close
బుల్లెట్‌ రైళ్లలో తిరిగాం... బౌద్ధాలయాల్ని చూశాం!

బుల్లెట్‌ రైళ్లలో తిరిగాం... బౌద్ధాలయాల్ని చూశాం!

‘అధిపతుల నిబద్ధతకి ప్రజల సహకారం తోడైతే ఆ దేశం అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం జపాన్‌. రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబుల దాడికి కోలుకోలేని దెబ్బతిని, అంతే వేగంగా తేరుకుని, తనదైన ముద్రతో దూసుకుపోతోంది...’ అంటూ ఆ దేశ విశేషాలను చెప్పుకొస్తున్నారు  హైదరాబాద్‌కి చెందిన రామకూరు లక్ష్మీమణి.

మూడువేల పైచిలుకు ద్వీపాల సమూహమే జపాన్‌. వాటిల్లో ముఖ్యమైనవీ పెద్దవీ ఐదారే. అక్షరాస్యత, ఆర్థికాభివృద్ధి, రవాణా, పరిశుభ్రత... ఇలాంటి ఎన్నో విషయాలను తీసుకుంటే ఆసియా దేశాల్లో ఇది తొలి, రెండు స్థానాల్లోనే ఉంది. అలాంటి దేశాన్ని చూడాలని సింగపూర్‌ మీదుగా ఒసాకా చేరుకున్నాం.

బుల్లెట్‌ రైలు!
ఒసాకా నుంచి హిరోషిమా పట్టణానికి బుల్లెట్‌ రైల్లో బయలుదేరాం. కోచ్‌ నంబరూ ప్లాట్‌ఫామ్‌ నంబర్లు ముందే ఇచ్చారు. గంటకి 320 కి.మీ. వేగంతో వెళ్లే ఈ రైల్లో గంటన్నరలో హిరోషిమాకి చేరుకున్నాం. అక్కణ్నుంచి ఫెర్రీలో మియాజిమా అనే ద్వీపానికి వెళ్లాం. ఇది ఇన్‌ల్యాండ్‌ సముద్రానికి పశ్చిమాన ఉంది. అక్కడ పర్యటకుల్ని ముందుగా ఆకర్షించేది సింధూర వర్ణంలోని తొరిగేట్‌. కేవలం ఆరు పిల్లర్లతో నీళ్లమధ్యలో కట్టిన ఈ నిర్మాణం ఓ అద్భుతం అనే చెప్పాలి. తరచూ వచ్చే భూకంపాలనూ తుపాన్లనూ తట్టుకుని నిలబడ్డానికి కారణం దీని పైభాగంలో కట్టిన నిర్మాణమేనట. ఇక్కడ ఇట్సుకుషిమా విగ్రహం ఉన్న ఆలయం కూడా నీటిలో ఉంటుంది. అందుకే జపనీయులు ఈ ద్వీపాన్ని విగ్రహ ద్వీపం అంటారు. ఇక్కడ దేవుడు ఉంటాడనేది వాళ్ల నమ్మకం.

హిరోషిమాలో...
అక్కణ్నుంచి హిరోషిమాలోని శాంతి పార్కు చూడ్డానికి వెళ్లాం. రెండో ప్రపంచయుద్ధంలో ఇక్కడి 76 వేల భవంతులు నేలకూలాయి. లక్షల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. బతికిన వాళ్లూ అణుబాంబు విస్ఫోటనం కారణంగా రోగాల బారినపడ్డారు. అక్కడక్కడా కూలిన భవన శకలాలు నేటికీ కనిపిస్తాయి. హిరోషిమా శాంతి మ్యూజియంలో దాడికి ముందు నగరం ఎలా ఉందో తెలిపే ఫొటోలూ, వీడియోలూ ప్రదర్శనకు ఉంచారు. ప్రాణాలు కోల్పోయిన వారి దుస్తులూ వస్తువులూ అక్కడ భద్రపరిచారు. వాళ్ల ఛిద్రమైన దుస్తులూ రూపం మారిన వస్తువులూ చూస్తే కళ్లలో నీళ్లు తిరుగుతాయి. నగరంలో ఆర్చి ఆకారంలో ఓ నిర్మాణం కనిపిస్తుంది. చనిపోయిన వారి గుర్తుగా కట్టిన దీన్ని సెనోటాఫ్‌ అంటారు. మేం కూడా అక్కడ నిలబడి వాళ్ల ఆత్మకు శాంతి కలగాలని కాసేపు ప్రార్థించాం.

