close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బూరుగుపూడి... ఓ గెలుపు పాఠం!

బూరుగుపూడి... ఓ గెలుపు పాఠం!

ఆ పంచాయతీ చెత్తతో సంపద సృష్టిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలకు కార్పొరేట్‌ స్థాయి చదువులు చెప్పిస్తుంది. గర్భిణులకు సీమంతం చేస్తుంది. వారికి రోజూ రకరకాల పండ్లని అందిస్తుంది. ఇంటికి ఆకు కూరలూ కూరగాయలూ పంపిస్తుంది. రైతులకు సేంద్రియ ఎరువుల్నీ తయారుచేసిస్తుంది. అంతేనా... మహిళలు వంటలతోనే నెలనెలా ఆదాయం పొందే అవకాశం చూపిస్తుంది. అభివృద్ధికి మారుపేరైన ఆ ఊరే బూరుగుపూడి.
ది 2013 సంవత్సరం... తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడి మండలంలో ఉన్న బూరుగుపూడిలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఫలితం ఊహించిందే... సర్పంచి పదవికి రెండోసారి పోటీ చేసిన పాశంశెట్టి సూర్యచంద్రదే విజయం. తన కుటుంబం మీద ఆ గ్రామ ప్రజలు చూపిన అభిమానానికీ నమ్మకానికీ ఆయన కదిలిపోయాడు. వారి ప్రేమకు ప్రతిఫలంగా ఏమివ్వగలనని బాగా ఆలోచించాడు. అంతకుముందు సర్పంచ్‌గానే ఊరికి మంచి చేయాలనుకునేవాడు. కానీ ఆరోజు నుంచీ పదిహేనువందల కుటుంబాలున్న ఆ పల్లెకు తను పెద్ద కొడుకుగా మారాలనుకున్నాడు. ప్రతి ఇంటినీ తన ఇంటిలా చూసుకోవాలనుకున్నాడు. అంతే... బూరుగుపూడిలో మార్పు మొదలైంది.
మొదటి అడుగు...
ఇల్లు శుభ్రంగా కళకళలాడుతూ ఉంటేనే ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది... అంటారు పెద్దలు. నిజానికిది సంప్రదాయమో నమ్మకమో కాదు. పరిశుభ్రత లేనిచోట ఆరోగ్యం ఉండదు. రోగాలతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటే చేతిలో డబ్బు నిలవదు. ఆరోగ్యం లేకపోతే అసలేపనీ చెయ్యలేం. అప్పుడు సంపాదనా కష్టమే. ఇది తెలియక చాలామంది ఇంటిని శుభ్రం చేస్తారు కానీ ఆ చెత్తను వీధుల్లో పోస్తారు. దాంతో సమస్య అక్కడే ఉంటుంది. ఒకప్పుడు బూరుగుపూడి పరిస్థితి కూడా ఇలాగే ఉండేది. ఇళ్లలోని మురుగునీరు రోడ్లమీదికి పారేది. ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలు దర్శనమిచ్చేవి. అందుకే, తొలి అడుగుని స్వచ్ఛత దిశగా వేశాడు సర్పంచి సూర్యచంద్ర. ఊళ్లో అందరినీ పిలిచి అభివృద్ధికి పరిశుభ్రత ఎంత అవసరమో వివరించాడు. ఇకమీదట ఎవరూ వ్యర్థాల్ని రోడ్లమీద పడెయ్యకూడదు... అని గట్టిగా చెప్పాడు. అంతలో గుంపులో కూర్చున్న ఓ పెద్దావిడ... ‘మరి చెత్తను ఎక్కడ పడెయ్యాలయ్యా...’ అడిగింది. నిజమే ఎక్కడ వెయ్యాలి... ఆ ప్రశ్నకు దొరికిన సమాధానమే ‘చెత్త నుంచి సంపద సృష్టి’ పథకం. కొద్దిరోజుల్లోనే గ్రామంలో చెత్త నుంచి సేంద్రియ ఎరువుల్ని తయారుచేసే కేంద్రం ప్రారంభమైంది. రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చిన తొలి గ్రామం బూరుగుపూడే. రోజూ ఉదయం తడి, పొడి వ్యర్థాలను తీసుకెళ్లడానికి రిక్షాలు ఊరంతా తిరిగేవి. కానీ ఏ విషయంలోనైనా ఒకేసారి మార్పు రావడం అంత సులభమేం కాదు. అక్కడా అదే జరిగింది. కొందరు వ్యర్థాల్ని వేరు చేసి రిక్షాలో వేసేవాళ్లు కానీ మరికొందరు రోడ్లమీదే పడేసేవారు. అయినా ఆ సర్పంచి ఎవరినీ పల్లెత్తు మాట అనేవాడు కాదు. పైగా తనే ఆ చెత్తను రిక్షాల్లోకి ఎత్తేవాడు. ఆ మంచితనం చూసి జనం పూర్తిగా మారారు. ప్రస్తుతం ఆ ఊళ్లో పోగైన జీవ వ్యర్థాలతో ప్రతి నెలా పది టన్నుల వర్మీ కంపోస్టు తయారవుతోంది. దీన్ని పంచాయతీలోని రైతులకు కిలో రూ.అయిదు చొప్పునా ఇతర గ్రామాల వారికి కిలో రూ.ఎనిమిదికీ అమ్ముతారు. అలా పంచాయతీకి వస్తున్న ఆదాయం నెలకు రూ.50వేలకు పైనే. అక్కడి రైతులు 1300 ఎకరాల్లో సేంద్రియ పంటలు పండించగలుగుతున్నారన్నా కారణం ఆ జీవ ఎరువులే. ప్లాస్టిక్‌ వ్యర్థాలను అమ్మడం ద్వారానూ నెలకు రూ.15వేలకు పైగా సమకూరుతోంది. అంటే ఆరోగ్యానికి ఆరోగ్యం... ఆదాయానికి ఆదాయం అన్నమాట. లక్ష్మీకళ అంటే ఇది కాదూ... పచ్చ‘ధనం’
నాలుగేళ్ల కిందట బూరుగుపూడి ఎంత వెనుకబడి ఉండేదంటే సగం ఇళ్లలో మరుగుదొడ్లు కూడా ఉండేవి కాదు. ప్రభుత్వ నిధులు ఇప్పిస్తాం మరుగుదొడ్లు నిర్మించుకోండి, అంటే ‘ఆ డబ్బుతో మొత్తం పని అవ్వదు, సొంతంగా ఖర్చుపెట్టే స్తోమత మాకు లేదు’ అంటూ కొందరు వెనకడుగు వేశారు. దాంతో ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్ముకు పంచాయతీ నిధులను చేర్చి ఊళ్లోనే అవసరమైన సామగ్రిని తయారుచేయించడంతో మరుగుదొడ్లు పూర్తయ్యాయి. పల్లెలో వస్తున్న మార్పుని చూశాక దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలనే కోరిక క్రమంగా జనంలోనూ కలిగింది. ఊరికోసం ఏ పని మొదలుపెట్టినా మేముసైతం అంటూ చేతులు కలిపేవారు. ఊరంతా సిమెంటు రోడ్లు వేయించాలనుకున్నప్పుడు అంచనాల్లో రూ.రెండు కోట్లు అవుతుందని తేలింది. ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరుచేయగా గ్రామాన్ని దత్తత తీసుకున్న కాకినాడ ఎంపీ తోట నరసింహం రూ.50లక్షలు సాయమందించారు. ‘ఇంకా యాభైలక్షలు కావాలి. ఎలా... ఆ విలువకు కూలీల్ని తగ్గించి మనమే శ్రమదానం చేసుకుందామా...’ అన్న సూర్యచంద్ర మాటలకు ఊరంతా పలుగూ పారా పట్టుకుని కదిలి వచ్చింది. మీతో పాటే నేనూ... అంటూ సర్పంచి కూడా కూలీలా పనిచేశాడు. ఆరునెలలు గడిచేసరికి ఊళ్లో మట్టిరోడ్ల జాడే లేకుండా పోయింది.  