close
అమృత రాత్రులు..అద్భుత యాత్రలు..
 

హ్యాపీ హనీమూన్‌
అమృత రాత్రులు..అద్భుత యాత్రలు..

  బిడియాలకు గడియేసే మంత్రం.. భర్త నాడి పట్టే తంత్రం..భార్య మనసును అర్థం చేసుకునే మార్గం.. హనీమూన్‌. ఈ వేసవి ముహూర్తాల్లో ఒక్కటవుతున్న జంటల కోసం కొన్ని హనీమూన్‌ కేంద్రాల వివరాలిస్తున్నాం. క్షేమంగా వెళ్లి.. ప్రేమతో రండి!!
పగడపు దీవుల్లో..
ఎంత హనీమూన్‌కొచ్చినా.. ఆలుమగలిద్దరూ ఒకరినొకరు చూస్తూ ఎంతసేపు కూర్చుంటారు. పిల్లగాలితో అల్లరి చేయొద్దా!  చల్లని సముద్ర గర్భంలో దాగిన అందాలు చూడొద్దా! ఇన్ని చేయాలంటే లక్షద్వీప్‌ వెళ్లాలి! ఈ పగడపు దీవుల్లోని ప్రకృతి సౌందర్యం బాలమిత్ర కథల్లో వర్ణించిన దానికన్నా గొప్పగా ఉంటుంది. అరేబియా సముద్రంలో చెల్లాచెదురుగా ఉన్న ఈ ద్వీపాలకు దేశవిదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. మండువేసవిలోనూ గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీలు దాటదు. సాయంకాలం.. సాగర తీరంలో.. శీతల పవనాలు వీస్తుంటాయి. లక్షదీప్‌ 36 దీవుల సమూహం. ఇందులో 10 ద్వీపాల్లో మాత్రమే జనాలున్నారు. వీటిలో బంగారం, కడమట్‌, అగట్టి ద్వీపాలు చాలా బాగుంటాయి. ఒక ద్వీపం నుంచి మరో ద్వీపానికి వెళ్లడానికి ఫెర్రీలు ఉంటాయి. కయాకింగ్‌, వాటర్‌ స్కీయింగ్‌, విండ్‌ సర్ఫింగ్‌, స్కూబా డైవింగ్‌ వంటి సాహసక్రీడలకు వేదికలు ఈ ద్వీపాలు.
ఎలావెళ్లాలి:
* విమానయానం: లక్షద్వీప్‌ చేరుకోవాలంటే ముందుగా కొచ్చిన్‌ వెళ్లాలి. అక్కడి నుంచి అగట్టి ద్వీపానికి విమాన సర్వీసులు ఉన్నాయి. అగట్టి నుంచి బంగారం ద్వీపానికి స్పీడు బోట్‌లో వెళ్లాలి.
* నౌకా విహారం: కొచ్చిన్‌ నుంచి లక్షద్వీప్‌ ప్రధాన దీవులకు నౌకలో వెళ్లొచ్చు. అక్కడ విహారం, బస, బోటింగ్‌ అన్ని కలిపి ప్యాకేజీలు కూడా ఆఫర్‌ చేస్తుంటారు నౌకల నిర్వాహకులు. వీటి ధర రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు (జంటకు) ఉంటుంది.


విడిది: భారీ రిసార్టులు, కాటేజీలు, రెస్టారెంట్లు, బడ్జెట్‌ హోటళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
అనుకూల సమయం: జూన్‌-సెప్టెంబర్‌ మినహా ఏడాదంతా వెళ్లొచ్చు.

వసంత సంతసం..