దేవుని దూతలు జింకలు!
మర్నాడు ఉదయాన్నే బయలుదేరి, నారా అనే ఊరికి చేరుకున్నాం. ఇది క్రీ.శ. 710లో జపాన్‌ రాజధాని. కొన్ని రాజకీయ కారణాల కారణంగా 794లో క్యోటోని రాజధానిగా చేశారు. నారాలో జింకల పార్కు చెప్పుకోదగ్గది. 1880లో పెట్టిన ఈ పార్కులో వందల జింకలు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. షింటో మతం ప్రకారం వీటిని దేవుని దూతలుగా భావిస్తారు. ఆహారంకోసం అవి మన దగ్గరకు వస్తాయి. ఆహారం లేకపోతే రెండు చేతులూ పైకి ఎత్తితే, వెనక్కి వెళ్లిపోతాయి. జపాన్‌లో షింటోతోబాటు బౌద్ధాన్నీ అనుసరిస్తారు.

తొడై-జి అనేది ఇక్కడ ఉన్న అతి పెద్ద, పురాతన ఆలయం. చెక్కతో కట్టిన ఈ ఆలయం ప్రపంచంలోనే అతి పెద్దది. ఇక్కడ అతిపెద్ద కంచు, రాతి బౌద్ధ విగ్రహాలు ఉన్నాయి. ధ్యానం చేసుకుంటున్నట్లుగా ఉన్న ఆ కంచు విగ్రహాన్ని చూస్తూ కాసేపు మేం కూడా ధ్యానం చేసుకున్నాం. తరవాత నారా పట్టణంలోని కింకాకుజి గోల్డెన్‌ పెవిలియన్‌కి వెళ్లాం. దీనిపై రెండు అంతస్తులను బంగారురేకులతో తాపడం చేశారు. ఇది మొదట చివరి షోగున్‌ అయిన అషికగా యోషిమిత్సు నివాసస్థలంగా ఉండేది. ఆయన రాసిన విల్లు ప్రకారం తరవాత దాన్ని జెన్‌ బౌద్ధాలయంగా మార్చారు. దానిచుట్టూ చిన్న కొలను ఉంది. ఈ బంగారు దేవాలయం దూరానికి కూడా మెరుస్తూ కనిపిస్తుంది. కొలనులో దాని నీడ చూడ్డానికి శోభాయమానంగా ఉంటుంది.

ఇక్కడ చూడదగ్గ మరో విశేషం పిండోలా. సిద్ధార్థుడు తన తరవాత మత వ్యాప్తికోసం నలుగురు ప్రచారకుల్ని నియమిస్తాడు. వాళ్లలో పిండోలా భరద్వాజ ఒకరు. ఆయనకి కొన్ని తాంత్రిక శక్తులు ఉన్నాయనీ దాంతో ఆ విగ్రహాన్ని తాకితే రోగాలు తగ్గుతాయనీ జపనీయులు విశ్వసిస్తారు. తరవాతమా ప్రయాణం క్యోటో దిశగా సాగింది. రెండో ప్రపంచ యుద్ధంలో నష్టం జరగని ప్రదేశాల్లో క్యోటో ఒకటి. ఇది జపాన్‌ దేశ సాంస్కృతిక కేంద్రం. ఇక్కడ పురాతన, సాంస్కృతిక కట్టడాలు చాలానే ఉన్నాయి.

