close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
క్షణ క్షణం... చావు భయం

క్షణ క్షణం... చావు భయం

మెరుపు మెరిస్తే... వాన కురిస్తే... ఆకసమున హరివిల్లు విరిస్తే... ‘అవి మాకే’ అని ఆనందించాల్సిన  పసికూనలే వారంతా. కానీ కళ్లు పోయి, కాళ్లూ చేతులూ విరిగిపోయి ఆస్పత్రుల్లో, శరణార్థుల శిబిరాల్లో... దైన్యంగా గడుస్తోంది వారి పసితనం. ఉండడానికి ఇళ్లూ ఆడుకోడానికి మైదానాలూ కాదు కదా అసలు అమ్మానాన్నలే ఉన్నారో లేరో తెలియదు చాలా మందికి. ఒక పక్క బాంబుల మోత... మరో పక్క కళ్లముందే కుప్పకూలుతున్న ఇళ్లు. రోడ్ల మీద శవాల కుప్పలుగా మారుతున్న మనుషుల్ని చూస్తూ ఆ చిన్ని మనసులు పడుతున్న క్షోభనీ, రక్తమోడుతూ కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న కన్నబిడ్డల్ని ఎలాగైనా కాపాడుకోవాలని పరుగులుతీస్తున్న పెద్దల ఆవేదననీ వర్ణించడానికి  ఏ భాషలో పదాలు సరిపోతాయి?
‘అమ్మా... చచ్చిపోతే స్వర్గానికి వెళ్తారని చెప్పావుగా. అక్కడ చాలా అన్నం ఉంటుందా? నాకూ పెడతారా...’ బాంబు దాడిలో రెండు కాళ్లూ కోల్పోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎనిమిదేళ్ల బిడ్డ ఆకలికి తట్టుకోలేక పదే పదే అలా అడుగుతోంటే ఏం చెప్పగలదు ఆ తల్లి. చిన్నారి ఆకలి తీర్చేందుకు ఏమన్నా తెద్దామని బయటకు వెళ్దామంటే తిరిగి రాగలనన్న భరోసా లేదు. ఆస్పత్రి ఆవరణ నిండా రక్తం కారుతున్న దేహాలతో మనుషులు. తండ్రుల చేతుల్లో వేలాడుతున్న పిల్లల శవాలు. బాంబు దాడుల భీకర శబ్దాలను తలదన్నే ఆర్తనాదాలు. నిస్సహాయంగా చూస్తూ ఉండడం తప్ప ఆ పరిస్థితుల్లో ఏ తల్లయినా ఏం చేయగలుగుతుంది?  కాళ్లూ చేతులూ విరిగిపోయి, శరీరమంతా గాజుముక్కలు చీరేసిన గాయాలతో హాహాకారాలు చేస్తూ వస్తున్న పిల్లల్ని చూసి వైద్య సిబ్బందే తట్టుకోలేకపోతున్నారు. ఆడుతూ పాడుతూ గంతులేయాల్సిన బాల్యానికి నిండు నూరేళ్లూ నిండిపోవడాన్ని చూసి మంచాలు మౌనంగా రోదిస్తున్నాయి.  అమ్మానాన్నలు కన్పించక, కూలిపోయిన ఆ భవనాల్లో తన ఇల్లేదో  తెలియక వెదుక్కుంటూ తిరుగుతున్న అనాథ పిల్లల్ని చూసి మొండిగోడలు సైతం శోకిస్తున్నాయి.

