close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆఫ్టరాల్‌ భార్యేగా

ఆఫ్టరాల్‌ భార్యేగా
- అప్పరాజు నాగజ్యోతి

‘‘ఏమ్మా, ఇప్పుడెలా ఉందీ?’’ నుదుటి మీద చేయి వేసి అడిగిన అమ్మవైపు అయోమయంగా చూస్తూ-
‘‘నువ్వేమిటమ్మా ఇక్కడ?’’ అన్నాను.
‘‘నిన్ను ఈ ఆస్పత్రిలో చేర్చి, ఈరోజుకి సరిగ్గా పదవరోజు దీపూ. ఇన్నాళ్ళూ నువ్వు మూసిన కన్ను తెరవకుండా ఉంటే అల్లుడుగారు ఎంత కంగారుపడ్డాడనుకున్నావు? నీకెన్ని సేవలు చేశాడో! నిన్ను కంటికిరెప్పలా చూసుకున్నాడనుకో. ‘గండం గడిచినట్లే’ అని డాక్టర్లూ, ‘ఆస్పత్రిలో మేముంటాము, మీరు ఇంటికివెళ్ళి విశ్రాంతి తీసుకోండి అల్లుడుగారూ’ అని మేమూ ఎంత చెప్పినా కూడా వినకుండా నీకోసం నిద్రాహారాలని మానుకుని ఎలా ప్రాణం మీదకు తెచ్చుకున్నాడో చూడు.’’
అమ్మ చెప్తుంటే అప్పుడే చూశాను పక్కనే మరో మంచం మీద పడుకున్న సూర్యని.
కళ్ళు లోతుకిపోయి నీరసంగా, డీలాపడ్డ వాడిలా ఉన్న సూర్యాని చూస్తుంటే దుఃఖం ముంచుకొచ్చింది.
  *                 *             *
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటికి వచ్చిన నాలుగురోజులకి నా ఆరోగ్యం గురించిన జాగ్రత్త
లన్నీ చెప్పి ఊరికి వెళ్ళిపోయారు అమ్మా నాన్నా.
బాగా అలసిపోయాడేమో సూర్య మంచం మీద అడ్డంగాపడి నిద్రపోతున్నాడు. ఏమీ తోచక ఇల్లంతా కలియచూస్తుండగా అక్కడే ఉన్న శ్రీరాముడి ఫొటో మీద పడింది నా దృష్టి. ఫొటో మీద దట్టంగా పేరుకుపోయిన దుమ్ముని దులుపుదామని లేచి చూస్తే, దానికింద నాలుగు మడతలుగా పెట్టి ఉన్న కాగితం కనిపించింది.
‘ఏదో ఉత్తరంలా ఉందే’ స్వగతంలా అనుకుంటూ కాగితాన్ని చేతిలోకి తీసుకున్నాను. ముత్యాల్లాంటి దస్తూరిని చూస్తూనే పోల్చుకున్నా, అది సూర్యా చేతిరాతేనని.
ఆత్రంగా నా కళ్ళు ఉత్తరంలోని అక్షరాలవెంట పరుగులు తీశాయి.
దీపూ,
ఆ రోజున పెన్‌డ్రైవ్‌ని ఇంట్లో మరచిపోవడంతో ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాను. ల్యాప్‌టాప్‌ పక్కనే ఉన్న పెన్‌డ్రైవ్‌ని జేబులో వేసుకుంటుండగా దానిమీద నువ్వు పెట్టిన ఉత్తరం కనిపించడంతో హడావుడిగా దాన్ని కూడా జేబులోకి తోసేసి ఆఫీసుకి వెళ్ళిపోయేంతలో, ఎన్నడూలేనిది మంచం మీద ఒళ్ళెరక్కుండా నిద్రపోతున్న నువ్వు కనిపించావు. పగలు నీకెప్పుడూ నిద్రేపట్టదు. అలాంటిది ఇంత గాఢంగా పడుకున్నావేమిటా అని నీ నుదుటి మీద చేయి వేసి చూస్తే, నీ ఒళ్ళు కాలిపోతోంది. వెంటనే పక్కింటి మామీ సాయంతో హాస్పిటల్‌కి తీసుకొచ్చాను. ‘డెంగ్యూ’ అని చెప్పి నీకు ట్రీట్‌మెంట్‌ మొదలుపెట్టారు డాక్టర్లు. ఎప్పుడూ చలాకీగా తిరుగుతుండే నిన్నలా హాస్పిటల్‌ బెడ్‌మీద చూస్తుంటే నాకు చెప్పలేనంత బెంగగానూ, చాలా అధైర్యంగానూ అనిపించింది దీపూ. నా బలమూ ధైర్యమూ శక్తీ అన్నీ నువ్వేనని నాకు ఆ క్షణానే అర్థమైంది.