 నీమూన్‌కు పశ్చిమ బంగలో అనువైన చోటేది అని అడిగితే టక్కున చెప్పే పేరు డార్జిలింగ్‌. ఇక్కడికి యాభై కిలోమీటర్ల దూరంలో మరో అందమైన ప్రాంతం ఉంది. దాని పేరు కాలింపాంగ్‌. ఎత్తయిన కొండలు.. వాటిపై బౌద్ధారామాలు.. ప్రశాంతతకు చిరునామాగా ఉంటుందీ ఊరు. ఆమని రాకతో పర్వతాలన్నీ పచ్చటి దుప్పటి కప్పుకొని పసందుగా కనిపిస్తాయి. అరవిరిసిన ఆర్చిడ్‌ పూలు వసంతగాలికి వలపులు నేర్పిస్తాయి. తీస్తా నది తీరంలో విహారం, కొండల్లో లోయల్లో ప్రయాణం.. కాలింపాంగ్‌కు వెళ్లిన నూతన వధూవరులకు మధురమైన అనుభూతినిస్తాయి. పనిలో పనిగా పక్కనే ఉన్న డార్జిలింగ్‌నూ సందర్శించి రావొచ్చు.
ఎలా వెళ్లాలి
* విమాన యానం: కాలింపాంగ్‌కు సమీపంలో ఉన్న విమానాశ్రయం బాగ్‌డోగ్రా. కోల్‌కతా, దిల్లీ నుంచి విమాన సర్వీసులు ఉన్నాయి. బాగ్‌డోగ్రా నుంచి కాలింపాంగ్‌కు 78 కిలోమీటర్లు. ట్యాక్సీలు, బస్సుల్లో వెళ్లొచ్చు.
* రైలు మార్గం: కాలింపాంగ్‌కు సుమారు 75 కిలోమీటర్ల దూరంలో జల్పాయ్‌గురి రైల్వేస్టేషన్‌ ఉంటుంది. సికింద్రాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణం నుంచి గువాహటి వెళ్లే రైళ్లు జల్పాయ్‌గురి మీదుగా వెళ్తాయి. అక్కడి నుంచి బస్సులు, ట్యాక్సీలో కాలింపాంగ్‌కు చేరుకోవచ్చు.


విడిది: హనీమూన్‌ జంటల కోసం కాటేజీలుంటాయి. భారీ హోటళ్లు బోలెడున్నాయి. సిక్కిం వంటకాలు, టిబెటిన్‌ రుచులు, ఉత్తరాది పదార్థాలు ఆస్వాదించవచ్చు.
అనుకూల సమయం: వర్షాకాలం మినహా ఎప్పుడైనా వెళ్లొచ్చు. వసంత రుతువులో గిరులన్నీ విరులతో విశేషంగా అలరిస్తాయి.

గూటి పడవలో..

 ‘అలల ఊపులో తీయని తలపులు చెలరేగుతాయ’ని ఓ సినీకవి సెలవిచ్చారు. అలాంటి మధురమైన భావన ఎక్కడ పడితే అక్కడ కలగదు. కొలనులో నీరు నిద్దురోయినట్టే ఉండాలి. కొత్త పెళ్లి కూతురు కుదురుగా కూర్చోవడానికి గూటి పడవ కావాలి. మంచుకౌగిట వణుకుతున్న కొండల ప్రతిరూపాలు.. నీలి నీటిలో తేలాడుతుండాలి. ఇవన్నీ ఉన్నాయంటే అది శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సు అయి ఉంటుంది. మనదేశంలో ఎవర్‌గ్రీన్‌ హనీమూన్‌ స్పాట్‌ శ్రీనగర్‌.. కొత్త దంపతులకు ఇది ప్రేమ్‌నగర్‌. మదిని పరవశింపజేసే దాల్‌ సరస్సు.. ఆ పక్కనే ఊసులు పంచుకోవడానికి షాలీమర్‌ తోట.. దాని చెంతనే హౌస్‌బోట్లతో నగీన్‌ సరస్సు.. ఈ ఉత్సాహం నుంచి తేరుకోకముందే తులిప్‌ తోట.. స్వర్గమిక్కడే అంటుంది. కొత్తకాపురాన్ని దిద్దుకుంటున్న ఆలుమగలకు ఇంతకన్నా అనువైన చోటు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. అందుకే హనీమూన్‌ అనగానే టూరిస్ట్‌ ఆపరేటర్లు, ట్రావెల్‌ సంస్థలు కూడా ముందుగా కశ్మీర్‌ పేరే చెబుతారు. అందునా శ్రీనగర్‌ సౌందర్యం ప్రత్యేకమైనది. వేసవి ముహూర్తాల్లో ఒక్కటైన వారు.. మరింత దగ్గరవ్వడానికి ఇంతకన్నా మంచి ప్రదేశం మరొకటి ఉండదు.
ఎలా వెళ్లాలి?
* విమాన యానం: హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణం నుంచి సింగిల్‌ స్టాప్‌, టూస్టాప్‌ విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
* రైలు మార్గం: సికింద్రాబాద్‌, విజయవాడ, వరంగల్‌, నెల్లూరు, ఒంగోలు నుంచి జమ్మూ వెళ్లే రైళ్లు (వీక్లీ) అందుబాటులో ఉన్నాయి. జమ్మూ నుంచి శ్రీనగర్‌కు సుమారు 266 కిలోమీటర్లు. బస్సులు, ట్యాక్సీల్లో వెళ్లొచ్చు. ఈ ప్రయాణం భలే పసందుగా ఉంటుంది.


