close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కల్యాణ ‘సేవ’!

కల్యాణ ‘సేవ’!

ఒక పళ్లెంలో వంద రుచులతో భోజనం, ఓ పేదవాడి వంద రోజుల ఆకలి...  లక్షల ఖర్చుతో ఇలాచూసి అలా పక్కనపడేసే శుభలేఖలు,  ఓ చిన్నారికి జీవితాన్నిచ్చే చదువు... కోట్ల వ్యయంతో ఒక్క రోజు వేడుక, కొన్ని కుటుంబాలు బతుకంతా ఉండేందుకు ఇళ్లు... ఏది ముఖ్యం... ఏది మంచిది? మానవత్వంతో ఆలోచిస్తే కచ్చితంగా రెండోదే. అదే చేస్తున్నారు ఈతరం వధూవరులు కొందరు.
పొరుగు దేశం వాళ్లెవరైనా సరిహద్దుల్లోకి చొరబడి మన సైనికులు పదిమందిని చంపితే మన రక్తం ఉడికిపోతుంది. భారతీయులంతా నా సోదరులు అన్నమాటను శరీరంలోని అణువణువూ గుర్తు చేస్తుంది. మరి, మనతోనే మనగడ్డమీదే బతుకుతూ ఏటా దాదాపు పాతిక లక్షలమంది ఆకలితో చనిపోతున్నారంటే ఊరుకోగలమా...నాలుగ్గంటలు ఉంచి తీసి పారేసే మంటపానికీ ఓ నిమిషం చూసి పక్కన పడేసే శుభలేఖలకూ ఒక్క రోజులో వాడిపోయే పూలకూ లక్షల సొమ్ముని వృథా చేసే బదులు అలాంటి పేదల ఆకలి తీర్చాలని అనుకోకుండా ఉండగలమా... ఆవైపే ఆలోచించింది ఈతరం. ఫలితం... సరికొత్త వివాహ సంప్రదాయానికి తెరలేచింది. ఈ కొత్త పెళ్లి తంతులోనూ ఇచ్చిపుచ్చుకోవడాలూ విందు భోజనాలూ ఉంటాయి. అయితే, వాటిలో హంగులూ ఆర్భాటాలకు బదులు మంచితనం, మానవత్వం పాళ్లే ఎక్కువ. అవును, ఇక్కడ ఇవ్వడం అంటే వియ్యాలవారు ఒకరికి ఒకరు ఇచ్చుకోవడం కాదు. ఇద్దరూ  కలసి పెళ్లి ఖర్చుని తగ్గించుకుని అప్పులపాలైన రైతులకు అండగా నిలబడటం.ఇళ్లులేని వారికి ఇళ్లు కట్టించి ఇవ్వడం. ఏ ఆధారం లేని వృద్ధులకూ పేదలకూ తోచినంత సాయం చెయ్యడం. పేద విద్యార్థులకు ఫీజులు కట్టి వారి బంగరు భవితకు పునాదులు వెయ్యడం. ఇక, మన సాయాన్ని అందుకున్నవారు సంతోషం నిండిన మనసుతో ‘నిండు నూరేళ్లూ సుఖంగా ఉండండి’ అని ఇచ్చే దీవెనలకన్నా పుచ్చుకోవడానికి గొప్ప కానుక ఏముంటుంది..?విందుభోజనాలంటారా... ఎప్పటికపుడు రకరకాల రుచులను ఆస్వాదిస్తూనే ఉంటారు మన బంధువులూ స్నేహితులూ. వారి కోసం వందరకాల వంటకాలతో భోజనాల్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యంగా చూస్తారే తప్ప అన్ని వంటకాలనూ తినేయలేరు. దాంతో రుచి చూసి కొన్నీ చూడక కొన్నీ చెత్త బుట్టలోకి చేరడం తప్ప మరో ప్రయోజనం ఉండదు. కొన్ని చోట్ల ఉత్సాహం అంచనాలను దాటి, వంటకాలు అతిథుల్ని మించిపోతాయి. అదీ వృథానే. ఇలా వేరు వేరు కారణాలతో మనదేశంలో ఏటా చెత్త బుట్టలోకి చేరే నాణ్యమైన ఆహారం విలువ అక్షరాలా యాభైవేల కోట్ల రూపాయలు! ఈ లెక్కలన్నీ తెలిసినా తెలియకపోయినా తమవంతుగా ఆ వృథాను అరికట్టి మిగిలిన సొమ్మును అనాథాశ్రమాలకూ, పేదలకు అన్నదానం చేసే సత్రాలకూ అందించాలని ప్రయత్నిస్తున్నవారు ఈమధ్య దేశవ్యాప్తంగా పెరుగుతున్నారు. తాము చెయ్యడమే కాదు, బంధువుల్నీ పెళ్లికొచ్చే అతిథుల్ని కూడా ఈ కళ్యాణ సేవలో భాగస్వాముల్ని చేస్తున్నాయి కొన్ని జంటలు. ‘మీ నుంచి మాకు ఎలాంటి బహుమతులూ వద్దు. అందుకు బదులుగా మాతో పాటు మీరు కూడా వీధి బాలల్నీ అనాథ వృద్ధుల్నీ చేరదీసే ఆశ్రమాలకూ, రైతులను ఆదుకునే, పేద పిల్లల్ని చదివించే స్వచ్ఛంద సంస్థలకూ తోచినంత విరాళంగా ఇవ్వండి’ అంటూ పెళ్లి మంటపంలో విరాళాల పెట్టెల్ని పెడుతున్నారు. మరో అడుగు ముందుకేసి, వివాహ వేడుక దగ్గరే అవయవదాన, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసేవారూ పెరిగారు. మామూలుగా చేస్తే ఏ పెళ్లైనా ఒకటీ రెండురోజుల వేడుకే. కానీ ఇలా చెయ్యడంవల్ల సాయం అందుకున్నవారికి అది ఎప్పటికీ గుర్తు పెట్టుకునే పండుగ అవుతుంది. ఇంతకుమించిన ఘనమైన వేడుక ఇంకేముంటుందీ...

