close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
శ్రీవారి సన్నిధిలో ఉగాది!

శ్రీవారి సన్నిధిలో ఉగాది!

వైకుంఠం నుంచి భక్తుల కోసం భూలోకానికి వేంచేసి వారి ఇలవేల్పుగా నిలిచిన శ్రీవేంకటేశ్వరస్వామి తెలుగు సంవత్సరాది పండుగను ‘ఉగాది ఆస్థానం’ పేరిట వైభవంగా చేసుకుంటున్నారు. ఆరోజు తిరుమల క్షేత్రం పచ్చని పందిళ్లూ, రంగవల్లులూ, విద్యుద్దీపాల వెలుగులతో ఇల వైకుంఠంగా భాసిల్లుతుంది.
శ్రీవారి మేలుకొలుపు సేవ సుప్రభాతంతో ‘ఉగాది’ ప్రారంభమవుతుంది. అనంతరం తోమాల సేవ జరుగుతుంది. అది పూర్తయిన వెంటనే శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి, శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుల ఉత్సవమూర్తులకి ఏకాంతంగా తిరుమంజనం జరుగుతుంది. ఆపైన మందిరంలోని బంగారు వాకిలి ముందుండే తిరుమహామణి మండపంలో గరుడాళ్వారుకు అభిముఖంగా బంగారు సర్వభూపాల వాహనంలో దేవేరులతోపాటు శ్రీమలయప్పస్వామివారిని వేంచేపుచేస్తారు. పట్టువస్త్రాలతో, వజ్రవైఢూర్య మరకత మాణిక్యాది సర్వాభరణాలతో, కిరీటాలతో, సుగంధ పరిమళభరితమైన పుష్పమాలికలతో ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరిస్తారు. శ్రీమలయప్పస్వామివారికి ఎడమవైపున మరొక పీఠంపై దక్షిణాభిముఖంగా శ్రీవారి సేనాధిపతికి శిరస్త్రాణాన్నీ, ఖడ్గాన్నీ అలంకరించి అత్యంత భయభక్తులతో స్వామి ఆజ్ఞలను అమలుజేయడానికి సర్వసన్నద్ధమైనట్లు సిద్ధంచేస్తారు. ఆ తర్వాత ఆనంద నిలయంలోని మూలవిరాట్టుకూ, బంగారు వాకిలిలోని ఉత్సవమూర్తులకూ, సేనాధిపతికీ విశేషమైన ప్రసాదాలూ, అన్నప్రసాదాలూ నివేదిస్తారు. ఆ సమయంలో శ్రీవారి అర్చకులు, జీయంగార్లు, ఏకాంగులు, వేద పండితులు, దేవస్థానం కార్యనిర్వాహకులు ఛత్రచామరాలతో వెంటరాగా- మంగళ వాయిద్యాలతో వేదపఠనం జరుగుతుంది. ఆపైన పెద్దజీయంగార్‌ వెండి పళ్లెంలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలమీద పెట్టుకుని పంచముఖ దివిటీలు వెలుగుతుండగా సన్నడోలూ, పలకగంటలూ మోగుతుండగా, వేద పారాయణాలు సాగుతుండగా దేవస్థానం ఉన్నతాధికారులు వెంటరాగా ధ్వజస్తంభానికి ప్రదక్షిణంగా స్వామిసన్నిధిని చేరుకుని అర్చకస్వాములకు పట్టువస్త్రాలను అందిస్తారు. వీటిలో నాలుగింటిని శ్రీవేంకటేశ్వరస్వామి మూలమూర్తికి అలంకరిస్తారు. ఒక వస్త్రాన్ని కిరీటానికీ, రెండోది నందక ఖడ్గానికీ, మూడోది ఆది తోమాలగానూ, నాలుగోది ఉత్తరీయంగానూ అలంకరిస్తారు. అనంతరం తెర తొలగించిన తర్వాత అర్చకులు బంగారు పళ్లెంతో పచ్చకర్పూర హారతిని ఇస్తారు. ఈ హారతిని అధికారులకు కూడా అందించి ఆపైన తీర్థం, శఠారి, చందనం, తాంబూలాలిస్తారు. అనంతరం మరో రెండు పట్టువస్త్రాలను బంగారు వాకిలి ఎదుట ఉత్సవమూర్తులకు సమర్పిస్తారు. వీటిని అర్చకులు శ్రీమలయప్పస్వామికి ఒకటీ, సేనాధిపతికి మరొకటీ అలంకరిస్తారు. ఆ తర్వాత శ్రీవారికి ఆస్థానం జరుగుతుంది.

