close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కోఠీ.. ఏక్‌ ప్రేమ్‌ కహానీ!

కోఠీ.. ఏక్‌ ప్రేమ్‌ కహానీ!

కోఠి.. హైదరాబాద్‌ నగరానికి ముఖ్యమైన లాండ్‌మార్క్‌. ఇక్కడో ఊరూ, దానికో పేరు ఏర్పడటానికి కారణం ఓ భవంతి. నేటి కోఠి మహిళా కళాశాలలో భాగంగా ఉన్న ఆ భవనమే ‘రెసిడెన్సీ బిల్డింగ్‌’! దక్షిణాదిలోని బ్రిటిష్‌శైలి భవంతుల్లో ఇదే అత్యుత్తమమైనదని చెబుతారు! అందుకే శిథిలావస్థకి చేరిన ఈ భవనానికి ఆలస్యంగానైనా పూర్వవైభవం తెస్తున్నారు. ఆ రకంగా ఓ ప్రేమచిహ్నానికి మళ్లీ ప్రాణం పోస్తున్నారు. ఆ ప్రేమకథపై హాలీవుడ్‌ సినిమా తీయడానికీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏమిటా ప్రేమకథ అంటే...
ది 1795 ప్రాంతం. రెండో నిజాం అలీఖాన్‌ హైదరాబాద్‌ని పరిపాలిస్తున్నాడు. ఓవైపు మరాఠా రాజులూ, మరోవైపు మైసూరు టిప్పు సుల్తాన్‌ ఇద్దరూ హైదరాబాద్‌ని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్న కాలమది. శత్రువుకి శత్రువు మిత్రుడు కదా.. అందువల్ల టిప్పుపై పోరాడుతున్న బ్రిటిష్‌వాళ్ల మైత్రి నిజాంకి చాలా అవసరమైంది. అలాంటి కీలకమైన సందర్భంలోనే హైదరాబాద్‌కు బ్రిటిష్‌ రెసిడెంట్‌(రాయబారి)గా వచ్చాడు జేమ్స్‌ అచిలిస్‌ కిర్క్‌పాట్రిక్‌! బ్రిటిష్‌వాడేకానీ చెన్నైలో పుట్టాడు. తెలుగు చక్కగా మాట్లాడగలడు. హైదరాబాద్‌ వచ్చాక ఉర్దూ, పర్షియా భాషలూ నేర్చుకున్నాడు. ఆ నేర్చుకునే క్రమంలోనే ఇక్కడ ఖైరున్నిసా అనే అమ్మాయి అందానికి ఫిదా అయిపోయాడు! ఆ అమ్మాయి కోసం తన వేషం, భాషతోపాటూ మతం కూడా మార్చుకున్నాడు. కానీ ఖైర్‌ రాజవంశీయురాలు. హైదరాబాద్‌ ప్రధానమంత్రి మీర్‌ ఆలం మేనల్లుడికి మనవరాలు. ప్రధాని అప్పటికే తమ వంశానికే చెందిన ఓ యువకుడితో ఆమెకు నిఖా నిశ్చయం చేసేశాడు. ఆ నేపథ్యంలో ఖైర్‌ ఓ ఆంగ్లేయుడికి దగ్గరకావడం ప్రధానికి సుతరామూ ఇష్టం లేదు. మరోవైపు, కోల్‌కతాలో ఉన్న జేమ్స్‌ ఉన్నతాధికారులూ దీనికి సుముఖత చూపలేదు. ‘అతనికి మనం అప్పగించిన పనేమిటీ? అక్కడ అతని వేషధారణేమిటీ! ఈ పెళ్లితో ఆ నిజాంరాజ్యానికే విధేయుడైపోయే ప్రమాదం ఉంది!’ అని అనుమానించారు. ఇన్ని వ్యతిరేకతలమధ్యే తమ ప్రేమను గెలిపించుకున్నారు జేమ్స్‌, ఖైరున్నిసా. ఖైర్‌ తల్లి సహకారంతో పెళ్లి చేసుకున్నారు.
కడచూపూ దక్కలేదు..
