close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఉగాది పండగ వచ్చిందీ...

ఉగాది పండగ వచ్చిందీ...

ఉగాది నాడే బ్రహ్మ సృష్టిని ఆరంభించాడట. సకల చరాచర జీవరాశికీ మూల కారకుడైన బ్రహ్మ ఈ మహత్కార్యాన్ని ఆరంభించిన రోజుని అత్యంత వైభవోపేతంగా జరపాలన్న కాంక్షతోనే సరికొత్త అందాలను మోసుకొచ్చే వసంత మాసపు తొలి రోజునే ఉగాదిగా ఎంచుకున్నాడు. అందుకే ఆ పండగకు సర్వాంగ సుందరంగా ముస్తాబయిన ప్రకృతే వేదిక. మామిడి చిగురు తిన్న మత్తకోయిలల గానాలూ, సాయం సంధ్యల్లో మరు మల్లెల పరిమళాలూ, గిలిగింతలు పెట్టే వాసంత సమీరాలూ, వెండి వెన్నెలను కురిపించే చందమామ అందాలూ... అన్నీ ఈ పండగకు ప్రత్యేకతలే. అందమైన రేపటికి సంకేతాలే.
‘‘ఎవరదీ... నువ్వేనా ఉగాదీ!
కొమ్మల్లో కోయిల కూస్తుంటే
మా పెరటి రెమ్మల్లో మల్లియ పూస్తుంటే
ఈ మధుమాసోదయ వేళ
ఉగాదీ నిన్ను పోల్చుకున్నానులే’’
అంటాడు ఓ కవి చమత్కారంగా... నిజమే ఉగాది ఆగమనం అంత అందంగానే ఉంటుంది. పండగంటే మనింటిని తోరణాలతో ముస్తాబు చేయటమే మనకు తెలుసు ఈ పండగకు మాత్రం అనంత ప్రకృతీ సన్నద్ధమైపోతుంది. అందమైన వసంతానికి స్వాగతం పలుకుతుంది.
అందుకే గీతలో శ్రీకృష్ణుడు ‘మాసానాం మార్గశీర్షోహం... ఋతూనాం కుసుమాకరః’ అంటాడు. అంటే మాసాల్లో మార్గశిరమూ, రుతువుల్లో వసంత రుతువూ తానేనని అర్థం. అంతటి మహత్యం ఉంది వసంత రుతువుకి. ప్రపంచంలో అత్యధికంగా పూలు వసంతంలోనే పూస్తాయట. ఎర్రటి ఎండాకాలంలో సుకుమారమైన మల్లెపూలు పూయడం, చుక్కనీరు లేని చోట రసాలు నిండిన మధుర ఫలాలు గుత్తులుగా విరగకాయడం ఈ మాసానికే సొంతమైన ప్రకృతి వింతలు. అలాంటి వింతలే కృష్ణుణ్ని సైతం కట్టిపడేశాయి. వసంతం అనే పదానికి ఏడాది అనే అర్థమూ ఉంది. ఒక్క తెలుగువారే కాదు చాంద్రమానాన్ని పాటించే తెలుగు, కన్నడ, మహారాష్ట్ర ప్రజలూ చైత్ర శుక్ల పాడ్యమిని నూతన సంవత్సరానికి తొలి దినంగా పరిగణిస్తారు. కృతయుగంలో కార్తీకశుద్ధ అష్టమినాడు ఉగాది జరుపుకునేవారట. త్రేతాయుగంలో వైశాఖశుద్ధ తదియ రోజు సంవత్సరాది పండగ వచ్చేది. దాన్నే మనం ఇప్పుడు అక్షయ తృతీయగా జరుపుకుంటున్నాం. ద్వాపరయుగం మొదలైంది మాఘ బహుళ అమావాస్య నాడు. అయితే అన్ని యుగాల ఆరంభమూ వసంత మాసంలోనే జరిగిందని చెబుతారు. ఆయా యుగాల్లో వసంతం ఆయా మాసాల్లో వచ్చేదట. మోడువారిన చెట్లు చిగురిస్తూ పచ్చని ప్రకృతి మనిషిని పరవశానికి గురిచేసే కాలం, ఏ యుగంలోనైనా కొత్త ఉగాదికి నాంది పలికేదిగానే ఉంటుంది మరి!