మరచిపోలేని పెళ్లి

నోజ్‌ మునోత్‌... మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కి చెందిన ఈ వ్యాపారవేత్తకి డబ్బుకి కొదవలేదు. ధగధగలాడే సెట్టింగులూ ముత్యాల పందిళ్లూ వేయించి కూతురి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించగలడు. తిన్నాతినకపోయినా
అతిథులు గుర్తుపెట్టుకోవడానిక్కూడా కష్టపడిపోయేటన్ని వంటకాలను చేయించగలడు. బంధువులు తిరిగివెళ్లేటపుడు ఖరీదైన కానుకల్నీ ఇవ్వగలడు. కానీ... ఎవరో కొందరు నాలుగు రోజులు చెప్పుకుని మర్చిపోయేలా పెళ్లి
చేయాలా... కొన్ని కుటుంబాలు జీవితకాలం గుర్తుపెట్టుకునేలా జరిపించాలా... అని ఆలోచించాడు. మనసు రెండోవైపే మళ్లింది. వెంటనే కూతురు శ్రేయాతో విషయం చెప్పాడు. తన పెళ్లి కానుకగా తండ్రి చెయ్యాలనుకున్న ఆ గొప్ప పనికి ఆమె కూడా సంతోషించింది. వేడుక ఖర్చును తగ్గించుకుని రూ.1.5 కోట్లతో స్థానికంగా ఓ చోట ఇళ్లులేని నిరుపేదల కోసం తొంభై ఇళ్లను కట్టించాడు మనోజ్‌. కరెంటూ మంచినీటి పంపుల్లాంటి కనీస అవసరాలన్నిటినీ ఏర్పాటు చేయించాడు. అలా తన కూతురి పెళ్లిని ఎంతోమంది జీవితాంతం గుర్తుపెట్టుకునేలా చేశాడు.

