close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ పెద్దాయన..!

ఆ పెద్దాయన..!
- శ్రీకంఠస్ఫూర్తి

జారులో కూరగాయలు కొనుక్కుని ఇంటివైపు నడుస్తున్నాను. మా ఇల్లు బజారుకు దగ్గరే. అక్కడ టీ దుకాణం ముందు నిలబడ్డ నలుగురైదుగురు వ్యక్తుల్లో... ఎవరో ఒక వృద్ధుడు చేయిచాచి ప్రాధేయపడుతున్నట్లుగా ఏదో అడుగుతున్నాడు. టీకొట్టు ఆసామి కసురుకుంటూ ఆ వృద్ధుడ్ని పొమ్మంటున్నాడు.
టీకొట్టు పక్కగా నడుస్తూ యథాలాపంగా ఆ వృద్ధుడ్ని చూశాను. ఆ పెద్దాయన ముఖం, ఎక్కడో ఎప్పుడో చూసినట్టు అనిపించింది. ఎవరు... ఎవరు... ఎక్కడ? ఆఁ సుమారు నాలుగేళ్ళక్రితం... గాజువాకలో కొత్తగా ఉద్యోగంలో చేరి... కొత్తగా పెళ్ళిచేసుకున్న భార్యతో... డాబా మీద రెండుగదుల్లో... కొత్తగా కాపురం పెట్టిన రోజులు..!