‘వసంతి సుఖం యథా తథా అస్మిన్నితి’ అంటారు. అంటే వసంతకాలంలో ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని అర్థం. నిజానికి సాధారణ పండగల్లా ఉగాది ఏ దేవతకో సంబంధించిన పండగ కాదు. కాలాన్ని ఆరాధించే పండగ. నిరంతరమూ, నిత్యనూతనమూ అయిన కాలాన్ని కొలుచుకుని అనంత కాలగమనంలో మనమెక్కడ ఉన్నామో తెలుసుకుని మరొక్కసారి దేవుడు ఇచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా మరల్చుకునే ప్రయత్నానికి నాంది పలికే పండగ.

ఉగాది పుట్టిందిలా...
ఉగాదిని తొలుత యుగాదిగా పిలిచేవారు. యుగస్య ఆదిః అని అర్థం. అంటే ఉత్తర దక్షిణ ఆయనాలు రెండూ కలిసిఉండే సంవత్సరానికి చైత్రశుద్ధ పాడ్యమే ఆది కనుక ఆ రోజును యుగాది అంటారు. యుగాది అంటే బ్రహ్మసృష్టిని ప్రారంభించిన రోజని అర్థం. కాలక్రమేణా అది ఉగాదిగా మారింది. బ్రహ్మ ఇప్పుడు ద్వితీయ పరార్ధంలో అంటే రెండో సగం జీవిత కాలంలో ఉన్నాడు. అందుకే ఏదైనా కార్యం చేయాలనుకున్నప్పుడు సంకల్పంలో కాలాన్ని ప్రస్తావిస్తూ ఆయన్ని గౌరవిస్తాం. అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే, అష్టావింశిన్‌ మహాయుగే, కలియుగే ప్రథమపాదే... అస్మిన్‌ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన విళంబి నామ సంవత్సరే చైత్ర మాసే, వసంత రుతౌ, శుక్లపక్షే, పాడ్యమ్యాం తిథౌ, భానువాసరే శుభ నక్షత్రే శుభయోగ శుభ కరణే... అని చెబుతాం. అంటే ఏ కార్యాన్ని మొదలు పెట్టాలనుకున్నా మనం సృష్టికర్త అయిన బ్రహ్మ మొదలు జరిగిన కాలాన్నంతా చెబుతూ మనం ఏడోదైన వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగమైన కలియుగంలో విళంబి నామ సంవత్సరంలో ఉన్నామంటూ వర్తమాన సమయం దాకా చెబుతాం. గడచిన అనంత కాలం మొదలు ఈ ఏడాది ఈ రోజు దాకా కాలాన్ని నిమిషాలతో సహా లెక్కగట్టి నిత్య పూజా విధానాల్లో, శుభాశుభ కార్యాల్లో తప్పనిసరిగా మననం చేసుకునే ఉత్కృష్టత మన జీవన శైలిలో భాగం. అదీ మన సంప్రదాయంలో కాలానికున్న ప్రాధాన్యత. ఉగాది అచ్చంగా ఆ కాలానికి ప్రతిరూపమైన పండగే. కృష్ణపరమాత్మ కురుక్షేత్ర సమయంలో విశ్వరూపధారణ చేసినప్పుడు ‘నేను కాలాన్ని... ఈ వ్యవస్థను విధ్వంసం చేస్తాను’ అని అంటాడు. అంటే ఇక్కడ కాలం విష్ణుస్వరూపమే. కానీ ఆ కాలస్వరూపుడు చెప్పిన విధ్వంసం వెనుక ఒక రహస్యం దాగి ఉంది. ఆ విధ్వంసం ఒక కొత్తసృష్టికీ, సరికొత్త వ్యవస్థ రూపకల్పనకూ పునాది అవుతుంది. ఏవైనా గడిచిన విషయాల గురించి చెప్పేటప్పుడు కాలగర్భంలో కలిసిపోవడం అనే పదాన్ని మనం అందుకే వాడతాం. పాతదాన్నంతటినీ తనలోకి లాక్కొనే కాలం నిరంతరం మనకు కొత్త సమయాన్నీ, కొత్త ఆశల్నీ అవకాశాల్నీ ఇస్తూనే ఉంటుంది.