దండల పెళ్లితో అన్నదాతలకు అండ

నదేశంలో సగటున పెళ్లిళ్ల కోసం రూ. మూడు లక్షల నుంచి అయిదుకోట్ల వరకూ ఖర్చుపెడుతున్నారు. మరోవైపు అన్నదాతలూ కాయకష్టం చేసుకునే పేదలూ రెండు మూడు లక్షల రూపాయల అప్పుల్ని తీర్చలేక ఆత్మహత్యలతో తనువుని చాలిస్తున్నారు. ఆ దుస్థితిని కళ్లారా చూసిన ఈ రెండు జంటలూ పెళ్లి ఖర్చుని తగ్గించుకుని వారికి అండగా నిలబడ్డాయి. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన బోడపల్లి అవనీష్‌, సంగారెడ్డికి చెందిన కూనదొడ్డి నీలిమ ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దల్నీ ఒప్పించారు. అవనీష్‌ కాంట్రాక్టరుగా పనిచేస్తుంటే అమ్మాయి ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. కోరుకుంటే ఇద్దరూ పెళ్లిని ఘనంగా జరుపుకోవచ్చు. కానీ ఆ ఇద్దరూ గతేడాది నవంబర్‌ 24న చాలా సాదాసీదాగా రిజిస్ట్రార్‌ ఆఫీసులో దండలు మార్చుకున్నారు. తరవాత రిసెప్షన్‌ని ఏర్పాటు చేసి విందుకి సంగారెడ్డి, కొండాపూర్‌ మండలాలకు చెందిన ఆత్మహత్యలు చేసుకున్న కొంతమంది రైతుల కుటుంబాలతో పాటు ఓ నిరుపేద వృద్ధురాల్ని మాత్రమే ఆహ్వానించారు. వారికి కొత్త బట్టలు పెట్టడంతో పాటు, ఒక్కొక్కరికీ పదివేల రూపాయల్ని ఆర్థిక సాయంగా అందించారు. అంతేకాదు, పెళ్లి బట్టలతోనే తమ కళ్లను ఎల్‌వీ ప్రసాద్‌ ఆసుపత్రికీ అవయవాల్ని మోహన్‌ ఫౌండేషన్‌కీ దానం చేస్తున్నట్లూ పత్రాల మీద సంతకం చేసిచ్చారు. మహారాష్ట్రలోని ఉంబర్దా బజార్‌ గ్రామానికి చెందిన అభయ్‌ దేవేర్‌, ప్రీతి కూడా ఇలాగే తమ పెళ్లి వేడుకను రైతు కుటుంబాల కన్నీరు తుడిచేందుకు వేదికగా మార్చుకున్నారు. ఇన్‌కమ్‌ట్యాక్స్‌ శాఖలో పనిచేస్తున్న అభయ్‌ సొంత జిల్లా అమరావతిలోనూ రైతుల ఆత్మహత్యలు ఎక్కువే. అలాంటి సంఘటనల గురించి పత్రికల్లో చదివినపుడు అతడు కదిలిపోయేవాడు. తమ పెళ్లి సందర్భంగా వారికోసం ఏదైనా చెయ్యాలనుకుని విషయాన్ని ప్రీతికి చెప్పగా ఆమె సంతోషంగా ఒప్పుకుంది. ఇద్దరూ రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుని ఇంటికి వచ్చిన కొద్దిమంది అతిథులకూ పప్పూ కూరా సాంబారుతో మామూలు భోజనం పెట్టించారు. అలా పెళ్లి ఖర్చుని తగ్గించి రెండు లక్షల రూపాయలను పది కుటుంబాలకు రూ.20వేల చొప్పున అందించారు.

ఒక్క వేడుక... వంద పెళ్లిళ్లు

తండ్రి కోట్లు గడించిన వ్యాపారవేత్త అయితే పిల్లల పెళ్లి ఏ లోటూ లేకుండా చేస్తాడు. అదే... పేద కుటుంబాల్లో పెళ్లి చేయాలంటే అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిందే. అందుకే, తన కొడుకు పెళ్లి సందర్భంగా వంద పేద కుటుంబాల ఆడ పిల్లలకు తండ్రిగా మారి కన్యాదానాన్ని గొప్పగా చెయ్యాలనుకున్నాడు సూరత్‌ వ్యాపారి గోపాల్‌ వస్తాపరా. అందుకోసం గుజరాత్‌లోని అమ్రేలీ రాజ్‌కోట్‌ జిల్లాల్లోని పేద కుటుంబాల ఆడపిల్లల్ని ఎంపికచేశాడు. వారి వివాహ వేడుక ఖర్చునంతా తానే భరిస్తానని చెప్పి ‘పెళ్లికి మీరు ఎంతమంది అతిథులను కావాలంటే అంతమందిని పిలుచుకోండి’ అని చెప్పాడు. వేడుకకు దాదాపు 60వేల మంది వచ్చారు. ఒక్కో జంటకూ పెళ్లి తర్వాత కాపురం పెట్టేందుకు పుట్టింటి తరఫున ఇచ్చే వస్తువుల్ని కూడా తనే కానుకగా అందించాడు గోపాల్‌. ఈ మొత్తం తతంగానికి అతడు ఖర్చుపెట్టింది మూడుకోట్ల రూపాయలకు పైనే. ఇదంతా తన కొడుకు పెళ్లి ఖర్చును తగ్గించడం ద్వారా మిగిల్చిందే. కొడుకు పెళ్లిని వంద జంటల పెళ్లి వేడుకకి సమానమయ్యేలా చేసిన ఈ తండ్రి గొప్పతనాన్ని మెచ్చుకోకుండా ఉండగలమా..?

