close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పిందె ఊరింది... నోరూరించింది..!

పిందె ఊరింది... నోరూరించింది..!

ఏప్రిల్‌ మాసం వచ్చిందంటే చాలు... మామిడికాయల సీజన్‌ వచ్చేసిందని అమ్మమ్మలూ బామ్మలూ తెగ హైరానా పడిపోతుంటారు. కొడుకులూ కూతుళ్లూ మనుమలూ ఇలా అందరికీ ఎవరికి నచ్చిన పచ్చళ్లను వాళ్లకు పట్టి, పంపించేవరకూ నిద్రపోరు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం పిందె తొడిగినప్పటి నుంచే పచ్చళ్ల హడావుడి మొదలైపోతుంది. పిందెలతోనే ఆ ఏటి ఊరగాయలకు బోణీ చేస్తారు. అదే వడు మ్యాంగో లేదా పిందె పచ్చడి..!
ఎండాకాలం వచ్చిందంటే చాలు, అందరి కళ్ళూ మామిడి చెట్లమీదనే. పూత పూసిందా... అదెప్పుడు పిందెవుతుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే పిందెగా ఉన్నప్పడే వాటిని తెంపి ఉప్పూకారం అద్దుకుని తినే చిన్ననాటి జ్ఞాపకాలు ఉండనివాళ్లు అరుదే. కాయలు కాస్త పెద్దవై జీడి వచ్చాక జీడి ఆవకాయ, తొక్కుడు పచ్చడి... వంటివి పడితే, టెంక కట్టాక ఆవకాయ, మాగాయ, మెంతికాయ, పచ్చావకాయ, నీళ్లావకాయ, బెల్లం ఆవకాయ, మసాల ఆవకాయ... ఇలా ఒకటా రెండా... మామిడికాయ ఊరగాయల్లోనే వందల రకాలు పడుతుంటారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, పిందె దశలోనే పట్టే వడు మ్యాంగో రకం ఒక్కటీ మరో ఎత్తు. ఎందుకంటే కసురు కాయల్ని లేదా పిందెల్ని కోసి రాతి ఉప్పు, కారం, ఇంగువ, పసుపు వేసి కలిపి, మూడునాలుగురోజులు జాడీలో నానబెట్టి, కొద్దిగా ఆముదం వేసి పట్టే ఈ ఊరగాయ కూడా ఏడాదిబారునా నిల్వఉంటుంది. ఆముదం ఎందుకూ అంటే- పిందెల్ని కోసినప్పుడు కాడల్ని తుంచినప్పుడు వచ్చే పాలు ఆమ్ల గుణాన్ని కలిగి వేడి చేస్తాయి. ఆముదంవల్ల ఆమ్లగుణం పోయి, ఈ పచ్చడి వేడి చేయకుండా ఉంటుంది. నిల్వ ఉండేందుకూ దోహదపడుతుంది. పైగా ఆముదం జిడ్డు వల్ల కాయలకు ఉప్పు పట్టి వాటిని ఊరేలా చేస్తుంది. ఫలితంగా గాలి, తేమ చేరి పచ్చడి పాడవకుండా నిల్వ ఉంటుందన్నమాట. మిగిలిన ఎన్నిరకాల పచ్చళ్లు ఉన్నా మండు వేసవిలో ఉదయాన్నే మజ్జిగ లేదా పెరుగన్నంలో ఊరిన ఆ పిందెల్ని నంజుకుని తింటే వచ్చే మజానే వేరంటారు వడు మ్యాంగో ప్రియులు. దీన్ని కొందరు మెంతిపొడితో పడితే, మరికొందరు అచ్చంగా ఆవపిండితోనే పడుతుంటారు. వాటినే మెంతికాయలనీ ఆవకాయలనీ కూడా పిలుస్తుంటారు. కారం కలపకుండా కాయల్ని ఉప్పులో నానబెట్టి నిల్వ ఉంచి కూడా వాడుతుంటారు.

ఎలా చేస్తారు?
అరకిలో మామిడిపిందెలు, పావుకిలో ఉప్పు, 100 గ్రా. ఆవాలు, 100 గ్రా. కారం, టేబుల్‌స్పూను ఇంగువ, టేబుల్‌స్పూను పసుపు, 50 గ్రా. ఆముదం లేదా నువ్వులనూనె తీసుకోవాలి. పిందెల్ని బాగా కడిగి తడి లేకుండా ఆరనివ్వాలి. ఇప్పుడు వీటిమీద ఆముదం పోసి బాగా కలపాలి. తరవాత ఓ డబ్బా లేదా జాడీలో అడుగున కాయల్ని వేసి పైన ఉప్పు చల్లి మళ్లీ కాయలు ఆపై ఉప్పు ఇలా పొరలుపొరలుగా సర్దాలి. పొడిబట్టతో జాడీ మూతి కట్టి చల్లని వాతావరణంలో ఉంచి, రోజూ కదుపుతుండాలి. మూడో రోజుకి కాయల్లోని నీరంతా బయటకు వచ్చి ఊరుతుంది. ఇప్పుడు ఆవపొడి, కారం, ఇంగువ వేసి బాగా కలిపి మూతపెట్టి, పొడి బట్టతో గట్టిగా కట్టి ఉంచాలి. రోజూ జాడీని పైకీ కిందకీ కదుపుతూ ఉండాలి. పది పన్నెండు రోజులకు పచ్చడి ఊరి బాగుంటుంది. ఇదే పచ్చడిని కొందరు ఎండుమిర్చితోనూ పడుతుంటారు. అప్పుడు మూడోరోజున మిర్చి, ఆవాలు, మెంతులు, పసుపు, ఉప్పు అన్నీ కలిపి మిక్సీలో వేసి రుబ్బి, కాసిని కాచి చల్లార్చిన నీళ్లు పోసి కలిపి పదిరోజులపాటు ఊరనిస్తారు.

తమిళనాడులో...
దక్షిణాది రాష్ట్రాల్లో మిగిలినవాళ్లతో పోలిస్తే తమిళనాట ఈ పచ్చడి వాడకం ఎక్కువ. అందుకే అక్కడి మార్కెట్లన్నీ వేసవి  ప్రారంభంలో ఉదయాన్నే గంపలకొద్దీ మామిడి పిందెలతో కళకళలాడుతుంటాయి. ఈ పిందెలు కూడా చిన్నా పెద్దా రకరకాల సైజుల్లో ఉంటాయి. ఎక్కువమంది చిన్న సైజులో ఉన్న వాటిని కొనడానికే మక్కువ చూపిస్తారు. ఇలా పచ్చడి పట్టే పిందెల్లో కూడా ఆల్ఫాన్సో, ఇమాంపసంద్‌, మల్‌గోవా రకాల్నే ఎక్కువగా కొంటారట. ఇటీవల తమిళనాట మాత్రమే కాదు, ఈ పచ్చడిని అన్ని ప్రాంతాల్లోనూ పడుతున్నారు. ఆ అవకాశం లేనివారు మార్కెట్లో దొరికే పచ్చడిని కొని మరీ తింటున్నారు. ఎందుకంటే పిందె దశలో పట్టే ఆ పచ్చడిని ఒకసారి రుచి చూసినవాళ్లెవరయినా మళ్లీ మళ్లీ తినకుండా ఉండలేరట. ఓసారి తిని చూడండి మరి.



ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.