close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఐదు డిగ్రీల చలిలో సముద్రస్నానం..!

ఐదు డిగ్రీల చలిలో సముద్రస్నానం..!

భూమండలమ్మీద అత్యంత తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రదేశం ఎక్కడ ఉందీ... దక్షిణ భూభాగం చిట్టచివర ఉన్న ఖండం ఏదీ... అనగానే అందరికీ గుర్తొచ్చేది అంటార్కిటికానే. భూమండలంమీద ఉన్న పొడి ప్రదేశం కూడా అదే. నివాసానికి ఏమాత్రం అనువైన పరిస్థితులు లేని ఆ ఖండంలోకి ఇరవయ్యో శతాబ్దం వరకూ మనిషి వెళ్లిన జాడ కూడా లేదు. కానీ నేడు అది ఓ సాహస పర్యటక ప్రదేశంగా అభివృద్ధి చెందడం విశేషం...’  అంటూ అక్కడి విశేషాలు చెప్పుకొస్తున్నారు. నెల్లూరుకి చెందిన డా. కె.ఎల్‌. సంపత్‌కుమార్‌.
నార్వేకి చెందిన రోల్డ్‌ అమండసేన్‌ 1911లో తొలిసారిగా దక్షిణ ధృవాన్ని చేరుకున్నాడు. కానీ అక్కడి అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఏ దేశమూ ఆ ఖండాన్ని ఆక్రమించుకోలేదు. ఎవరూ అక్కడికి వెళ్లడానికి ఉత్సుకత కూడా చూపించేవారు కాదు. కానీ ప్రస్తుతం ప్రపంచ ఉష్ణోగ్రతలలో జరుగుతున్న మార్పుల కారణంగా అక్కడి హిమనీ నదాల్లో కదలికలు ఏర్పడుతున్నాయి. దాంతో వాటిని పరిశీలించేందుకూ మరెన్నో విషయాలమీద ప్రయోగాలు చేసేందుకూ అక్కడ వివిధ దేశాలు ప్రయోగశాలలు నెలకొల్పాయి. మనదేశం తొలిసారిగా 1981లో దక్షిణ గంగోత్రి, 1995లో మైత్రి అనే ప్రయోగశాలలను నెలకొల్పింది. ఆపై 2015లో దాదాపు ముప్ఫై గదుల సముదాయంతో అతి పెద్దదైన భారతి అనే ప్రయోగశాలను ప్రారంభించింది. గత శతాబ్దం చివరి వరకూ ఈ హిమఖండంలో ప్రయోగశాలలో పనిచేసే సిబ్బంది మాత్రమే ఉండేవారు. వేరే ఎవరూ అక్కడికి వెళ్లేవారు కాదు. కానీ నేషనల్‌ జియోగ్రాఫిక్‌, డిస్కవరీ చానల్‌ వాళ్లు ఆ ఖండం గురించి టీవీల్లో చూపించడంతో క్రమంగా దాన్ని చూడాలన్న ఆసక్తితో అక్కడ పర్యటించడం క్రమేణా పెరిగింది. అది కూడా వేసవి కాలంలో మాత్రమే అంటే నవంబరు-మార్చి మధ్యలోనే పర్యటకులు ఆ ఖండంలో పర్యటిస్తుంటారు. మిగిలిన సమయంలో అక్కడ అడుగు పెడితే గడ్డకట్టుకు పోవాల్సిందే. వీసా అక్కర్లేదు!
అంటార్కిటికా వెళ్లడానికి మూడు దారులు ఉన్నాయి. మొదటిది న్యూజిలాండ్‌, రెండోది చిలీ, మూడోది అర్జెంటీనా మీదుగా వెళ్లేది. నేను అర్జెంటీనా మీదుగా వెళ్లాలనుకుని ఆ దేశానికి చెందిన వీసా తీసుకున్నాను. నిజానికి అంటార్కిటికా ఖండ పర్యటనకు వీసా అక్కర్లేదు. కానీ ఏ దేశం మీదుగా వెళతామో ఆ దేశానికి చెందిన వీసా అవసరం. చెన్నై నుంచి బ్యునస్‌ఎయిర్స్‌కు చేరుకున్నాను. అక్కడి నుంచి దక్షిణ భాగంలో ఉన్న యూస్వాయా నగరానికి వెళ్లాను. యూస్వాయాలో ఒకరోజు బడలిక తీర్చుకున్నాం. అక్కడే నా ప్రయాణానికి కావాల్సిన దుస్తులూ సాక్సులూ గ్లోవ్సూ.. వంటివి తీసుకున్నాను. మంచులో నడవడానికి అనువైన బూట్లు నావలోనే ఇస్తారట. అక్కడి నుంచి పడవలో బయలుదేరాం. చుట్టూ మంచుతో కప్పబడిన ఆండీస్‌ పర్వత్‌ శ్రేణులూ అందమైన భవనాలతో యూస్వాయా నగరం చాలా అందంగా ఉంటుంది. యూస్వాయా... ఓ నావ!