భూమి మీద నరకం
సిరియాలోని ఘౌటా నగరం ఇప్పుడు పిల్లల పాలిట భూమి మీద నరకంలా మారిందనీ, ఇది అంతర్యుద్ధం కాదు, సిరియా పిల్లల మీద యుద్ధమనీ యునిసెఫ్‌ పేర్కొంది. అందుకు కారణం- గత ఏడాది వెయ్యి మంది దాకా చిన్నారులు మృతి చెందగా ఈ ఏడాది గత రెండు నెలల్లోనే వెయ్యిమంది ప్రాణాలు పోయాయి. మొన్న అలెప్పో... నిన్న ఇద్లిబ్‌... నేడు ఘౌటా. ఏడేళ్లుగా హృదయవిదారకమైన వార్తలెన్నో సిరియా నుంచి వస్తున్నాయి. తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉండడం ఘౌటా చేసిన నేరం. నాలుగు లక్షల మంది జనాభా ఉన్న ఆ నగరాన్ని చుట్టుముట్టిన సైన్యం పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించకుండానే దాడులకు పాల్పడడంతో తీవ్రమైన ప్రాణనష్టం జరుగుతోంది. రాకెట్లూ బాంబు దాడులతో ఇళ్లు కూలిపోవడంతో చావగా మిగిలినవాళ్లు బేస్‌మెంట్లలో, భూగృహాల్లో, సొరంగాల్లాంటి చీకటికొట్లలో తలదాచుకుంటున్నారు. సాధారణంగా పౌరులెవరూ ఇళ్లలో భూగృహాలు కట్టించుకోరు. దాడులు మొదలయ్యాక కొందరు అప్పటికప్పుడు ఇళ్లకింద గోతులు తవ్వుకుని అందులో దాక్కుంటున్నారు. వాటి మీద ఇళ్లు కూలడంతో చాలాసార్లు అవి వారికి సజీవ సమాధులవుతున్నాయి. బతికి ఉన్నవారికి తిండిలేదు. గాయపడినవారికి చికిత్స లేదు. మందులు లేవు. పునరావాస శిబిరాలన్నీ నిండిపోవడంతో పార్కుల్లో, వీధుల్లో డేరాల కింద బతుకుతున్నారు చాలామంది. ఐక్యరాజ్యసమితి ద్వారా అందుతున్న సహాయమూ వారికి అందే పరిస్థితులు లేవు. ఇప్పుడు ఒక్క ఘౌటాలోనే లక్షకు పైగా చిన్నారులు తక్షణసాయం కోసం వేచి చూస్తున్నారు.

అందుకే ఆ ముద్దు...
ఎర్రటి స్వెటర్‌... రింగురింగుల జుట్టు... వెచ్చగా దుప్పటి కింద నిద్రపోతున్నట్లున్నాడు ఏడాదిన్నర బాలుడు. అంబులెన్సులో నుంచి అతడిని దించగానే బుగ్గలు పుణికి ముద్దాడుతూనే, తలమీదినుంచి ధారలుగా కారుతున్న రక్తాన్ని చూసి గబగబా చికిత్సకు ఏర్పాట్లు చేసింది అక్కడి నర్సు. ఆమెలో ఎక్కడా తొట్రుపాటు లేదు. కొన్నేళ్లుగా అలవాటైపోయిన దృశ్యాలివి. అయినా ఆమెలోని అమ్మ పిల్లల్ని చూడగానే కదిలిపోతుంది. అందుకే ఆ ముద్దు. బతికితే ఆనందంతో మరో ముద్దు. లేదంటే కన్నీటితో మరో వీడ్కోలు ముద్దు. ఎప్పటికప్పుడు ఇది మామూలేగా అనుకున్నా హృదయం కదా చలించక మానదు. ఎవరు చూడొచ్చారు... రేపు తానే ఉండకపోవచ్చు. ఎందుకంటే, అక్కడ ఆసుపత్రులూ వైద్యసిబ్బందీ దాడుల్ని తప్పించుకోలేని పరిస్థితి. ఘౌటాలో అంబులెన్సులెన్నో దాడుల్లో ధ్వంసం అయ్యాయి. దాంతో సమయానికి చికిత్స అందక గాయపడిన చాలామంది ఆస్పత్రికి చేరకముందే ప్రాణాలు విడుస్తున్నారని వైద్యులు ఆవేదన చెందుతున్నారు. వైద్యులకే భద్రత కరవైన చోట ఇక ప్రజల ప్రాణాలను కాపాడేదెవరు? క్లుప్తంగా చెప్పాలంటే... ప్రాణాలు కోల్పోతే అంతిమసంస్కారాలు లేవు. గాయపడితే చికిత్స లేదు, మందుల్లేవు. ప్రాణాలతో బతికి ఉంటే తినడానికి తిండి లేదు. పెద్దలకు రేపటి మీద ఆశ కలిగించే పిల్లల్లేరు. పిల్లలకు అక్కున చేర్చుకునే అమ్మానాన్నల్లేరు. ఇదీ ఇప్పటి సిరియా. ప్రపంచ దేశాలనుంచి ఎందరో విలేకరులు అక్కడికి వెళ్లారు. ప్రత్యక్ష ప్రసారాల్లో అక్కడి పరిస్థితుల గురించి చెప్తూ కొందరు కన్నీటి పర్యంతమైతే, ‘ఇక్కడి వార్తలు కవర్‌చేయడానికి చాలా ధైర్యం కావాలి- బాంబులను ఎదుర్కొనడానికి కాదు, చిన్నారుల పరిస్థితిని చూసి తట్టుకోడానికి’ అంటూ భోరున విలపించారు మరికొందరు.