ఇలా జరుపుకోవాలి...
ఏడాది తొలిరోజు ఎలా గడుస్తుందో అలాగే ఏడాదంతా గడుస్తుందని ప్రజల విశ్వాసం. అందుకే ఆ రోజుని సకల శుభప్రదంగా జరుపుకునేందుకు అంతా సన్నద్ధమవుతారు. ఆ పండగ రోజుని ఎలా జరుపుకోవాలి అనే దానికి శాస్త్రం ఒక క్రమ పద్ధతిని సూచించింది. ప్రాతఃకాలంలోనే లేచి పెద్దవాళ్లతో తలకు నువ్వుల నూనె పెట్టించుకుని వాళ్ల ఆశీర్వాదం తీసుకుని అభ్యంగన స్నానం చేయాలి. తలమీద నీళ్లు కుమ్మరించుకుంటూ
గంగేచ యమునేచైవ కృష్ణా గోదావరి సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్‌ సన్నిధిం కురు
అనే శ్లోకాన్ని జపించాలి. తైలాభ్యంగనం వల్ల ఆకలి, దప్పిక, మలిన నిర్మూలనాలు జరుగుతాయనీ, మహాలక్ష్మీ కృప లభించి దరిద్రం తొలగిపోతుందనీ చెబుతారు. ఆ రోజు కొత్త బట్టలు కట్టుకోవాలి. నూతన వస్త్రంలో సకల దేవతలూ నివాసముంటారని శాస్త్రం చెబుతోంది. కొత్త బట్టలు కట్టుకుని కుటుంబ సభ్యులూ, ఇష్టమైన వారి సాంగత్యంలో గడిపితే లలితా, లక్ష్మీ కటాక్షాలు లభిస్తాయట. దిష్టి పోయేందుకు ఇంటి ముందు గుమ్మడికాయను కట్టాలి. తర్వాత ఇష్టదేవతను ప్రార్థించి పరగడుపున ఉగాది పచ్చడిని స్వీకరించాలి. షడ్రుచుల సమ్మేళనమైన ఈ పచ్చడి గొప్ప ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందన్నది పురాణోక్తి. సర్వశుభప్రదమైన పంచాంగ శ్రవణాన్ని ఉగాది నాడు తప్పక వినాలి. అందులోనూ ఉత్తర ముఖంగా కూర్చుని పంచాంగశ్రవణం చేయడం వల్ల విశేషపుణ్య ఫలితాలు కలుగుతాయట.

పంచాంగ శ్రవణం...
శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్న దోషాపహం
గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం
ఆయుర్వ్యిద్ధిద ముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం
నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతామ్‌
పంచాంగం సిరిసంపదలను ప్రసాదిస్తుంది. దుస్స్వప్నాలను హరించడంతో పాటు గంగానదీ స్నాన ఫలితాన్నిస్తుంది. గోదానం చేసిన భాగ్యాన్నీ, ఆయురారోగ్యాలనూ, విద్యాబుద్ధులనూ, సత్సంతానాన్నీ ప్రసాదిస్తూ సకల విజయాలనూ సిద్ధింపజేస్తుంది. అందుకే పంచాగ శ్రవణం తప్పక చేయాలని చెబుతాయి శాస్త్ర గ్రంథాలు. ఉగాదినాడు చేసే పనుల్లో ఇదో ముఖ్య ఘట్టం. పంచాంగ శ్రవణ సమయంలో ఎన్నోసార్లు గ్రహాల పేర్లను పలుకుతారు. అందువల్ల ఆయా గ్రహాలు సంతోషిస్తాయి. ఫలితంగా పంచాగ శ్రవణం చేసిన వాళ్లకీ, విన్నవాళ్లకీ సూర్యుడివల్ల తేజస్సు, చంద్రుడివల్ల వైభవం, కుజుడి వల్ల సర్వమంగళం, బుధుడి వల్ల బుద్ధి వికాసం, గురుడి వల్ల జ్ఞానం, శుక్రుడి వల్ల సుఖం, శని వల్ల దుఃఖరాహిత్యం, రాహువు వల్ల ప్రాబల్యం, కేతువు వల్ల ప్రాధాన్యం కలుగుతాయని జ్యోతిషవాక్కు. పంచాంగ ప్రస్తావన వేదాలు మొదలు ఎన్నో శాస్త్ర గ్రంథాల్లో కనిపిస్తుంది. మన పంచాంగానికి మూలమైన కాల సిద్ధాంతాలున్న గ్రంథాన్ని క్రీ.శ.505లో వరాహమిహిరుడు ప్రతిపాదించాడు. మొత్తం 18 సిద్ధాంతాలుండగా అందులో ముఖ్యమైనవంటూ అయిదింటిని తన గ్రంథంలో ప్రస్తావించాడు. ఆ జ్యోతిష గ్రంథాన్ని ఉగాది నాడే ప్రజలకు అంకితం చేశాడట. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న పంచాంగాలను అందులోని పూర్వగణిత, దృగ్గణిత సిద్ధాంతాల ఆధారంగా రూపొందిస్తున్నారు.