డాక్టర్‌ రాసిచ్చిన ఇంజెక్షన్ని ఫార్మసీలో కొన్న తరవాత డబ్బులకోసమని జేబులో చేయి పెడితే నీ ఉత్తరం చేతికి తగిలింది. ఇన్నేళ్ళనుంచీ నిన్ను నేనింతలా బాధపెడుతున్నా నన్న విషయం ఆ ఉత్తరం చదివాకగానీ నాకు తెలీలేదు దీపూ. ఇంత చదువుకున్న నేనూ ఒక సగటు మగాడిలా ప్రవర్తించానన్న విషయం తలచుకుంటేనే బాధగానూ సిగ్గుగానూ అనిపించింది. నా తప్పు నాకు తెలిసొచ్చింది దీపూ. నేను నీ అంత చక్కగా రాయలేను కానీ, ఒక్క విషయం మాత్రం నిజం... నువ్వు నా ప్రాణం, నువ్వు లేకుండా నేను లేను. నాకు తెలీకుండానే నేను చేసిన తప్పులకి నన్ను శిక్షించొద్దు... ప్లీజ్‌!
ఎప్పటికీ... నీ
సూర్య
నేను చదవడం పూర్తయ్యేటప్పటికి సూర్య లేచినట్లున్నాడు. ‘‘నన్ను క్షమించు దీపూ’’ అంటూ నా చేతులు పట్టుకున్నాడు. నేనేం మాట్లాడలేదు.
‘‘నువ్వు నీ ఫీలింగ్స్‌ని అప్పుడప్పుడూ నాతో పంచుకున్న ప్పటికీ నేను తేలిగ్గా తీసుకు
న్నాను. మగాడిగా పుట్టాను కదూ, అందుకే త్వరగా అర్థం చేసుకోలేకపోయాను. వెరీవెరీ సారీ దీపూ. అన్నట్లు, నీ రిజిగ్నేషన్‌ లెటర్‌ని నువ్వు చెప్పినట్లుగా నీ ఆఫీసులో ఇవ్వలేదు. దానికి బదులుగా నువ్వు కొన్నాళ్ళు సిక్‌లీవ్‌ పెడ్తున్నట్లుగా మీ బాస్‌కి ఈమెయిల్‌ చేశాను. నా తప్పు నేను తెలుసుకున్నాను దీపూ. ఇంకా నీ నిర్ణయంలో మార్పు లేకపోతే, నీతోపాటే నేనూనూ. నీకు శ్రీరాముడంటే ఇష్టమైతే, నాకు నువ్విష్టం’’ అంటున్న సూర్య మాటలకి నా వదనంలో మెరుపు.
తనాశించిన సమాధానం నా కళ్ళల్లో దొరికిందేమో, ఆనందంగా నా ముంగురులని సవరిస్తూ నన్ను దగ్గరకి తీసుకున్నాడు.
  *                 *                 *
ఈ నెలరోజుల్లోనూ సూర్యలో నేనూహించనంత మార్పు. పెళ్ళికి మునుపు సూర్యని చూస్తున్నట్టు గానే ఉంది నాకు. సాధారణంగా ఏదైనా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన క్లాసుకి వెళ్ళినా లేదా అలాంటి పుస్తకాన్ని చదివినా దాని ప్రభావం మనమీదా, మన ప్రవర్తన మీదా కొన్నాళ్ళపాటే ఉంటుంది. మరి సూర్యలో కనిపిస్తున్న ఈ మార్పు తాత్కాలికమా లేక శాశ్వతమా అన్న డైలమాలో నేనుండగానే అనుకోని సర్‌ప్రైజ్‌. ఆరోజు ఆదివారం. ఆఫీసుకి వెళ్ళే పని ఉండదు కాబట్టి, తీరిగ్గా కాఫీ తాగుతూ మ్యాగజైన్‌లో నా ఫేవరేట్‌ స్టోరీ సెక్షన్‌ని తెరిచి ఆ వారం కథని చదవడం మొదలుపెట్టాను.
