close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చెమట కూడా అందమే

చెమట కూడా అందమే

మామూలుగా మనిషికి ఎన్నో కోరికలు ఉండొచ్చు. కానీ వేసవి వస్తే మాత్రం తెల్లారి లేస్తే మనసు కోరుకునేది ఒకటే. అదే చల్లదనం. అందుకే, రకరకాల కూలింగ్‌ గ్యాడ్జెట్లూ వస్తువులూ మార్కెట్లోకి వచ్చేశాయి. ఇంతకన్నా చల్లటి కబురు ఏముంటుంది అంటారా...

ర్కవుట్‌ సున్నా శాతం... జిమ్‌కి వెళ్లినపుడు ఆ అమ్మాయి టీ షర్టు మీద కనిపించింది ఇదే. కానీ వర్కవుట్లు పూర్తయ్యాక చూస్తే చెమటతో తడిసిన ఆ టీ షర్టుమీద ‘వర్కవుట్‌ 100శాతం కంప్లీట్‌’ అని కనిపించింది. అది చూసి అవాక్కవడం అక్కడున్నవారి  వంతైంది. అదే ఈ ‘స్వెట్‌ యాక్టివేటెడ్‌ టీ షర్టు’ల మాయ. కొన్ని అక్షరాలను ప్రత్యేక పద్ధతిలో ముద్రించడం వల్ల మామూలుగా కనిపించనివి చెమట తడి అంటినవెంటనే ప్రత్యక్షం కావడం వీటి ప్రత్యేకత. వినూత్నంగా ఉన్న ఈ షర్టుల్ని వేసుకుంటే చెమటతో తడిచిపోయిందని ఇబ్బంది పడాల్సిన పనేలేదన్నమాట.

చేతికి చుట్టే బాటిల్‌

ఎంత ఎండాకాలం అయితే మాత్రం వాకింగ్‌కీ జాగింగ్‌కీ వెళ్లకపోతే ఎలా... కానీ ఆ వేడికి వెంట వెంటనే దాహం వేస్తుంటుంది. అలా అని వాటర్‌ బాటిల్‌ని చేత్తో పట్టుకుని నడవాలన్నా పరిగెత్తాలన్నా కష్టం. కానీ ఈ స్విగ్గీస్‌ వాటర్‌ బాటిల్‌ ఉంటే మనం చేత్తో పట్టుకోకుండానే నీళ్లను ఎప్పుడూ వెంటే ఉంచుకోవచ్చు తెలుసా... చిన్నసైజులో ఉండే ఈ బాటిల్‌ని రిస్ట్‌ బ్యాండ్‌లా చేతికి పెట్టేసుకోవచ్చు మరి.

భలే భలే ఐసు బొమ్మ

మిగిలిన రోజుల్లో ఐసు తినొద్దని పిల్లల్ని ఆపినా వేసవిలో మాత్రం వేడి నుంచి ఉపశమనం కోసం పెద్దలే వాటిని తినకుండా ఉండలేని పరిస్థితి. అలా అని రోజూ బయట దొరికే ఐసులూ ఐస్‌క్రీముల్ని కొనిస్తే పిల్లల ఆరోగ్యం పాడవుతుందేమోనని భయం. అలాకాకుండా పండ్లరసాలతో ఇంట్లోనే ఐసుల్ని చేసిద్దాం అనుకుంటే బయట దొరికినట్లూ ఒకే ఐసులో ఎక్కువ రంగులు లేవనో, నచ్చిన ఫ్లేవర్‌ ఐసు కాదనో పిల్లలు మారాం చేస్తారు. ఆ సమస్య లేకుండా వస్తున్నవే ఈ ‘జోకు ఐస్‌ పాప్‌ మౌల్డ్స్‌’. ప్రిన్సెస్‌ బొమ్మలానూ రకరకాల పక్షులూ జంతువుల ఆకారాల్లోనూ దొరికే ఈ మౌల్డ్స్‌లో మనం పండ్ల రసాన్ని పోసి ఫ్రీజర్‌లో పెడితే ఐసులు అచ్చం ఆయా జంతువుల బొమ్మల్లానే తయారవుతాయి. ఈ ఫొటోల్లో  కనిపించినట్లన్నమాట. ఈ బొమ్మల ఐసుల్ని చూశాక పిల్లలు వేరే వాటి కోసం  ఆలోచించే అవకాశమే ఉండదనడంలో ఆశ్చర్యం ఏముందీ..!

