close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సీతమ్మకు చేయిస్తి..!

సీతమ్మకు చేయిస్తి..!

జగదానందకారకుడైన రాముడికీ జగన్మాత జానకికీ జరిపించే కళ్యాణం కడుకమనీయం. అసలు కళ్యాణం అంటే అది సీతారాములదే. కళ్యాణంలోని ప్రతి ఘట్టం కనులకు పండగే. ఇందులో అమితమైన భక్తితో రామదాసు చేయించిన ఆభరణాలను సీతారాములకు అలంకరించే ఘట్టం మరీ ప్రత్యేకం. శతాబ్దాల కి¨ందటే స్వామికీ సీతమ్మకీ ఏయే నగలు అలంకరించాలో వాటన్నింటినీ అమర్చిన గొప్ప భక్తాగ్రజుడు శ్రీరామదాసు. తానీషాల కాలంనాటి ఆభరణాలకు రాములోరి దర్బారులో ఇప్పటికీ విశిష్ట స్థానమే.

ప్రపంచంలోని ఏ దేవుడి నగలైనా భక్తులు చేయిస్తారు. కానీ ఒక్క భద్రాద్రిలో మాత్రం స్వామివారి నగలకు స్వయంగా ఆ శ్రీరాముడే కదలి వచ్చి మూల్యం చెల్లించుకున్నాడు. తానీషా ప్రభువుల ఖజానాలోని నగదుతోనే కంచర్ల గోపన్న రాములవారికీ, సీతమ్మకూ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులకూ నగలు చేయిస్తాడు. దీంతో ఆగ్రహించిన తానీషా గోపన్నను చెరసాలలో బంధిస్తాడు. అంతట శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి వచ్చి ఆరు లక్షల రామమాడలను రాశిగా పోసి తానీషాకు ఇస్తాడు. అలా రాముడు తన ఆభరణాలకు తానే మూల్యం చెల్లించుకున్నట్లయింది. దీంతో రామదాసు భక్తిని తెలుసుకున్న తానీషా నాటి నుంచీ రాములవారి కళ్యాణానికి పట్టువస్త్రాలూ, ముత్యాల తలంబ్రాలూ సమర్పించడం ప్రారంభించాడు. నేటికీ భద్రాచలం రాములవారి దేవస్థానంలో చైత్ర శుద్ధ నవమి రోజు (ఈ ఏడాది మార్చి 26)న జరిగే కళ్యాణానికి ప్రభుత్వం తరఫున వీటిని అందజేస్తూ ఉండటం విశేషం.
రామదాసు ప్రత్యేక కృషి
భద్రాచలంలోని సీతారాముల వారికి ఎలాంటి ఆభరణాలు తయారు చేయించాలి అనేదానిపై రామదాసు ఎంతో కృషి చేశాడని చెబుతారు. వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే స్వామివారికి అలంకరించే నగలు, కిరీటాలు, శఠారి, ఛత్ర, చామరాలు, వస్త్రాలు మొదలైనవాటిని తయారు చేయించాడన్నది పండితుల విశ్లేషణ. రామదాసు భక్తితో సీతారాములకు చేయించిన ఆభరణాల్లో అత్యంత వైభవోపేతమైంది చింతాకు పతకం. చింత చిగుర్లాంటి ఎర్రని రాళ్లను పొదిగిన
ఈ నగ తయారీకి ఆ కాలంలోనే పదివేల వరహాలు వెచ్చించాడట రామదాసు. జానకీనాథుడి అలంకరణకు కలికితురాయినీ చేయించాడు. ఇక లక్ష్మణ స్వామికి ముత్యాల పతకాన్ని, భరత శత్రుఘ్నులకు పచ్చల పతకం, రవ్వల మొలతాడు చేయించాడు.
మూడు సూత్రాలు!
చైత్రశుద్ధ నవమినాడు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభోగంగా జరుగుతుంది. ఈ కళ్యాణ వేడుకలో స్వామివారు కట్టే తాళిబొట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ వేడుకలో రాములవారు సీతమ్మ మెడలో మూడు సూత్రాలను కడతాడు. పితృవాత్సల్యంతో భక్త రామదాసు చేయించిన మంగళ పతకాన్ని కలిపి మొత్తం మూడు సూత్రాలను కళ్యాణంలో సీతమ్మవారికి ధరింపజేయడం భద్రాచల క్షేత్ర ఆచారం. ఇలా మూడు సూత్రాలతో తయారైన మంగళసూత్రం ఎన్నో వేదాంత రహస్యాలను చాటిచెబుతుంది. కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలకు ఈ సూత్రాలు సంకేతాలు. వైరముడి...
రామయ్యకు ఉన్న ఆభరణాల్లో మరో ప్రత్యేకమైన ఆభరణం వైరముడి. ఈ కిరీటాన్ని కూడా ఈ ప్రాంతానికి తహసీల్దారుగా వచ్చిన వ్యక్తే చేయించడం విశేషం. 1880 ప్రాంతంలో నెల్లూరుకు చెందిన రంగరాయుడు అనే భక్తుడు భద్రాచలానికి తహసీల్దారుగా వచ్చినప్పుడు దీన్ని చేయించినట్టు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి.
స్వర్ణ పుష్పార్చన
భద్రాద్రి రామయ్యకు ప్రతి ఆదివారం స్వర్ణ పుష్పార్చన జరుగుతుంది. ఈ అర్చనకు ఉపయోగించే నూట ఎనిమిది స్వర్ణ పుష్పాలను చినజీయర్‌ స్వామి బహూకరించారు. అలాగే ప్రతి శనివారం స్వర్ణ తులసీ దళాలతో మూలవిరాట్టును పూజిస్తారు. శతవర్ష ఉత్సవాల్లో భాగంగా సుమారు అయిదు కిలోల బంగారంతో వీటిని చేయించారు. బెంగళూరుకు చెందిన ఒక భక్తుడు మూడున్నర కోట్ల రూపాయల విలువైన పదికిలోల బంగారు కవచాలను శ్రీరామచంద్రమూర్తికి సమర్పించాడు. వీటిని ప్రతి శుక్రవారం మూలవిరాట్టుకు అలంకరిస్తారు.
ఒడిలో సీతమ్మతో, చేతిలో శంఖచక్రాలతో భద్రాచలంలో కొలువై ఉన్న శ్రీరాముడి దర్శనం జగన్మంగళ దాయకం. అందుకే నవమినాటి రామయ్య పెళ్లిలో రామదాసు చేయించిన మంగళసూత్రాలను అర్చకస్వాములు ఆనందంగా చూపిస్తుంటే, ఎంత దూరాన్నుంచైనా రెండు చేతులతో కళ్లకద్దుకుని తమ భక్తిని ప్రదర్శిస్తారు. ఈ సందడి ఒక్క భద్రాచలంలోనే కాదు ప్రతి తెలుగు పల్లెలోనూ కనిపిస్తుంది. ప్రతి హృదయం రాముడి కళ్యాణాన్ని చూసి పరవశిస్తుంది.