లేఖా రూపంలో రాసిన కథలా ఉంది.
ప్రియమైన మీకు,
ఈరోజు మన ఇరవైఐదో పెళ్ళిరోజు కావడంతో సిల్వర్‌జూబ్లీ ఫంక్షన్‌ని ఆర్భాటంగా చేయాలని పిల్లలు ముచ్చటపడ్డారు. కానీ, మీకిలాంటివన్నీ ఇష్టముండవని నేనే వాళ్ళని గట్టిగా వారించాను. మన పదో పెళ్ళిరోజు సందర్భంగా మా అన్నావదినలు హోటల్లో పార్టీని ఏర్పాటు చేసినప్పుడు, ఆ పార్టీ జరుగుతున్నంతసేపూ మీరు ఎలా ముళ్ళమీద కూర్చున్నట్టుగా కూర్చున్నారో, ఆ రాత్రి ఇంటికి వచ్చిన తరవాత నామీద ఎంత చిరాకుపడ్డారో నేనింకా మరిచిపోలేదు.
పాతిక వసంతాల మన వైవాహిక జీవితంలో ఎన్నో అడుగులు కలిసి నడిచాం, మరెన్నో బాధ్యతల్ని కలిసి పంచుకున్నాం. మీ జీవన సహచరిగా నా వంతు పాత్రని నేను సరిగ్గానే పోషించాననుకుంటున్నాను. కానీ, మీతో పంచుకోనీ, పంచుకున్నా మీరు పట్టించుకోనీ కొన్ని సంగతులని మీకు వివరించాలన్నదే నా ఆరాటం. అంతేకాదు, నా జీవితంలో మీతో చర్చించకుండా నేను తీసుకోబోతున్న మొట్టమొదటి అతి ముఖ్యమైన నిర్ణయాన్ని మీకు తెలిపేందుకు ముందుగా, మీకు కొన్ని విషయాలని తెలియచేయడం నా కర్తవ్యం అని కూడా నేను భావిస్తున్నాను.
మీకు గుర్తుందా, పాతికేళ్ళకి మునుపు జరిగిన మన ప్రధానానికీ పెళ్ళికీ మధ్యనున్న నాలుగు నెలల వ్యవధిలో, మీరు నెలకి రెండు మూడుమార్లు వైజాగ్‌ నుంచి హైదరాబాద్‌కి వచ్చేవారు. ఇద్దరం కలిసి సిటీ మొత్తం చుట్టేస్తూ ఎంతో సరదాగా గడిపేవాళ్ళం, మనసులు విప్పి మాట్లాడుకునేవాళ్ళం, భవిష్యత్తు గురించి ప్లాన్స్‌ వేసుకునేవాళ్ళం. ఆ రోజుల్లో నువ్వు నాకెన్నెన్ని కానుకలని ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేసేవాడివో గుర్తుందా, టైటాన్‌ రాగా గోల్డ్‌ వాచ్‌, ముత్యాల సెట్‌, ఇంకా నాకెంతో ఇష్టమైన లవెండర్‌ కలర్‌ డిజైనర్‌ చీర... ఎన్నో లెక్కేలేదు. అవన్నీ చూసిన నా ఫ్రెండ్స్‌, కజిన్స్‌ ‘పెళ్ళికి ముందే ఇన్ని బహుమతులైతే, పెళ్ళి తరవాత ఇంకెన్నో’ అంటూ నన్ను ఆటపట్టించేవాళ్ళు. అమ్మానాన్నలైతే నా అదృష్టానికి మురిసిపోయారు. నేనూ అలాగే అనుకుని ఆనందపడ్డాను.


నాకు టైఫాయిడ్‌ జ్వరం వస్తే, మా అమ్మానాన్నలకి ఫోన్‌ చేసి పిలిపించేసి దాంతో నీ బాధ్యత తీరిపోయినట్టుగా ఆఫీసుకి వెళ్ళిపోయావు. ఆ రోజున నా మనసెంత గాయపడిందో తెలుసా?


  కానీ, పెళ్ళయిన తర్వాత మీనుంచి నేనెటువంటి కానుకలనీ అందుకోలేదు. మొదట్లో తీవ్రమైన ఆశాభంగానికి గురయ్యాను, ఆ తర్వాత అలవాటుపడిపోయాను.