కుండల కళకళ

ఇంట్లో ఫ్రిజ్‌లు ఉండొచ్చు గాక. కానీ ఎండలో నుంచి వచ్చి కుండలో నీళ్లు తాగితే ఉండే హాయే వేరు. పైగా కుండలో నీళ్లు ఆరోగ్యం కూడా. అయితే ‘ఎంతో ఆధునికంగా అందంగా తీర్చిదిద్దిన వంటగదిలో ఆ మట్టికుండ ఒక్కటే తేడాగా కనిపిస్తుందబ్బా...’ అనుకునే ఆధునిక మహిళలూ ఉన్నారు. మన సంగతేమో కానీ కళ తెలిసిన వాళ్లు అనుకుంటే కుండ కాన్వాస్‌ కావడం ఎంతసేపూ... రకరకాల పెయింటింగులతో అందంగా ముస్తాబై మార్కెట్లోకి వస్తున్న ఈ కుండలే అందుకు  నిదర్శనం. ఆన్‌లైన్‌లోనూ మిట్టీకూల్‌ లాంటి  కంపెనీలు వీటిని అమ్ముతున్నాయి.

చెప్పులు తీసినా కాలవు

ఎంత మండే ఎండలైనా పిల్లలకు వేసవి సెలవులుంటాయి కాబట్టి ఏదో ఒక ట్రిప్‌ వేస్తూనే ఉంటాం. అందులో పుణ్య క్షేత్రాలూ ఉండనే ఉంటాయి. అంతా బాగానే ఉంటుంది కానీ ఆలయాలకు వెళ్లినపుడు చెప్పులు బయట ఎక్కడో విప్పేస్తాం. కానీ ఆలయం లోపలికి వెళ్లేలోగా ఎండకు గచ్చు నిప్పుల్లా కాలిపోతుంటుంది. అలాంటి చోట పదడుగులు వేయడం కూడా కష్టమే. ఈ సమస్యకు పరిష్కారంగా వస్తున్నవే ఈ ‘అడ్‌హెసివ్‌ ఫుట్‌ ప్యాడ్స్‌’. మందపాటి బట్టలా ఉండే వీటిని సులభంగా కాళ్లకు అంటించి తీయొచ్చు. కాబట్టి హ్యాండ్‌ బ్యాగులో వేసుకెళ్తే అవసరమైనపుడు పనికొస్తాయి.

చల్లగా హాయిగా...  

కూలింగ్‌ జెల్‌ మ్యాట్‌... ప్రత్యేకమైన కూలింగ్‌జెల్‌ని నింపి తయారుచేసే ఈ మ్యాట్‌లను కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి తీస్తే చాలు, మూడు నాలుగు గంటల వరకూ చల్లగా ఉంటాయి. రకరకాల సైజుల్లో దొరికే వీటిని దిండ్ల మీదా మంచం మీదా కారు సీట్లోనూ ఎక్కడైనా వేసుకోవచ్చు. చంటి పిల్లలకూ  పెంపుడు జంతువులకూ ఎండ తాకిడి తగలకుండా ఉండేందుకు కూడా ఇవి బాగా పనికొస్తాయి.

ఫ్యానే కూలర్‌

వేసవిలో ఫ్యాన్లు ఉన్నా చల్లటి గాలి రాదని మళ్లీ కూలర్‌ని ఆన్‌చేస్తాం. కానీ ఆ కూలర్‌ని టేబుల్‌ ఫ్యాన్‌లా ఎక్కడకు పడితే అక్కడకు  తీసుకెళ్లలేం. ఈ సమస్యలకు చెక్‌ పెడుతూ వచ్చిందే ఈ ‘ఎయిర్‌ హ్యుమిడిఫయర్‌  బ్లేడ్‌ ఫ్రీ బ్లోయర్‌ ఫ్యాన్లు’. రెక్కలు లేని  ఈ ఫ్యాన్ల నుంచి వచ్చే గాలి మామూలు ఫ్యాన్లతో పోల్చితే చల్లగా ఉంటుంది. ఇక, దీని వెనుక భాగంలో ఉన్న చిన్న సైజు నీటి ట్యాంకు  హ్యుమిడిఫయర్‌గా పనిచేసి కూలర్‌లా  ఆ గాలిని మరింత చల్లబరుస్తుంది.  రెక్కలుండవు కాబట్టి చిన్నపిల్లలున్నా  ఈ ఫ్యానుతో భయపడాల్సిన పనిలేదు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.