- మామిడి నాగేశ్వరరావు, న్యూస్‌టుడే, భద్రాచలం

శ్రీరామ నవమి

హిందువులకు ముఖ్యమైన పండగల్లో శ్రీరామనవమి ఒకటి. శ్రీరామచంద్రుడు విళంబి నామ సంవత్సరంలో, చైత్రశుద్ధ నవమినాడు, పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో జన్మించాడు. చైత్రశుద్ధ నవమినే శ్రీరామనవమిగా భావిస్తారు. దేవుడు అవతరించిన రోజే కళ్యాణాన్ని ఆచరించాలన్నది పాంచరాత్రాగమ సంప్రదాయం. ఆ ప్రకారం శ్రీరామనవమినాడే సీతారాముల కళ్యాణం జరిపించడం అనాదిగా వస్తోంది. ఈ వేడుక కూడా అభిజిత్‌లగ్నంలోనే జరగడం విశేషం.

శ్రీరాముడిలాగే రామనామం కూడా చాలా విశిష్టమైంది. రామనామాన్ని జపంగానే కాదు బిడ్డకు పేరు పెట్టి పిలిచినా, ఏమరపాటుగానైనా స్మరించినా పుణ్యమేనంటాడు పోతన. ‘రామా’ అని పలకగానే మనలోని పాపాలన్నీ పటాపంచలైపోతాయన్నది ఆర్యోక్తి. అంతటి మహిమాన్విత నామాన్ని కలిగిన శ్రీరామచంద్రుడి కళ్యాణం లోకానికీ పండగే. అలాగే పూజ పూర్తయిన తర్వాత మిరియాలూ బెల్లంతో చేసిన పానకాన్నీ, వడపప్పునూ నైవేద్యంగా పెడతారు. పానకం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదిగా చెబుతారు. దీని వెనుక ఆరోగ్యపరమైన పరమార్థం కూడా ఉంది. పానకంలో వాడే మిరియాలూ, యాలకులూ వసంత రుతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అలాగే వడపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలవచేస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది. వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది కూడా.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.