close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అక్కడ ఫేస్‌బుక్‌ పప్పులుడకలేదు!

అక్కడ ఫేస్‌బుక్‌ పప్పులుడకలేదు!

ఎవరెంత రుసరుసలాడినా.. ఫేస్‌బుక్‌, దాని మెసెంజర్‌, అది సొంతం చేసుకున్న వాట్సాప్‌లు లేనిదే చాలామందికి పొద్దుగడవదు. ప్రపంచవ్యాప్తంగా రెండువందలకోట్లమంది వినియోగదారులున్న  ఫేస్‌బుక్‌ది.. సామాజిక మాధ్యమాల పరంగా రవి అస్తమించని సామ్రాజ్యం అనొచ్చు! ఒక్క మన దగ్గరే కాదు.. ప్రపంచంలోని చాలా దేశాల్లో అదే నంబర్‌వన్‌. కానీ అత్యంత  ఆకర్షణీయమైన ఫేస్‌బుక్‌ ఫీచర్‌లకి దీటుగా అడ్డుకట్ట వేసి తమదేశంలో దాని ఉనికిని నామమాత్రంగా మిగిల్చిన సామాజిక మాధ్యమాలూ కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దామా?
టీవల ఫేస్‌బుక్‌పై పలు దేశాలు విచారణకి ఆదేశించడం, దాని షేర్‌ విలువలు పతనంకావడంతో ప్రపంచవ్యాప్తంగా దాని అభిమానుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఇరవై ఐదు కోట్లమంది ఖాతాదారులున్న మనదేశంలోనైతే మరీనూ! కానీ కొన్నిదేశాల్లోని నెటిజన్‌లకి మాత్రం ఫేస్‌బుక్‌ ఓ లెక్కే కాదు. స్థానికంగా ఆ దేశాలకంటూ ప్రత్యేక సామాజిక మాధ్యమాలు ఉండటమే ఇందుక్కారణం. ఫేస్‌బుక్‌కి వ్యతిరేకంగా ఆ స్థానిక ఐటీ సంస్థల పోరాటం చిన్నదేం కాదు.

లైన్‌: ఫేస్‌బుక్‌ 2005లోనే జపాన్‌లో కాలుపెట్టింది. దాదాపు ఐదేళ్లపాటు సామాజిక మాధ్యమంలో ఉన్న ఆనందాన్ని వాళ్లకి చవిచూపింది. దాంతోపాటూ ‘టంబ్లర్‌’ వంటి మెసెంజర్‌లూ సత్తాచాటుతున్నాయి. ఆ నేపథ్యంలోనే 2011లో పురుడుపోసుకుంది లైన్‌! ఈ సంస్థ పరిచయం చేసిన ‘చాట్‌ స్టిక్కర్ల’ని జపాన్‌ యువత గుండెలకి హత్తుకుంది. అవే దీన్ని ప్రత్యేకంగా నిలిపాయి. మనం చాట్‌ చేసేటప్పుడు వాడుకునే ఎమోజీల్లాంటివే ఇవి. కాకపోతే జపాన్‌ సంస్కృతీ, అక్కడి అలవాట్లని ఇవి వ్యంగ్యంగా ప్రతిబింబిస్తుంటాయి. ఇవి ఉచితంగా కాదు. డబ్బులుకట్టాలి. పైగా వారానికోసారి కొత్తవి వస్తుంటాయి. అయినా సరే.. జపాన్‌ ప్రజలు ఆ స్టిక్కర్‌లనీ దాంతోపాటూ లైన్‌నీ అక్కున చేర్చుకున్నారు. మూడేళ్లలోనే దాన్ని అక్కడ నంబర్‌వన్‌గా మార్చారు. ప్రస్తుతం లైన్‌ని 2.2 కోట్లమంది చూస్తున్నారు. ఆ తర్వాత ట్విట్టర్‌దే అక్కడ హవా. ఇవి రెండూ కలిసి ఫేస్‌బుక్‌ని మూడోస్థానానికి నెట్టేశాయి.

