close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మహా ప్రస్థానం!

మహా ప్రస్థానం!

పెంకుటిళ్లను పోలిన భవనాలూ చుట్టూ పచ్చిక మైదానాలూ ప్రవేశద్వారం ఎదురుగా చూడచక్కని మహాశివుడి విగ్రహమూ మరోవైపు వినాయకుడి మందిరం... తిరుపతిలో రోడ్డు పక్కనే ఉన్న ఆ చోటుని చూస్తే అక్కడ కనిపించేవి పర్యటకులకు ఆతిథ్యాన్నిచ్చే రిసార్టులు అనుకోవడం ఖాయం. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే అదో శ్మశానం.
లియుగ దేవుడు శ్రీనివాసుడి నిలయం తిరుపతి. ఓపక్క... ఇక్కడ జనాభా రోజురోజుకీ పెరిగిపోతోంది. మరోపక్క... ఎప్పుడో నిర్మించిన రెండు శ్మశానవాటికలు నగరం మధ్యలో ఉండడం, వాటిలో చాలినంత స్థలం లేకపోవడం అక్కడివారికి పెద్ద సమస్య అయి కూర్చుంది. స్థానికంగా ఉండే టెంకాయల దామోదరం ఈ విషయం గురించి తెలుసుకుని ఆత్మీయుల అంతిమయాత్రను గౌరవప్రదంగా చేసేలా శ్మశానాన్ని నిర్మిస్తే బాగుంటుంది కదా... అనుకున్నారు. ఆయన మంచి ఆలోచనకు మరో నాలుగువందలమంది తోడై ‘మహాప్రస్థానం’ పేరుతో కమిటీని ఏర్పాటుచేసుకున్నారు. విరాళాలు సేకరించడం మొదలుపెట్టగా తిరుపతిలో ఉండేవారితోపాటు ఇతర ప్రాంతాలవాళ్లూ తోచినంత సాయం చేశారు. కొద్దిరోజుల్లోనే మూడుకోట్ల రూపాయలు పోగయ్యాయి. స్థానిక కార్పొరేషన్‌ నగర శివారులో ఎకరం స్థలాన్ని కేటాయించింది. అలా 2014లో గోవిందధామం పేరుతో ప్రారంభమైన శ్మశాన నిర్మాణం ఈమధ్యే పూర్తైంది. సాధారణంగా శ్మశానాలు అనగానే చెత్తా చెదారం, ముళ్లమొక్కలతో లేని భయాన్ని తెచ్చిపెట్టేలా ఉంటాయి. కానీ ఇది అలాంటివాటికి భిన్నం. రిసార్టుల్లో ఉండేలాంటి భవనాలతో పాటు చుట్టూ రకరకాల మొక్కలూ పచ్చికబయళ్లతో ఉండే ఇక్కడి ఆహ్లాద వాతావరణం బాధలో ఉన్న మనసుకు సైతం ఉపశమనం కలిగిస్తుంది. పార్థివదేహాలమీద పూలు విసరడం గోవిందధామంలో నిషిద్ధం. ఇక్కడకు వచ్చేవాళ్లు పూలూ డప్పులూ అన్నిటినీ గేటు బయటే వదిలి నిశ్శబ్దంగా లోపలికి రావాలి.

