close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ డాక్టర్‌ దగ్గర వైద్యం ఉచితం!

ఈ డాక్టర్‌ దగ్గర వైద్యం ఉచితం!

ఈ రోజుల్లో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాలంటే   కనీసం చేతిలో ఓ వెయ్యి రూపాయలన్నా ఉండాల్సిందే. ఇక, ఏదైనా ఆపరేషన్‌ చేయించుకోవాలంటే ఖర్చు ఎంత అవుతుందో ఊహించలేం. కానీ ఆ కంటి డాక్టర్‌ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రోజూ ఎంతోమందికి వైద్యం చేస్తాడు. కళ్లజోళ్లు అందిస్తాడు. అవసరమైనవారికి శస్త్రచికిత్సలూ ఉచితంగా చేయిస్తాడు. మంచి చదువులు చదవాలనీ గొప్ప ఉద్యోగాన్ని సంపాదించాలనీ చిన్నతనం నుంచీ ఎన్నో కలలు కన్నాడు ఆ కుర్రాడు. ఆ కల వెనుక ఉన్న ఆలోచన ఆర్థికంగా స్థిరపడాలని కాదు, నలుగురికీ సాయపడాలని. ఆ కారణంతోనే తన ఆశయానికి దగ్గర దారి వైద్య వృత్తే అని నమ్మి కర్ణాటకలోని రాజీవ్‌గాంధీ విశ్వవిద్యాలయంలో మెడిసిన్‌ పూర్తిచేశాడు బొగ్గు సురేష్‌. అతడి సొంతూరు అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బ మండలం, ఆకుతోటపల్లి. భార్య హైదరాబాద్‌లో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తుండడంతో అక్కడే వనస్థలిపురంలో ఉంటూ స్థానిక సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కాలనీలో క్లినిక్‌ తెరిచి వైద్య సేవల్ని అందించడం మొదలుపెట్టాడు. ప్రతిరోజూ ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకూ ఎవరొచ్చినా ఉచితంగా వైద్యం చెయ్యడంతో పాటు కళ్ళజోళ్లనూ పంపిణీ చేస్తాడు డాక్టర్‌ సురేష్‌. ఇలా అయితే ఇల్లు ఎలా గడుస్తుందని తల్లిదండ్రులూ భార్యా అడ్డుచెప్పినా తన ఆలోచన మార్చుకోలేదు. అతడిని అర్థం చేసుకుని చివరకు భార్య శ్రీదేవి కూడా అతడికి సహకరించడం మొదలుపెట్టింది.
లక్షలమందికి చూపునిచ్చింది
సొంతంగా ఆసుపత్రిని తెరవడానికి ముందే ఏడుగురు స్నేహితులతో కలసి 2005లో ‘పీస్‌ వెల్ఫేర్‌ సొసైటీ(ఫోన్‌ నంబరు9912276429)’ని స్థాపించాడు సురేష్‌. పేదలకు ఉచిత వైద్యం, విద్యను అందించడమే ఈ సంస్థ లక్ష్యం. సురేష్‌ చేస్తున్న సేవాకార్యక్రమాలు నచ్చడంతో ఉద్యోగులతో పాటు, చదువుకునే యువకులు ఎంతోమంది దీన్లో వలంటీర్లుగా చేరారు. ప్రస్తుతం పీస్‌ వెల్ఫేర్‌ సొసైటీ తరఫున 243మందికి పైగా వలంటీర్లు పనిచేస్తున్నారంటేనే ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.
వీరి సాయంతోనే సురేష్‌ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోని ఎన్నో మారుమూల ప్రాంతాలూ గిరిజన తండాల్లో   ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాడు. వీటిద్వారా ఇప్పటివరకూ 4.25 లక్షల మంది ఉచిత వైద్య పరీక్షలు చేయించుకున్నారు. 26వేల మందికి కళ్లజోళ్లు పంపిణీ చెయ్యడంతో పాటు 6,300 మందికి కంటి శస్త్ర చికిత్సలు చేయించింది పీస్‌ వెల్ఫేర్‌. ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు కూడా సంస్థ తరఫున ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నారు మరి. ప్రైవేటు ఆసుపత్రుల్లో కుదరని సందర్భంలో ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్లి దగ్గరుండి చికిత్స చేయిస్తాడు సురేష్‌. ఈమధ్యే నాగర్‌కర్నూలు జిల్లాలోని గిరిజన తండాలైన వాతవర్లపల్లి, అప్పాపూర్‌, సర్లపల్లి, కుడిచింతలబలిలో నేత్ర వైద్యశిబిరాలను ఏర్పాటు చెయ్యడంతో పాటు దుప్పట్లను పంపిణీ చేశారు. గతేడాది సంస్థ ప్రారంభించిన ‘సంచార నేత్ర వైద్యశాల’ రంగారెడ్డి, అనంతపురం, నల్గొండ, మహబూబ్‌ నగర్‌, హైదరాబాద్‌ జిల్లాల్లోని 40 పాఠశాలల్లో నేత్రవైద్యాన్ని అందిస్తోంది.
విద్యాదానం కూడా...
‘చదువుంటే చాలు, ఎవరి అండ ఉన్నా లేకపోయినా అదే మనకు అన్ని రకాలుగా తోడవుతుంది’ అనే సురేష్‌ పేద పిల్లలూ తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులను చేరదీసి చదువు చెప్పిస్తున్నాడు. వారిలో కొంతమందిని తన ఇంట్లో ఉంచుకునీ మరికొందరిని వనస్థలిపురంలోని వివేకానంద హోమ్‌, అనంతపురంలోని శాంతి హోమ్‌లో ఉంచీ చదివిస్తున్నాడు. వారికి ఫీజులు కట్టడంతోపాటు పుస్తకాలూ దుస్తులూ అవసరమైన ఇతర సామగ్రినీ అందిస్తాడు. ఇలా అతడి సాయంతో ఇప్పటివరకూ 233 మంది ఉన్నత విద్యనభ్యసించారు. ఈ ఏడాది 29మంది చదువుకుంటున్నారు. ఒక్కో విద్యార్థికీ ఏటా దాదాపు రూ.10వేలు ఖర్చవుతుంటుంది. వైద్యం, విద్య... ఇలా పీస్‌వెల్ఫేర్‌ సొసైటీ తరఫున సురేష్‌ చేసే సేవలన్నిటికీ ఆధారం విరాళాలే.
జీవితంలో మనం ఎంతో ఎత్తుకి ఎదగొచ్చు. ఎంత దూరమైనా వెళ్లొచ్చు. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నపుడు మనం పుట్టిన ఊరూ చదువుకున్న బడీ ఇంకా అలాగే ఉంటే మనసుకి బాగుండదు. అందుకే, తను చదువుకున్న బడిని అన్ని హంగులతో ఆధునికంగా తీర్చిదిద్దాలనుకున్నాడు సురేష్‌. పూర్వ విద్యార్థులు 450 మందిని సంప్రదించగా అందరూ కలిసి రూ.7.20 లక్షల్ని పోగుచేశారు. ఆ నిధులతో పాఠశాలకు కంప్యూటర్లు కొని ల్యాబ్‌ని నిర్మించడంతో పాటు గ్రంథాలయాన్నీ ఏర్పాటు చేశారు. ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఇవేకాదు, నేత్రదానం, అవయవదానంపైనా అవగాహనా కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తుంటారు  పీస్‌ వెల్ఫేర్‌ సొసైటీ సభ్యులు. ప్రకృతి విపత్తుల సమయంలోనూ సాయమందిస్తుంటారు. 2015లో భారీ వర్షాలూ వరదలతో తమిళనాడు అల్లకల్లోలం అయిన సమయంలో సంస్థ సభ్యులు రూ.ఆరు లక్షల విలువైన సామగ్రిని తీసుకెళ్లి అక్కడ పంపిణీ చేశారు.
ఇన్ని మంచి పనుల వెనుక ఉన్న సురేష్‌ని మనసారా అభినందించాల్సిందే కదూ...

- ఎల్లయ్యోల ప్రభాకర్‌, ఈనాడు, డిజిటల్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.