ఇలాగే ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి వీధిలోనూ వ్యర్థాల్ని వేసేందుకు కంపోస్ట్‌ పెట్టెల్నీ పశువుల దాహాన్ని తీర్చేందుకు నీటితొట్టెల్నీ ప్రజలే నిర్మించుకున్నారు. ఇళ్లల్లో ఇంకుడు గుంతలూ వెలిశాయి. దాంతో భూగర్భజలాలు పెరిగాయి. ఆ ప్రగతి ప్రయాణం అక్కడితోనూ ఆగలేదు. ఇంటింటికీ నీటి పంపుతో ఆ సమస్యా దూరమైంది. సుజల పథకం ద్వారా ఇళ్లకే శుద్ధిచేసిన తాగునీరు వచ్చేస్తోంది. బూరుగుపూడి మొత్తం జనాభా ఆరువేలు. ప్రతి వెయ్యి మందికీ ఓ గ్రీన్‌ అంబాసిడర్‌ ఉంటారు. యువకులు బృందాలుగా ఏర్పడి ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ తమ వీధిని శుభ్రం చేస్తారు. అన్నట్లూ ఇప్పుడు ఆ ఊరు స్వచ్ఛతకే కాదు, పచ్చదనానికీ చిరునామా. పంచాయతీ నిధులతో 20వేల మొక్కల్ని నాటి గ్రామాన్ని ఉద్యానవనంలా మార్చేశారు మరి. అంతేనా, ఆహ్లాదంతో పాటు ఫలసాయం కూడా అందేలా ప్రతి ఇంటికీ ఐదురకాల పండ్ల మొక్కల్ని ఇచ్చి నాటించారు. కలిసి ఊరిని అభివృద్ధి చేసుకోవడమే కాదు, రోజూ ఉదయం అందరూ ఓచోట చేరి యోగా చేస్తూ ఆరోగ్యాన్నీ పెంచుకుంటున్నారు బూరుగుపూడి ప్రజలు. అమ్మలా చూసుకునే పంచాయతీ
కొంతకాలం కిందట ఊళ్లో నలుగురు చిన్నారులు పుట్టగానే కన్నుమూశారు. ఇద్దరు బాలింతలూ ప్రాణాలొదిలారు. ఆ సంఘటన సూర్యచంద్ర మనసుని కలచివేసింది. బాల్యవివాహాలూ పోషకాహారలోపమే అందుకు కారణం అని తెలియడంతో ‘ఇకమీదట మన పంచాయతీలో ఇలాంటి మరణాలు సంభవించడానికి వీల్లేదు’ అంటూ తీర్మానం చేశాడు. బాల్యవివాహాల్ని కట్టడిచేసేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పడ్డాయి. మరోపక్క పోషకాహార లోపాన్ని తరిమికొట్టేందుకు గర్భిణులూ బాలింతల కోసం ‘అమ్మకడుపు చల్లగా’ పథకాన్ని ప్రారంభించింది పంచాయతీ. దీనిద్వారా రోజూ బెల్లంతో చేసిన వేరుశనగ ఉండలూ ఖర్జూరాలూ ఓ పండూ కేరట్‌ బీట్‌రూట్‌ ముక్కల్నీ అందిస్తున్నారు. దీనికితోడు చంద్రన్న అదనపు పౌష్టికాహార కార్యక్రమంలో భాగంగా రోజూ అంగన్‌వాడీ సెంటర్‌లో పాలూ ఉడికించిన గుడ్లతో పాటు భోజనాన్ని కూడా పెడతారు. చిన్నారులకోసం గ్రామంలో ఏడు అంగన్‌వాడీ కేంద్రాలను నడుపుతున్నారు. ఇక, ఊళ్లో ఏర్పాటుచేసిన ‘మహిళా శిశు పోషకాహార వనం’లో ఎలాంటి రసాయనాలూ వాడకుండా ఆకుకూరలూ కూరగాయల్ని పండించి వాటిని వారానికి రెండుసార్లు గర్భిణులూ బాలింతలూ చిన్నారులూ ఉన్న కుటుంబాలకు అందిస్తారు. ఇలా మాతా శిశు మరణాల్ని అదుపులోకి తేవడమే కాదు, కాబోయే తల్లులకు చీరా గాజులూ పెట్టి సొంత ఖర్చుతో సీమంతం చేయిస్తూ మనసున్న అన్నగానూ పేరు తెచ్చుకున్నాడు సూర్యచంద్ర. ప్రభుత్వ బడి... కార్పొరేట్‌ విద్య
సమయం... ఉదయం పదకొండు గంటలు... బూరుగుపూడి ప్రభుత్వ పాఠశాలలో ఆరోతరగతి గది... పిల్లలందరూ కళ్లు మూసుకుని కూర్చున్నారు. కాసేపటికి ఒక్కొక్కరూ లేచి నిలబడి నేను పెద్దయ్యాక డాక్టర్‌ని అయ్యి అందరికీ వైద్యం చేస్తా.