అప్పటిదాకా జనానాకే(మహిళలకి మాత్రమే ప్రవేశం ఉన్న అంతఃపురం)పరిమితమైన ఖైరున్నిసా స్వేచ్ఛగా విహరించేలా అతిపెద్ద భవంతి నిర్మించాలనుకున్నాడు జేమ్స్‌. మూసీపక్కన అరవై ఎకరాల స్థలం తీసుకున్నాడు. భారత్‌లో ఇంకెక్కడా లేనివిధంగా ముందువైపు 40 అడుగుల ఎత్తైన స్తంభాలతో.. ‘పలాడియన్‌ శైలి’లో దీనికి రూపకల్పన చేశాడు. అందాల షాండ్లియర్‌లతో కూడిన దర్బార్‌ హాలూ, అద్భుతమైన వంపుతిరిగిన మెట్లదారులతో కూడిన ఈ వాస్తు అద్భుతం పూర్తికావడానికి రెండేళ్లు పట్టింది. ఖైర్‌, జేమ్స్‌లకి ఇక్కడే ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్లకి మూడేళ్లు నిండకుండానే.. బ్రిటన్‌లో ఉంటున్న తన తాతయ్య దగ్గరకి పంపించేశాడు జేమ్స్‌. ఓసారి కోల్‌కతా వెళ్లిన జేమ్స్‌ అంతుపట్టని వ్యాధితో అక్కడే మరణించాడు! ఖైర్‌కి కడచూపు కూడా దక్కలేదు. ఆమె కోల్‌కతాకి వెళ్లేటప్పటికే సమాధి చేసేశారు. అలా కోల్‌కతా వెళ్లిన ఆమెని ఇక్కడివాళ్లు తిరిగి రానివ్వలేదు. ఆస్తిపాస్తులు పోగొట్టుకుని, తనకిష్టమైన భవంతికి దూరమై ఖైర్‌ మచిలీపట్నంలో ఓ అనామకురాలిలా కన్నుమూసింది!
పునరుద్ధరణ మొదలైంది..
వాళ్ల ప్రేమకి చిహ్నంగా ఉన్న భవంతిని ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్‌ అధికారులు కార్యాలయంగా వాడుకుంటూ వచ్చారు. కోఠి అంటే ఉర్దూలో రాజాంతపురమని. అందుకే తర్వాతి రోజుల్లో ఆ ప్రాంతానికి అదే పేరు స్థిరపడిపోయింది. స్వాతంత్య్రం తర్వాత ఇందులోకి ఉస్మానియా మహిళా కళాశాలని మార్చారు. కాలక్రమంలో భవనం శిథిలమైపోయింది. 1999లో ఇక్కడికొచ్చిన చరిత్రకారుడు విలియం డాల్‌రింపుల్‌ ఈ భవనాన్ని చూసి అప్రతిభుడై పరిశోధనలు చేయడం మొదలుపెట్టాడు. ఐదేళ్ల తన పరిశోధనలో 1803లో లండన్‌ వెళ్లిన జేమ్స్‌, ఖైరున్నిసాల కూతురి మునిమనవరాలిని చూశాడు! ఆమె సహకారంతో జేమ్స్‌-ఖైరున్నిసా జీవితంలో అప్పటిదాకా తెలియని నిజాలని ‘వైట్‌ మొఘల్స్‌’ పేరుతో ఆంగ్లంలో చారిత్రక నవలగా రాశాడు! అక్కడి నుంచే..
ఆ నవల ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. దాని పాఠకుల్లో ఒకరు లండన్‌ నుంచి ఈ భవంతి పునరుద్ధరణ కోసం ఇరవై లక్షల పౌండ్లు(సుమారు ఎనిమిదిన్నర కోట్లు) విరాళం ఇచ్చారు. అటు వరల్డ్‌ మాన్యుమెంట్స్‌ ఫౌండేషన్‌, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పునరుద్ధరణ కోసం నడుంబిగించడంతో పాత వైభవాన్ని తెచ్చారు. జేమ్స్‌-ఖైర్‌ల కథని హాలీవుడ్‌ సినిమాగా తెచ్చేందుకూ ప్రయత్నాలు సాగుతున్నాయి. ‘గేమ్‌ ఆఫ్‌ త్రోన్స్‌’ ఆంగ్ల చిత్రాల నిర్మాత ఫ్రాంక్‌ డాల్జర్‌, దర్శకుడు రాల్ఫ్‌ ఫియన్నస్‌ ఇప్పటికే ఈ కథని సినిమాగా రూపొందిస్తామని ప్రకటించారు! అంతేకాదు, ఈ భవనం ప్రాధాన్యం మరింత పెరిగేలా కోఠి కళాశాలని మహిళా విశ్వవిద్యాలయంగా చేస్తామనీ ఈ మధ్యే ప్రభుత్వం ప్రకటించింది కూడా!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.