బ్రహ్మ మంత్రివర్గం
ఏడాదికి తొలిరోజుగా ఉగాదిని ప్రతిపాదించిన బ్రహ్మ ఆ సంవత్సరాన్ని ఎవరు పరిపాలించాలీ, ఏయే శాఖలకు ఎవరెవరు మంత్రులుగా ఆధిపత్యం చెలాయించాలీ అనే వ్యవహారాన్ని నవగ్రహాలకు అప్పగించాడు. దాని ప్రకారమే ఆయా శాఖల అధిపతుల స్వభావాన్ని బట్టి ఆ ఏడాది వారు ఆధిపత్యం వహించే అంశం ఎలా ఉంటుంది అనేది నిర్ణయమౌతుంది. ఈ ఏడాది ఎంత వర్షం కురుస్తుందీ, ఏయే పంటలు బాగా పండుతాయీ, ధరలెలా ఉండబోతున్నాయీలాంటి అంశాలన్నీ ఈ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటాయి. ఈ మంత్రివర్గంలో మొత్తం నవనాయకులుంటారు. వాళ్లను ఎలా నిర్ణయిస్తారంటే...
1. చాంద్రమానాన్ని అనుసరించి ఏ వారం ఉగాది వచ్చిందో ఆ వారాధిపతి ఆ సంవత్సరానికి రాజు
2. సౌరమాన సంవత్సరం ప్రారంభమైన రోజు ఏ వారం వస్తే ఆ వారాధిపతి మంత్రి
3. సూర్యుడు సింహరాశిలో ప్రవేశించే సమయంలో ఉన్న వారాధిపతి ఆ సంవత్సరానికి సేనా నాయకుడు
4. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించేటప్పుడు వారానికి అధిపతి సస్యాధిపతి
5. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించే సమయంలో ఉన్న వారానికి అధిపతి ఆ సంవత్సరానికి ధాన్యాధిపతి
6. సూర్యుడు మిథున రాశిలో ప్రవేశించేనాటి వారాధిపతి అర్ఘాధిపతి (ధరలకు వాణిజ్యానికీ అధిపతి)
7. సూర్యుడు ఆరుద్రా నక్షత్రంలో ప్రవేశించేనాటి వారానికి అధిపతి మేఘాధిపతి
8. సూర్యుడు తులారాశిలో ప్రవేశించే రోజుకి వారాధిపతి రసాధిపతి
9. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజున ఉన్న వారాధిపతి నీరసాధిపతి ఈ ఏడాది నవనాయక ఫలితాలు