సాయంత్రం నాలుగు గంటలకు అంటార్కిటికా వెళ్లడానికి యూస్వాయా అనే నావలో బయలుదేరాం. అందులో 88 మంది ప్రయాణికులూ, 33 సిబ్బందీ ఉన్నారు. మా పర్యటన మొత్తం పన్నెండు రోజులు. ఆ పన్నెండు రోజులూ నావలోనే గడపాలి. అందుకు అనుగుణంగా నావలోనే వసతి గదులూ, గ్రంథాలయమూ, భోజనశాలా... ప్రయాణికులందరూ కలిసి కూర్చోవడానికి వీలుగా మీటింగ్‌ హాలూ ఉన్నాయి. రాత్రి భోజన సమయంలో నావలోని డాక్టర్‌, సీ సిక్‌నెన్‌ను నివారించడానికి ట్యాబ్లెట్లు ఇచ్చారు. అంటార్కిటికా సముద్రంలో భీకరమైన అలల మధ్య రెండు రోజులు ప్రయాణించాం. ట్యాబ్లెట్లు వేసుకోకపోతే మా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఆ రెండు రోజుల్లో గైడు అన్ని విషయాలనూ వివరించాడు. జనవరి రెండు మధ్యాహ్న సమయానికి బీగెల్‌ చానల్‌ దాటి, మెకినల్‌ పాస్‌ చేరుకున్నాం. సముద్రంలో అలలు చాలావరకూ తగ్గిపోయాయి. సాగరజలాలమీద తేలియాడే పెద్ద మంచు శకలాలూ, దూరంగా హిమనీ నదాలూ కనిపించసాగాయి. అంటార్కిటికా ఖండం దగ్గరకు వచ్చినట్టు తెలిసింది. అక్కడక్కడా పెంగ్విన్‌ పక్షులు చేపలను పట్టుకుంటూ కనిపించాయి. సాయంకాలం మూడు గంటలకు మేమందరం లైఫ్‌ జాకెట్లు వేసుకుని, లాండింగ్‌ బే కు వెళ్లాం. అప్పటికే సిబ్బంది జోడియాక్‌ అనే చిన్న మోటారుబోటులను నావలోంచి దించి, మాకోసం సిద్ధం చేశారు. ఈ బోటులో 8 నుంచి 10 మంది ప్రయాణికులు కూర్చోవడానికి వీలవుతుంది. వాటిలో ఎక్కి దాదాపు పదిహేను నిమిషాల్లో అయటాటో అనే ద్వీపానికి వెళ్లాం. అక్కడ ద్వీపం అంతా మంచుతో కప్పబడి ఉంది. మధ్యలో మంచులేని ఓ గుట్టమీద పెంగ్విన్ల కాలనీ ఉంది. వీటి రెక్కలు చిన్నగా ఉండి, సముద్రపు నీళ్లలో ఈదడానికి వీలుగా తెడ్లలా పరిణామం చెందాయి. మర్నాడు ఉదయం యూస్‌ ఫుల్‌ అనే ద్వీపానికి వెళ్లాం. అక్కడి పెంగ్విన్ల కాలనీలో అడేలి జాతికి చెందిన పెంగ్విన్లను చూశాం. 40 నుంచి 50 సెంటీమీటర్ల పొడవుతో వీపుభాగంమీద నల్లటి చారతో ఉన్నాయివి. అవి నడుస్తుంటే చూడముచ్చటగా అనిపించింది. అవి కూడా మమ్మల్ని చూసి అస్సలు భయపడలేదు. ఆ రోజు సాయంకాలం పోర్టు లాకరాయ్‌, జోగ్లా పాయింట్‌కు వెళ్లాం.