close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పంచమగ్రహం

పంచమగ్రహం
- డేగల అనితాసూరి

‘‘రేపట్నుంచే వేసవి సెలవులు పిల్లలకు’’ చెప్పింది పూర్ణ.

‘‘అవును నువ్వూ, పిల్లలూ ఊరెళ్తారా... టికెట్స్‌ బుక్‌ చేయనా?’’ అన్నాడు శివ.

‘‘వెళ్ళాలనిపించట్లేదు నాకు’’ అంది పూర్ణ.

‘‘ఓ వారం మన ఊరెళ్ళు. అక్కడ అన్నయ్యా వదినా, అమ్మానాన్నలతోబాటు అన్నయ్య పిల్లలూ చుట్టాల పిల్లలూ వస్తారు. సరదాగా గడిపి, తర్వాత మీ ఇంటికి వెళ్ళు. మీ అమ్మా అన్నయ్యలతో కూడా ఓ వారం సరదాగా గడిపి రెడీగా ఉంటే, నేనో నాల్రోజులు సెలవు పెట్టి అమ్మావాళ్ళను పలకరించి మీ దగ్గరకొస్తాను. అందరం కలిసి వచ్చేయొచ్చు... సరేనా?’’ అన్నాడు శివ.

‘‘నాకు వెళ్ళాలని లేదంటే వినరేంటి? ఇక్కడే పార్కులూ రిసార్టులూ సినిమాలంటూ తిరిగిరండి చాలు’’ నిర్లిప్తంగా అంది పూర్ణ.

‘‘ఏమైందసలు? వద్దన్నా ఆగేదానివి కాదుగా... ఎవరిమీదైనా కోపమా?’’

అడిగాడు శివ.

‘‘అరె, నేను పుట్టిపెరిగిన ఇల్లండీ అది. నేను శుభ్రంచేసి జాగ్రత్త చేసిన వస్తువులే కదా అక్కడున్నవి? అలాంటిది పిల్లలు షోకేస్‌లోని బొమ్మలు కావాలంటే ‘పూర్ణా... దూరం నుంచే చూడమను పిల్లల్ని.

కావాలంటే రబ్బరు బొమ్మలిస్తా కానీ, అవి పింగాణీవి. పెళ్ళికి వచ్చిన బహుమతులు. గుర్తుగా అక్కడుంచా. విరక్కొట్టేయగలరు’ అంది మా వదిన.’’

‘‘అవున్లే, ముందే చెప్పటం మంచిది కదా. ఆనక పిల్లలు పాడుచేస్తే ఏం చెయ్యగలమని అనివుండొచ్చు. దాన్లో ఏం తప్పులేదుగా?’’ అన్నాడు శివ.

‘‘అవునవును. అడపడుచన్న మర్యాద కూడా లేకుండా పిల్లలకన్నా వస్తువులు ముఖ్యమన్నట్లు మాట్లాడితే, మీకు నచ్చిందేమోగానీ, నాకైతే ఒళ్ళు మండింది’’

ఉక్రోషంగా అంది పూర్ణ.

‘‘అయినా, అంత మాత్రానికే మీ వదిన కాకుండా పోతుందా? అయినవాళ్ళతో పంతాలకు పోతామా?’’ అన్నాడు శివ.

‘‘అంతమాత్రానికే ఏం కాదు. మన పిల్లలు వస్తున్నారని హాల్లోని కేన్‌ ఉయ్యాలను ముందే తీయించి పక్కన పెట్టేశారు. పిల్లలు ఊగేటప్పుడు వెనుక గోడకు పాదాలతో తన్నుకోవడం వల్ల ఆ బంగారు గోడకు మురికిపడ్తుందని’’ చెప్పింది విసురుగా.

‘‘నువ్వే అంటున్నావ్‌ కదా, గోడ పాడవుతుందని. మరందుకే తీసి ఉంటారు.

పిల్లలకేం తెలుస్తుంది- వస్తువులు, ఇల్లు గురించిన విలువ? పెద్దలే జాగ్రత్తపడాలి కదా’’ అన్నాడు.