అన్నివసతులూ అక్కడే!
గోవిందధామంలో అంత్యక్రియల్ని నిర్వహించాలనుకుంటే రూ.మూడువేలు చెల్లిస్తే సరిపోతుంది. పేదలూ అనాథలైతే ఎలాంటి రుసుమునూ తీసుకోరు. మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు వాహనాన్ని పంపించడంతోపాటు అవసరమైనవారికి ఫ్రీజర్‌ బాక్సునీ మహాప్రస్థానం కమిటీనే అందిస్తుంది. ఇక్కడ దహనసంస్కారాలకు కరెంటుకు బదులు గ్యాస్‌ని ఉపయోగిస్తారు. అందుకే, పేరు నమోదు చేసినవారికోసం  రెండు గ్యాస్‌ సిలిండర్లను పక్కన పెడతారు. ఇక, పిండప్రదానం చేసుకునేందుకూ ఇతర తతంగాలకూ పురోహితులూ అపర కర్మలకోసం క్షురకులూ శ్మశానంలోనే అందుబాటులో ఉంటారు. అంత్యక్రియలు చేసేందుకు గంట ముందు సమాచారం ఇస్తే శ్మశాన కమిటీ ఏర్పాట్లన్నీ చేసి ఉంచుతుంది. స్నానాల గదులతో పాటు నీటిజల్లు స్నానాలకూ ఇక్కడ విడిగా ఏర్పాట్లుంటాయి. ఉత్తర క్రియలు పూర్తయిన తర్వాత శ్మశానంలోనే ఏదో ఒకటి చేసుకుని ప్రసాదంలా స్వీకరించడం కొందరి సంప్రదాయంలో భాగం. అలాంటివారికి వంటకార్యక్రమాలకూ గోవిందధామంలో అన్ని వసతులూ ఉన్నాయి. అస్థికల్ని భద్రపరుచుకునేందుకు లాకర్లూ విదేశాల్లోని బంధువులూ దూర ప్రాంతాల్లో ఉండే సన్నిహితులూ అక్కణ్నుంచే అంత్యక్రియల్ని చూసేందుకు వీలుగా వైఫై కనెక్షన్‌ ఉన్న కెమేరాలూ సంస్మరణ సభలు నిర్వహించుకునేందుకు శ్మశానవాటిక ఆవరణలోనే భవనాలూ... ఇలా గోవిందధామంలో ఉన్న సౌకర్యాలు ఎన్నో. గోవిందధామం ప్రాజెక్టుకు ఒక రూపం వచ్చిన తర్వాత ఆ ఆలోచన నచ్చి ఓ దాత రూ.35లక్షల్ని విరాళంగా అందించాడు. మరికొందరు అస్థికల్ని భద్రపరిచే పెట్టెలనూ దహనవాటిక పైకప్పును వేసే ఖర్చునూ అందించారు. ఈ శ్మశానవాటికలోనే అవయవదానంపై ప్రజల్లో చైతన్యాన్ని కలిగించేందుకు ఓ బృందం పనిచేస్తోంది. వీళ్లు ప్రతి ఆదివారం వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాల్ని నిర్వహించడంతోపాటు, శ్మశానానికి వచ్చేవారికీ అవయవదానం, నేత్రదానం ఆవశ్యకత గురించి వివరిస్తారు. చనిపోయినవారిని గౌరవంగా సాగనంపాలనే తపన కొందరిదైతే... మరణించినవారి అవయవాలతో అవిలేని అభాగ్యులకు కొత్త జన్మనివ్వాలని తాపత్రయపడేది మరికొందరు... అందరిదీ మంచితనమే. మనిషిని చనిపోయాక కూడా బతికించేది ఆ మంచిపేరే కదా!

- శివ మావూరి, ఈనాడు, తిరుపతి
ఫొటోలు: సింహాచలం

మహా ప్రస్థానం!

పచ్చిక బయళ్లూ రంగు రంగుల పూల మొక్కలూ వినూత్నమైన నిర్మాణాలతో చూడ్డానికి ఉద్యానవనంలా కనిపిస్తుంది ఆచోటు. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఎంతోమందికి అది ఆఖరి మజిలీ. అవును, ఇక్కడ కనిపిస్తున్నది శ్మశానవాటిక. హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ‘వైకుంఠ మహాప్రస్థానం’ పేరుతో ఎన్నో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు దీన్ని.

బంగళాల్లో బతికినా కార్లలో తిరిగినా చనిపోయాక చేరేది శ్మశానానికే. కానీ ఆత్మీయుల అంత్యక్రియలు ముళ్ల తుప్పల్లోనూ అపరిశుభ్రవాతావరణంలోనూ చెయ్యడం మన మనసుకు కష్టంగానే ఉంటుంది. అందుకే, పోయినవారిని గౌరవప్రదంగా సాగనంపాలనే ఉద్దేశంతో జీహెచ్‌ఎంసీ ఫండ్‌ యువర్‌ సిటీ ప్రోగామ్‌లో భాగంగా శ్మశానవాటికల్లో వసతులు కల్పించడం మొదలుపెట్టింది ఫీనిక్స్‌ ఫౌండేషన్‌. ఆ ప్రయాణంలో భాగంగా ఏదైనా ఓ శ్మశానాన్ని చాలా అందంగా అత్యాధునికంగా తీర్చిదిద్దాలనుకుంది. అందుకోసం నగరంమధ్యలో ఉండి, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌లకు దగ్గరగా ఉన్న రాయదుర్గం శ్మశానవాటికను ఎంపికచేసుకున్నారు. ఫలితం... ఒకప్పుడు ముళ్లపొదలూ కలుపు మొక్కలతో ఉన్న మూడెకరాల ఆ చోటు ఇప్పుడు పూల మొక్కలూ పెద్ద పెద్ద చెట్లూ పచ్చని దారులతో ఆహ్లాదాన్ని పంచుతోంది. సౌకర్యాల విషయానికొస్తే... కలపతో దహన సంస్కారాలు చేసేందుకు మూడు దహనవాటికలతో పాటు ఒక విద్యుత్‌ వాటిక, మృతదేహాలను భద్రపరిచేందుకు శీతల గదులూ, పిండప్రదానం చేసేందుకు ప్రత్యేక గదినీ వాటర్‌ హీటర్‌ సౌకర్యంతో పురుషులూ మహిళలకు ప్రత్యేక స్నానాల గదుల్నీ నిర్మించారు. ఆధునిక నిర్మాణశైలితో ప్రతిదానికీ ఓ అర్థం కలిగి ఉండడం ఈ నిర్మాణాల ప్రత్యేకత. ప్రవేశ ద్వారం దాటాక ముందుకు వెళ్లేందుకు రెండు ఏటవాలు గోడల మధ్యలోంచి దారి ఉంటుంది. ఆ గోడలు చనిపోయినవారికి వంగి నమస్సుమాంజలి సమర్పిస్తున్నామనడానికి గుర్తులు అంటారు నిర్వాహకులు. ఇలా ఇక్కడ ఉన్న ఒక్కో కట్టడానికీ ఒక్కో అర్థం ఉందంటారు. అస్థికల కలశాలను దాచుకునేందుకు లాకర్లూ ఉన్నాయిక్కడ. ఇక, అంత్యక్రియలకోసం వచ్చేవారికి మహాప్రస్థానంలో ఉన్న క్యాంటీన్‌లో శుద్ధమైన తాగునీరూ టీ కాఫీలను ఉచితంగా అందిస్తారు. ఇక్కడికి ఒకేసారి మూడువందల కార్లు వచ్చినా ఇబ్బంది లేకుండా పెద్ద పార్కింగ్‌ స్థలమూ ఉంది. శ్మశానంలో ఏర్పాటుచేసిన పైప్‌డ్‌ మ్యూజిక్‌ వ్యవస్థ వల్ల శబ్దకాలుష్యం లేకుండా భగవద్గీత శ్లోకాలూ భక్తి గీతాలూ లోపల ఉన్నవారికి మాత్రమే మంద్రంగా వినిపిస్తాయి.