భవిష్యత్తునిచ్చాడు

కేరళకు చెందిన సూర్యకృష్ణమూర్తి తన కూతురు సీత పెళ్లిని చాలా భిన్నంగా చెయ్యాలనుకున్నారు. పెళ్లికి కొద్దిరోజుల ముందే రూ.పదిహేనులక్షల్ని బ్యాంకు నుంచి తెచ్చారు కూడా. ఇంతకీ, పెళ్లెలా జరిగిందంటారా... దగ్గరి బంధువులూ స్నేహితుల ఆశీర్వాదాల మధ్య ఇంట్లోని పూజగదిలో శాస్త్రబద్ధంగా అయింది. మరి, ఆ డబ్బు ఏమైందంటే స్థానికంగా తను చదివిన మోడల్‌ స్కూల్‌, గవర్నమెంట్‌ ఆర్ట్స్‌ కాలేజ్‌, టీకేఎమ్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలకు ఇచ్చేశాడు. ఆ డబ్బుతో తన కూతురి పేరు చెప్పి పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలన్నది ఆయన కోరిక. ఆ సాయంతో 20 మందికి పైగా పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవగలుగుతున్నారు.

గురువులకు సత్కారం

రోజుల్లో కూడా ఆడపిల్లలకు చదువెందుకు... అంటూ వారిని వంటింటికే పరిమితం చేసే ఊళ్లు ఉన్నాయి. అలాంటిదే గుజరాత్‌లోని హల్దారు గ్రామం. అంత వెనుకబడిన ప్రాంతంలో పుట్టి కూడా ‘నిశద్‌బాను వజిఫ్‌దార్‌’ ఎంసీఏ చదివిందంటే అది ఆమె తండ్రి గొప్పతనమే. అందుకే, చదువు విలువ ఆమెకు బాగా తెలుసు. ఈమధ్యే నిశద్‌కి అదే గ్రామానికి చెందిన రమీజ్‌తో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లిని ఎంత ఘనంగా చెయ్యాలీ... అని కుటుంబీకుల మధ్య చర్చ జరుగుతుండగా ఆమె అడ్డుపడింది. ‘అంత ఖర్చు పెట్టడం ఎందుకు...’ అంటూ ఆ డబ్బుతో  తనకు విద్య నేర్పిన 75మంది ఉపాధ్యాయులను సత్కరించడంతో పాటు, తను చదివిన ప్రాథమిక, ఉన్నత పాఠశాలల అభివృద్ధికి పదిలక్షల రూపాయల్ని విరాళంగా అందించింది నిశద్‌.