*             *             *

  ఆరోజు... ఆ పెద్దాయన... ఇలాగే..!
ఆఫీసు కిటికీలోంచి బయటికి చూస్తున్నాను. సాయంత్రం అయిదు గంటలు... ఆ పెద్దాయన రోడ్డుమీద కనిపించాడు. అటూ ఇటూ చూస్తూ ముందుకు నడుస్తున్నాడు. కొంతదూరం ముందుకు నడిచి, కంగారుగా వెనక్కి మళ్ళాడు. వెనక్కి వెళ్ళిన పెద్దమనిషి ఎందుకో మళ్ళీ ముందుకు వచ్చాడు. హడావుడిగా ఎదురుగా ఉన్న సందులోకి వెళ్ళాడు. ఓ అయిదు నిమిషాల్లోనే సందులోంచి రోడ్డు మీదకు వచ్చేశాడు. అక్కడ ఫుట్‌పాత్‌ మీద దీపస్తంభాన్ని ఆనుకుని నిలబడ్డాడు- అలసటగా... ఆలోచనగా!
‘ఎవరీయన..? ఎక్కడో చూసినట్టే ఉంది’ అనుకున్నాను పొద్దుట. ఆఫీసుకు వచ్చిన తరవాత కూడా ఈయన రోడ్డు మీద ఇలాగే తిరుగుతూ కనిపించాడు. ఇప్పుడు మళ్ళీ..? ఎక్కడ చూశానబ్బా..?
నాకు మెరుపులా స్ఫురణకొచ్చింది. ఈ పెద్దాయన, తను అద్దెకు ఉండే డాబా కింద వాటాలో, కటకటాల వసారాలో పచార్లు చేస్తూ కనిపిస్తుంటాడు. మంచం మీద పడుకునో, సాలోచనగా వాలుకుర్చీలో కూర్చునో ఉంటాడు. ఆ కుటుంబం వివరాలు తనకు తెలియనే తెలియవు. ఆ ఇంటినుంచి మూడు కిలోమీటర్లు దూరం వచ్చి, ఇక్కడ రోడ్డు మీద ఎందుకు ఇలా చక్కర్లు కొడుతున్నాడు..?
ఆనుకోవడమే తరువాయి... ఆఫీసు నుంచి బయటకొచ్చి రోడ్డుదాటి, ఆ పెద్దాయన వద్దకు వెళ్ళాను.
‘‘మీరేంటిక్కడ? పొద్దుట్నుంచీ చూస్తున్నాను... ఇక్కడే అటూ ఇటూ...’’
నాకు ఆయన వెంటనే జవాబు చెప్పలేదు. ఎగాదిగా వెర్రిచూపులు చూశాడు.
‘‘మా ఇల్లు... అదే మా ఇల్లు ఎక్కడో మరిచిపోయాను, తెలియడంలేదు’’ అన్నాడు. నేను నిశ్చేతనగా కొన్ని క్షణాలు నిలబడిపోయాను.
‘ఇల్లు మరిచిపోవడమా... అదేంటి?’ స్వగతంలో అనుకున్నట్లు అన్నానేకానీ, అంతలోనే తేరుకుని ‘పాపం, పెద్ద వయసు, వృద్ధాప్యం... ఇల్లు మరిచిపోయేటంతగా మతిమరుపు వచ్చేసిందేమో’ అని సమాధానపడ్డాను.
‘‘ఒక్క నిమిషం, ఇక్కడే నిలబడండి. మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెడతాను.’’
రోడ్డు దాటి రెండు అంగల్లో మళ్ళీ ఆఫీసులోకి వెళ్ళాను. అప్పటికే సిబ్బంది చాలామంది ఇంటిముఖం పడుతున్నారు. నా క్యారేజీ సంచీ తీసుకుని బయటకు వచ్చాను. స్కూటరు నడిపించుకుంటూ ఆ పెద్దాయన ముందు నిలబెట్టాను. చేయి ఆసరా ఇచ్చి స్కూటరు వెనుక సీటు మీద ఎక్కి కూర్చోమని రెండు చేతులతో గట్టిగా పట్టుకోమని జాగ్రత్తలు చెప్పి బండి బయలుదేరదీశాను.
‘‘మీకు మా అబ్బాయి సీతాపతి తెలుసా?’’ ఆ పెద్దాయన అడిగాడు.
నేను జవాబు చెప్పలేదు. మౌనంగా తల ఊపాను. పావు గంటలో స్కూటరు ఇంటిముందు ఆగింది. పెద్దాయన్ని చేయి పట్టుకుని దింపాను.
కింది వాటా వసారాలో పెద్దాయన కోడలు కాబోలు... కలవరపడి పోతూన్నట్లు కంగారుగా బయటకు వచ్చింది.
‘‘చాలా థ్యాంక్సండీ! పొద్దుట్నుంచీ ఒకటే గాభరాపడి పోతున్నానంటే నమ్మండి! మనసు మనసులో లేదు. మావారికి ఫోను చేశాను... షిఫ్టులో ఉండిపోయారు, బయటకు రావడం కుదరదన్నారు. ఎక్కడో తిరిగి తిరిగి ఇంటికి తిరిగి వచ్చేస్తాడని ఆయనకు తండ్రిమీద నమ్మకం. అంతగా అయితే, సాయంత్రం వరకూ చూసి పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేద్దాం’’ అన్నారు- ఆమె ఆందోళనగా ఆయాసపడిపోతూ చెబుతోంది.
‘‘ఇల్లు ఎక్కడో మరిచిపోయానని... మా ఆఫీసు దగ్గర్లో తిరుగుతూంటే...’’ విషయం నేను వివరించబోయాను.
‘‘ఈయన మతిమరుపు రోగంతో చచ్చిపోతున్నానంటే నమ్మండి. పిల్లల్నే చూసుకోనా, ఈయన్నే కనిపెట్టుకోనా, ఇల్లు చక్కబెట్టుకోనా? సందు దొరికితే చాలన్నట్లు గ్రిల్‌ తాళం తీస్తే ఎలాగోలా తప్పించుకుపోతున్నాడీయన.’’
ఆవిడ పెద్దాయన రెక్క బట్టుకుని తీసుకెళ్ళి వాలు కుర్చీలో కుదేసినట్లు కూర్చోబెట్టింది. లోపల్నుంచి గ్లాసుతో నీళ్ళు తెచ్చి తాగించింది.
‘‘ఉంటానండీ, మేము డాబా పైవాటాలోనే ఉంటాం’’ నేను సెలవు తీసుకుంటూ అన్నాను.
‘‘అయ్యో, నాకు తెలుసండీ... మీరు ఈమధ్యనే వచ్చారు కదా! మీ ఆవిడ సునీతగారితో చాలాసార్లు మాట్లాడాను’’ ఆవిడ ఇంకా ఏదో చెప్పబోతోంది. గబగబా మేడ మెట్లు ఎక్కి నేను పైకి వెళ్ళిపోయాను.