నేను పోలీసునవుతా. నేను ఇంజినీర్‌ని అయిపోతా... అంటూ చెబుతున్నారు. ఎదురుగా కూర్చున్న సర్పంచి అందరు చెప్పేవీ ఓపిగ్గా వింటూ పుస్తకంలో నోట్‌ చేసుకుంటున్నాడు. ఆ ఊరి బాగోగులే కాదు, అక్కడి పిల్లల చదువు బాధ్యత కూడా ఆయనదే మరి. అందుకే, ఆ పుస్తకంలో వారి మార్కులతో పాటు పిల్లల ఆసక్తులూ ఆశయాలన్నీ నమోదవుతాయి. బాగా మార్కులు తెచ్చుకున్న పిల్లలకు అమ్మలా బహుమతులిచ్చి ప్రోత్సహిస్తాడు. వెనుకబడిన పిల్లలను నాన్నలా దగ్గరకు తీసుకుని ‘ఒరేయ్‌ నువ్వు డాక్టర్‌వి అవ్వాలంటే ఇంకొంచెం బాగా చదవాలిరా’ అంటూ ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తాడు. ఊళ్లో ఏ చిన్నారి పుట్టినరోజైనా పిల్లలందర్నీ పిలిచి కేక్‌ కట్‌ చేయిస్తాడు. ఇక, పాఠశాలలో అన్ని వసతులూ ఉండేలా, మెరుగైన విద్యనందించేలా చూసుకోవడం, తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లల గురించి ఆరాతీయడం... లాంటివన్నీ సూర్యచంద్ర రోజువారీ కార్యక్రమాల్లో భాగం. ఓసారి కొంతమంది తల్లిదండ్రులు పేరెంట్స్‌ మీటింగ్‌కి రాలేదు. దాంతో వారి తరఫున తానే శిక్ష వేసుకుని ఎంతమంది రాలేదో అన్ని గుంజిళ్లు తీశాడు. అంతే, ఆ తరవాత ఎన్ని పనులున్నా పెద్దలు పేరెంట్స్‌ మీటింగ్‌కి రావడం మానలేదు. 2001లో పదోతరగతిలో బూరుగుపూడి ఉన్నత పాఠశాల ఉత్తీర్ణత 43శాతం. మండలంలో ఆఖరున ఉన్నది అదే. అలాంటి బడిలో 2017 నాటికి ఉత్తీర్ణత నూటికి నూరు శాతం అయింది. మొత్తం విద్యార్థుల సంఖ్య వెయ్యికి చేరుకుంది. వారిలో సర్పంచి సూర్యచంద్ర కొడుకు కూడా ఒకడు. ఇప్పుడు ఊళ్లో దాదాపు అందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు మరి. ఆ బడిలో బోధన ఎంతబాగా ఉందో చెప్పడానికి ఇది చాలదూ...పిల్లలకు ఆటా పాటా
బాల్యం అంటే... జీవితానికి సరిపడా ఆటపాటలనూ మధుర జ్ఞాపకాలనూ మూటకట్టుకునేలా ఉండాలి. బూరుగుపూడి పిల్లలకు ఆ అవకాశాన్ని కల్పించేందుకు ఏర్పడినవే బాలల కమిటీలు. ఒక్కో వీధిలో ఉండే పిల్లలు ఒక్కో బృందంలో ఉంటారు. ఊరు మొత్తమ్మీదా 28 కమిటీల్లో కలిపి వెయ్యిమంది విద్యార్థులున్నారు. అందరూ ఓచోట చేరి రోజూ ఉదయం ఆరు నుంచి ఆరున్నరవరకూ యోగా చేస్తారు. తర్వాత గంట చదువుకుంటారు. మళ్లీ సాయంత్రం అయిదు గంటలకు అందరూ ఆడుకోవాలన్నది నియమం. వీరికోసం ప్రతి వీధిలోనూ ప్రత్యేకంగా ఆట స్థలాన్ని ఏర్పాటు చేసి, రకరకాల ఆటవస్తువుల్ని కూడా పంచాయతీనే సమకూర్చింది. ఈ ఊరి పిల్లల్ని దత్తత తీసుకున్న ‘తదేకం’ స్వచ్ఛంద సంస్థ 1.25 లక్షల ఖర్చుతో క్రీడా సామగ్రినీ పాఠశాలకోసం రూ.4 లక్షల విలువైన ఫ్యాన్లూ బెంచీలూ పుస్తకాలను కొనిచ్చింది. ఇదంతా ఆ ఊరిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వాళ్లంతట వాళ్లు వచ్చి చేసిన సాయమే.మహిళలకూ ఆదాయం...