అప్పుడూ ఇప్పుడూ... పిల్లలే!
ఇప్పుడే కాదు, సిరియా పరిస్థితిని మొదటినుంచీ పిల్లలే ప్రపంచానికి చాటుతున్నారు. సిరియాలో వార్తలు కవర్‌ చేయడానికి వెళ్లిన ఓ టర్కిష్‌ ఫొటోగ్రాఫర్‌కి బొద్దుగా ముద్దుగా ఉన్న ఓ నాలుగేళ్ల పాప కన్పించింది. ఒక ఫొటో తీసుకుందామని కెమెరాని సరిచేసుకున్నాడతను. కెమెరా క్లిక్‌మనే లోపలే ఆ చిన్నారి మొహంలో నీలినీడలు. చేతులు రెండూ పైకెత్తి, పెదాలు బిగించి ఆ అమ్మాయి అలా భయంగా, బాధగా ఎందుకు పోజిచ్చిందో అతనికి మొదట అర్థం కాలేదు. తర్వాత తెలిసింది... తన కెమెరాని తుపాకీగా భావించి లొంగిపోతున్నట్లుగా ఆమె చేతులు పైకెత్తిందని. నాలుగేళ్ల పాప ముఖంలో చావు భయాన్ని తొలిసారి చూసిన ఆ ఫొటోగ్రాఫర్‌ కంగుతిన్నాడు. 2014 డిసెంబరులో జరిగిన సంఘటన ఇది. 2015 మేలో ఆ ఫొటోగ్రాఫర్‌ స్నేహితులెవరో దీన్ని ట్విటర్‌లో పెట్టగా ఒక్కరోజులోనే వైరల్‌ అయింది. ఆ ఫొటో చూస్తే ఏడుపొస్తోందంటూ ఎందరో కామెంట్లు రాశారు. ఆ ఒక్క ఫొటో ప్రపంచ దేశాల ముందు సిరియా పరిస్థితిని చర్చకు పెట్టింది. ఆ తర్వాత కొన్నాళ్లకే మూడేళ్ల అలాన్‌ కుర్ది మృతదేహం మధ్యధరా సముద్రపుటొడ్డుకి కొట్టుకొచ్చినప్పుడూ దేశాలన్నీ వణికాయి. 2015 సెప్టెంబరులో పత్రికల పతాకశీర్షికలకు ఎక్కిన ఆ చిత్రం సిరియా పౌరులు ప్రాణాలు కాపాడుకోవడానికి విదేశాలకు ఎలా పారిపోతున్నారో కళ్లకు కట్టింది. టర్కీ నుంచి గ్రీకు దీవి అయిన కోస్‌కి బయల్దేరిన రబ్బరు పడవ ఐదు నిమిషాలకే మునిగిపోయింది. 8 మందికి చోటున్న పడవలో 16మందిని ఎక్కించుకున్న ఫలితమది. అలాన్‌తో పాటు అతని తల్లీ సోదరుడూ కూడా ప్రాణాలు కోల్పోయారు. అలా దేశం వదిలి పారిపోతూ ఇప్పటికి కొన్ని వేల మంది సముద్రంలో ప్రాణాలొదిలారు. ‘నాన్నా నన్ను పట్టుకో... నాన్నా... నాన్నా...’ అంటూ పదేళ్ల అబ్దుల్‌ బాసిత్‌ ఆక్రందనల వీడియో ఇంటర్నెట్‌ని మరో కుదుపు కుదిపింది. ఇద్లిబ్‌ పట్టణంలో బ్యారెల్‌ బాంబు పేలి అబ్దుల్‌ కాళ్లు రెండూ విరిగిపోయాయి. చుట్టూ పొగ మధ్యలో నిలబడలేక కుప్పకూలిపోతూ తండ్రిని ఎత్తుకోమంటూ అరవడం చూసి కంటతడి పెట్టని వారు లేరు. ఆ దాడిలో అబ్దుల్‌ తల్లీ చెల్లెలూ చనిపోయారు. ఇద్దరు అక్కలూ ఊపిరితిత్తులు పాడై తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.