కానీ, నాకు ఆశ్చర్యం కలిగించే విషయమేమిటంటే... మీరు ఇప్పటికీ మీ స్నేహితులకీ బంధువులకీ తరచుగా కానుకలనిస్తుంటారు- ఎందుకని సూర్యా? ‘సర్‌ప్రైజ్‌లూ బహుమతులూ మనుషుల్ని ఎంతో థ్రిల్‌ చేస్తాయి. బంధాల్ని మరింత ధృడం చేస్తాయి’ అనే కదూ. కానీ, మీ దృష్టిలో భార్యకు అలాంటి థ్రిల్స్‌ అవసరం లేదు. ఫియాన్సీ నుంచి నా స్టేటస్‌ భార్యకి మారగానే మీ బహుమతులకి నేను అనర్హురాలనైపోయాను కదూ. భార్యతో బంధాన్ని నిలుపుకోవడానికి ప్రత్యేకంగా కష్టపడవలసిన అవసరం లేదు, ఆఫ్టరాల్‌ భార్యేగా. అంతే కదూ!
పెళ్ళికి ముందు నువ్వు మా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు, నీకోసం నేనే స్వయంగా వండి దగ్గరుండి వడ్డించినప్పుడు, ఒక్కో వంటకాన్నీ ఎంతో మెచ్చుకుంటూ తిన్నావు. ఆ రోజున నీ మాటలకే నా కడుపు నిండిపోయిందంటే నమ్ము! మన పెళ్ళయ్యాక ఎన్నోమార్లు నువ్వు నీ ఫ్రెండ్స్‌నీ కొలీగ్స్‌నీ ఫ్యామిలీస్‌తోపాటుగా మన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుండేవాడివి. నేనూ సంతోషంగా వండిపెట్టేదాన్ని. వాళ్ళంతా నా వంటని పొగుడుతూ ‘చాలా అదృష్టవంతుడివి సూర్యా’ అంటూ నిన్ను అభినందిస్తుండేవారు. ఎంతమంది మెచ్చుకున్నా నా మనసులో ఏదో తెలియని లోటు. నీనుండి మెప్పుదలని ఆశిస్తుండేదాన్నేమో... చాలా డిజప్పాయింట్‌ అవుతుండేదాన్ని.
పెళ్ళికి ముందు తప్ప ఆ తరవాతెప్పుడూ నువ్వు నా వంటని మెచ్చుకోలేదు. అదే నీ కొలీగ్‌ భార్య చేసిన ఏ చిన్న వంటకాన్నయినా సరే ఎంతో మెచ్చుకుంటావు. అంతవరకూ ఎందుకు... మీ అక్క వేసవి సెలవులకి మనింటికి వచ్చినప్పుడు ‘మ్యాగీ’ చేసినా సరే, ఒకటే పొగుడుతూ తింటావు. ఆవిడ సరదాగా పూరీలు చేసేందుకని కిచెన్‌లోకి వెళితే, నువ్వూ తనతో కబుర్లు చెబుతూ, తను పూరీలు ఒత్తిస్తుంటే నూనెలో వాటిని వేయిస్తావు. ఇన్నేళ్ళ మన వైవాహిక జీవితంలో ఏనాడైనా, నాతో అలా కబుర్లు చెబుతూ నాకు వంటలో సాయం చేశావా సూర్యా? ఇదేమాట ఆ రోజున నేనడిగితే నువ్వేమన్నావు... ‘మా అక్క వచ్చేది సంవత్సరానికి ఒక్కసారి’ అని కదూ. నన్నూ సంవత్సరంలో ఒక్కరోజే మెచ్చుకో, నాకూ ఒక్కరోజే సాయం చేయి సూర్యా. దాంతోనే తృప్తిపడతాను నేనూను. ఆ ఒక్కరోజు కోసం ఎదురుచూస్తూ మిగిలిన మూడువందల అరవైనాలుగు రోజులూ ఆనందంగా గడిపేస్తాను. కానీ నువ్వలా చేయవు. ఎందుకంటే నేను అక్కని కాదుగా, అమ్మతోనో మరెవరితోనో ‘తమ్ముడు చాలా మారిపోయాడు’ అని ఫిర్యాదు చేయడానికి. ఆఫ్టరాల్‌ భార్యనిగా, టేకెన్‌ ఫర్‌ గ్రాంటెడ్‌.
