close
ఇమ్మిగ్రేషన్‌.. పరేషాన్‌!

తస్మాత్‌ జాగ్రత్త
ఇమ్మిగ్రేషన్‌.. పరేషాన్‌!

‘హలో! వియ్‌ ఆర్‌ కాలింగ్‌ ఫ్రమ్‌ ఇమ్మిగ్రేషన్‌..’ అని ఫోన్‌లో అవతలి నుంచి వినిపించగానే.. ఇవతలి వ్యక్తి వణికిపోతాడు. అదే వాళ్లకు కావాల్సింది. ఆ భయాన్నే క్యాష్‌ చేసుకుంటారు. మాటలతో మభ్యపెడతారు. మీ వివరాలు ఒక్కొక్కటిగా చెప్పి కంగారు పుట్టిస్తారు. ఆ మాటలు నమ్మి మోసపోయారా! లక్షల్లో కుచ్చుటోపి పెడతారు. అన్ని రంగాల్లో సైబర్‌ క్రైమ్‌ పెరుగుతున్నట్టే.. విదేశీ విహారంలోనూ హ్యాకర్స్‌ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఆన్‌లైన్‌లో వ్యక్తిగత సమాచారం దొంగిలించి.. యాత్రికుల జేబులు ఖాళీ చేస్తున్నారు.
దేశీయ యాత్రలకు వెళ్లాలనుకున్నా.. విదేశాలు చుట్టి రావాలనుకున్నా.. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవడం ఇప్పుడు మామూలే! ఇదే అదనుగా సైబర్‌ నేరగాళ్లు.. విదేశాలకు వెళ్తున్న పర్యాటకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. హ్యాకింగ్‌ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని కొల్లగొడుతున్నారు. ప్రైవేట్‌ టూర్‌ ఆపరేటర్లు, ట్రావెల్‌ ఏజెన్సీల నుంచి యాత్రికుల మెయిల్‌ ఐడి, మొబైల్‌ నెంబర్‌ సంపాదించి నేరాలకు పాల్పడుతున్నారు.
హామీతో హాని..
జనాలను బురిడీ కొట్టించడానికి సైబర్‌ నేరగాళ్లు కొత్త పంథాను అనుసరిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయం నుంచి ఫోన్‌ చేస్తున్నామని చెప్పి.. ‘మీరు ఫలానా దేశానికి వెళ్తున్నారు కదా! దరఖాస్తుతో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించార’ంటూ బెదరగొడుతారు. సదరు యాత్రికుడు కంగారుపడ్డాడా.. మరింత రెచ్చిపోతారు. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు చర్యలు తప్పవని, జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరిస్తారు. ఆ పరిస్థితుల్లో ఎవరైనా ఈ సమస్య నుంచి గట్టెక్కించమని అడగడం సహజం. ఆ బలహీనతనే సొమ్ము చేసుకుంటారు సైబర్‌ మోసగాళ్లు. ఇంత మొత్తం తమ ఖాతాలో జమచేస్తే.. ఏ హాని జరగకుండా చూసుకుంటామని హామీ ఇస్తారు. ఆ మాటలు నమ్మేసి అడిగిన సొమ్ము చెల్లించిన తర్వాత గానీ, మోసపోయామని తెలియదు. ఇటీవలి కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయని చెబుతున్నారు కేంద్ర నేర పరిశోధన సంస్థ సైబర్‌ సెల్‌ అధికారులు. ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయంలో డాక్యుమెంట్లు పరిశీలించిన అధికారులు అన్నీ సరిగ్గా ఉంటే ఆమోదం తెలుపుతారు. లేని పక్షంలో అభ్యర్థనను తిరస్కరిస్తారు. అంతేగాని.. ఫోన్లు చేసి కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడరని అధికారులు పేర్కొంటున్నారు. మోసగాళ్ల ఉచ్చులో పడకుండా.. ఇలాంటి ఫోన్లు వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

ఉచ్చు ఇలా..

 * ఇమ్మిగ్రేషన్‌ అధికారులమని ఫోన్‌ చేస్తారు.
* తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించారని, విషయం అరెస్ట్‌ దాకా వెళ్తుందని బెదిరిస్తారు.
నిజం ఇది..
* స్టాంపింగ్‌ సమయంలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఉన్నట్టుగా తేలితే.. విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వరు.
* ఇమ్మిగ్రేషన్‌ అధికారులు వ్యక్తిగతంగా ఫోన్‌ చేసి కేసుల గురించి ఎప్పుడూ మాట్లాడరు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.