విడిది: శ్రీనగర్‌లో భారీ రెస్టారెంట్లు ఎన్నో. అద్దెకు హౌస్‌బోట్లు లభిస్తాయి. దేశీవిదేశీ వంటకాలు, కశ్మీరీ రుచులు కావాల్సిన రుచులన్నీ లభిస్తాయి.
అనుకూల సమయం: వానాకాలం మినహా ఏడాదంతా వెళ్లొచ్చు.

బంధంలో బందీల్లా..

కొంగుముడి వేసుకున్న కొత్త దంపతులకు అండమాన్‌-నికోబార్‌ దీవులు అద్భుతమైన హనీమూన్‌ స్పాట్‌. అందమైన వాతావరణం, రకరకాల మనుషులు, కాస్త హడావుడి.. ఇంకాస్త కలివిడితనం కలగలసిన దీవులివి. బడ్జెట్‌ లెక్కలు చూసుకునే వారు, డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేసే వారు.. ఎవరైనా అండమాన్‌లో జాలీగా గడిపేయొచ్చు. సాహస క్రీడలకు అండమాన్‌ కేరాఫ్‌.  అండమాన్‌ రాజధాని పోర్ట్‌బ్లెయర్‌లో దర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయి. స్వతంత్ర సమరయోధులను అప్పట్లో బందీలుగా ఉంచిన కాలాపాని జైలును ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. రోజూ సాయంత్రం స్వాతంత్య్ర సంగ్రామంపై లేజర్‌ ప్రదర్శన నిర్వహిస్తారు. పోర్ట్‌బ్లెయర్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని హావెలాక్‌ బీచ్‌ చాలా అందంగా ఉంటుంది.
ఎలా వెళ్లాలి?

* విమాన యానం: హైదరాబాద్‌, విశాఖపట్టణం నుంచి పోర్ట్‌బ్లెయర్‌కు సింగిల్‌స్టాప్‌ విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
* నౌకా విహారం: విశాఖపట్టణం, చెన్నై నుంచి పోర్ట్‌బ్లెయర్‌కు క్రూయిజ్‌లు కూడా నిర్వహిస్తారు. సుమారు రెండున్నర గంటలు సాగే సాగరయానం మరుపురాని అనుభూతిని కలిగిస్తుంది


విడిది:  బడ్జెట్‌ హోటళ్లు, భారీ రెస్టారెంట్లు, రిసార్ట్‌లు ఉన్నాయి. రకరకాల రుచులు లభిస్తాయి. అండమాన్‌లో తెలుగువారు చాలామంది ఉన్నారు. అన్నపూర్ణ మెస్‌, ఆంధ్రాభోజనం వంటి బోర్డులు చాలానే కనిపిస్తాయి.
అనుకూల సమయం: వేసవిలో కాస్త ఉక్కపోత ఉన్నా.. సాయంత్రాలు మనోహరంగా ఉంటాయి. రుతుపవనాల వేళ అందంగా ఉంటుంది. శీతాకాలంలో అద్భుతంగా ఉంటుంది.

ఇంకా ఎన్నెన్నో..

 హనీమూన్‌ కేంద్రాలుగా కేరళ నుంచి ఉత్తరాఖండ్‌ వరకు ప్రసిద్ధ ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. కేరళ బ్యాక్‌వాటర్స్‌, మున్నార్‌, కర్ణాటకలో కూర్గ్‌, మంగళూరు, ఆంధ్రప్రదేశ్‌లో అరకులోయ, మధ్యప్రదేశ్‌లో ఖజురహో, పచ్‌మడీ, రాజస్థాన్‌లో జైసల్మేర్‌, గోవా, హిమాచల్‌ప్రదేశ్‌లో సిమ్లా, కులు-మనాలి, నైనిటాల్‌, డల్హౌసి, ఉత్తరాఖండ్‌లో డెహ్రాడూన్‌, ముస్సోరి ఇలా ఎన్నో పర్యాటక ప్రదేశాలు కొత్త దంపతులకు స్వాగతం పలుకుతున్నాయి.

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.