పవిత్ర జలపాతం!
నగరంలో ముందుగా చూడదగ్గది ఒటోవా జలపాతం. దీన్నుంచి వచ్చే నీరు మూడు ధారలుగా పడుతూ ఉంటుంది. ఒక ధార నుంచి పడే నీరు దీర్ఘాయువునీ రెండో ధార నుంచి పడే నీరు విద్యాభివృద్ధినీ మూడో ధార ప్రేమైక జీవితాన్నీ ఇస్తాయనేది జపాన్‌వాసుల నమ్మకం. ఈ నీటిని తాగడానికి ఓ కర్రకి కప్పుని కట్టారు. వెళ్లినవారు మనసులో ఏదో ఓ కోరిక అనుకుని ఏదో ఒక ధార నుంచి నీళ్లు తాగుతారు. అక్కడ చాలా పెద్ద క్యూ ఉండటంతో మేం ఆ నీరు తాగలేదు.

ఇక్కడే ఉన్న మరో ముఖ్య ప్రదేశం అరాషియామా వెదురుతోటలు. చుట్టూ పర్వతాలూ, వొయీ నదీజలాలూ బౌద్ధదేవాలయాలతో ఈ ప్రదేశం ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంది. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఇక్కడ విరబూసే  చెర్రీ చెట్లని చూడ్డానికి చాలామంది వస్తుంటారు. ఇక్కడే ఒక వరసలో గీత గీసినట్లుగా ఉన్న వెదురుచెట్లు అడవి అంతా పరచుకుని ఎంతో బాగున్నాయి.

ఈ నగరంలో చూడదగ్గ మరో ప్రదేశం నిజోజో కోట. 1603లో మొట్టమొదటి షోగున్‌ తొకుగవా లెయాసు ఈ కోటను కట్టారట. దాన్ని ఆయన మనవడు పూర్తి చేసి నివాస స్థలంగా మార్చుకున్నాడట. షోగున్ల పరిపాలన అంతమయ్యాక ఈ కోటని కొంతకాలం వాడలేదు. తరవాత ఇంపీరియర్‌ భవంతిగా మార్చి, 1940 నుంచి ప్రజలు చూడ్డానికి అనుమతించారట. ఇక్కడ జపాన్‌తోబాటు ఇతర భాషా చిత్రాల షూటింగులూ జరుగుతుంటాయి. టామ్‌ క్రూజ్‌ నటించిన ‘ది లాస్ట్‌ సమురాయ్‌’ సినిమా షూటింగ్‌ ఇక్కడే జరిగిందట. 1868లో తొకుగవా షోగున్ల పాలన అంతమై, మైజీ అనే రాజుల పాలన ప్రారంభమైంది. అప్పట్నుంచీ సమురాయ్‌లు కత్తులు ధరించి తిరగకూడదనే నిబంధన వచ్చిందట. ఈ కోటలో ప్రతి బొమ్మా నాటి పాలనని ప్రతిబింబిస్తుంది.

మండే పర్వతం!
మర్నాడు హకోనే అనే నగరానికి బుల్లెట్‌ రైల్లో బయలుదేరాం. ఫూజీ అగ్నిపర్వతమూ ఒవాకుడామీ లోయలూ అక్కడ చూడదగ్గ ప్రదేశాలు. ఈ పర్వతాన్ని దగ్గరగా చూడ్డానికి 3776 మీటర్ల ఎత్తులో ఉన్న ఐదో లెవల్‌ వరకూ బస్సులో వెళ్లాం. చుట్టూ పచ్చని మొక్కలూ మలుపుల రోడ్లమీద అలా ప్రయాణించడం గమ్మత్తుగా అనిపించింది. మేం అక్కడికి వెళ్లేసరికి ఈదురుగాలులూ, వర్షం మొదలవడంతో ఎక్కువసేపు ఉండలేకపోయాం. మళ్లీ కిందకి వచ్చి, దూరం నుంచే త్రిభుజాకారంలో ఉన్న ఫూజీ పర్వతాన్ని చూశాం. తరవాత రోప్‌వేలో అక్కడి అగ్నిపర్వతం కారణంగా ఏర్పడ్డ వేడినీటి మడుగుల్ని చూడ్డానికి వెళ్లాం. వాటిల్లో గుడ్లను ఉడికించి విక్రయిస్తున్నారు. ఆ మడుగుల్లోని సల్ఫర్‌ వేడికి పైన పెంకు నల్లగా మారింది. లోపల గుడ్డు తెల్లగానే ఉంది. ఈ గుడ్డు ఒక్కటి తింటే ఏడు సంవత్సరాల ఆయుఃప్రమాణం పెరుగుతుందని అక్కడివాళ్ల నమ్మకం. చాలామంది కొనుక్కుని తింటున్నారు. అక్కణ్ణుంచి టోక్యోకి బయలుదేరాం.