కకావో టాక్‌ : ప్రపంచంలో అత్యధిక నెట్‌స్పీడ్‌ ఉన్న దేశం దక్షిణకొరియా. దీని మొత్తం జనాభా 5.62 కోట్లయితే.. వీరిలో సుమారు నాలుగున్నరకోట్లమంది ఈ ‘కకావో టాక్‌’ సామాజిక మాధ్యమానికి వినియోగదారులు. అంటే అక్కడున్న జనాల్లో 90 శాతం మంది దీన్ని వినియోగిస్తారు! మరేదేశంలోనూ ఇంతటి ఆదరణ సంతరించుకున్న సామాజిక మాధ్యమం లేదు. దక్షిణ కొరియాలోనూ మొదట ఫేస్‌బుక్‌దే హవా. కానీ 2010లో కకావో టాక్‌ వచ్చాక ఫేస్‌బుక్‌ ప్రభ కేవలం 1.6 కోట్ల మంది వినియోగదారులకే పరిమితమైంది. ఈ కకావో టాక్‌ వాట్సాప్‌లాంటిదే. కానీ అంతకుమించి ఫొటో షేరింగ్‌, వీడియో షేరింగ్‌ వసతులని కల్పిస్తూ ఫేస్‌బుక్‌ని మరిపించింది.

వీ చాట్‌: చైనా దీని ప్రాప్తిస్థానం. ఆ దేశం ఫేస్‌బుక్‌పై 2009లో నిషేధం విధించడంతో.. ఆ అవకాశాన్ని ‘వీ చాట్‌’ చక్కగా వినియోగించుకుంది. కాకపోతే ఫేస్‌బుక్‌కి ప్రతిబింబంలా కాకుండా తనదైన సొంత ముద్రవేసింది. వినియోగదారులు కేవలం తమకి నచ్చిన సమాచారాన్ని పంచుకోవడానికే ఇది పరిమితం కాలేదు.. రోజువారీ అవసరాలకి సంబంధించిన సమస్త సేవల్నీ ఇందులో పొందవచ్చు. క్యాబ్‌ బుక్‌ చేయడం నుంచి ఆహారం ఆర్డర్‌ చేయం దాకా అన్నీ చేయొచ్చు. చైనాలో రాజకీయ నాయకుల నుంచి సామాన్యుల వరకూ అందర్నీ కలిపే సాధనంగా దీన్ని చెబుతున్నారు! 2011లో పుట్టిన వీచాట్‌ ఏడేళ్లలోనే నెలకి వందకోట్లమంది వినియోగదారులకి సేవలందించే మాధ్యమంగా మారింది. ప్రపంచంలో పలు రకాల సేవలందించే అతిపెద్ద మొబైల్‌ ఆప్‌గా గుర్తింపూ  సాధించింది! 

వీ కాంటాక్టే: ముందుగా పానకంలో పుడకలాంటి విషయం ఒకటి చెప్పుకోవాలి. ఆ మధ్య అందర్నీ తీవ్ర భయభ్రాంతులకి గురిచేసిన ‘బ్లూ వేల్‌ ఛాలెంజ్‌’ గుర్తింది కదా. అది మొదటిసారి కనిపించింది ఈ సామాజిక మాధ్యమంలోనే! అప్పటికప్పుడు దానిపై చర్యలూ, విచారణలని చేపట్టి బ్లూవేల్‌పైన యుద్ధం చేసింది కూడా ఈ మాధ్యమం సభ్యులే. రష్యాకి చెందిన సామాజిక మాధ్యమం ఇది! ఫేస్‌బుక్‌లాగే మొదలై తనకంటూ కొత్తబాటలు వేసుకుని రష్యన్‌ యువతని ఆకట్టుకుందీ సైట్‌. ప్రస్తుతం ఆ దేశంలో 61 శాతం నెటిజన్‌లు దీన్ని చూస్తుంటే.. ఫేస్‌బుక్‌ 35 శాతానికే పరిమితమైపోయింది! 

ఫేస్‌బుక్‌ ఓ పెద్ద ఆకర్షణ. లే-అవుట్‌ నుంచి మొదలుపెట్టి ప్రతి అంశంలోనూ అది ఖాతాదారులని అనునిత్యం వెంటాడుతూనే ఉంటుంది. అంతటి ఆకర్షణని కాదనుకుని ప్రజలు మరో సంస్థవైపు చూడాలంటే దానికి మరెంతో పెద్ద మార్కెటింగ్‌ వ్యూహాలు కావాలి. అది సాధించుకున్న ఈ సంస్థల ఒరవడి.. మన ఐటీ సంస్థలకి ఓ స్ఫూర్తి పాఠమనే చెప్పాలి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.