close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
డబ్బులు పోవిక..!

డబ్బులు పోవిక..!

ఇకపై మన పర్సుపోయినా బాధపడాల్సిన పనిలేదు. వేరొకరు దొంగిలిస్తారేమోనన్న అనుమానం అసలే అవసరంలేదు. ఎందుకంటే మన వేలిముద్రలు లేకుండా దాన్ని మరొకరు తెరవలేరు. పైగా అదెక్కడుందో మన ఫోన్‌కి వెంటనే సందేశం కూడా వచ్చేస్తుంది. పొరపాటున ఎక్కడన్నా మర్చిపోతే బీప్‌ సౌండ్‌తో మనల్ని అలర్ట్‌ చేస్తుంది. వీటితోపాటు మరెన్నో ప్రత్యేకతలున్న మొదటి స్మార్ట్‌ వ్యాలెట్‌ని తయారుచేసింది మన తెలుగు అమ్మాయే.
క సర్వే ప్రకారం ప్రపంచంలో 94 శాతం మంది తమ పర్సును ఎక్కడో ఒకచోట మర్చిపోవడమో, పోగొట్టుకోవడమో సర్వసాధారణమట. అలా పోగొట్టుకున్న పర్సులు మళ్లీ దొరికినా అందులోని నగదూ, కార్డులూ అలాగే ఉంటాయన్న గ్యారంటీ లేదు. సంప్రదాయ పర్సులతో ఉండే ఇబ్బందులే ఇవి. అయితే పోగొట్టుకున్న పర్సును మరొకరు తెరవడానికి వీలులేకపోవడమేకాక జీపీఎస్‌ ద్వారా అదెక్కడుందో ఇట్టే తెలుసుకోగలిగే స్మార్ట్‌ వ్యాలెట్‌ని తయారుచేసింది శృతి గిల్లా.
టెక్నాలజీ టచ్‌...
శృతికి చిన్నప్పటి నుంచీ ఏదైనా భిన్నంగా చెయ్యడం అలవాటు. అందుకే తన చదువుకీ ఉద్యోగానికీ ఏమాత్రం సంబంధంలేని ఆలోచనలతో వ్యాపారాన్ని ప్రారంభించింది. మగవారు ఎక్కువగా ఉపయోగించే వ్యాలెట్‌కి టెక్నాలజీని జోడించి అధునాతన స్మార్ట్‌ పర్సుని తయారుచేసింది. హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంసీఏ చదువుకుంటూనే ఒక బీమా కంపెనీలో పనిచేసేది శృతి. ఆ తర్వాత ఎనిమిదేళ్లపాటు భారత్‌, అమెరికాల్లో డెలాయిట్‌ కన్సల్టెన్సీలో ఉద్యోగం చేసింది. ఆ సమయంలోనే తానే సొంతంగా ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టాలని నిర్ణయించుకుంది. అదే విషయాన్ని ఫేస్‌బుక్‌లో ఉద్యోగం చేస్తున్న తన స్నేహితుడు సన్నీ మల్హోత్రాతో పంచుకుంది. అతడు కూడా దానికి పచ్చజెండా ఊపడంతో ఏ వ్యాపారాన్ని చేపట్టాలన్న విషయంమీద చాలా రిసెర్చ్‌ చేశారు ఇద్దరూ. చివరికి ఇప్పటివరకూ ఎవరూ ఎంచుకోని స్మార్ట్‌ వ్యాలెట్‌ని తయారు చేయాలనుకున్నారు. అమలు ఇలా...
