close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చల్లటి ఒడి.. పచ్‌మఢీ

చల్లటి ఒడి.. పచ్‌మఢీ

జగన్మోహినిని కట్టిపడేసిన జలపాతాలు.. పాండవులకు నీడనిచ్చిన గుహలు.. ఆంగ్లేయులను సైతం ఆహ్లాదపరచిన పచ్చదనం.. వేసవిలో చల్లదనాన్ని అందించే నెలవు.. మధ్యప్రదేశ్‌లోని పచ్‌మఢీ. సాత్పురా-వింధ్య పర్వత సానువుల్లో.. దట్టమైన అరణ్యంలో.. ఉన్న పచ్‌మఢీలో గుహలు.. జలపాతాలు.. కొండలు.. లోయలు.. ఎన్నెన్నో అందాలు.  వేసవి విడిదిగా పేరొందిన పచ్‌మఢీ విశేషాలివే...

బ్రిటిష్‌ పాలకులు పాలిస్తున్న రోజులవి. సెంట్రల్‌ ఇండియా ప్రావిన్స్‌లో అధికారిగా చేరాడు జేమ్స్‌ ఫార్సిథ్‌. సహజంగా ప్రకృతి ప్రేమికుడైన జేమ్స్‌ సాత్పుర-వింధ్య పర్వత పంక్తుల్లోని పచ్చదనం చూసి మైమరచిపోయాడు. రోజూ పరివారం సహా అడవుల బాట పట్టడం అతని పని. కొండలు, కోనలు విహరించేవాడు. అలా తిరుగుతుండగా.. ఒకరోజు ఆయనకు ఐదు గుహలు కనిపించాయి. వనవాస కాలంలో పంచ పాండవులు ఈ గుహల్లో నివసించారని అంటారు. పాంచ్‌ అంటే ఐదు అనీ, మఢీ అంటే గుహ అని అర్థం. వెరసి ఈ ప్రాంతానికి పాంచ్‌మఢీ అని పిలిచేవారు. కాలక్రమంలో ఆ పేరు కాస్తా పచ్‌మఢీగా స్థిరపడింది. పచ్‌మఢీలో పంచ పాండవుల గుహలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. గుహల్లోని బండలపై రంగులతో వేసిన చిత్తరువులు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ గుహలకు సమీపంలోనే పాంచాలి సరస్సు కూడా ఉంది. అయితే ఈ ప్రాంతం ఒకప్పుడు బౌద్ధారామంగా విలసిల్లిందని చెప్పేవాళ్లూ ఉన్నారు.

మహాదేవ శంకర..
పాండవ గుహలకు సమీపంలోని మరో గుహలో శివాలయం ఉంటుంది. దీనిని జటాశంకర గుహ అని పిలుస్తారు. భస్మాసురుడి నుంచి తనను తాను రక్షించుకోవడానికి పరమ శివుడు ఈ గుహలోకి వచ్చి దాక్కున్నాడని స్థల పురాణం. గర్భాలయంలో సహజ సిద్ధంగా ఏర్పడిన 108  శివలింగాలు కనిపిస్తాయి. గుహలో గుప్త గంగ అనే కుండం కూడా ఉంది. అతి పురాతమైన ఈ ఆలయంలో ఏటా శివరాత్రి సందర్భంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. పాండవ గుహలకు కొంత దూరంలో మహాదేవ కొండ ఉంటుంది. కొండపై అరవై అడుగుల పొడవున్న గుహ ఉంది. దీనిని బడే మహదేవ్‌ గుహ అని పిలుస్తారు. విష్ణుమూర్తి మోహినీ రూపంలో వచ్చి భస్మాసురుణ్ణి ఇక్కడే సంహరించారని చెబుతారు. గుహలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాలు దర్శనమిస్తాయి. మధ్యలో జలకుండం ఉంది. ఇందులోని జలాలు శివలింగాన్ని నిరంతరం అభిషేకిస్తుంటాయి.

రాజేంద్రగిరి
పచ్‌మఢీలో ఉన్న ప్రముఖ వ్యూపాయింట్లలో రాజేంద్రగిరి ఒకటి. ఇది సముద్రమట్టానికి మూడున్నరవేల అడుగుల ఎత్తులో ఉంటుంది. సూర్యాస్తమయాన్ని చూసేందుకు ఈ కొండపైకి వస్తుంటారు. ఇక్కడే అందమైన ఉద్యానవనం కూడా ఉంది. భారతదేశ తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ దీనిని సందర్శించడంతో.. ఈ కొండకు రాజేంద్రగిరి అని పేరు పెట్టారు. ఆనాడు రాష్ట్రపతి నాటిన మొక్క ఇప్పుడు మహావృక్షమై చరిత్రకు సాక్షిగా కనిపిస్తుంది. ఈ గిరిపైనే విడిది కేంద్రమైన రవిశంకర్‌ భవనం ఉంటుంది.

దూప్‌గఢ్‌
సాత్పుర పర్వత శ్రేణుల్లో అత్యంత ఎత్తయిన ప్రదేశం దూప్‌గఢ్‌ వ్యూ పాయింట్‌. 4,430 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రాంతమంతా కనిపిస్తుంది. ఈ వ్యూ పాయింట్‌ నుంచి సూర్యోదయంతో పాటు సూర్యాస్తమయం కూడా చూడవచ్చు. పచ్‌మఢీలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇదీ ఒకటి.