పోర్ట్‌ లాకరాయ్‌ ఒకనాటి బ్రిటిషు నావికుల వసతి గృహం. వాళ్లు దాదాపు శతాబ్దం క్రితం దక్షిణ ధృవం గురించిన అన్వేషణ కోసం అంటార్కిటికా ప్రాంతానికి వచ్చి దాదాపు ఆరు నెలలు ఇక్కడ గడిపారు. నాటి పరిస్థితుల గుర్తుగా ఇక్కడ ఓ మ్యూజియం ఉంది. వాళ్లు ఆనాడు ఎలా నివసించారో కళ్లకు కట్టినట్లుగా అమర్చారు. అక్కడ బ్రిటిష్‌ వారి పోస్టాఫీసు ఉంది. అంటార్కిటికా ప్రయాణానికి గుర్తుగా అక్కడున్న గిఫ్టు షాపులో ఏదైనా వస్తువుని కొని ప్రపంచంలోని ఏ ప్రదేశానికైనా పంపించవచ్చు. అది మూడునాలుగు రోజుల్లో ఆయా ప్రదేశాలకు చేరుతుందట. మేము ఒక పోస్ట్‌కార్డు కొని ఇండియాకు పంపించాం. పక్కనే ఉన్న జోగ్లా పాయింట్‌లో సముద్ర నీటి కాకుల కాలనీ ఉంది. జెంట్యూ అనే జాతికి చెందిన పెంగ్విన్ల కాలనీ కూడా అక్కడే ఉంది. ఈ జాతి పెంగ్విన్లకు కళ్లు నీలి రంగులో ఉంటాయి. ఇరుకు దారిలో... జలసంధిలో..!
మర్నాడు ఉదయం లుమేహ్‌ జలసంధిని దాటాం. ఇది దాదాపు పది కిలోమీటర్ల పొడవూ అర కిలోమీటరు వెడల్పూ ఉంది. చుట్టూ అందమైన గ్లేసియర్లతో ఈ జలసంధి చూడ్డానికి ఎంతో అద్భుతంగా అనిపించింది. నావకు అడుగడుగునా ఐస్‌బర్గ్‌లు అడ్డు వస్తుండడంతో కెప్టెన్‌ దాన్ని ఎంతో జాగ్రత్తగా నడపాల్సి వచ్చింది. కేవలం ఆ పది కిలోమీటర్ల దూరం దాటడానికి దాదాపు గంట సమయం పట్టింది. ఓ వారం క్రితం వచ్చిన ఒక నావ ఆ జలసంధిని దాటలేక మరో మార్గంలో వెళ్లిందట. దీన్ని దాటాక పీటర్‌ మాన్‌ అనే ద్వీపానికి వెళ్లాం. ఇదో చిన్న ద్వీపం. మొత్తం మంచుతో కప్పబడి ఉంది. అక్కడ ఉష్ణోగ్రత మైనస్‌ ఏడు డిగ్రీలు. దారి అంతా మంచుతో కప్పబడి ఉంది. చుట్టూ నీలిరంగు జలాలూ దూరంగా హిమనీ నదాలతో కప్పబడిన కొండలతో మాటల్లో వర్ణించలేనంత అందంగా ఉందా ద్వీపం. అక్కడకు వెళ్లడానికి చాలా సమయం పట్టింది. దారి అంతా మంచుగడ్డలే. సాయంకాలం మూడు గంటలకు సాల్‌ పెట్రియర్‌ జలసంధిలో విహరించడానికి మోటారుబోటుల్లో వెళ్లాం. ఈ జలసంధి దాదాపు ఇరవై చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఈ జలసంధిలో నీరు అలలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ ఎత్తైన పర్వతాలూ మంచుతో కప్పబడిన శిఖరాలూ హిమనీ నదాలూ నీటిలో తేలియాడే మంచుగడ్డలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉందా ప్రదేశం. నీళ్లలో తేలియాడే ఆ మంచు గడ్డలు అక్కడ వీచే గాలులకూ సూర్యరశ్మి వేడికీ వివిధ ఆకారాల్లో కరిగి చూడ్డానికి అద్భుతంగా ఉందా దృశ్యం.