*             *             *

  ఆయన పేరు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి ఇల్లు మరిచిపోవడం గురించి శ్రీమతితో ముచ్చటిస్తే- ఆవిడ సానుభూతిగా చూసింది. కృష్ణమూర్తి కోడలు మా ఆవిడకు చెప్పిన వివరాల ప్రకారం... ‘‘ఆయన మతిమరుపు మనిషేనట! భోజనం, స్నానం, పడక, మందుబిళ్ళలతో సహా అన్నీ దగ్గరుండి కోడలు కామాక్షే చూసుకుంటుందట. ఆయన ఇది కావాలని ఏదీ అడగరు. తనే ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూ సేవలు చేస్తుంది. కృష్ణమూర్తి పోస్టు మాస్టరుగా చేసి రిటైరయ్యాడు. పింఛను పాతికవేలదాకా వస్తుంది. ఏది మరిచిపోయినా, పోస్టాఫీసు చెల్లింపు ఫారం మీద సంతకం మాత్రం ఆంగ్లంలో చకచకా చేస్తారట. ఒకవిధంగా ఆ పింఛనే తమ సంసారానికి ఆధారమని ఆవిడ చెప్పింది. ఆమె భర్త సీతాపతికి పక్క ఊళ్ళోని పంచదార ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం ఉంది. ఆర్నెల్లు ఉద్యోగం, ఆర్నెల్లు సెలవు. ఆరు నెలలకు సగం జీతమే వస్తుందట. కొన్ని నెలలు ఆ జీతాలు కూడా ఉండవట. అందువల్ల ఈ పెద్దాయన కృష్ణమూర్తిని బలవంతంగా తమవద్దే ఉంచుకుని, అన్నీ భరిస్తున్నారు. కృష్ణమూర్తికి మరో కొడుకూ కూతురూ ఉన్నారు. వాళ్ళకు మంచి ఉద్యోగాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులూ బావున్నాయి. కానీ, ఈ రోజుల్లో ఎవరి జీవితాలు వాళ్ళవే కదా’’ శ్రీమతి నిట్టూర్చింది.
కిందవాటావాళ్ళ కుటుంబం గురించి వివరాలు తెలిసి ‘అయ్యో పాపం!’ అనుకున్నాను.
ఎందుకో నాకు గుండె బరువెక్కింది. స్మృతిపథంలో నాన్న రూపం మెదిలింది. ఆయన అచ్చం... ఈ కృష్ణమూర్తిలాగే ఉండేవాడు. జనపనార మిల్లులో కార్మికుడిగా పనిచేసేవాడు. పెద్ద కుటుంబం. చిన్నప్పుడు అన్నీ పేదరికపు పరిస్థితులే ఉండేవి. యాభై అయిదేళ్ళకే మూర్ఛ రోగంతో, దయనీయంగా దారుణంగా మరణించాడు నాన్న. అందరూ ఉండి కూడా ఎవరూలేని నిర్మానుష్య ప్రదేశంలో- దిక్కులేని చావులా, ఒంటరిగా తనువు చాలించాడు. అప్పటికి నేనింకా చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగాన్వేషణలోనే ఉన్నాను. తండ్రి చావు తనకొక భయంకరమైన పీడకల. ఆయన గుర్తుకు వస్తే చాలు... మనసు వికలమయి, మూగగా రోదిస్తుంది. ఆ రోజంతా దిగులు మేఘాలు కమ్ముకుంటాయి. అంతేకాదు, తండ్రి వయసువాళ్ళు ఎవరు కనిపించినా హృదయం ఆర్ద్రమైపోతుంది.
కృష్ణమూర్తి గురించి మా ఆవిడతో, పనిమనిషి మల్లమ్మ మాట్లాడుతోంది...
‘‘ఆ ముసలోడికిది మామూలే తల్లీ! ఆల్ల కల్లు కప్పి, పిల్లగాడికి మల్లే, గడప దాటి గట్టా ఉరుకుతనే ఉంటడు. ఆ కొడుకూ కోడలు ఆయనెంబడి పడి, ఎదుకుతునే ఉంటరు.
ఆ మడిసి మనసేటో... ఎవరికెరిక.’’ కృష్ణమూర్తి మీద జాలి నాకు రెట్టింపయింది.

