close
ఓపాలి సూసెళ్లిపోండి

తూర్పు తీరంలో చిట్టి తాబేళ్ల బృందగానం
ఓపాలి సూసెళ్లిపోండి

లక్షలు లక్షలుగా వస్తాయి! పక్కా లక్ష్యంతో వస్తాయి! గుడ్లు పెట్టి వెళ్లిపోతాయి. గూడులోని గుడ్లు ఊరికే ఉంటాయా! అందులోని జీవాలు భూమ్మీద పడతాయి! గమ్మున సాగరంలో సంగమిస్తాయి. అలలపైన ఇలా వచ్చేవి.. అలా అలలతోనే వెళ్లిపోతాయి. అవే ఆలివ్‌రిడ్లే తాబేళ్లు. అవి వెళ్లే సమయం ఆసన్నమైంది. అప్పుడే తీరంలో చిట్టి తాబేళ్ల సందడి మొదలైంది. అందులో మనమూ భాగమవుదామా...
ఆలివ్‌రిడ్లే తాబేళ్లు అవి ఎక్కడైతే పుట్టాయో ఆ ప్రాంత పరిసరాల్లోనే గుడ్లు పెడతాయి. ఏడాదంతా సముద్రంలో ఎక్కడెక్కడ ఉన్నా.. గుడ్లు పెట్టే సమయానికి అవి జన్మించిన తీరం దిశగా వచ్చేస్తాయి. తీరం వెంట ఐదారు రోజులు తిరుగాడి.. అనువైన ప్రదేశాన్ని ఎంచుకొని తెల్లవారుఝామున గుడ్లు పెట్టి సముద్రంలోకి వెళ్లిపోతాయి.
పద ముంచుకొస్తున్నా పరిగెత్తలేవు. వేగంగా నడవ లేవు. చాలా భారంగా కదులుతాయి. అయినా జీవిత సత్యాన్ని బోధించాయవి. కుందేలును ఓడించి తాబేలు నేర్పించిన ‘నిదానమే ప్రధానం’ గుర్తుందిగా! తాబేళ్లు మహా మొండివి.. ఎంతకాలమైనా బతికేస్తాయి. చాలా గట్టివి.. మందర పర్వతాన్ని మోసిన ఘనమైన చరిత్ర వాటిది. అలాంటి తాబేళ్లలో ఒక రకం ఆలివ్‌రిడ్లే. సముద్ర తాబేళ్లలో ఇవే చిన్నవి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయివి. పసిఫిక్‌ మహా సముద్రం, అట్లాంటిక్‌ మహాసముద్రం దక్షిణ భాగం, హిందూ మహాసముద్రంలో వీటి ఉనికి ఎక్కువ. మన దేశానికి వస్తే.. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర తీరాల్లో కనిపిస్తాయి. ఎప్పుడూ కడలి కౌగిట ఈదులాడే రిడ్లే తాబేళ్లు.. ఏడాదికి ఒకసారి తీరంలో కనువిందు చేస్తాయి. సముద్రంలో ఎక్కడున్నా.. డిసెంబర్‌-ఫిబ్రవరి మధ్య తీరాలకు చేరుకుంటాయి. తీరం సమీపించిన తర్వాత కొన్నాళ్ల పాటు ఆ ప్రాంతంలోనే ఉంటాయి. ఆడ, మగ తాబేళ్లు కలుస్తాయి. జనవరి, ఫిబ్రవరి నాటికి ఆడ తాబేళ్లు.. లక్షల్లో తీరానికి చేరుకుంటాయి. ఒక ప్రదేశాన్ని ఎంచుకొని.. అడుగున్నర లోతున్న గూడు తవ్వుతాయి. అందులో 100 నుంచి 120 వరకు గుడ్లు పెట్టి.. అవి ఎవరి కంటా పడకుండా.. వాటిపై ఇసుక కప్పేసి మళ్లీ సముద్రంలోకి వెళ్లిపోతాయి.
బుడిబుడి అడుగులు..
మార్చి మాసాంతం నుంచి ఈ తీరాల్లో సందడి మొదలవుతుంది. తల్లి తాబేళ్లు వదిలి వెళ్లిన గుడ్లలో నుంచి ఒక్కొక్కటిగా పిల్ల తాబేళ్లు బయటకు వస్తాయి. ఇసుకను తొలుచుకుంటూ పైకి వస్తాయి. వీటి సంఖ్య కోట్లలో ఉంటుంది. ఇసుక గూడు నుంచి బయటకు రాగానే.. ఎవరో పిలిచినట్టు బుడిబుడి అడుగులేస్తూ సముద్రం వైపువెళ్లిపోతాయి. పిల్ల తాబేళ్ల ఉత్సాహం చూసేందుకు ఆయా తీరాలకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. సముద్ర జలాలతో పచ్చిగా మారిన తీరంపై కాలిముద్రలు వేసుకుంటూ ముందుకెళ్తుంటాయవి. అలల తాకిడికి ఒడ్డుకొచ్చి పడుతూ.. సముద్రంలోకి మళ్లిపోతున్న అదే కెరటంపై తేలాడుతూ సముద్ర గర్భంలో కలిసిపోతాయి.
అందరు కలిసి..
ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జంతుజాలంలో ఆలివ్‌ రిడ్లే తాబేలు కూడా ఒకటి. వీటిని కాపాడేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ గుడ్ల పరిరక్షణకు ఏర్పాట్లు చేస్తున్నాయి. జంతు సంరక్షణ సంఘాలు, ఎన్జీవోలు కూడా ఇందులో పాలు పంచుకుంటున్నాయి. తీరప్రాంత గ్రామవాసులూ ఈ పోరాటంలో భాగమవుతున్నారు. తీరాల్లో సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి.. గుడ్లను పదిలంగా చూసుకుంటున్నారు. చిట్టి తాబేళ్లు సముద్రంలో కలిసే ఘట్టాన్ని వేడుకగా చేసుకునే గ్రామాలూ ఉన్నాయి. ఆ ప్రదేశాలు పర్యాటకంగానూ అంతో ఇంతో లబ్ధి పొందుతున్నాయి.