ఆరుగాలం కష్టపడితే ఆఖరున ఆదాయం వచ్చేదే వ్యవసాయం. ఈలోగా పెద్ద ఖర్చులు తగిలితే అప్పులు చేయక తప్పదు. అందుకే, కుటుంబానికి అండగా ఉండేలా గ్రామంలోని మహిళలకూ ఆదాయమార్గం చూపించాలనుకున్నాడు ఆ ఊరి సర్పంచి. ఊరిబయట జాతీయ రహదారిని ఆనుకుని పంచాయతీ స్థలం రెండెకరాలూ అందులో పెద్ద కమ్యూనిటీ హాలూ నిరుపయోగంగా ఉన్నాయి. అక్కడ ‘డ్వాక్రా ఫుడ్‌ బజార్‌’ని ఏర్పాటుచేసి ప్రతి మహిళకూ నెలకు రూ.10వేలు ఆదాయం వచ్చేలా వెంటనే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. త్వరలో ప్రారంభమయ్యే ఈ ఫుడ్‌ బజార్‌ని 550 మంది మహిళలు బృందాలుగా ఏర్పడి నిర్వహిస్తారు. వీళ్లు అరిసెలూ బొబ్బట్లూ సున్నుండలూ జంతికలూ కారప్పూసా చెక్కలూ... ఇలా యాభై, అరవై రకాల పిండి వంటలు తయారుచేసి అమ్ముతారట. హైవే పక్కనుంచి వెళ్లేవాళ్లు లోపలికెళ్లి అన్నిటినీ చూసి కొనుక్కోవచ్చు.
ఎందరికో ఆదర్శం...
ఇప్పటివరకూ నాలుగుసార్లు ఆదర్శ గ్రామంగా ఎంపికైన ఈ పల్లె 2014లో స్వచ్ఛ బూరుగుపూడి అవార్డునూ సొంతం చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా రూ.అయిదులక్షల నగదు బహుమతినీ అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా బూరుగుపూడిలో విజయవంతం చేస్తూ పంచాయతీని అభివృద్ధి చేస్తున్న సూర్యచంద్ర కృషికి ముఖ్యమంత్రి కూడా ఫిదా అయిపోయారు. ఆయన్నుంచి మరెందరో స్ఫూర్తి పొందాలనే ఉద్దేశంతో ఓసారి మహానాడులో రెండు నిమిషాలు మాట్లాడమన్నారు. ప్రసంగం మొదలైంది. బూరుగుపూడి గెలుపు పాఠాలు ముఖ్యమంత్రి మనసునూ గెలుచుకున్నాయి. దాంతో స్వయంగా ఆయనే ఇంకా చెప్పమంటూ దాదాపు 15నిమిషాలు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఆ స్ఫూర్తి పాఠాలు వినేందుకు వివిధ స్వచ్ఛంద సంస్థలూ సూర్యచంద్రను ఆహ్వానిస్తుంటాయి. ఇక, చెత్త నుంచి సంపద కార్యక్రమం, పోషకాహారవనం... లాంటివాటి గురించి తెలుసుకోవడానికి నిత్యం ఏదో ఒక జిల్లా నుంచి పంచాయతీరాజ్‌ సిబ్బందీ అధికారులూ బూరుగుపూడికి వస్తూనే ఉంటారు. జాంబియా ప్రభుత్వం తరఫునా ప్రతినిధుల బృందం వచ్చి ఇక్కడ అమలవుతున్న కార్యక్రమాల్ని పరిశీలించి వెళ్లింది. ఇలా స్వచ్ఛంద సంస్థల నిర్వాహకుల దగ్గర్నుంచి కాలేజీ విద్యార్థుల వరకూ బూరుగుపూడి అభివృద్ధినీ పచ్చదనం పైట వేసుకున్నట్లుండే ఆ ఊరి అందాలనూ కళ్లారా చూసేందుకు వచ్చే సందర్శకులు ఎందరో. ఇంటికొచ్చిన బంధువులు పిల్లల ఆటపాటలకు మెచ్చి ఆనందంతో ఎంతోకొంత చేతిలో పెట్టి వెళ్లినట్లూ ఈ ఊరికి వచ్చినవాళ్లు బడిపిల్లలకూ పేదవారికీ ఉపయోగపడేలా ప్రేమతో ఆర్థికసాయం చేస్తుంటారు. ఒకప్పుడు... బూరుగుపూడి అంటే