రివోల్‌ టెక్నాలజీ పేరుతో ఎలక్ట్రానిక్‌ వస్తువులను తయారుచేసే కంపెనీని ప్రారంభించింది శృతి. దీనికి శృతి స్నేహితుడు సన్నీ సహ వ్యవస్థాపకుడు. అయితే అప్పటివరకూ బీమా కంపెనీల్లో పనిచేసిన శృతికి ఎలక్ట్రానిక్‌ వస్తువులూ, వాటి పనితీరుమీద కనీస అవగాహన కూడా లేదు. దాంతో ఈ రంగంమీద పట్టుసాధించడానికి అనేక పుస్తకాలు చదవడంతోపాటు ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించి నిర్వహించే ప్రత్యేక తరగతులకు సైతం హాజరయ్యేది. ఎందుకంటే ఈ వ్యాలెట్‌ని తయారుచేసి, మార్కెట్‌ కల్పించాలంటే దానికి సంబంధించిన కనీస పరిజ్ఞానం తప్పనిసరి. అంతా ఒక కొలిక్కి వచ్చాక స్మార్ట్‌ వ్యాలెట్‌కి సంబంధించిన విషయాలనూ, ప్రత్యేకతలనూ వివరిస్తూ పెట్టుబడుల వేట మొదలుపెట్టారు ఈ మిత్రులిద్దరూ. ఈ వ్యాలెట్‌కి కాష్యూ వ్యాలెట్‌ అని పేరు పెట్టారు. ఈ వ్యాలెట్‌కి సంబంధించిన ఫీచర్లూ, పనితీరును తెలుపుతూ ఒక వీడియోని రూపొందించి, సోషల్‌మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ కాన్సెప్ట్‌ తెగ నచ్చేయడంతో వ్యాలెట్‌ ఇంకా మార్కెట్‌లోకి రాకముందే అనేక సంస్థల నుంచి కుప్పలుతెప్పలుగా ఆర్డర్లు వచ్చిపడ్డాయి. దీంతో ఇక వెనక్కి తిరిగిచూడాల్సిన అవసరంలేకుండా పోయింది వారికి. ఆర్డర్లు వస్తున్నప్పటికీ మరో ఆరునెలలు దానిమీద కసరత్తు చేసి, అనుకున్న దానికంటే ఎక్కువ ఫీచర్లతో మరో అయిదు మిల్లీమీటర్ల పరిమాణాన్ని తగ్గించి మరింత నాజూగ్గా వ్యాలెట్‌ని తయారుచేశారు.
అదిరే ఫీచర్లు...
ఈ వ్యాలెట్‌లోని ఫీచర్లన్నింటిలో అందర్నీ అమితంగా ఆకట్టుకున్నది మాత్రం వేలిముద్రలతోనే ఓపెన్‌ అవడం. అంతేకాదు కావాలనుకున్నప్పుడు ఈ వేలిముద్రను మార్చుకునే సదుపాయమూ ఉంది. దీంతోపాటు ఈ వ్యాలెట్‌ నిరంతరం జీపీఎస్‌తో కనెక్ట్‌ అయ్యే విధంగా బ్లూటూత్‌ ట్రాకర్‌తో అనుసంధానం చేశారు. అందువల్ల ఎవరైనా దీన్ని దొంగిలించినా అది ఎక్కడుందో ఇట్టే కనిపెట్టెయ్యొచ్చు. పొరపాటున మనం వ్యాలెట్‌ని ఎక్కడైనా మర్చిపోతే వెంటనే మన ఫోన్‌కి సందేశం కూడా వస్తుంది. మూడు విభాగాలుగా ఉన్న ఈ వ్యాలెట్‌లో ఏడు కార్డులూ, ముప్ఫైవరకూ కరెన్సీ నోట్లను పెట్టుకోవచ్చు. అంతేకాదు ఈ వ్యాలెట్‌ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే నెలరోజుల వరకూ పనిచేస్తుంది. త్వరలో మరిన్ని...
ప్రస్తుతం ఈ వ్యాలెట్‌ ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో లభ్యమవుతోంది. ఇప్పటివరకూ కోటిన్నర రూపాయల టర్నోవర్‌తో ఈ వ్యాపారం నడుస్తోందనీ, ఇందులో ఏడాదికి రెండువందల శాతం వృద్ధిని సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామంటున్నారు ఈ మిత్రులు. అంతేకాదు భవిష్యత్తులో పాస్‌పోర్ట్‌, లగేజ్‌, హ్యాండ్‌ బ్యాగ్‌... ఇలా అన్నింటినీ స్మార్ట్‌ బ్యాగులుగా రూపొందించేందుకు వీరు సిద్ధమవుతున్నారు. సంప్రదాయ బ్యాగులకు స్మార్ట్‌ సొబగులు అద్ది, అటు లుక్‌ ఇటు భద్రత - రెండింటినీ అందిస్తామంటే ఎవరు మాత్రం కొనకుండా ఉండగలరు చెప్పండి!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.