మర్నాడు ఉదయం నెకో హార్బర్‌ అనే చోటుకి వెళ్లాం. ఇక్కడ అడుగుపెడితే అంటార్కిటికాకు చేరుకున్నట్లే. ఇక్కడి సముద్ర జలాలు ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా ప్రశాంతంగా ఉన్నాయి. పూర్వం ఇక్కడ ఓ పెద్ద నావమీద వేల్స్‌ ఫ్లోటింగ్‌ ఫ్యాక్టరీ ఉండేది. అంటే తిమింగలాలను పట్టి చంపి, వాటి కొవ్వును వేరు చేసే ఫ్యాక్టరీ అన్నమాట. ప్రస్తుతం తిమింగలాల వేటను నిషేధించడంతో దాన్ని మూసేశారు. ఆ వేళ మధ్యాహ్నం హూవర్‌ హిల్‌ అనే ద్వీపానికి వెళ్లాం. ఈ ద్వీపం మధ్యలో ఓ పెద్ద పెంగ్విన్ల కాలనీ ఉంది. ప్రపంచంలో ఇదే పెద్ద పెంగ్విన్ల కాలనీ. అక్కడ వాటి సంఖ్య పదివేలకు పైనే.మర్నాడు జనవరి ఆరో తేదీన ప్యారడైజ్‌ బేకి వెళ్లాం. ఇక్కడ అర్జెంటీనా దేశ పరిశోధనా కేంద్రం బ్రౌన్‌ ఉంది. ఆ సాయంత్రం అంటార్కిటికా ఖండానికి పశ్చిమతీరాన ఉన్న ఫోయన్‌ హార్బర్‌కి వెళ్లాం. దారిలో తిమింగలాలనీ, సముద్రం మధ్యలో ఐస్‌బర్గ్‌లనీ, వాటిమీద ఉన్న సీలు జంతువుల్నీ చూశాం. 

మంచు ఖండంలో సముద్రస్నానం!
జనవరి ఏడో తేదీ ఉదయం రెండు కొండల మధ్యా ఇరుకైన దారిలోంచి నావ బయలుదేరింది. ఈ దారిన వెళ్లేటప్పుడు నావకు అభిముఖంగా ఎంతో వేగంగా గాలులు వీచాయి. అందుకే ఈ దారిని నెప్ట్యూన్‌ బెల్లోస్‌ అంటారు. పది గంటల సమయానికి టెలికాం తీరానికి చేరుకున్నాం. దీని ఒడ్డున పెండులం కోవ్‌ అనే ప్రాంతం ఉంది. ఇక్కడ గతంలో అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం వల్ల ఏర్పడ్డ ఒక పెద్ద బిలం ఉంది. చివరిసారి 1968లో అగ్నిపర్వతం నుంచి లావా వెలువడింది. బిలం చుట్టూ ఇప్పటికీ బూడిదతో కూడిన నల్లని మట్టి ఉంది. ఇక్కడి సముద్రం అలలు లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నావ సిబ్బంది సముద్ర స్నానం చేయమని పోత్సహించడంతో అందరం చేశాం. ఆరోజు మాకోసమే అన్నట్లు ఉష్ణోగ్రత ఐదు డిగ్రీలకు పెరిగింది. బతికిపోయాం.అదేరోజు సాయంకాలం హాఫ్‌మూన్‌ అనే ద్వీపానికి వెళ్లాం. ఆ ద్వీపం నిజంగానే చంద్ర వంక ఆకారంలో ఉంది. ఇది గ్రీన్‌విచ్‌,   లివింగ్‌స్టోన్‌ ద్వీపాల మధ్య ఉండటంతో అలలు లేకుండా నావలు లంగరు వేసుకుని నిలబడ్డానికి వీలవుతుంది. ఈ ద్వీపంలో అర్జెంటీనా వారి సమ్మర్‌ స్టేషన్‌ ఉంది. ఇక్కడ చిన్‌స్ట్రాప్‌ పెంగ్విన్లు ఉండటం విశేషం. కానీ ఎంపరర్‌ పెంగ్విన్లను మాత్రం చూడలేకపోయాం. అవి మూడు అడుగుల ఎత్తు ఉంటాయట. సాధారణంగా ఇవి అతి తక్కువ ఉష్ణోగ్రతలున్న ప్రదేశాల్లో ఉంటాయి. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా అవి మరింతగా దక్షిణ ధృవం వైపునకు వలసపోయాయి. అదొక్కటీ తప్ప అంటార్కిటికాను తృప్తిగా చూసిన ఆనందంతో వెనుతిరిగాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.