మన ఎంగేజ్‌మెంట్‌ తరవాత రోజు, నాక్కొద్దిగా ఒంట్లో నలతగా ఉంటే నువ్వెంత హడావుడి చేశావో ఒక్కసారి గుర్తుచేసుకో సూర్యా. చిన్న జ్వరానికే అంత హంగామా చేసిన నువ్వు, మన పెళ్ళయిన తరవాత నాకు టైఫాయిడ్‌ జ్వరం వస్తే, మా అమ్మానాన్నలకి ఫోన్‌ చేసి పిలిపించేసి దాంతో నీ బాధ్యత తీరిపోయినట్టుగా ఆఫీసుకి వెళ్ళిపోయావు. ఆ రోజున నా మనసెంత గాయపడిందో తెలుసా? ‘అల్లుడుగారు ఆఫీసులో ఏదో అర్జెంటు పని ఉండి వెళ్ళుంటాడులేమ్మా’ అంటూ అమ్మ నాకు సర్దిచెప్పాలని చూసింది. కానీ, వరసగా పది రోజులూ ఆఫీసులో అర్జెంట్‌ పనే ఉంటుందని అనుకోలేముగా- చదువుకుని ఉద్యోగం చేస్తున్న నేనైనా, పెద్దగా చదువుకోని అమ్మైనా.
ఆ పైనెల అత్తయ్యగారికి జ్వరం వస్తే నువ్వే స్వయంగా ఆవిడని డాక్టరికి చూపించి మందులు తేవడమేకాక ఆఫీసుకి సెలవుపెట్టి జ్వరం తగ్గుముఖం పట్టేవరకూ దగ్గరుండి ఆవిడని కనిపెట్టుకుని ఉన్నావు. కన్నతల్లికి ఒంట్లో బాగోలేకపోతే కొడుకుగా ఆవిడకి సపర్యలు చేయడం తప్పనేటంతటి కుసంస్కారిని కాను. కానీ, తల్లిని ఇంత ప్రేమగా చూసుకునే నువ్వు భార్య విషయంలో వేరేవిధంగా ఎలా ప్రవర్తించగలుగుతావు సూర్యా.
కన్నతల్లి ప్రేమకి సాటిలేకపోయినా, ఆ తల్లే కొడుకు పెద్దయిన తరవాత తనని సరిగా చూసుకోకపోతే ‘అడ్డాలనాడు బిడ్డలుగానీ, గడ్డాలనాడు కాదు’ అంటూ కూతురుతో
తన కష్టాన్ని చెప్పుకునేందుకు ఏమాత్రమూ సంకోచించదనే వెరపు కదూ. అదే భార్య మాత్రం భర్త గురించి ఎవరితోనూ చెడుగా చెప్పుకోలేదు మరి. ఎందుకో తెలుసా సూర్యా... ఒక భార్య తన భర్తని గురించిన అసంతృప్తిని కనక బయటికి ప్రకటిస్తే మగవారైతే వెంటనే అడ్వాంటేజ్‌ తీసుకోవడానికి చూస్తారు, అదే ఆడవారైతే ఆ భార్యనే చులకనగా చూస్తారు- తోబుట్టువులైనా, చివరికి తల్లిదండ్రులైనా సరే. వీటన్నింటికీ మించిన మరో పెద్ద కారణం ఏంటంటే- ఏ భార్యకైనా ‘నా భర్త ఎంతో ఉత్తముడూ, నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు’ అని చెప్పుకోవడంలో తెలియని తృప్తీ, ఆనందమూ. అందుకేనేమో మరి, నీ గురించి ఎన్నడూ ఎవ్వరితోనూ చెప్పుకోలేదు నేను.