రాజు రవి: సూర్యుడు రాజు అయినందు వల్ల పాలకుల మధ్య పరస్పర వైరం కలుగుతుంది. వర్షాలు సమంగా పడతాయి. రాజు వల్ల ప్రజలకు భయం ఏర్పడుతుంది. శస్త్ర, చోర, అగ్ని బాధలు అధికమవుతాయి.
మంత్రి శని: శని మంత్రి అవడం వల్ల  వానలు తక్కువగా కురుస్తాయి. పంటలు తక్కువగా పండుతాయి. ప్రజలు దరిద్రాన్ని పొందుతారు. మొత్తంగా ప్రజలకు కష్టకాలం.
సేనాధిపతి శుక్రుడు: శుక్రుడు సేనాధిపతి కావడంతో స్త్రీ పురుషులు పరస్పరం అన్యోన్య అనురాగాలతో ఉంటారు. వానలు తక్కువగా కురుస్తాయి. ధరలు అధికమవుతాయి.
సస్యాధిపతి చంద్రుడు: చంద్రుడు సస్యాధిపతి అవడం వల్ల నీటి పంటలూ, మెట్ట పంటలూ సమృద్ధిగా పండుతాయి. పచ్చదనం బాగుంటుంది.
ధాన్యాధిపతి రవి: ధాన్యాధిపతి రవి అవటం వల్ల వర్షాలు మధ్యస్తంగా పడతాయి. పంటలు తక్కువగా పండుతాయి. ధరలు తగ్గుతాయి. ఎరుపు రంగు ధాన్యం సమృద్ధిగా పండుతుంది.
అర్ఘ అధిపతి శుక్రుడు: ధాన్యాల ధరలు బాగా పెరుగుతాయి. శుక్రుడు అధిపతి అయినందున తెల్లని ధాన్యాలు బాగా పండుతాయి. దేశం, ప్రజలు క్షేమంగా ఉంటారు.
మేఘాధిపతి శుక్రుడు: మేఘాధిపతి కూడా శుక్రుడే అవడం కారణంగా వానలు అధికంగా కురుస్తాయి. పంటలు బాగా పండుతాయి. ప్రజలు రోగబాధలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. గోవులు బాగా పాలిస్తాయి.
రసాధిపతి బుధుడు: సుగంధ ద్రవ్యాలు, బెల్లం తదితర వస్తువుల ధరలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
నీరసాధిపతి చంద్రుడు: బంగారం, ముత్యం, కంచు, వస్త్రాలు, నగలు తదితరాల ధరలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
మొత్తంగా చెప్పాలంటే, విళంబి నామ సంవత్సరంలో వర్షాలు మరీ ఎక్కువా మరీ తక్కువా కాకుండా సమంగా కురుస్తాయి. ధరలు అందుబాటులో ఉంటాయి. జనానికి శత్రువుల వల్ల ఇబ్బందులు కలగడంతో పాటు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ప్రజా సమస్యలు పెరుగుతాయి. చోరభయం ఉంటుంది. కాబట్టి ప్రజలు దైవారాధన చేయడం ద్వారా శాంతిని పొందొచ్చు.

ఈ ఏడాది తెలుగు ప్రజలకు...
శ్రీ విళంబి నామ సంవత్సరంలో వర్ష లగ్నాధిపతి అయిన బుధుడు కేంద్ర స్థానంలో ఉండి శుభయోగాన్నిస్తున్న్లాడు. ఉచ్ఛగ్రహంతో కలిసి ఉన్నందున ప్రజలకు మేలు జరుగుతుంది. జనం సుఖశాంతులతో సంతోషంగా ఉంటారు. ధన భాగ్యాధిపతి అయిన శుక్రుడు కేంద్ర భావంలో ఉచ్ఛస్థితిలో ఉండటం వల్ల సౌభాగ్యం, ఆర్థికవృద్ధి విశేషంగా ఉంటాయి. ప్రధానంగా మహిళలకు శుభఫలితాలు సిద్ధిస్తాయి. ప్రజలు ఆనందంగా వారివారి పనుల్లో నిమగ్నమవుతారు. శుక్రగ్రహం భాగ్యాధిపత్యం వల్ల అదృష్టఫలాలు ప్రజలకు అందుతాయి. ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. చంద్రుడు లాభాధిపతి అయినందువల్ల మనశ్శాంతి, ప్రశాంత జీవితం లభిస్తాయి. మనోబలం పూర్తిగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. గురుగ్రహం వాక్‌ స్థానంలో ఉండటంతో రాష్ట్ర ప్రజలు మంచి విద్యాయోగాన్ని పొందుతారు. జ్ఞానమార్గంలో ధర్మబద్ధంగా వ్యవహరిస్తారు. చక్కటి ఆలోచనా విధానంతో బుద్ధిబలంతో విజ్ఞానాన్ని ఆర్జిస్తారు. సప్తమ కేంద్రస్థిత సూర్య సంచారం వల్ల ప్రజలు రోగాలు లేనివారై ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగిస్తారు. కేతువు పంచమకోణంలో ఉండటం వల్ల ఆధ్యాత్మిక పురోగతి బాగుంటుంది. లాభ రాహువు వల్ల సాంకేతికపరంగా అభివృద్ధి చెందుతారు. చతుర్థ కేంద్రంలో శని, కుజుల వల్ల స్వల్ప అశాంతి నెలకొంటుంది. అధిక గ్రహాలు శుభ స్థానాల్లో ఉండటం వల్ల ప్రజలు సంపూర్ణ శుభఫలితాలను అనుభవిస్తారు.

