close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఒకప్పటి అన్న... ఇప్పుడెందరికో నాన్న!

ఒకప్పటి అన్న... ఇప్పుడెందరికో నాన్న!

చర్చి ఫాదర్‌ కావాలనుకున్న ఓ యువకుడు సమాజంలో జరుగుతున్న పరిణామాలను చూసి అడవి బాట పట్టాడు. అన్నలతో కలిసి అనేక పోరాటాలు చేశాడు. ఆ క్రమంలో ఒక చేతినీ పోగొట్టుకున్నాడు. చివరకు సమాజంలో ఏ ఆదరణకూ నోచుకోని వందల మంది పిల్లలకు తండ్రిగా మారాడు. అనాథలుగా బతుకుతున్నవారికి శాశ్వత చిరునామాను అందిస్తున్న గాదె ఇన్నారెడ్డి ప్రస్థానం ఇది.
చిన్నతనంలో ఎవరికైనా ఏ డాక్టరో, ఇంజినీరో కావాలని ఉంటుంది. కానీ ఇన్నారెడ్డి మాత్రం చర్చి ఫాదర్‌ కావాలని కలలు కనేవారట. రోమన్‌ క్యాథలిక్‌ కుటుంబ నేపథ్యమే ఇందుకు కారణమంటారాయన. కానీ, పాఠశాల, కళాశాల చదువులు ఆయన కలని మరో వైపు తిప్పేశాయి. ఆయన చదివిన స్కూల్లో వామపక్ష దిగ్గజాలైన కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తి పాఠాలు చెప్పేవారు. వారి ప్రభావంతో ఇన్నారెడ్డి ఆసక్తి వామపక్ష రాజకీయాల వైపు మళ్లింది. క్రైస్తవ మిషనరీల కంటే సమాజం కోసం పోరాడటమే మంచిదని భావించారు. దాంతో రాడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఆర్‌ఎస్‌యూ)లో చేరి చురుగ్గా పని చేశారు. పీపుల్స్‌ వార్‌ గ్రూపులో ఉంటూ పార్టీ తరఫున తెలంగాణ, రాయలసీమల్లో బాధ్యతలు నిర్వహించారు. అప్పుడే ఒక ప్రమాదంలో తన కుడి చేయిని పోగొట్టుకున్నారు. దాంతో వరంగల్‌లో ఉంటూ పార్టీ తరఫున పనిచేసేవారు.
పోరాటాల్లో...
1979 నుంచి 94 వరకూ వామపక్ష    రాజకీయాల్లో ఉన్న ఇన్నారెడ్డి ఆ తర్వాత ప్రాంతీయ అసమానతలపై పోరాటం ప్రారంభించారు. రాయలసీమ విమోచన పోరాటంలో పాల్గొన్నారు. ఆ తర్వాత తెలంగాణ ప్రాంత సమస్యలపై దృష్టి పెట్టారు. 1996లోనే ‘దగాపడ్డ తెలంగాణ’ పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన వారిలో, 2001లో ప్రారంభమైన టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఇన్నారెడ్డి ఒకరు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చేశారు.
మార్చిన పుస్తకాలు...
2005లో తెలంగాణ పోరాటంలో చురుగ్గా ఉన్న సమయంలో జరిగిన హైదరాబాద్‌ బాంబు పేలుళ్ల కేసులో అనుమానితుడిగా ఇన్నారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2006 ఫిబ్రవరి వరకు చర్లపల్లి జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నన్ని రోజులూ చాలా పుస్తకాలు చదివారు. ఆయన ఆలోచనల్లో మార్పు రావడానికీ, రాజకీయాల నుంచి సేవ వైపు మళ్లేందుకూ ఆ పుస్తకాలే కారణమంటారు ఇన్నారెడ్డి. ఆ దశలోనే అనాథల కోసం ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తన దగ్గరున్న కొద్ది డబ్బుతో వరంగల్‌ జిల్లా జబ్బర్‌ఘడ్‌ మండలంలో స్థలం కొని అనాథాశ్రమాన్ని ప్రారంభించారు.
ఆదరణే మా ఇల్లు...
‘మా ఇల్లు’ పేరుతో ఇన్నారెడ్డి అనాథాశ్రమాన్ని ప్రారంభించారు. కానీ బోర్డుమీద మా ఇల్లు అని మాత్రమే ఉంటుంది తప్ప ఆశ్రమం అన్న మాట ఉండదు. ఎందుకంటే అక్కడుండేేవారెవరికీ అదొక అనాథాశ్రమం అనే ఆలోచన రాకూడదనే ఆ మాట బోర్డుమీద రాయించలేదంటారు ఆయన. ఆశ్రమంలోని పిల్లలు ఇన్నారెడ్డి దంపతులను అమ్మానాన్నా అనే పిలుస్తారు. వారు కూడా పిల్లలతోనే కలిసుంటూ వారి బాగోగులు చూస్తుంటారు. 2006లో ముప్ఫై రెండుమందితో ప్రారంభమైన ఈ ఆశ్రమంలో ఇప్పుడు 220 మంది ఆశ్రయం పొందుతున్నారు. అంతేకాదు ఇక్కడ ఉండడానికి వయసుతో సంబంధం లేదు. ఏదో ఒక ఆధారం దొరికే వరకూ ఎవరైనా ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడ ఉన్న పిల్లలకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పిస్తారు. పిల్లల సంఖ్య పెరగడంతో ఆశ్రమ ప్రాంగణంలోనే ఒక ప్రయివేటు ఇంటర్‌ కాలేజీని కూడా ఏర్పాటు చేయించారు. ఇందులో బయటి పిల్లలను కూడా చేర్చుకుంటారు. కాలేజీకి స్థలం ఇచ్చినందుకు బదులుగా ఆశ్రమంలోని పిల్లలకు ఉచిత విద్య అందించేలా కాలేజీ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అరుదైన పోరాటం...
అనాథలకు ఆశ్రయం కల్పించడం, వారిని చదివించడం మాత్రమేకాదు, వారి గుర్తింపు కోసం అరుదైన పోరాటం చేస్తున్నారు ఇన్నారెడ్డి. తల్లిదండ్రుల పేర్లూ, కులం, వయసు మొదలైన వివరాలు లేకపోవడం వల్ల అనాథలు ప్రభుత్వ ప్రయోజనాలను పూర్తిగా పొందలేకపోతున్నారు. దీంతో అనాథలకూ గుర్తింపు ఇవ్వాలంటూ 2008 నుంచీ పోరాటం చేస్తున్నారు. ఇన్నారెడ్డి ప్రయత్నానికి స్పందించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక జీవోను జారీచేసింది. అయితే దీన్ని ఏ ప్రభుత్వాలూ అమలు చేయకపోవడంతో వారి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారాయన. చిన్నప్పటి నుంచీ తన జీవితం అనేక మలుపులు తిరిగిందనీ, వాటన్నింటిలో ‘మా ఇల్లు’  నిర్వహణే ఎక్కువ సంతృప్తినిస్తోందంటూ మరోసారి తన పెద్దమనసును చాటుకున్నారు ఇన్నారెడ్డి.

- జి.పాండురంగ శర్మ, ఈనాడు, వరంగల్‌
ఫొటోలు: రవీందర్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.