మన అసంతృప్తులని మనకంటే ముందుగా, మన మనసుకి దగ్గరగా ఉండే స్నేహితులూ కొలీగ్సూ గుర్తిస్తారు సూర్యా. మన నిశ్చితార్థం నాలుగు రోజుల్లో ఉందనగా, నా ఫ్రెండ్‌ కౌశిక్‌ నాకు ప్రపోజ్‌ చేస్తే నేను రిజెక్ట్‌ చేశానని నీకు తెలుసుగా. మన పాప పుట్టిన మూడేళ్ళకనుకుంటా... తను మా కంపెనీలోనే జాయిన్‌ అయ్యాడు. ముందునుంచీ మేమిద్దరమూ మంచి ఫ్రెండ్స్‌మి కావటం వల్లనేమో మరి... ఇట్టే కనిపెట్టేశాడు నా వైవాహిక జీవితంలోని అసంతృప్తులని. తనింకా ఒంటరిగానే ఉన్నాననీ, తన ఆఫర్‌ ఇంకా అలాగే ఉందనీ, నన్ను ఆలోచించుకోమనీ చెప్పాడు.
కౌశిక్‌ నాకు ఎంతో కాలంగా తెలుసు. మంచివాడు, చాలా కేరింగ్‌ మనస్తత్వం. భర్త నుండి ఆశించే ఆదరణ, మెచ్చుకోలులాంటివన్నీ మరో మగవాడి నుంచి దొరకబోతుంటే, మనసు లొంగిపోకుండా ఉండటానికి ఎంత విల్‌పవర్‌ కావాలో తెలుసా సూర్యా?
నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ శ్రీరాముడే నా ఆరాధ్యదైవం. నా కష్టం, సుఖం అన్నీ ఆ తండ్రితోనే పంచుకునేదాన్ని. రాముడు మహారాజు. క్షత్రియులకు బహుభార్యాత్వం సమ్మతమే అయినప్పటికీ మరో వివాహం చేసుకోకుండా స్వర్ణసీతని పక్కన పెట్టుకుని యాగం చేసిన ఏకపత్నీవ్రతుడు. సీతకి దూరంగా ఉన్నా ఆమెని మరచిన క్షణం లేదు రాముడికి. అలాంటి ఆదర్శమూర్తిని నిత్యం పూజించే నేను నిన్నుకాక మరొకరిని నా పక్కన ఎలా ఊహించుకోగలను చెప్పు? అందుకే ముందుగా కంపెనీ మారి, ఆ తరవాత మెల్లమెల్లగా కౌశిక్‌తో కాంటాక్ట్స్‌ తగ్గిస్తూ వచ్చాను. తనూ అర్థంచేసుకున్నాడేమో మరి, మళ్ళీ నన్నెప్పుడూ కలవడానికిగానీ, నాతో మాట్లాడటానికిగానీ ప్రయత్నించలేదు. అప్పట్లో నేను ఉద్యోగం మారినప్పుడు ‘జీతంలో పెద్దగా తేడా లేనప్పుడు ఎందుకూ మారడం’ అని నువ్వంటే, ‘కొత్త కంపెనీలో జాబ్‌ ఎక్కువ ఛాలెంజింగ్‌గా ఉంటుంది’ అని నీకు చెప్పాను, కానీ అసలు కారణం ఇది.
ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉన్నాయి సూర్యా. మనం పెద్ద ఇల్లు కొనుక్కున్నామన్న ఈర్ష్యతో మన గృహప్రవేశానికి కూడా రాని మీ బాబాయి కొడుకు అడిగిందే తడవుగా రెండు లక్షలిచ్చావు పదేళ్ళకిందట. అతను ఆ తర్వాత సొంత కారూ ఇల్లూ కొనుక్కోవడమే కాకుండా యూరప్‌ టూర్‌కి కూడా వెళ్ళి ఎంజాయ్‌ చేశాడేగానీ ఇప్పటివరకూ నీ అప్పు తీర్చింది లేదు. ఏదోలే, రక్తసంబంధం కదా అనుకుని సర్దుకుపోయాను.
కానీ, ఒకమారు నువ్వు నీ స్నేహితుడిని అవసరంలో ఆదుకుని లక్షన్నర రూపాయలు అప్పిచ్చావు. ఆ తరవాత రెండేళ్ళకనుకుంటా మన ఇంటి రిజిస్ట్రేషన్‌ సమయంలో ఆ డబ్బు ఇవ్వమని అడిగావని అతను నీతో మాట్లాడటం మానేశాడు. నీ తప్పేమీ లేకపోయినా కూడా నువ్వెంతో ఫీల్‌ అయి అతనికి మళ్ళీ దగ్గరవడానికి చాలా ప్రయత్నించావు. చివరకు అతనికి సారీ కూడా చెప్పావు. మరి మన ఇన్నేళ్ళ సంసారంలో ఎన్నోసార్లు తప్పు నీదే అయినప్పటికీ ఒక్కసారైనా నువ్వు నాకు సారీ చెప్పడం కాదు కదా... కనీసం బతిమాలను కూడా లేదు నన్ను ఏ విషయానికీనూ.