విళంబిలో దేశస్థితిగతులు...
ఈ ఏడాదికి జగల్లగ్నం (జగత్‌ లగ్నం అంటే దేశఫల లగ్నం) వృషభలగ్నం అయింది. దాని అధిపతి శుక్రుడు ద్వాదశ భావంలో ఉన్నాడు. ఇదంత మంచి ఫలితాన్నివ్వదు. రవి శుక్రులిద్దరూ 12వ స్థానంలో ఉండటం వల్ల పాలకుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశముంది. బుధుడు, ధన పంచమాధిపతియై లాభంలో ఉండటం  వల్ల దేశానికీ, రాష్ట్రాలకూ సంపూర్ణ ధనయోగం ఉంటుంది. శని కుజులు ధనుస్సులో ఉండటంతో భయాందోళనలు కలుగుతాయి. కొన్ని సందర్భాల్లో యుద్ధ వాతావరణం కనపడుతుంది. సున్నితమైన అంశాల్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడవచ్చు. ప్రజలూ పాలకులూ సమన్వయంతో ఆలోచించాల్సిన అవసరముంది. గురుగ్రహం షష్ఠంలో ఉన్నందువల్ల మరింత చెడు ఫలితాలు సూచితమవుతున్నాయి. ప్రజలు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పాలనలో ప్రతిష్ఠంభన ఏర్పడుతుంది. ప్రజలు వెన్నుదన్నుగా నిలిస్తే తప్ప పాలకులకు కష్టకాలమే. రాహుకేతువుల ఫలితాలు కొంతవరకూ మేలు కల్గిస్తాయి. మొత్తం మీద జగత్‌ లగ్నస్థితి ఏ మాత్రమూ అనుకూలంగా లేదు. దేశవ్యాప్తంగా ప్రజలు అభివృద్ధిని సాధించాలంటే బాగా కష్టపడాలి. ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపాలి. సమష్టి కృషి వల్ల ఆపదలను అధిగమించవచ్చు. ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు బలపడాలంటే ఆయా అంశాల మీద పాలకులు ప్రత్యేక దృష్టి సారించాలి. అప్పుడే వైజ్ఞానికంగా, ఆర్థికంగా భారతదేశం సమగ్రంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది.

పంచాంగ శ్రవణం మహా పుణ్యదాయకమైన విషయమే అయినా ఇందులో జీవన వికాస పాఠం కూడా నిగూఢంగా దాగి ఉంటుంది. ఏడాది తొలిరోజే ఆదాయ వ్యయాలూ, అవమాన రాజపూజ్యాలూ తెలుసుకోవడం ద్వారా మనిషి రాబోయే కష్టసుఖాలన్నింటికీ మానసికంగా సన్నద్ధమవుతాడు.
ఏ కొత్త బాధ్యతో మీద పడితే ‘ఆ రోజు చెప్పిన భారం ఇదేనన్నమాట’ అని సరిపెట్టుకుంటాడు. ఏ అనుకోని ఆపదో ఎదురైతే ‘గ్రహగతి మారుతుందని ముందే తెలిసిందేగా’ అని సర్దుకుంటాడు. చివరికి అనని మాటలు అన్నారన్నా, లేనిపోని వ్యవహారాల్లో ఇరుక్కున్నా ‘నీలాపనిందలు ఊహించినవేగా’ అని ఊరుకుంటాడు.

ఏ ఉన్నతాధికారో నలుగురి ముందూ అక్షింతలేస్తే ‘అవమానాలు అధికమని అనుకున్నదేగా’ అని మిన్నకుండిపోతాడు. సుఖసంతోషాలుంటాయి అన్న పంచాంగ వాక్యానికి పొంగిపోయి ‘ఈ ఏడాది నాకు ఇవీ ఉన్నాయన్నమాట’ అని నిండు మనసుతో ముందుకెళతాడు. మనిషి ధైర్యంతో కొత్త ఆశలతో ముందడుగు వేయడానికి ఏడాది తొలినాడు ఈ మాత్రం ఉత్సాహం చాలు. నిజానికి షడ్రుచులతో పంచే ఉగాది పచ్చడి ఆంతర్యమూ అదే. నాకు బెల్లమ్ముక్కలే కావాలంటే కుదరదు, అరటి పండొక్కటే తింటానంటే వీలు పడదు. వేప చేదునూ, మామిడి వగరునూ రుచి చూడాల్సిందే. చింతపండు పుల్లదనాన్నీ, మిరియాల ఘాటునీ అనుభవించాల్సిందే. అప్పుడే జయాపజయాల్నీ, లాభనష్టాల్నీ సమదృష్టితో చూసే మనోధైర్యం ఏర్పడేది. జీవితంలో ఎదురయ్యే ఎత్తుపల్లాల్నీ, ఊహించని మలుపుల్నీ సులువుగా దాట గలిగే సత్తా వచ్చేది. ఉగాది పండగ నుంచి మనం నేర్చుకోవాల్సిందీ, ఆ రోజు నుంచి స్ఫూర్తి పొందాల్సిందీ ఈ కోణంలోనే.

