్టంగా ఉంటుంది.’’
‘‘నీ ఉద్దేశ్యం బాగానే ఉందనిపిస్తోంది. కానీ సమాజం ఎలా తీసుకుంటుందో అని భయంగా ఉంది. వీళ్ళు తల్లిదండ్రుల్ని చూసుకోలేక ఇలా చేశారని దుమ్మెత్తిపోస్తారేమో? వాళ్ళందరికీ సర్దిచెప్పుకోవడం కష్టమవుతుందేమో?!’’
‘‘మన చిన్నప్పుడు నాన్న అలా అనుకోలేదు. పక్కింటివాళ్ళకి డబ్బున్నా వాళ్ళబ్బాయిని డిగ్రీలో జాయిన్‌ చేస్తే నాన్న స్థాయికి మించినా బ్యాంకులో లోన్‌ తీసుకుని ఎవరెన్ని అన్నా మనల్ని ఇంజినీరింగ్‌ చదివించారు. మనం అమెరికా వెళ్ళినప్పుడు కూడా నాన్నా అమ్మా చాలామందికి సర్దిచెప్పుకున్నారు. ఇది అంతకంటే కష్టమైన పనేంకాదు. చెప్పుకునేవాళ్ళకి విషయం ఉంటే చాలు... అది మంచిదా, చెడ్డదా అక్కర్లేదు. నాన్నని ఒంటరిగా వదిలేసి మనం వెళ్ళిపోతున్నామని కూడా అంటున్నారు చాలామంది. అది పట్టించుకున్నామా? నాన్న వయసు 61 సంవత్సరాలే. ఆ వయసులో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచినవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక కొత్త జీవితాన్ని ఏ వయసులోనైనా మొదలుపెట్టొచ్చు. అవకాశం కనిపిస్తోంది కాబట్టి ఒక ప్రయత్నం చేస్తే పోయేదేముంది. మనం జీవితంలో స్థిరపడ్డానికి మన అమ్మా నాన్నా ఎంత త్రికరణశుద్ధిగా ప్రయత్నించారో మనం కూడా అలాగే ప్రయత్నిద్దాం. అమ్మకి నాన్నంటే చాలా ఇష్టం. తాను సుమంగళిగా చనిపోవాలని రోజూ దేవునికి దండం పెట్టుకోవడం ఎంత నిజమో... నాన్న ఒంటరి అయిపోతారేమోనని బెంగపడటం కూడా అంతే నిజం. అమ్మ మనం చేసే పనిని తప్పకుండా హర్షిస్తుంది’’ అని చెప్పేసరికి నా మాట వాడికి నచ్చి- ‘‘సరేకానీ, ఇప్పుడు ఎవరు దొరుకుతారు? నాన్నకు వధువు కావాలని పేపర్లో ప్రకటన ఇద్దామా?’’ అన్నాడు.
‘హమ్మయ్య, తమ్ముడు ఒప్పుకున్నాడు’ అని మనసులో సంతోషించి ‘‘పేపర్లో ప్రకటన ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం చిన్నప్పుడు శ్రీనివాస్‌ అంకుల్‌, హేమ ఆంటీ మన పక్కింట్లో ఉండేవారు. అప్పుడప్పుడూ వాళ్ళింట్లో మనం, మనింట్లో వాళ్ళు భోజనాలు కూడా చేసేవాళ్ళం. నాన్న వేసే జోకులకు ఆంటీ పగలపడి నవ్వేవారు. హేమాంటీ అంత నెమ్మదస్తురాలు ఎక్కడా ఉండరని అమ్మ అంటూండేది.
శ్రీనివాస్‌ అంకుల్‌ నాతో చెస్‌ కూడా ఆడేవారు. వాళ్ళ పిల్లలు ప్రసాద్‌, గిరి. వాళ్ళతో క్రికెట్‌ కూడా ఆడేవాళ్ళం, గుర్తుందా? తర్వాత వాళ్ళు ట్రాన్స్‌ఫర్‌ అయ్యి వేరే ఊరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ గిరి, ప్రసాద్‌ అమెరికాలోనే ఉన్నారు. అమ్మ చనిపోయిన 4 నెలలకే శ్రీనివాస్‌ అంకుల్‌ కూడా చనిపోయారట’’ అన్నాను.
నా భావం తమ్ముడికి అర్థమయి ‘‘అవును కానీ... వాళ్ళ పిల్లలు ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు. వాళ్ళమ్మగారిని మనకంటే బాగానే చూసుకుంటూంటారు కదా’’ అన్నాడు.
‘‘అవును. ఆవిడకి ఇండియాలో పెద్ద బంగ్లా కట్టించారు. వాచ్‌మేన్‌ని పెట్టారు. ఇంట్లో ముగ్గురు పనిమనుషుల్ని పెట్టారు. రెండు లక్షల ఖరీదు చేసే టీవీ కొన్నారు. ఏడాదికోసారి ఆమెని తీర్థయాత్రలకు విమానంలో తీసుకెళ్తారు. గిరికీ ప్రసాద్‌కీ యుఎస్‌లో గ్రీన్‌కార్డ్‌ కూడా వచ్చిందట. వచ్చే నెలలో వాళ్ళు అమెరికాలో పెద్ద కంపెనీ పెడతారట. అయితే హేమా ఆంటీ మాత్రం తాను అమెరికా రానని వాళ్ళకి చెప్పేశారట. ప్రతీ సంవత్సరం ఆరు నెలలు కాశీలో ఉండాలని నిర్ణయించుకున్నారట. ఆమధ్యన వాళ్ళ కంపెనీ నుండి నాకు ఆఫర్‌ వచ్చింది. తీరావెళ్తే నా బయోడేటా చూసి నువ్వు ఫలానా కదా అని గిరి అడిగేసరికి విషయాలన్నీ తెలిశాయి’’ అని మొత్తం విషయం వివరిస్తూ ‘‘గిరికీ ప్రసాద్‌కీ విషయం చెప్పి ఒప్పించడానికి ప్రయత్నిస్తాను, తప్పకుండా ఒప్పుకుంటారన్న నమ్మకం నాకుంది. ఒకవేళ ఒప్పుకోకపోతే నువ్వు చెప్పినట్టు ‘అమ్మ కావాలి’ అని పేపర్లో ప్రకటన ఇద్దాం’’ అన్నాను.
‘‘ఇంతకీ నాన్న అభిప్రాయం ఏమిటో అడగలేదు కదా’’ సందేహించాడు తమ్ముడు.
‘‘ఈ పరిస్థితుల్లో నాన్నను అడిగితే ఒప్పుకోరు. ముందు హేమాంటీని మనింటికి రమ్మని మామూలుగా పిలుద్దాం. ఆవిడ వచ్చి కొన్నాళ్ళు ఉన్నాక వాళ్ళమధ్య సాన్నిహిత్యం పెరిగిన తర్వాత నాన్నతో మాట్లాడదాం. అంతవరకూ నా భార్యా, నీ భార్యా ఇక్కడే ఉంటారు’’ అనగానే అందరూ తమ ఆమోదాన్ని తెలిపారు.
మా ప్రయత్నం సఫలీకృతం కావాలని దీవించమంటూ అమ్మ ఫొటోకి దండం పెట్టుకుని ‘అమ్మ’కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.