వాళ్ళ అవసరానికే నీ దగ్గరికొచ్చే నీ తమ్ముడి పాటి, నీ స్నేహితుడిపాటి కూడా చేయలేక పోయానా సూర్యా నేను. ఓ మర్చేపోయాను... ఆఫ్టరాల్‌ భార్యని కదూ, సో టేకెన్‌ ఫర్‌ గ్రాంటెడ్‌.
నిన్ను సరిగ్గా అర్థంచేసుకునేలోగానే మనకి ఇద్దరు పిల్లలు. నా ఆశా నిరాశల ప్రభావం మన పిల్లల మీద పడకూడదని పళ్ళబిగువున దుఃఖాన్నీ బాధనీ దాచేసుకుని ఇన్నేళ్ళూ గడిపేశాను సూర్యా. అప్పటికీ కొన్నిమార్లు చూచాయగా నీతో ఈ విషయాలన్నీ చెప్పాను. కానీ నువ్వెప్పుడూ అదో పెద్ద విషయమే కాదన్నట్టుగా నవ్వేసి ఊరుకునేవాడివి.
పాతికేళ్ళుగా నీనుంచి ఓ చిన్న మెచ్చుకోలు కోసం, నీ ప్రేమా ఆదరణల కోసం ఎదురు చూసీ చూసీ అలసిపోయాను సూర్యా. నీతో కలిసి ఉన్నంతకాలం నీనుంచి ఆశించడం, ఆశించినది అందక బాధపడటం- ఇవన్నీ తప్పవు. ఈ ఆశలూ ఆశాభంగాలూ తట్టుకునేంత స్థైర్యం నాలో ఇక మిగలలేదు సూర్యా. నాకూ వయసైపోయింది, బాధ్యతలు తీరిపోయాయి. పిల్లల పెళ్ళిళ్ళయిపోయి వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. తనువూ మనసూ కూడా అలసిపోయి విశ్రాంతిని కోరుకుంటున్నాయి. అందుకే నా ఇష్టదైవమైన రామచంద్రుడి సన్నిధిలో నా శేషజీవితాన్ని గడిపేయాలనుకుంటున్నాను.
కిందటేడు మా ఆఫీసువాళ్ళతో కలిసి భద్రాచలం వెళ్ళినప్పుడు అక్కడికి దగ్గరలో ఒక ఎన్‌జీఓ సంస్థ నడుపుతున్న స్కూల్‌ని చూశానని నీకు చెప్పాను కదూ. అనాథల కోసం, పేదవారి పిల్లల కోసం నడుపుతున్న స్కూల్‌ అది. అందులోనే ఒక కౌన్సిలింగ్‌ సెంటర్‌ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. నీకు తెలుసుగా నాకు టీచింగ్‌ అంటే ఎంతో ఇష్టమని. పైగా నేను కౌన్సిలింగ్‌లో పీజీ డిప్లమా కూడా చేశానుగా. ఆ అనాథ పిల్లలకి చదువు చెబుతూ, నాలాంటి స్త్రీలకి కౌన్సిలింగ్‌ చేస్తూ రాముని సన్నిధిలో చివరిదాకా గడిపేయాలని నిర్ణయించు
కున్నాను సూర్యా. నీమీద కోపంతోనో, నిన్ను బాధపెట్టాలనో కాదు సుమా. నీమీద నా ఎక్స్‌పెక్టేషన్స్‌నీ తద్వారా కలిగే డిజప్పాయిం
ట్మెంట్స్‌నీ తగ్గించుకునేందుకు నేను చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం మాత్రమే ఇది. నేనెక్కడున్నా నా మనసెప్పుడూ నీతోనే ఉంటుంది సూర్యా. సెలవు ఇక, ఆరోగ్యం జాగ్రత్త.