వెండి జిలుగులు

పచ్‌మఢీ చుట్టుపక్కల సుందరమైన జలపాతాలు ఉన్నాయి. అందులో రజత్‌ ప్రతాప్‌ జలపాతం ప్రధానమైనది. 351 అడుగుల ఎత్తు నుంచి వేగంగా కిందికి దూకుతుంది. ఈ జలపాతంలో నీళ్లు వెండి వెలుగులు జిలుగుతాయి. దీనిని సిల్వర్‌ ఫాల్‌ అని కూడా అంటారు. జలపాతం కింద ప్రవాహం తక్కువే! పిల్లలు, పెద్దలు జలకాలాడేందుకు అనుకూలంగా ఉంటుంది. పచ్‌మఢీ అరణ్యంలో సాల వృక్షాలు, రావి, జువ్వి, వెదురు చెట్లు విస్తారంగా ఉన్నాయి. ఈ అడవి గుండా ప్రవహించే రజిత జలపాతం నీళ్లు ఎంతో స్వచ్ఛంగా, మరెన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.

ఎప్పుడు అనుకూలం 

దట్టమైన అడవిలో ఉన్న పచ్‌మఢీకి వేసవి విడిదిగా పేరుంది. ఈ సమయంలో ఇక్కడ గరిష్ఠ  ఉష్ణోగ్రతలు 33-35 డిగ్రీల మధ్య నమోదవుతుంటాయి. వేసవిలో (ఏప్రిల్‌- జూన్‌) పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. నవంబర్‌-ఫిబ్రవరి వరకు శీతాకాల విహార కేంద్రంగానూ దీనికి మంచి పేరుంది.

బస: పచ్‌మఢీలో రెస్టారెంట్లు చాలానే ఉన్నాయి. బడ్జెట్‌ హోటల్స్‌ మొదలు రిసార్ట్స్‌ వరకు అన్ని రకాల ఆతిథ్యం లభిస్తుందిక్కడ. గదుల అద్దె రూ.1,000 నుంచి రూ.6,000 వరకు ఉంటుంది. దక్షిణాది ఆహారం దొరకడం కష్టమే. ఉత్తరాది వంటకాలు, చైనీస్‌ రుచులు అన్ని రెస్టారెంట్లలో లభిస్తాయి.

సాత్పురా కీ రాణి

పచ్‌మఢీని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంలోనూ బ్రిటిష్‌ అధికారి ఫార్సిథ్‌ జేమ్స్‌ కీలక పాత్ర పోషించాడు. ఉన్నతాధికారులను ఒప్పించి పచ్‌మఢీని వేసవి విడిదిగా తీర్చిదిద్దాడు. సాత్పురా పర్వత శ్రేణుల్లోని కొండలు, జలపాతాలు, అడవుల వివరాలతో ‘ద హైల్యాండ్స్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఇండియా’ అనే పుస్తకం కూడా రాశాడు జేమ్స్‌. అందులో పచ్‌మఢీని ‘క్వీన్‌ ఆఫ్‌ సాత్పురా’ (సాత్పురా కీ రాణి) అని అభివర్ణించాడు. పచ్‌మఢీని ఆయన తొలిసారిగా గుర్తించిన ప్రదేశాన్ని ఫార్సిథ్‌ పాయింట్‌గా పిలుస్తారు. 1964లో ఇందిరాగాంధీ ఈ ప్రదేశానికి విచ్చేశారు. అప్పటి నుంచి దీనిని ‘ప్రియదర్శిని వ్యూ పాయింట్‌’ అని కూడా పిలుస్తున్నారు.

అప్సర విహార్‌

అప్సర విహార్‌ జలపాతంలో కేరింతలు కొట్టకుండా పచ్‌మఢీ విహారం పూర్తవ్వదు. దాదాపు 35 అడుగుల ఎత్తు నుంచి జలధారలు పడుతుంటాయి. రజిత జలపాతం నుంచి ప్రవహించే నీరే అప్సర విహార్‌లో కనువిందు చేస్తాయి. పాండవ గుహలకు ఈ జలపాతం కూత వేటు దూరంలో ఉంటుంది. భస్మాసురుణ్ని సంహరించిన తర్వాత మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఈ జలపాతంలో స్నానం చేశాడట. అందుకే అప్సర విహార్‌ను మోహినీ జలపాతం అని కూడా పిలుస్తారు. జలపాతం అందాలే కాదు.. చుట్టూ ప్రకృతి కూడా సమ్మోహనపరిచే విధంగా ఉంటుంది.

బీ ఫాల్‌

 పచ్‌మఢీలో అందరినీ ఆకట్టుకునే మరో జలపాతం బీ ఫాల్‌. దీనిని జమునా ప్రతాప్‌ జలపాతం అంటారు. 150 అడుగుల ఎత్తు నుంచి ఏటవాలు కొండ మీదుగా జలప్రవాహం కొనసాగుతుంది. పర్యాటకులు జలకాలాడేందుకు వీలుగా ఉంటుంది బీ ఫాల్‌. ఈ జలపాతం నుంచే పచ్‌మఢీవాసులకు తాగునీరు సరఫరా అవుతుంది.

ఎలా వెళ్లాలి?విమానయానం

* భోపాల్‌ నుంచి పచ్‌మఢీకి 195 కిలోమీటర్ల దూరం. ఇక్కడి నుంచి బస్సులు, ప్రైవేట్‌ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.
* హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి భోపాల్‌కు సింగిల్‌ స్టాప్‌ విమాన సర్వీసులు ఉన్నాయి.
రైలు మార్గం
* హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి భోపాల్‌కు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. భోపాల్‌ నుంచి పచ్‌మఢీకి బస్సులో వెళ్లాల్సి ఉంటుంది.
* పచ్‌మఢీకి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్‌ పిపరియా. ఇక్కడి నుంచి పచ్‌మఢీకి 55 కిలోమీటర్లు.
* సికింద్రాబాద్‌, విజయవాడ నుంచి పిపరియాకు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి పచ్‌మఢీకి బస్సులు, ట్యాక్సీల్లో వెళ్లాలి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.