*             *             *

ఆరోజు ఒకటవ తేదీ. ఇంటిగలాయనకి అద్దె డబ్బులు ఇవ్వడానికి లుంగీతో డాబా మెట్లు దిగి కిందకు వచ్చాను. ఈమధ్య డాబా మెట్లు ఎక్కేటప్పుడూ దిగేటప్పుడూ కృష్ణమూర్తిని ఆసక్తిగా గమనిస్తున్నాను. ఆయన ఎక్కువసార్లు వాలుకుర్చీలో వెనక్కి వాలి, ఏదో దీర్ఘాలోచనలో ఉంటాడు లేదా మంచం మీద ముడుచుకుని పడుకుంటాడు. కృష్ణమూర్తి మాటలు మాత్రం ఎప్పుడూ బయటకు వినపడవు. ఇంటి యజమాని వీరాస్వామికి అద్దె డబ్బులు ఇచ్చి, ఆయన ఏదో మాటల్లో పెడితే కుర్చీలో కూర్చున్నాను. ఎన్నడూ లేనిది పక్క వాటాలోంచి కృష్ణమూర్తి స్వరం వినిపించింది. ఆయన గొంతు బిగ్గరగానే వినపడుతోంది.
‘‘మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాన్రా...సీతాపతీ... వెళ్ళిపోతాను... ఏఁవిటీ మాట్లాడవూ?’’ కృష్ణమూర్తిలో చిరాకూ కోపమూ ధ్వనిస్తున్నాయి.
ఎదురుగా కొడుకూ కోడలూ ఉన్నట్టున్నారు. వాళ్ళేమీ మాట్లాడటం లేదు.
‘‘మమ్మల్నిలా ఎంతకాలం విడదీస్తార్రా మీరు? మేమిద్దరం కలిసి ఉండొద్దా? ఈ వయసులో ఒకరికొకరం ఉండాలనుకోవడం తప్పా? ఒకేచోట ఇద్దరం బతికే యోగం లేదా మాకు చెప్పండి?’’ ఆయన గద్దించినట్లుగానే అడుగుతున్నాడు.
‘‘మొన్ననే కదా నాన్నా, అన్నయ్య ఇంటికి వెళ్ళాం, పది రోజులు ఉన్నాం. అమ్మ అక్కడే ఉంది కదా’’ సీతాపతి జవాబు చెప్పాడు.
‘‘మా పెళ్ళయినప్పటి నుంచి మీ అమ్మా నేనూ ఎప్పుడైనా విడిగా ఉన్నామురా? మీకు పెళ్ళిళ్ళయి పిల్లలు పుట్టినప్పటి నుంచీ వచ్చాయి మాకీ పాట్లు. కాన్పు వచ్చిందనో కష్టం వచ్చిందనో చాకిరీకి పనికొస్తుందనో... అమ్మను రమ్మనడం... అది తగుదునమ్మా అని తయారవడం... దాన్ని తీసుకుపోవడం... నన్నోచోట పడెయ్యడం... ఎంతకాలంరా, మాకీ తిప్పలు?’’ కృష్ణమూర్తిలో ఆవేశం, ఆక్రోశం!
‘‘అమ్మ దగ్గరకు మనం మళ్ళీ వెళ్దాం నాన్నా. నేను సెలవు పెట్టుకుంటాను.’’
‘‘కల్లబొల్లి కబుర్లు చెప్పకురా! నీకు సెలవు కుదరదు, నాకు తెలుసు. ఒక పనిచెయ్‌, అమ్మనే ఇక్కడకు వచ్చేయమను. అన్నయ్యను ట్రైను ఎక్కించమని చెప్పు, ఏమంటావ్‌?’’
‘‘సరే నాన్నా, ఇప్పుడే ఫోన్‌ చేస్తాను అన్నయ్యకి.’’
‘‘కష్టం సుఖం పంచుకోవడానికైనా, మాటామంతీ చెప్పుకోవడానికైనా... తోడుగా మీ అమ్మ కావాలిరా నాకు. సంవత్సరాల తరబడి మేము విడిగానే బతుకుతున్నాం.
మీ అమ్మ నా పక్కన ఉంటే... అదో ధైర్యం, తృప్తీ... అర్థమవుతోందా! ఈ జీవితం ఇంకా ఎంతకాలమో తెలియదు. మమ్మల్ని ప్రశాంతంగా పోనివ్వండిరా!’’ కృష్ణమూర్తి కళ్ళనీళ్ళ పర్యంతం అయినట్టున్నాడు... గొంతు గాద్గదికమయింది.
ఇంటి యజమాని వీరాస్వామి పోర్షనులో కూర్చుని మాటలన్నీ విన్న నాకు గుండె చెరువైనట్లయింది. కృష్ణమూర్తి ఆంతర్యం అవగతమయింది.
ఈ వృద్ధాప్యంలో ఆయన భార్య ఎడబాటుతో బాధపడుతున్నాడు. ఇద్దరు కొడుకులూ కూతురూ కలిసి బాధ్యతలపరంగానో, అవసరాల నిమిత్తమో తల్లిదండ్రుల్ని పంచుకుంటున్నారు. పాపం, ముసలివాళ్ళు - ఇద్దరూ కలిసి ఉండలేని పరిస్థితి. ‘అయ్యో’ అనిపించింది. ఆ తరవాత నాలుగోరోజునాడు కాబోలు... కృష్ణమూర్తి మళ్ళీ కనపడకుండాపోయాడు. పిల్లల్ని స్కూలుకు పంపడానికి బయటకొచ్చి నప్పుడు పిల్లిలా తప్పించుకుపోయాడని కోడలు కామాక్షి గోలపెడుతూ చెప్పింది. సీతాపతి ఊరంతా వెదికినా తండ్రి కనిపించలేదు. ఏ బస్సు ఎక్కాడో, ఏ రైలెక్కి ఏ ఊరు వెళ్ళిపోయాడో అంతుబట్టలేదు.
కృష్ణమూర్తి కనపడకుండా పోయిన రోజే, ఆయన కొడుకు సీతాపతికి నేనో సలహా గట్టిగా ఇచ్చాను.
‘‘మీ అమ్మగారి కోసమే మీ నాన్నగారి బాధా తపనా ఆరాటమూనూ. కచ్చితంగా మీ అన్నయ్య వద్దకే ఆయన వెళ్ళి ఉంటారు, వెళ్ళి చూడండి. అంతేకాదు, మీ అమ్మగారినీ నాన్నగారినీ ఒకేచోట ఉంచే ప్రయత్నం చేయండి. ఇకపై ప్రశాంతంగా వాళ్ళు...’’ నా మాటలు పూర్తికాలేదు.
‘‘మా అమ్మగారు ఆర్నెల్లక్రితమే పోయారండీ. మా నాన్నగారి కళ్ళముందే కర్మకాండ జరిగింది. అయినా, అదేమీ గుర్తులేదాయనకి. అంతా మరిచిపోయారు. తాము విడిగానే ఉన్నామనీ అమ్మ ఇంకా బతికే ఉందన్న భ్రమలో, అప్పుడప్పుడూ అలా మాట్లాడుతుంటారు.’’
అవాక్కవడం... నా వంతు అయింది.
కృష్ణమూర్తి, తన భార్య ఇంకా బతికే ఉందన్న భ్రమలోనే ఉన్నాడా?
కృష్ణమూర్తి కనపడకుండా పోయి వారం రోజులయింది...నెల రోజులయింది...మూడోనెల దాటింది... సంవత్సరం నిండిపోయింది. కృష్ణమూర్తి ఎక్కడున్నాడో తెలియలేదు. తప్పిపోయిన ఆయన జాడ దొరకలేదు.