ఆ మండలంలోని ఎన్నో గ్రామాల్లో ఒకటి. మరి ఇప్పుడూ... దేశ విదేశాల్లోని ఎన్నో పల్లెలకు ఓ స్ఫూర్తిపాఠం. ఈ మార్పుకి కారణం ముమ్మాటికీ తమ సర్పంచే అనే ఆ ఊరి ప్రజలు ‘మా సర్పంచిలా ప్రజల్ని ప్రేమించే నాయకుడుంటే ప్రతి ఊరూ బూరుగుపూడిలా మారడానికి ఎంతో సమయం పట్టదు’ అని గర్వంగా చెబుతారు. నిజమే... నాయకుడంటే ప్రజల్ని పాలించేవాడు కాదు, ప్రేమించేవాడు.

- నాదెళ్ల తిరుపతయ్య, ఈనాడు, కాకినాడ
ఫొటోలు: జి.శేషగిరిరావు

పశువులన్నీ ఒక్కచోటే!

పాడి ద్వారా మరింత ఆదాయాన్ని తెచ్చేందుకు పశువుల కోసం బూరుగుపూడిలో ఏకంగా ‘యానిమల్‌ హాస్టల్‌’ని నిర్మిస్తున్నారు. ప్రభుత్వ పథకంలో భాగంగా ప్రారంభించబోయే ఈ షెడ్డులో రేషన్‌ కార్డుకి రెండు గేదెలు చొప్పున ఉంచే అవకాశం ఉంది. గేదెలకు కావల్సిన మేతనూ దాణానీ సబ్సిడీలో ప్రభుత్వమే ఇస్తుంది. పరిశుభ్రమైన వాతావరణంలో పశువుల్ని ఉంచడం వల్ల పాల ఉత్పత్తీ మెరుగవుతుంది. ఇప్పటికే గ్రామంలో పశువుల కోసం స్వచ్ఛంద సంస్థల సహకారంతో అజోళ్ల అనే మేతనూ మొక్కజొన్న విత్తనాలను హైడ్రోపోనిక్స్‌ విధానంలో దాణాగా మార్చి రైతులకు అందిస్తోంది పంచాయతీ.


అమ్మానాన్నలకు చదువు

బూరుగుపూడిలో చదువుకోని పిల్లలే కాదు, చదువురాని పెద్దలు కూడా ఉండకూడదన్నది పంచాయతీ తీర్మానం. గ్రామంలో పెద్దవారిలో 800 మంది నిరక్షరాస్యులున్నారు. వారి కోసం ‘అమ్మానాన్నా చదువు’ పేరుతో ఓ కార్యక్రమాన్ని రూపొందించారు.
తల్లిదండ్రులకు వారి పిల్లలతోనే చదువు చెప్పించడం దీని ప్రత్యేకత. ప్రతి ఆదివారం పిల్లలు అమ్మానాన్నలకు పాఠాలు నేర్పించాలి. ఇదేకాదు, పారిశుధ్యం, వీధిలైట్లూ... ఇలా ఏ సమస్య ఉన్నా గ్రామంలోని పిల్లలే దాని గురించి రాసి పాఠశాలలోని ఫిర్యాదుల పెట్టెలో వేస్తుంటారు. ఈ ఊరి పిల్లలూ పెద్దలకేం తీసిపోరండోయ్‌. అందరూ కలసి ఉన్నత పాఠశాల ఆవరణలో ఎర్రచందనం మొక్కలతో ఏకంగా వనాన్నే పెంచుతున్నారు. వాళ్లు నాటి, నీరుపోసి పెంచిన మొక్కలు ఇప్పుడు వారికన్నా ఎత్తు ఎదిగిపోయాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న