గ్రంథాలయం...
శ్మశానంలో కార్యక్రమాలు ఒక్కోసారి బాగా ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో సందర్శకులు పుస్తకాలు చదువుకునేందుకు వీలుగా మహాప్రస్థానంలో ప్రత్యేక గ్రంథాలయం కూడా ఉంది. అందులో భగవద్గీత, రామాయణ, మహాభారత గ్రంథాలతోపాటు పురాణేతిహాసాలకు సంబంధించిన మరిన్ని పుస్తకాలూ ఉంటాయి. వీటన్నిటి నిర్వహణనూ ఫీనిక్స్‌ ఫౌండేషనే చూస్తోంది. ఎవరైనా ఈ శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహించాలంటే కొంత రుసుము తీసుకుంటారు. స్థానికులు, పేదలు, వృద్ధాశ్రమాలకు చెందినవారు సంస్కారాలు ఉచితంగా చేసుకోవచ్చు. పిండప్రదాన కార్యక్రమం కోసం పూజారితో పాటు పార్థివదేహాన్ని తీసుకొచ్చేందుకు వాహనం, పూజా కార్యక్రమాలకు అవసరమైన సామగ్రి... అన్నీ శ్మశానంలోనే లభిస్తాయి. ఇక్కడ ఏర్పాటుచేసిన సీసీ కెమేరాలూ వైఫై సౌకర్యంతో- విదేశాల్లోనూ దూరప్రాంతాల్లోనూ ఉండి రాలేకపోయిన బంధువులు అక్కడినుంచే అంత్యక్రియల్ని చూడొచ్చు. మహాప్రస్థానంలో పనిచేసే సిబ్బంది కాషాయవస్త్రాలు ధరించి అంతిమసంస్కారాలకు అవసరమైన అన్ని పనులూ చెయ్యడంతో పాటు శ్మశానం శుభ్రంగా ఉండేలా చూసుకోవడం, రకరకాల మొక్కలు వేసి పెంచడం లాంటివి చేస్తుంటారు.

వందమందికి అన్నదానం
‘చివరిమజిలీలో గౌరవప్రదమైన వీడ్కోలు లభించాలంటే శ్మశానాల్లో అన్ని సౌకర్యాలూ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సంకల్పంతోనే మహాప్రస్థానాన్ని తీర్చిదిద్దాం. ముందు ముందు మరిన్ని శ్మశానవాటికలను ఆధునీకరించేందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వానికి సాయం అందిస్తోంది మా సంస్థ’ అంటారు ఫీనిక్స్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌. మహాప్రస్థానం చుట్టుపక్కల ఎవరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ఫీనిక్స్‌ సంస్థ ఛైర్మన్‌ చుక్కపల్లి సురేష్‌ తన తండ్రి శంకర్‌రావు జ్ఞాపకార్థం ఇక్కడ రోజూ వందమందికి అన్నదానం చేస్తున్నారు. వారి మంచి మనసును అభినందించాల్సిందే!

- సదానంద్‌ ఓంప్రకాష్‌, న్యూస్‌టుడే, రాయదుర్గం
ఫొటోలు: శివకృష్ణ

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.