రణస్థలం నుంచి ఇచ్ఛాపురం వరకు 

శ్రీకాకుళం జిల్లాలో 194 కి.మీ సముద్ర తీర ప్రాంతం ఉంది. తీరం పొడవునా పెద్ద ఇసుక తిన్నెలు విస్తరించి ఉన్నాయి. ఆలివ్‌రిడ్లే తాబేళ్లకు గుడ్లు పెట్టడానికి ఇది అనువైన ప్రదేశం. రణస్థలం నుంచి ఇచ్ఛాపురం తీరం వరకు వీటి జాడ కనిపిస్తుంది. జిల్లాలోని బారువా, కళింగపట్నం, భావనపాడు, దేవునల్తాడ, వజ్రపుకొత్తూరు తీరాలు ఏప్రిల్‌, మే నెలల్లో కొత్తగా పుట్టుకొచ్చిన తాబేళ్లతో అలరిస్తాయి. వీటి గుడ్ల పరిరక్షణకు అటవీశాఖ తీర ప్రాంతంలో ప్రత్యేక హేచరీలను ఏర్పాటు చేస్తుంటుంది. స్థానిక యువత గుడ్లను పరిరక్షిస్తుంటుంది. గుడ్లు వీధికుక్కలు, ఇతర జంతువులు, గద్దల బారిన పడకుండా వాళ్లు జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి రోజూ తీరం వెంట గుడ్లను సేకరించి సురక్షిత ప్రాంతానికి తరలిస్తుంటారు. గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్లలను సముద్రంలోకి విడిచిపెడతారు. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం తీరాల్లోనూ ఆలివ్‌రిడ్లే తాబేళ్లను సంరక్షిస్తున్నారు. వీటిల్లో ఏ ప్రాంతానికి వెళ్లినా చిన్ని చిన్ని తాబేళ్లను చూసినట్టూ ఉంటుంది.. సాగర విహారం చేసినట్టూ ఉంటుంది.

