close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వీళ్ల ఉగాదిని చూడాల్సిందే...

వీళ్ల ఉగాదిని చూడాల్సిందే...

తీపీ చేదూ పులుపూ వగరూ ఉప్పూ కారం... ఇలా ఉగాది పచ్చడిలో ఎన్నో రుచులున్నట్లే తెలుగునాట ఉగాది పండగను జరుపుకునే పద్ధతిలోనూ ఎన్నో సంప్రదాయాలున్నాయి. ఓచోట ఆరోజు పిడకల యుద్ధం జరిగితే మరోచోట గాడిదల సవారీ జరుగుతుంది. అమ్మవారికి బోనాలు సమర్పించడం, పండగనాడు పంచదార చిలుకల్నీ చేటల్నీ కొనడం లాంటివీ ఆ సంప్రదాయంలో భాగమే.
సంవత్సరాది రోజున కొత్త బట్టలు వేసుకుని గుడికి వెళ్లడం రైతులు నాగళ్లకు పూజలు చెయ్యడం ఉగాది పచ్చడిని తిని పంచాంగం వినడం... అందరూ చేసేవే. కానీ తెలుగు లోగిళ్లలోనే కొన్నిచోట్ల వీటికి అదనంగా భిన్నమైన సంప్రదాయాలూ ఉన్నాయి.

పిడకల యుద్ధం
ఉగాది వస్తుందంటే చాలు, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆస్పరి మండలం, కైరుప్పల చుట్టుపక్కల గ్రామాల్లో భారీ సంఖ్యలో పిడకలు తయారవుతాయి. పండుగనాటికి అవన్నీ కైరుప్పలలోని ప్రాచీన వీరభద్రస్వామి ఆలయం దగ్గరికి చేరిపోతాయి. ఎందుకంటారా... వాటితో కొట్టుకోవడానికి. ‘నుగ్గులాట’(నుగ్గులు అంటే పిడకలు)గా పిలిచే ఈ యుద్ధానికి కారణం తమ ఆరాధ్యదైవం వీరభద్రుడూ కాళికాదేవిల విఫల ప్రేమగాథే అంటారు స్థానికులు. వీరభద్రుడిని ఇష్టపడిన కాళికాదేవి, తనను పెళ్లిచేసుకోమని కోరిందట. ఆమెను ఆటపట్టించడానికి స్వామి ‘కుదరదు’ అన్నాడట. దాంతో వీరభద్రుణ్ని అవమానించడానికి కాళికాదేవి వర్గీయులు ఆయన్ను పిడకలతో కొట్టారట. వీరభద్రుడి వర్గీయులూ తిరిగి వారిమీదికి పిడకల్ని విసిరారట. అప్పటి ఆ కొట్లాటే ఇప్పటి పిడకల యుద్ధం. ఏటా వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉగాది మరునాడు గ్రామస్థులు వీరభద్రుడూ కాళికామాతల వర్గాలుగా విడిపోయి పిడకలతో కొట్టుకుంటారు. చుట్టుపక్కల గ్రామాలవాళ్లూ ఇందులో పాల్గొంటారు.

గాడిదల సవారీ
కర్నూలు జిల్లా కల్లూరులోని చౌడేశ్వరి మాత జ్యోతి ఉత్సవాలు కూడా ఏటా ఉగాది రోజునే ప్రారంభమవుతాయి. ఆలయప్రాంగణంలోని బురదమట్టిలో జరిగే ఎద్దులూ గాడిదల సవారీలు ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణ. ఉగాదిరోజున గ్రామంలోని రైతులు తమ ఎద్దుల్ని అందంగా అలంకరించి, బండ్లు కట్టుకొచ్చి, ఆలయం చుట్టూ ఏర్పాటుచేసిన బురదమట్టిలో మూడుసార్లు తిప్పుతారు. అలా చేస్తే పంటలు బాగా పండుతాయనీ బండ్లు తిరుగుతున్నపుడు చూడ్డానికి వచ్చిన సందర్శకుల కొత్తబట్టల మీద బురద మరకలు పడితే అమ్మవారి ఆశీస్సులు లభించినట్లేననీ భావిస్తారు భక్తులు. ఎడ్లబండ్ల తరహాలోనే ఉగాది మరుసటి రోజున కర్నూలు నగరంలోని రజకులందరూ తమ గాడిదల్ని అలంకరించి, ఒంటెద్దు బండికి కట్టుకుని ఆలయంలోని బురదమట్టిలో మూడుసార్లు ప్రదక్షిణ చేస్తారు. అలాచేస్తే బట్టలు ఉతికేందుకు నీటి కరవు ఉండదనేది వారి నమ్మకం.