*             *             *

బదిలీల భ్రమణంలో గిరగిరా తిరుగుతూ ఈ ఊరొచ్చిపడిన నాకు... మళ్ళీ ఇన్నాళ్ళకి... నాలుగున్నర ఏళ్ళ తరవాత... నెల్లూరు జిల్లా... గూడూరు పట్టణంలో... ఈ టీ కొట్టు దగ్గర... ఆ పెద్దాయన కృష్ణమూర్తి! ఎక్కడ విశాఖ- గాజువాక? ఎక్కడ గూడూరు? ఇన్నేళ్ళు ఎక్కడెక్కడ తిరిగాడో... ఎలా ఉన్నాడో... ఏం తిన్నాడో... ఎలా బతికాడో... మతితప్పిన మనిషి గతితప్పి తిరగడం అంటే ఇదేనేమో!
టీకొట్టు ఆసామికి డబ్బులిచ్చాను...
ఆ పెద్దాయనకి టీ ఇవ్వమని. ఆయన నావైపు ఆసక్తిగా చూస్తూ టీ అందుకుని, ఊదుకుంటూ ఆత్రంగా తాగుతున్నాడు. టీ పూర్తిగా తాగిన తరవాత- ‘‘మీరు కృష్ణమూర్తి కదూ?’’ అడిగాను.
ఆయన అవునూ కాదూ అన్నట్లు తలూపాడు.
‘‘ఇక్కడున్నారేంటి?’’ మళ్ళీ అడిగాను.
‘‘బెంగుళూరు వెళ్ళాలి. అక్కడ నా భార్య భాగ్యం ఉంది కదా?’’
కృష్ణమూర్తి మాటలు నాకు ఆశ్చర్యం కలిగించలేదు.
‘‘రండి, నాతో... మీ భాగ్యం దగ్గరికి నేను తీసుకువెళ్తాను’’ అన్నాను చెయ్యి అందిస్తూ.
ఆయన బుద్ధిగా తలూపి నా చెయ్యి అందుకున్నారు.

మీ అమ్మ నా పక్కన ఉంటే... అదో ధైర్యం, తృప్తీ... అర్థమవుతోందా! ఈ జీవితం ఇంకా ఎంతకాలమో తెలియదు. మమ్మల్ని ప్రశాంతంగా పోనివ్వండిరా!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.