ఎలావెళ్లాలి?

 * హైదరాబాద్‌, విజయవాడ నుంచి శ్రీకాకుళం చేరుకోవాలి. అక్కడి నుంచి బారువా, భావనపాడు, కళింగపట్నం తదితర ప్రాంతాలకు బస్సులు అందుబాటులో ఉంటాయి.
* హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నుంచి రైళ్లో.. ఇచ్ఛాపురం జంక్షన్‌కు చేరుకోవాలి. అక్కడి నుంచి కావలసిన తీరానికి వెళ్లొచ్చు.

ఊరంతా సందడే

 మహారాష్ట్ర తీరంలో ఆలివ్‌రిడ్లే తాబేళ్లను ఆదరించే గ్రామాలెన్నో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది రత్నగిరి జిల్లాలోని వెలాస్‌. ఫిబ్రవరిలో ఈ తాబేళ్లు వెలాస్‌ తీరానికి వచ్చి గుడ్లు పెడతాయి. గ్రామస్థులు, గ్రామ పంచాయతీ, మరికొన్ని పర్యావరణ సంస్థలు కలిసి.. తాబేళ్ల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. మార్చి నాటికి ఆ గుడ్లలో నుంచి తాబేళ్లు బయటకు వస్తాయి. ఈ సందర్భంగా పర్యాటక ప్రియులను సాదరంగా ఆహ్వానిస్తుంటారు వెలాస్‌ గ్రామస్థులు. మార్చి నెలంతా తాబేళ్ల పండగ నిర్వహిస్తారు. ఈ గ్రామానికి సమీపంలో దివేఆగర్‌, ఆంజర్లే, హరిహరేశ్వర్‌ తీరాల్లోనూ తాబేళ్ల సందడి చూడొచ్చు.
ఎలా వెళ్లాలి?
* పుణె నుంచి వెలాస్‌ 194 కిలోమీటర్లు ఉంటుంది. పుణె నుంచి మండన్‌గఢ్‌ మీదుగా ఇక్కడికి చేసుకోవచ్చు.

ఒడిశాలో..

ఒడిశాలో గోపాల్‌పూర్‌ బీచ్‌ మొదలు.. గంజాం సమీపంలోని గహిరమాతా బీచ్‌ వరకు ఆలివ్‌రిడ్లే తాబేళ్లు లక్షలుగా కనిపిస్తాయి. గంజాం తీరానికి ఈ దఫా నాలుగు లక్షలకు పైగా తాబేళ్లు వచ్చి గుడ్లు పెట్టాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్‌, మే నెలల్లో రోజూ వేల సంఖ్యలో తాబేళ్లు కడలి బాట పడతాయి. పూరీ, కోణార్క్‌, పారాదీప్‌ తీరాల్లోనూ ఈ ముచ్చట చూడొచ్చు.
ఎలా వెళ్లాలి?
* బరంపురం రైల్వేస్టేషన్‌ నుంచి గోపాల్‌పూర్‌ బీచ్‌కు 18 కి.మీ, గహిరమాతా తీరానికి 34 కి.మీ దూరం. సికింద్రాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణం నుంచి భువనేశ్వర్‌ వెళ్లే దాదాపు అన్ని రైళ్లూ బరంపురంలో ఆగుతాయి. అక్కడి నుంచి బస్సులు, ట్యాక్సీల్లో ఈ తీరాలకు చేరుకోవచ్చు.
* భువనేశ్వర్‌ నుంచి పూరీకి 67 కిలోమీటర్లు. అక్కడి నుంచి కోణార్క్‌కు 36 కి.మీ. ఈ రెండు క్షేత్రాల్లోనూ తాబేళ్ల సందడి కనిపిస్తుంది.  

పల్లేటి మోహన్‌రావు, న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.