ఇళ్లలో బందీలు... ట్విటర్లో వేడుకోళ్లు
‘ప్లీజ్‌... మమ్మల్ని కాపాడరూ...’ అంటున్న సిరియా బాలల ట్వీట్లతో ట్విటర్‌ వెల్లువెత్తుతోంది. గాయాలతో ఏడుస్తూ, కళ్లు తుడుచుకుంటూ, తమని కాపాడమని వేడుకుంటూ వాళ్లు పోస్టు చేసే వీడియోలు చూస్తే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది.
‘రాకెట్‌ దాడిలో మా ఇల్లు కూలిపోయింది. కిటికీ అద్దం గుచ్చుకుని నా కన్ను పోయింది...’ ఓ కంట కన్నీరు, మరో కంట రక్తం కారుతుండగా ఒక చిట్టితల్లి ఆక్రందన. ‘తినడానికి ఏమన్నా తెస్తానని వెళ్లి నాన్న తిరిగి రాలేదు... బాంబు తగిలి నాన్న చచ్చిపోయాడని అమ్మ ఏడుస్తోంది. ఆకలితో చెల్లి ఏడుస్తోంది... నేనేం చేయాలి...’ ఓ అన్న ఆవేదన. గత నెల రోజుల్లోనే తూర్పు ఘౌటా నగరంలో వెయ్యిమందికి పైగా మరణించగా ఐదు వేల మంది దాకా గాయపడ్డారు. అంతర్యుద్ధం కారణంగా నగరాలన్నీ ఎవరో ఒకరి ఆధీనంలోనే ఉన్నాయి. దాంతో ప్రజలు ఊరు విడిచి వెళ్లడానికి లేదు. తమ ఇళ్లలోనే తాము బందీలుగా ఉండే పరిస్థితి. నిత్యావసరాలు నిండుకున్నా పాలకుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడడమే. ఇచ్చినంత తీసుకుని నోర్మూసుకుని వెళ్లడమే. ప్రశ్నించి తూటాలకి బలవుతున్నవాళ్లను చూస్తూ మౌనంగా నిస్సహాయంగా జీవచ్ఛవాలుగా బతుకుతున్నారు ప్రజలు. కాస్త చదువుకున్న తల్లులు పిల్లల పేరున ట్విటర్‌ ఖాతాలు తెరిచి తమ పిల్లల పరిస్థితులను ప్రపంచానికి తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అలెప్పో నగరం ఇలా దాడులకు గురైనప్పుడు బనా అలాబెద్‌ అనే ఏడేళ్ల చిన్నారి తల్లితో కలిసి ట్వీట్లు చేస్తూ తొలిసారిగా సిరియా వైపు ప్రపంచం దృష్టిని మరల్చింది. ‘బాంబుల మోతతో రాత్రిళ్లు ఉలిక్కిపడి లేస్తున్నాం...’ ‘15 నిమిషాల్లో 11 బాంబులు పేలాయి’ ‘నా ఫ్రెండ్స్‌ చనిపోయారు... నేనూ ఎన్నాళ్లుంటానో తెలియదు’ ‘యుద్ధం మా ఇంటివరకూ వచ్చింది. ఇదే నా ఆఖరి ట్వీట్‌ కావచ్చు’ ...