అవయవదానమే అతిపెద్ద బహుమతి

ఇంకో వారం రోజుల్లో పెళ్లి ఉందనగా జైపూర్‌కి చెందిన దేవల్‌సోనీ చెప్పిన విషయం విని తల్లిదండ్రులు విస్తుపోయారు. ‘పెళ్లి రోజున ఆశీర్వదించడానికి వచ్చిన అతిథులను ఎవరైనా అవయవదానం చెయ్యమని
అడుగుతారా...’ అని మండిపడ్డారు. అవును, కళ్యాణమండపంలో అవయవదాన శిబిరాన్ని ఏర్పాటుచెయ్యాలన్నది అతడి ఆలోచన. కాబోయే భార్య కూడా ఒప్పుకోవడంతో తల్లిదండ్రులకూ అత్తమామలకూ సర్దిచెప్పి ఒప్పించాడు.
అతిథులూ అర్థం చేసుకున్నారు. పెళ్లిరోజున వధూవరులతోపాటు, కొందరు అతిథులు కూడా తమ తదనంతరం అవయవాలను దానం చేసేందుకు ఒప్పుకుంటూ ‘ఆర్గాన్‌ ఇండియా’ సంస్థలో పేర్లను రిజిస్టర్‌ చేసుకున్నారు. ఒక పెళ్లి ఎంతోమందికి అవయవదానం చెయ్యబోతోందన్నమాట. ఆమధ్య రాజమండ్రికి చెందిన కిరణ్మయి, సిద్ధార్థలైతే మరో అడుగు ముందుకేసి, తమ పెళ్లిలో అతిథులను రక్తదానం చెయ్యమని అడిగేందుకు ముందుగా తామే పెళ్లి బట్టలతో రక్తదానం చేశారు. అంతటి స్ఫూర్తి కళ్లముందు కనిపిస్తుంటే వధూవరుల తల్లిదండ్రులూ వివాహానికి వచ్చిన అతిథులూ ఊరుకుంటారా... దాదాపు ముప్ఫైమంది మేము సైతం అంటూ ముందడుగు వేశారు.

వితంతువులే అతిథులు

ర్త చనిపోయిన ఆడవాళ్లు శుభకార్యాల్లో పాల్గొనకూడదనే మూఢనమ్మకాలు మనదేశంలో ఇంకా ఉన్నాయి. అవన్నీ తప్పని నిరూపించాలనుకున్నాడు గుజరాత్‌ వ్యాపారవేత్త జితేంద్ర పాటిల్‌. అనుకున్నట్లే ఆమధ్య జరిగిన తన కొడుకు వివాహ వేడుకకి స్థానిక గ్రామాల నుంచి పద్దెనిమిది వందల మంది వితంతువులను ఆహ్వానించాడు. అనుకోని ఆ ఆతిథ్యానికి వాళ్లెంతో సంతోషపడటంతో పాటు వేడుకలో వయసుని మర్చిపోయి మరీ ఆడి, పాడారు. రకరకాల వంటకాల్ని రుచి చూశారు. వారిని గౌరవించేందుకు దుప్పట్లనూ మొక్కల్నీ బహుమతిగా ఇచ్చాడు జితేంద్ర. అంతేకాదు, వారిలో నిరుపేదలైన ఎనిమిదివందల మందికి ఒక్కొక్కరికీ ఒక్కో పాడి ఆవుని కానుకగా ఇచ్చాడు. ఎంత మంచి ఆలోచన..!