ఉగాది ఆస్థానం
శ్రీవారి పాదాలమీద ఉంచిన పంచాంగాన్ని తీసుకుని ఆస్థాన సిద్ధాంతి స్వామివారి నూతన పంచాంగ విశేషాలను వినిపిస్తారు. ఆనాటి తిథి, వార నక్షత్రాలతోపాటు నూతన సంవత్సర ఫలితాలూ, 27 నక్షత్ర జాతకుల కందాయఫలాలూ, రాజ పూజ్యత-అవమానాలను పంచాంగ శ్రవణంతో స్వామివారికి వినిపిస్తారు. ప్రత్యేకంగా స్వామివారి జన్మనక్షత్రం శ్రవణం గురించి వివరంగా చెబుతారు. సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేస్తుండగా, చిన్మయహాసంతో అందరినీ ఆశీర్వదిస్తున్నట్లుగా వేయి వెలుగులతో దర్శనమిస్తాడు శ్రీనివాసుడు. తర్వాత అమ్మవార్లు శ్రీదేవీ, భూదేవిలకు కూడా నక్షత్ర ఫలితాలు చెబుతారు. పంచాంగ శ్రవణానంతరం ముందు రోజు వచ్చిన హుండీ రాబడినీ, ఆదాయ వ్యయాలనూ ఉత్సవ విశేషాలను స్వామివారికి వినిపించి ఆపైన బంగారుతట్టలో నవనీత హారతిని ఇస్తారు. తర్వాత మైసూరు, తాళ్లపాక, తరిగొండవారి హారతులూ, చివరగా భక్తుల తరఫున ఒక్కొక్కరినుంచీ రూపాయి వసూలుచేసి ‘రూపాయి హారతి’నీ స్వామికి ఇస్తారు. ఆపైన ప్రసాద వినియోగంతో ఉగాది ఆస్థానం పరిసమాప్తమవుతుంది. ఆ తర్వాత భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంకాలం తిరువీధుల్లో శ్రీదేవి-భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి ఊరేగుతూ భక్తులకు నూతన సంవత్సర ఆశీస్సులతో పాటు దివ్యదర్శనాన్ని అనుగ్రహిస్తారు. ఇలా తిరుమలలో ఉగాది ఆస్థానం సందర్భంగా శాస్త్రోక్తంగా పలు కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీ విళంబినామ సంవత్సరాన్ని స్వాగతిస్తూ శ్రీవారి ఆలయం, ముఖద్వారాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

తితిదే పంచాంగం
తితిదే పంచాగానికి విశేష ఆదరణ ఉంది. ఈ పంచాంగం విడుదలయ్యేవరకు పండితులు కొత్త సంవత్సరంలో శుభ ముహూర్తాలు పెట్టరు. ఈసారి పంచాంగాన్ని తితిదే ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వేంకట పూర్ణప్రసాద్‌ సిద్ధాంతి రూపొందించారు. రాజాధి నవనాయకుల ఫలితాలతోపాటు రాశి ఫలాలూ, వధూవరుల గుణమేళనం, వివాహాది సుముహూర్త నిర్ణయాలూ, తిరుమలలో నిర్వహించే విశేష ఉత్సవాలను ఇందులో వివరించారు.

- వసంతనాయుడు న్యూస్‌టుడే, తిరుమల

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.