ఇలా గుండెని పిండేసే ట్వీట్లతో బనా లక్షలాది ప్రజల అభిమానాన్ని చూరగొంది. ఎందరో ప్రముఖులు స్పందించి రిట్వీట్ల ద్వారా ఆమెకు ధైర్యం చెప్పేవారు. అమెరికా అధ్యక్షుడికి బహిరంగ లేఖ కూడా రాసిందామె. ప్రస్తుతం తూర్పు ఘౌటా నుంచి మొహమ్మద్‌ నాజెం అనే 15ఏళ్ల బాలుడు చేస్తున్న ట్వీట్లు ప్రపంచాన్ని ప్రశ్నిస్తున్నాయి. ‘మా బాల్యాన్ని హత్య చేశారు మీరంతా కలిసి...’ అంటూ సిరియాపై తలో చేయీ వేసిన దేశాధ్యక్షుల్ని పేరుపేరునా నిలదీస్తున్నాడు నాజెమ్‌. రష్యా క్లస్టర్‌బాంబులతో ఫుట్‌బాల్‌ ఆడుతోందనీ, చావు నెమ్మదిగా ముంచుకొస్తోందనీ ఆవేదన వ్యక్తంచేస్తూ ‘రక్తమోడుతున్న మా ఫొటోలు చూసి చూసి మీకు విసుగొచ్చేసి ఉంటుంది. కానీ మేం వేడుకుంటూనే ఉంటాం. మీరు మౌనంగా చూస్తూ ఉంటే మేమందరం చచ్చిపోతాం. పరిస్థితి చేయిదాటిపోకముందే మా ప్రాణాలు కాపాడరూ...’ అని అర్థిస్తున్నాడు.

మొదలైందీ ఓ బాలుడితోనే...
చరిత్ర సంగతి పక్కన పెట్టి గత పదేళ్ల పరిస్థితి చూస్తే... 2007-10 మధ్య సిరియాలో కరవు రాజ్యమేలింది. ప్రజలు గ్రామాలనుంచీ నగరాలకు విపరీతంగా వలసవచ్చారు. పేదరికమూ నిరుద్యోగమూ అవినీతీ ప్రజల్లో అభద్రతను పెంచాయి. ఆందోళనలకు దారితీశాయి. సరిగ్గా అదే సమయంలో ట్యునీషియా, ఈజిప్టు లాంటి పొరుగు దేశాల్లో తిరుగుబాట్లు విజయవంతమయ్యాయి. ‘అరబ్‌ వసంతం’ అంటూ ప్రపంచ పత్రికలు వాటి గురించి గొప్పగా రాశాయి. ఈ పరిణామాలు ప్రజాస్వామ్యవాదుల్లో ఆశలను రేకెత్తించాయి. వారంతా కలిసి నియంత బషర్‌ అల్‌ అసద్‌ని గద్దె దింపాలన్న లక్ష్యంతో 2011లో తిరుగుబాటు జెండా ఎగరేశారు. దాన్ని అణచివేసేందుకు దేశాధ్యక్షుడు సైన్యాన్ని ప్రయోగించాడు. అత్యంత కిరాతకంగా సైన్యం తిరుగుబాటుదారులను వెంటాడి హతమార్చడం మొదలెట్టింది. తల్లిదండ్రులు ఫలానా పక్షానికి మద్దతుదారులనే అనుమానంతో వారి పిల్లలను అరెస్టు చేయడం నిత్యకృత్యమైంది. దారా నగరంలో పదమూడేళ్ల హంజా అలీ అల్‌ ఖతీబ్‌ను సిగరెట్లతో కాల్చి, జననాంగాలు కోసి నానా చిత్రహింసలూ పెట్టి చంపడంతో ప్రజాగ్రహం వెల్లువెత్తింది. నిరసనలు మిన్నంటాయి. మొదట్లో ప్రభుత్వమూ, తిరుగుబాటుదార్లూ, కుర్దులూ, ఐసిస్‌ తీవ్రవాదులూ- ఇలా నాలుగు పక్షాల మధ్య మొదలైన అంతర్యుద్ధం వివిధ కోణాల్లో విస్తరించింది. సిరియా ప్రజల్లో సున్నీ ముస్లింలు ఎక్కువగా ఉంటే సైన్యంలో షియా ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. దానికితోడు అల్‌ఖైదా, హిజ్బుల్లా లాంటి తీవ్రవాద సంస్థలూ అక్కడ ఉనికిని చాటుతున్నాయి. అస్థిరతను ఆసరాగా చేసుకుని విదేశీ శక్తులు తిష్టవేశాయి. రష్యా, ఇరాన్‌లు అధ్యక్షుడి కొమ్ముకాస్తుంటే అమెరికా, టర్కీలు తిరుగుబాటుదారులకు మద్దతిస్తున్నాయి. అమెరికా ఐఎస్‌ఐఎస్‌తో పోరాడుతోంటే టర్కీ కుర్దులతో పోరాడుతోంది. ఇజ్రాయల్‌ హిజ్బుల్లా స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ యుద్ధాలన్నిటి ఫలితంగా దేశంలోని కొన్ని ప్రాంతాలు సిరియా ప్రభుత్వ ఆధీనంలో ఉంటే కొన్ని ప్రాంతాలు తిరుగుబాటుదారుల ఆధీనంలోకి వెళ్లాయి. ఐఎస్‌ఐఎస్‌ అదుపులో కొన్నీ, కుర్దుల ఆధీనంలో మరికొన్నీ ఉన్నాయి. సిరియాతో కలగజేసుకున్న ప్రతి దేశానికీ సొంత అజెండా ఉంది. ఎవరి ప్రయోజనాలు వారివే. ఒకరు కాల్పుల విరమణ ప్రకటిస్తే మరొకరు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి దాడులకు దిగుతారు. ఎవరికీ అక్కడ జరుగుతున్న మారణహోమం తాలూకు పర్యవసానాలు పట్టవు. పోతున్న ప్రాణాలు కన్పించవు. అనాథలవుతున్న పసివారి ఆక్రందనలు విన్పించవు. అగ్రరాజ్యాలు రెండూ చెరో పక్షాన ఉన్నప్పుడు ఐక్యరాజ్యసమితి మాత్రం ఏం చేస్తుంది? అందుకే సిరియా అందరి చేతిలో ఓ పావుగా మారిపోయింది. ఏడేళ్లుగా మారణహోమం కొనసాగుతూనే ఉంది. నగరాలన్నీ మట్టిదిబ్బలుగా మారాయి. మనుషులు శవాల కుప్పలుగా మారుతున్నారు.

5 లక్షల మంది మృత్యువాత
ఎనిమిదేళ్ల క్రితం సిరియా జనాభా 2.2 కోట్లపైనే. ఇప్పుడు 1.8 కోట్లు. 61 లక్షల మంది ప్రాణాలరచేత బట్టుకుని దేశంలోనే ఒక ప్రాంతంనుంచి మరో ప్రాంతానికి వలసపోతే 56 లక్షల మంది ఇతర దేశాల్లో శరణార్థులయ్యారు. వారిలో పాతిక లక్షల మంది పిల్లలే. మాతృదేశం వదిలి వెళ్లలేక అక్కడే ఉన్నందుకు 5 లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో లక్ష మంది దాకా ఆచూకీ లేరు. చనిపోయినవారిలో 20వేల మంది చిన్నారులే. 85శాతం మరణాలు ప్రభుత్వ బలగాల వల్లే జరిగాయి. 15 లక్షల మంది శాశ్వత అంగవైకల్యానికి గురైతే, అందులో 86 వేల మందికి పూర్తిగా కాళ్లో చేతులో తీసేసిన పరిస్థితి. కృత్రిమ అవయవాల కోసం వేచిచూస్తున్నవారు వేలల్లో ఉన్నారు.