ప్రేమతో నీ దీపు పి.యస్‌: అన్నట్టు ఈ లెటర్‌తోపాటు నా రిజిగ్నేషన్‌ లెటర్‌ని కూడా పెట్టాను. అది మా ఆఫీసులో ఇచ్చేయి. నీకు నేను ఎన్నిసార్లు ఈమెయిల్‌ చేసినా నువ్వెప్పుడూ ఎన్నడూ రిప్లయి ఇవ్వలేదు. అందుకే ఈ లెటర్‌ని నీక్కనిపించేటట్లుగా నీ ప్రాణాధికమైన ల్యాప్‌టాప్‌ మీద పెడుతున్నాను.


పాతికేళ్ళుగా నీ ప్రేమా ఆదరణల కోసం ఎదురుచూసీ చూసీ అలసిపోయాను సూర్యా. నీతో కలిసి ఉన్నంతకాలం నీనుంచి ఆశించడం, ఆశించినది అందక బాధపడటం- తప్పవు.


    *                *                 *
నమ్మలేకపోయాను. మళ్ళీ చదివాను.
సందేహం లేదు. నేను సూర్యాకి రాసిన ఉత్తరమే ఈవారం కథగా ప్రచురించబడింది. అంతా నేను రాసింది రాసినట్టుగానే ప్రచురించారు. కేవలం కథ చివరలో నాలుగు లైన్లు మాత్రం జత చేశారు - ‘ఆఫ్టరాల్‌ భార్యేగా అన్న చులకన భావాన్ని నరనరాలా జీర్ణించుకున్న పురుషపుంగవులందరికీ కనువిప్పు కలగాలనే ఈ కథ. ఇండియాలో తొంభై  తొమ్మిది శాతానికి పైగా మగవాళ్ళందరికీ వాళ్ళ భార్యలు టేకెన్‌ ఫర్‌ గ్రాంటెడ్‌లే. ఈ కథ చదివిన మగవారిలో కనీసం ఒక్కరైనా మారినట్లయితే కథ ఉద్దేశం నెరవేరినట్లే. నాలాగా లోలోనే మధనపడే భార్యలందరికీ అంకితం నా ఈ కథ’ అని.
పేజీ వెనక్కి తిప్పి రచయిత పేరు కోసం చూస్తే నా పేరే ఉంది ‘దీపిక’ అని.
‘ఎవరు పంపి ఉంటారబ్బా’ అనుకుంటూ పక్కకి తిరిగిచూస్తే, అంతదాకా నన్నే గమనిస్తున్న సూర్య ఏమీ ఎరగనట్లుగా పేపర్‌లో తల దూర్చేసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు.
అర్థమైంది... ఇది సూర్యా నిర్వాకమేనని.
‘‘ఏంటీ పని? నా అనుమతి లేకుండా నా పర్సనల్‌ లెటర్‌ని పత్రికకి ఎందుకు పంపావు?’’ చిరుకోపంతో ప్రశ్నించాను.
‘‘దీపూ, నీలాగా బాధపడే స్త్రీలందరికీ నువ్వు కౌన్సిలింగ్‌ చేయాలనుకున్నావు. కానీ, నువ్వే ఆలోచించు... భద్రాచలంలాంటి చిన్న స్థలంలో ఎంతమంది వస్తారు నీ దగ్గరకి? అదే మీడియా ద్వారా అయితే ఎక్కువమందిని చేరవచ్చు. ఇలాంటి సమస్యల మీద సామాజిక స్పృహని కల్పించడం కోసమే మీడియాని ఎంచుకున్నాను దీపూ. పత్రికలో ప్రచురించిన కథనైతే ఎక్కువమంది చదువుతారు. అలా చదివినవాళ్ళలో నాలాంటి భర్తలెంతోమంది ఉండొచ్చు. వాళ్ళల్లో కొంతమందైనా నాలాగా స్పందించి మారవచ్చు. అంతేకాకుండా, అందరు భార్యలకీ నీలా హృద్యంగా, మనసుని స్పందింపచేసేటంత గొప్పగా రాసే టాలెంట్‌ ఉండకపోవచ్చు కదా! చివరలో ఆ నాలుగు లైన్లని నేనే రాసి పంపించాను. మన ఈ ప్రయత్నం వల్ల ఏ కొద్దిమంది మగవారిలో మార్పు వచ్చినా కూడా మనకది సంతోషమేగా’’ అంటున్న సూర్యని చూస్తూ ఆ క్షణం మనస్ఫూర్తిగా అనుకున్నాను ‘నేనెంతో అదృష్టవంతురాలిని’ అని.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.