ఎన్నేళ్లంటే...

బ్రహ్మ సృష్టి ఆరంభమై ఇప్పటికి 195 కోట్ల 58 లక్షల 85 వేల 118 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు వచ్చిన విళంబి నామ సంవత్సరం 119వది. కలియుగం ప్రారంభమై ఈ ఉగాదికి 5119 సంవత్సరాలు. శ్రీమహావిష్ణువు మత్య్సావతారంలో సోమకాసురుణ్ణి సంహరించి, వేదాలను కాపాడి బ్రహ్మదేవుడికి అప్పగించింది ఉగాది నాడేనట. కలియుగం ప్రారంభమైందీ, శ్రీరామ పట్టాభిషేకం జరిగిందీ, కురుక్షేత్రం తర్వాత ధర్మరాజు పీఠాన్నెక్కిందీ, వెయ్యేళ్లపాటు పాలన సాగించిన విక్రమార్కుడు సింహాసనాన్ని అధిష్ఠించిందీ, శాలివాహనుడు కిరీట ధారణ చేసిందీ ఈ పర్వదినానే. అందుకే ఉగాదినాడు పనులు మొదలు పెడితే అందులో తిరుగుండదనేది చాలా మంది నమ్మకం. ఈ కారణంగానే కొన్ని చోట్ల రైతులు కొత్త నాగళ్లకు పూజ చేసి, లాంఛనంగా వ్యవసాయ పనుల్నీ ప్రారంభిస్తారు. ఉగాది రోజు ఇంటి ముందో, వీధిలోనో చలివేంద్రాన్ని స్థాపిస్తే గొప్ప పుణ్యఫలం లభిస్తుంది. శుభ్రమైన చోట అలికి ముగ్గుపెట్టి కొత్త కుండల్లో నీరు నింపాలి. గణపతినీ ఇష్టదేవతలనూ ధ్యానించి కొబ్బరికాయ కొట్టి చలివేంద్రాన్ని ప్రారంభించాలి. ఈ రోజు చల్లటి మజ్జిగనో లేక పానకాన్నో అతిథులకూ బాటసారులకూ ఇచ్చినా పుణ్యమని పురాణవాక్కు. ఈ రోజు కొందరు పితృదేవతల్ని గుర్తు చేసుకుంటూ తర్పణాలూ వదులుతారు.

పంచ అంగాలు...

పంచాంగం అంటే అయిదు విభాగాలు అని అర్థం. అవి తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. తిథులు పదిహేనూ, వారాలు ఏడూ, అశ్వని మొదలు రేవతి వరకూ 27 నక్షత్రాలూ, విష్కంభం మొదలు వైధృతి వరకూ 27 యోగాలూ, బవ మొదలు కింస్తుఘ్నం వరకూ 11 కరణాలన్నింటిని గురించి తెలియజేసేదే పంచాంగం. ముహూర్తబలం కోసం ఈ అయిదింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. ప్రాచీన భారతీయుల ఖగోళ విజ్ఞానమే నేటి పంచాంగానికి పునాది అన్నది చరిత్రకారుల విశ్లేషణ. మనకి తెలిసిన ఖగోళ శాస్త్రం ఆధారంగా ఏ గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నాయో లెక్కవేసి, వాటి ప్రకారం ఫలితాలను అంచనా వేయడమే పంచాంగం. తిథి విషయంలో జాగ్రత్తపడితే సంపద, వారం వల్ల ఆయుష్షు, నక్షత్రం వల్ల పాప పరిహారం, యోగం వల్ల ఆరోగ్యం, కరణం వల్ల విజయం ప్రాప్తిస్తాయని అంటారు.

- లక్ష్మీహరిత ఇంద్రగంటి
సహకారం: డా.శంకరమంచి రామకృష్ణ శాస్త్రి

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.