తేరుకోవడానికి ఎన్ని తరాలు...
ఏడేళ్ల అంతర్యుద్ధం తర్వాత సిరియా దేశ భూభాగమంతా మందుపాతరలతో బాంబులతో నిండిపోయింది. పేలి ఎందరి ప్రాణాలో తీసిన బాంబులే కాదు, పేలకుండానూ ఆ భూమి మీద లెక్కలేనన్ని బాంబులు ఉన్నాయనీ వాటన్నిటినీ తొలగించడానికి 30, 40 ఏళ్లు పట్టవచ్చనీ ప్రకటించింది హ్యాండిక్యాప్‌ ఇంటర్నేషనల్‌ అనే ఫ్రెంచ్‌ సంస్థ. యుద్ధం అయిపోయినా సిరియాలో ఎవరూ సురక్షితం కాదని ఈ సంస్థ రెండేళ్ల క్రితమే ప్రకటించింది. ఆహారం కోసం బయటకు వెళ్లే మహిళలూ, వీధుల్లో ఆడుకునే పిల్లలూ - ఎవరైనా ఎప్పుడైనా పేలుళ్లకు బలవ్వచ్చు, ఎందుకంటే అక్కడ చదరపు మీటరుకి పదైనా పేలడానికి సిద్ధంగా ఉన్న బాంబులు ఉంటాయని ఆ సంస్థ పేర్కొంది. బాంబుల్నీ ఆయుధాల్నీ ఎలాగైనా వెదికి ఏరేయవచ్చు. శరీరానికి అయిన గాయాలనూ మాన్పవచ్చు. కానీ యుద్ధభయం గుండెల్లో, కళ్లల్లో, రక్తంలో, నరనరాల్లో... ఇంకిపోయిన పసి మనసుల్లోనుంచి ఆ భయాన్ని తొలగించడం సాధ్యమేనా? అందుకు ఎన్ని తరాలు పడుతుంది? ఇదే ఇప్పుడు అక్కడి తల్లుల్ని వేధిస్తున్న ప్రశ్న. ఓ ప్రమాదం జరిగితే అయ్యో అంటాం... ఓ ప్రకృతివిపత్తు సంభవిస్తే బాధితులను ఎలా ఆదుకోవాలా అని ఆలోచిస్తాం. కానీ మన కళ్లముందే మనుషుల్ని ఊచకోత కోస్తోంటే పసి ప్రాణాల్ని నిలువునా తీస్తోంటే ఎందుకు ప్రపంచం ఏమీ అనలేకపోతోంది? ఏ దేశంలోనూ, ఏ నగరంలోనూ ఒక్క నిరసన ప్రదర్శనా జరగడం లేదెందుకని? తీవ్రవాదులూ హంతకులూ తమ ఇష్టం వచ్చినట్లుగా దారుణమారణకాండకు తెగబడుతోంటే ప్రపంచం మౌనంగా చూస్తోందెందుకు? బాంబుదాడుల్లో కాళ్లూ చేతులూ తెగిపడుతుంటే, కళ్లముందే అన్నల్నీ నాన్నల్నీ నిలబెట్టి కాల్చేస్తుంటే భయంతో వణికిపోతున్నారు మా పిల్లలు. పెద్దవాళ్లం సరే, ఆ పసివాళ్లు ఏం పాపం చేశారు? ఎన్నాళ్లు మాకీ కడుపుకోత... ఇంకెన్నాళ్లీ నరమేధం... అంటూ ప్రశ్నిస్తున్నారు అక్కడి తల్లులు. వారికి సమాధానం చెప్పేదెవరు?

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.