టోక్యోలో...
జపాన్‌లోని మిగిలిన నగరాలతో పోలిస్తే ఇక్కడ జనాభా చాలా ఎక్కువ. ప్రపంచంలోని ఖరీదైన నగరాల్లో ఇదీ ఒకటి. దీన్ని ఎంతో సురక్షిత నగరంగా చెబుతారు. ఇక్కడి ప్రజలు స్నేహశీలురు. నగరం ఎంతో పరిశుభ్రంగా ఉంది. పబ్లిక్‌ ప్రదేశాల్లో సిగరెట్టు తాగేవారు యాష్‌ ట్రేను తమ దగ్గరే ఉంచుకుంటారు. ముందుగా సెంపోజి గుడి చూడ్డానికి వెళ్లాం. ఇది పురాతన బౌద్ధాలయం. ఇక్కడ ఏడాదిబారునా ఏవో ఒక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయట.

జపాన్‌లో 1603-1867 మధ్య కాలాన్ని ఎడో పీరియడ్‌ లేదా తొకుగవా కాలం అంటారు. ఆనాటి సంస్కృతీసంప్రదాయాలూ సమురాయ్‌ల విశేషాలూ తెలుసుకునేందుకు ఎడో మ్యూజియంను సందర్శించాం. తరవాత ప్రపంచంలోనే ఎత్తైన టోక్యో స్కై ట్రీని చూడ్డానికి వెళ్లాం. దీని కింది భాగం త్రిభుజాకారంగా ఉండి, పైకెళ్లేకొద్దీ సన్నగా స్థూపాకారంలోకి మారుతుంది. సుమారు 450 మీటర్ల పైకెళ్లి అక్కడ ఉన్న అద్దాల నేలమీద నడుస్తుంటే ఆకాశం మధ్యలో నడిచినట్టే అనిపించింది. అక్కడినుంచి కిందకి దిగి 350 మీటర్ల ఎత్తులో చుట్టూ చూస్తే నగరం మొత్తం కనిపిస్తుంటుంది. అక్కడి రెస్టరెంట్‌లో కాఫీ తాగి, కిందకువచ్చి షాపింగ్‌ చేసుకుని తిరుగు ప్రయాణమయ్యాం.


సూర్యుడు ఉదయించే దేశం... ఆ పేరెందుకు?

ప్రపంచంలో ఎక్కడైనా సూర్యుడు ఉదయిస్తాడు. అదీ తూర్పు దిక్కునే. కానీ జపాన్‌ని మాత్రమే ‘ల్యాండ్‌ ఆఫ్‌ రైజింగ్‌ సన్‌’ అని పిలుస్తాం. దానికి కారణం చైనీయులే. జపాన్‌ ఏర్పడక ముందు చైనీయులకి ప్రతిరోజూ సూర్యుడు వాళ్ల దేశానికి తూర్పు భాగంలో ఉదయిస్తూ కనబడేవాడు. దాంతో ఆ ప్రాంతం నుంచి మాత్రమే సూర్యుడు ఉదయిస్తాడని నమ్మేవారు. ఆ తరవాత జపాన్‌ ఏర్పడింది. వాళ్ల నమ్మకం ప్రకారం సూర్యుడు అటు నుంచే ఉదయిస్తాడు కాబట్టి ఆ దేశాన్ని ‘సూర్యుడు ఉదయించే ప్రాంతం’గా పిలిచేవారు. అలా దానికి ఆ పేరు స్థిరపడిపోయింది.