close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అక్కడ ముస్లింలకూ పండగే!

అక్కడ ముస్లింలకూ పండగే!

ఉగాది... అంటే హిందువుల పండగ అని అందరికీ తెలిసిందే. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే... కడప జిల్లాలో ఎంతోమంది ముస్లింలకూ ఈ పండగ ప్రత్యేకమైందే. ఆరోజున వందలమంది ముస్లింలు స్థానికంగా కొలువైన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని కానుకలు సమర్పించడం అక్కడ అనాదిగా వస్తున్న ఆచారం.
తిరుమల తొలి గడప దేవుని కడప. పూర్వం తిరుమల వెళ్లే భక్తులు కడపలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునే వెళ్లేవారట. అందుకే తాళ్లపాక అన్నమయ్య ‘కాదనకు నామాట కడపరాయ నీకు- గాదె బోసెవలపులు కడపరాయా...’ అంటూ కీర్తించాడు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఆ మొలకనవ్వుల కడప రాయడిని దర్శించుకునేందుకు కేవలం హిందూ భక్తులే కాదు, ముస్లింలు కూడా రావడం ఈ ఆలయానికున్న విశిష్టత. శ్రీనివాసుడు తమ ఇంటి ఆడపడుచు బీబీ నాంచారమ్మను మనువాడాడు కాబట్టి ఆయన్ను తమ అల్లుడిగా భావిస్తారు స్థానిక ముస్లింలు. అందుకే, ఏటా తెలుగు సంవత్సరాది రోజున ఉపవాసం ఉండి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తారు. బియ్యం, గారెలు, కొబ్బరికాయలూ తెచ్చి స్వామివారికి సమర్పిస్తారు. వెంకన్నను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నాక సాయంత్రం ఉపవాస దీక్షను విరమిస్తారు. ఇలా ఏటా ఉగాదినాడు ఉదయం నుంచి మధ్యాహ్నంలోపు స్వామి దర్శనానికి వచ్చే ముస్లింల సంఖ్య వందల్లో ఉంటుంది. హిందూ భక్తులతోపాటే వాళ్లూ తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు. ఈ సంప్రదాయం ఎన్నో వందల ఏళ్ల నుంచీ ఆ ఆలయంలో కొనసాగుతోంది. ఆ రోజున కడప రాయడిని దర్శించి కానుకలు సమర్పిస్తే ఏడాదంతా తమకు మంచే జరుగుతుందని అక్కడి ముస్లిం భక్తుల నమ్మకం.

రమణీయ శిల్పవైభవం
కడప లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ శిల్ప సౌందర్యం రమణీయం. స్వామి సన్నిధిలో ఉన్న మంటపం విజయనగర రాజుల కాలంలో నిర్మితమైనట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడి తాండవ గణపతి రూపం అతిమనోహరం. స్థానిక రాజులే కాక నవాబులు, ఆంగ్లేయుడైన సర్‌ థామస్‌ మన్రో సైతం ఆలయ పునర్నిర్మాణానికీ మరమ్మతులకూ సహకరించినట్లు ఆధారాలున్నాయి. స్వామి గర్భగుడి వెనుక ఆంజనేయ స్వామి విగ్రహం పశ్చిమాభిముఖమై ఉంటుంది. తిరుమల క్షేత్రపాలకుడు వరాహస్వామి కాగా ఇక్కడి క్షేత్ర పాలకుడు హనుమంతుడు. స్వామి వక్షస్థలంపై కుడివైపున శ్రీవత్స చిహ్నంతో మహాలక్ష్మీమూర్తి ఉండడం విశేషం. మూల విరాట్టు విగ్రహంపైన సుందరంగా చెక్కిన యజ్ఞోపవీతాలూ నాలుగు కంఠాభరణాలూ కనిపిస్తాయి. విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర, బుక్కరాయలూ సాళువ వంశీయుడైన నరసింహరాయలూ ఆంధ్రభోజుడైన శ్రీకృష్ణదేవరాయలూ స్వామికి మడిమాన్యాలూ ఆభరణాలూ సమర్పించినట్లు ఆలయ కుడ్య శాసనాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయానికి ఎడమ వైపున అమ్మవారి మందిరం ఉంది. విష్వక్సేన మందిరం, నాగుల విగ్రహాలు, వినాయకుడు, ఆండాళ్లమ్మ మందిరం, శమీవృక్షం, ధనుర్మాసాది మంటపాలే కాక వేంకటేశ్వర స్వామికి ఎదురుగా ఆంజనేయ స్వామి మందిరం సైతం ఉండడం ఈ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయానికున్న ప్రత్యేకతగా చెబుతారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరుని పుష్కరిణిగా పిలుస్తారు. కృష్ణా కాలువలోంచి దీన్లోకి వచ్చే నీరు తూర్పు వైపున ఉన్న చిన్న కాలువద్వారా బయటకు వెళుతుంది. కాబట్టి, నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. ఈ పుష్కరిణిలోనే స్వామివారి తెప్పోత్సవం, చక్రస్నానాది కార్యక్రమాల్ని అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఇక, ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఎంతో కన్నుల పండగగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా సాగే స్వామి రథోత్సవాన్ని అన్నమయ్య కీర్తించిన తీరే అందుకు ఉదాహరణ.
కన్నుల పండుగలాయ కడప రాయని తేరు
మిన్నునేల శృంగారము మితిమీరినట్లు
కాంతతో శ్రీవేంకటేశ కడప తేరెక్కి
యింత నన్ను గూడి వీధులేగితివి నీవు
అంటూ కప్పురపు నవ్వుల కడప రాయని కీర్తించి తరించాడు అన్నమయ్య. వేంకటేశుడి రథోత్సవం సమయంలో కూడా కులమతాలకు అతీతంగా వేలమంది భక్తులు తేరును లాగి దేవేరీ సహితుడైన కడపరాయడిని దర్శించి పరవశిస్తారు.

- కర్నాటి వెంకట శివారెడ్డి, కడప న్యూస్‌టుడే

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.