close
ఈ ఎండల్లో మినీ పాపికొండల్లో

ఈ ఎండల్లో మినీ పాపికొండల్లో

విశాఖపట్నం అందరికీ తెలుసు. అక్కడికి దగ్గర్లో ఉండే అరకులోయ భూతల స్వర్గమని తెలుసు.. ఆ మధ్యలో వచ్చే బొర్రాగుహల గురించీ కొద్దో గొప్పో తెలుసు.. వీటికి సమీపంలో ఉన్న.. తాటిపూడి గురించి అడిగితే చాలామంది తడబడతారు. అరకు.. పచ్చటి ప్రకృతిని పరిచయం చేస్తుంది. బొర్రా గుహలు.. అంతుబట్టని ఆకారాలను చూపిస్తాయి. తాటిపూడి.. ప్రకృతి అందాల మధ్య అంతులేని ఆనందాన్ని కలగజేస్తుంది.
ఎలా వెళ్లాలి?
తాటిపూడి జలాశయం విశాఖపట్టణానికి 65 కిలోమీటర్లు, విజయనగరం నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సులు, ప్రైవేట్‌ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. అరకు వెళ్లదలచిన వాళ్లు ముందుగా బొర్రాగుహలు సందర్శించి ఆ తరువాత తాటిపూడి చూసుకొని ముందుకుసాగుతారు.
విజయనగరం జిల్లా తాటిపూడిలో ఓ జలాశయం ఉంది. వేల ఎకరాల్లో పంటలూరిస్తోంది. విశాఖ వాసుల దాహార్తిని తీరుస్తోంది. సామర్థ్యం తక్కువే అయినా.. సౌందర్యానికి మాత్రం కొదవలేదు. ఎందుకంటే.. గో‘దారి’లోని పాపికొండలను పోలిన కొండలు ఇక్కడ కనువిందు చేస్తాయి. సూది మొనంత చోటు లేకుండా పచ్చదనం కప్పుకొని నిండుగా ఉంటాయవి. ఆ పాపికొండల నలుపు గోదారి కడగలేకపోయిందేమో గానీ.. ఈ కొండల్లోని పచ్చదనం నీళ్లపై నీడలా తేలుతూ.. గోస్తనీ నదికి పచ్చబొట్టేసిన భావన కలుగజేస్తాయి. ఉభయ సంధ్యల్లో ఈ పచ్చదనం కాస్తా మాయమై జలాశయం అంతా కాషాయం రంగును పులుముకుంటుంది. అందుకే తాటిపూడి గ్రామం.. విశాఖ, విజయనగరం వాసుల వారాంతపు విహార కేంద్రంగా మారింది. అరకు, బొర్రాగుహలు వెళ్తున్న పర్యాటకులూ ప్రయాణంలో వెసులుబాటు చూసుకొని మరీ తాటిపూడికి వెళ్తుంటారు.

గాలివాలులో..
చుట్టూ చెట్లు, చేమలు, కొండలు, కోనలు.. మధ్యలో విస్తరించి ఉంది తాటిపూడి జలాశయం. అందులో నౌకా విహారం చేసే వాళ్లంతా... ‘లాహిరి లాహిరి..’ అని పాడుకోకుండా ఉండలేరు. కొండల మీదుగా వచ్చిన స్వచ్ఛమైన చల్లగాలి వేసవి తాపాన్ని ఇట్టే మాయం చేస్తుంది. ఆ గాలిని పీల్చగానే శరీరం మునుపెన్నడూ లేని ఉత్సాహాన్ని పొందుతుంది. మరబోట్లో విహారం వేగంగా సాగుతుంది. అయితే, బోటు ఇంజిన్‌ శబ్దం.. మనసున తొణికే మధురభావాలను ఎప్పటికప్పుడు ఆటంకపరుస్తుంటుంది. అందుకే చెవులకు స్వరవాణి తగిలించుకుని మీ మనసు కోరే పాటలను మంద్ర స్థాయిలో వింటూ ప్రయాణిస్తే భలేగా ఉంటుంది. నాటు పడవ ఎక్కితే.. గాలివాలులో సాగె నావతో ఎన్ని ఊసులైనా పంచుకోవచ్చు.
తరచి తరచి చూస్తూ..
అలలపై అలా అలా సాగిపోయే పడవలు జలాశయం మధ్యలో మూడెకరాలున్న ముచ్చటైన ద్వీపానికి చేరుకుంటాయి. ‘గిరి వినాయక ఎకో టూరిజం’ పేరిట పర్యాటక శాఖ ఇక్కడ వివిధ రకాల సేవలు అందిస్తోంది. ప్రకృతి ఒడిలో హాయిగా కూర్చున్నట్టున్న వినాయకుడి భారీ విగ్రహం ఒకటుంది. దాన్ని చూసి.. అక్కడే ఐదారు ఫొటోలు దిగి.. రెస్టారెంట్‌కు వెళ్తారు యాత్రికులు. నచ్చిన భోజనం చేసి.. కాసేపు సేదతీరుతారు. ఈ ద్వీపంలో చాలా సినిమాల షూటింగ్‌లు జరిగాయి. ఆ విశేషాలన్నీ తెలుసుకొని.. వాటి గురించి చర్చిస్తూ.. పడవలో మళ్లీ తిరుగు ప్రయాణం అవుతారు. మూడుకొండల మధ్య పాపిటలా ఉన్న పాయల గుండా ప్రయాణిస్తూ.. పాపికొండలను చుట్టొచ్చామన్న అనుభూతికి లోనవుతారు. పక్షుల కిలకిలారావాలు, నీటి గలగలలు వినిపిస్తున్న వేళ.. సాయం సంధ్య సమీపిస్తున్న సమయాన.. ఎర్రనీళ్లు దిష్టి తీసి చల్లినట్టున్న గోస్తనీ జలాలను తరచి తరచి చూస్తూ పర్యాటకులు తిరుగు ప్రయాణం అవుతారు.

ఇజ్జగిరి రంజిత్‌, ఈనాడు పాత్రికేయ పాఠశాల
ఫొటోలు: సీహెచ్‌. సత్యనారాయణ, విజయనగరం

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.