అనాథలకు రూ.అయిదులక్షలు

వందలమంది అతిథుల్ని పిలిచినపుడు ఎంతమంది వస్తారో అంచనా వెయ్యలేం కాబట్టి చాలాసార్లు వండిన వంటలు వృథా అయిపోతుంటాయి. అనంతపురం జిల్లాకు చెందిన పుట్టపర్తి ప్రభాకర్‌ రెడ్డి ఇంట్లోనూ కొన్నేళ్ల కిందట జరిగిన ఓ శుభకార్యంలో ఆహారపదార్థాలు చాలా వృథా అయిపోయాయి. దాంతో, అప్పట్నుంచీ ఇంట్లో ఏదైనా వేడుక చెయ్యాలనుకుంటే బంధువులూ అతిథుల్ని తగ్గించి దగ్గర్లోని అనాథాశ్రమాల్లోని పిల్లల్ని ఆహ్వానించి వారికి కడుపునిండా భోజనం పెట్టి బట్టలూ బహుమతులూ ఇచ్చి పంపడం మొదలుపెట్టారు. ఏడాది కిందట జరిగిన తన కూతురి పెళ్లికి కూడా వందమంది అనాథపిల్లల్ని పిలిచి ముందువరుసలో కూర్చోబెట్టారు. పెళ్లిలో రిసెప్షన్‌ విందుకి బదులుగా ఆ చిన్నారులకు ఒక్కొక్కరి పేరునా రూ.అయిదువేలు చొప్పున మొత్తం అయిదు లక్షల రూపాయల్ని బ్యాంకులో డిపాజిట్‌ చేశారు. ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలక్కూడా అతిథులు ఆ పిల్లలే. వారిని ఇంటికి పిలిచి రకరకాల వంటకాలతో కడుపునిండా భోజనం పెట్టడంతో పాటు కానుకగా వాచీల్ని అందించారు ప్రభాకర్‌రెడ్డి. ఎప్పుడో కానీ విందు భోజనాలు తినని ఆ చిన్నారులు కడుపునిండా తింటుంటే, కేరింతలు కొడుతూ వేడుకల్లో పాల్గొంటుంటే వారిని చూసినపుడు కలిగే ఆనందం ఎంత ఖర్చుపెట్టినా దొరకనిది అంటారాయన.
హైదరాబాద్‌లోని ఆదర్శ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన న్యాయవాది బాణాపురం రాంచంద్రారెడ్డిదీ అదే ఆలోచన. కూతురి వివాహానికి బంధువులందర్నీ పిలిచేటపుడు జనగామ జిల్లా జాఫర్‌గఢ్‌లో స్నేహితుడు నిర్వహిస్తున్న అనాథాశ్రమంలోని పిల్లలూ గుర్తొచ్చారు ఆయనకు. వారిని పెళ్లికి తీసుకురమ్మని చెప్పి అక్కణ్నుంచి ప్రత్యేకంగా రెండు బస్సులు కూడా వేయించారు. అంతేకాదు, పెళ్లికొచ్చిన పిల్లలందరికీ కొత్త బట్టల్ని బహుమతిగా ఇచ్చి పంపారు.

కళ్యాణం అంటే శుభకరం... అని అర్థం. ఆ శుభ సమయాన మన సంతోషాన్ని నలుగురితో పంచుకుంటే మరింత పెరుగుతుంది కాబట్టి, పూర్వం తెలిసినవాళ్లందర్నీ పిలిచి భోజనాలు పెట్టేవారు. నిజానికి ఒకప్పుడు గ్రామాల్లో పేదరికం ఎక్కువుండేది. పండగలూ పెళ్లిళ్లకు తప్ప పిండివంటలు చేసుకోవడం అరుదు. అందుకే, షడ్రుచులతో భోజనం పెడితే ఊరంతా సంతోషంగా కడుపునిండా తింటారన్నది పెద్దల ఆలోచన. ఎంత మంచి ఉద్దేశమదీ... అందరికోసం ఆలోచించే పెళ్లింటివారికోసం ఊరూ కదిలి వచ్చేది. తమ ఇంట్లో పెళ్లే అన్నంత బాధ్యతగా తలో పనీ చేసి, ఆ శుభకార్యాన్ని పూర్తిచేసి ఆశీర్వదించేవారు. అంటే... ఎవరికి తోచిన సాయం వారు చేసేవారన్నమాట. రోజులు మారాయి. నిత్యం షడ్రుచులతో భోజనాన్ని ఆరగించేంతగా డబ్బు పెరిగింది. వివాహ వేడుక హోదాకూ సంపదకూ చిహ్నంగా మారింది. పెళ్లిళ్లకు మనదేశంలో ఏడాదికి అయ్యే ఖర్చు లక్ష కోట్ల రూపాయలకు చేరిపోయింది. కానీ ఈ తరానికి సామాజిక వెబ్‌సైట్లలో మునిగి తేలడమే కాదు సామాజిక బాధ్యత కూడా బాగానే తెలుసు. అందుకే, ఆ అనవసరపు ఖర్చుకి చరమగీతం పాడాలనుకుంది. ఫలితం... ఘనమైన పెళ్లిళ్లకు మారుపేరైన భారత్‌లో వివాహాల్లో సామాజిక సేవ ఓ సంప్రదాయంగా అడుగుపెట్టింది. నోట్ల కట్టలతో పనిలేని పచ్చటి పందిళ్లూ ఆడంబరాన్ని కాక ఆత్మీయతను ప్రతిబింబించే శుభలేఖలూ వాడిపోయే పూలకు మించిన మానవత్వపు పరిమళాలూ పెళ్లి మండపాల్లోకి రావడం మొదలుపెట్టాయి. మరి... మీ అడుగు ఎటువైపూ...

- మధులత బొల్లినేని

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న