చిలుకల తీర్థం
సంవత్సరాది రోజున పంచదార చిలుకల్నీ చేటల్నీ కొనే సంప్రదాయం గురించి ఎప్పుడైనా విన్నారా... ఇది విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో కనిపించే ఓ భిన్నమైన సంప్రదాయం. స్థానికంగా ఉన్న పేరంటాలమ్మకు ఏటా ఉగాదిరోజున ‘చిలుకల తీర్థం’ జరుగుతుంది. దానికి విశాఖతోపాటు తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా ఎంతోమంది భక్తులు వస్తుంటారు. తిరిగెళ్లేటపుడు ఇక్కడ అమ్మే పంచదార చిలుకలూ చేటల్ని కొనుక్కెళ్లి ఇళ్లలోని దేవుడిపటాల దగ్గర పెట్టి పూజిస్తారు.

పేలాల ఉత్సవం
ఉగాది వచ్చిందంటే చాలు, తెలంగాణలోని సంగారెడ్డి పట్టణంతో పాటు, ఆ చుట్టుపక్కల గ్రామాలవారికీ ఉత్సాహం రెట్టింపైపోతుంది. పండుగరోజు సాయంత్రం సంగారెడ్డిలోని శ్రీరామమందిరంలో జరిగే పేలాల ఉత్సవమే అందుక్కారణం. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ ఉత్సవాలు నిర్వహించడం ఈ పురాతన ఆలయంలో ఆనవాయితీ. ఆ సందర్భంగా పేలాలూ బెల్లంతో లడ్డూలను తయారుచేసి సీతారాములకు సమర్పించి సాయంత్రం ఏడుగంటల సమయంలో వాటిని మందిరం మీదినుంచి ఎగరేస్తారు. వాటిని అందుకోవడానికి భక్తులు పోటెత్తుతారు. ఒక్క లడ్డూ అందుకోగలిగినా ఆ సంవత్సరం అంతా మంచే జరుగుతుందన్నది భక్తుల విశ్వాసం.

ఉగాది రోజున బోనాలు
మామూలుగా తెలంగాణలో బోనాలను ఆషాఢమాసంలో జరుపుకుంటారు. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో మాత్రం ఛైత్రమాసం మొదటిరోజున ఊరంతా కలసి బోనాల వేడుకని చేసుకుంటారు. అరవైఏళ్ల కిందట ఓసారి ఆ గ్రామం మొత్తానికీ మశూచి సోకి, ఎంతోమంది మరణించారు. దానిక్కారణం ముత్యాలమ్మ తల్లి ఆగ్రహమే అని నమ్మిన గ్రామపెద్దలు అమ్మను శాంతింపజేసేందుకు బోనాలను నైవేద్యంగా సమర్పించాలని నిర్ణయించారు. ఆరోజు ఉగాది. అందరూ కలసి ఊరి ముత్యాలమ్మ, పడమటి ముత్యాలమ్మ ఆలయాల్లో బోనాలు సమర్పించగా మశూచి తగ్గిపోయిందట. అప్పటి నుంచీ తెలుగు సంవత్సరాది రోజున బోనాలూ ఎడ్లబండ్ల ఊరేగింపులూ పోతరాజుల విన్యాసాలతో పండగ జరుపుకోవడం అక్కడ ఆనవాయితీగా మారింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.