‘‘పిల్లలన్నాక అలాగే ఉంటారు మరి.

ఆ మాత్రానికి ‘సెలవులకు రండి రండని ఊదరపెట్టడం దేనికో?’’ మూతి మూడు వంకర్లు తిప్పింది పూర్ణ.

‘‘సర్లే, పిలిచారు కదాని వస్తువులు పాడుచేస్తామా? అసలు వాళ్ళకంటేముందు నువ్వే పిల్లలకు సర్దిచెబితే ఆవిడని అనే అవసరం ఉండేదికాదు కదా.’’

‘‘బాగుంది మీ వరస. పెళ్ళికి ముందు వరకూ నేనున్న గదిని తన గదిగా చేసేసుకుంది. ఆ గదిలో ఉన్న బీరువా మా అమ్మది. అందులో నా వస్తువులు పెడదామని మా అమ్మను తాళాలడిగితే ‘మీ వదిన దగ్గరున్నాయే’ అంది.

ఎంతైనా అత్తలంతా అంతే!

పెళ్ళికిముందు కూతుర్ని మహాలక్ష్మి అంటారు, కోడలొచ్చాక ఆవిడే ఆ ఇంటి మహారాణి అంటారు’’ విసవిసా ఆరిన బట్టలు మడతపెడుతూ అంది పూర్ణ.

‘‘ఇది మరీ అన్యాయం. వాళ్ళింటి బీరువా తాళాలు నీకెందుకసలు? వాళ్ళ పర్సనల్స్‌ ఎన్నో ఉండొచ్చు కదా?’’ అన్నాడు శివ ఫోన్లోని వాట్సాప్‌ మెసేజ్‌ చూసుకుంటూ.

‘‘అంతేకాదు, వచ్చేరోజు పిల్లలకూ నాకూ పెట్టిన బట్టలు ఏమైనా బాగున్నాయా? చిన్నాడి షర్టు ఆర్నెల్లకే పొట్టైపోయింది. నాకు పెట్టిన ఇంకుబ్లూ రంగు చీర అస్సలు నచ్చలేదు. అంత పెట్టాలనుకున్నవాళ్ళు మమ్మల్ని షాపుకి తీసుకెళ్ళి మాకు నచ్చినవి కొనిపెట్టి ఇవ్వాలిగానీ, ఎక్కడ ఎక్కువ ఖరీదైనవి కొనేస్తామో అన్నట్టు భయపడిపోతారు. ఏడాదికోసారి కోరిన బట్టలు పెడితే వాళ్ళ ఆస్తులేమైనా తరిగిపోతాయా, అరిగిపోతాయా?’’

రుసరుసలాడుతూ మడిచిన బట్టలు అలమరలో సర్దింది పూర్ణ.

దెబ్బకు మరి రెట్టించకుండా ఊరుకున్నాడు శివ.

***

‘‘ఈసారి సెలవులకు రానందమ్మా పూర్ణ’’ చెప్పాడు కేశవ్‌.

‘‘అయ్యో, తనొస్తుందనే మొన్న మా అన్నయ్య వచ్చి వెళ్ళేటపుడు పిల్లల్ని తీసుకెళ్తా అన్నా పంపలేదు... పూర్ణ పిల్లలతో ఆడుకుంటారని’’ అంది శ్యామల.

‘‘ఎప్పుడూ వచ్చేది కదా... అలిగిందో ఏమోరా?’’ అంది తల్లి సావిత్రమ్మ.

‘‘తననే తీసుకెళ్ళి బట్టలు కొనిపెట్టలేదని కోపమనుకుంటా. ‘నేనేమైనా వాళ్ళ తాహతుకు మించి పెట్టమన్నానా? ఎంతలో తీసుకోవాలనుకుంటారో అంతలోనే మాకు నచ్చినవి కొనిపెట్టొచ్చు కదా’ అని చిన్నాన్న కూతురు శ్రావణితో చెప్పుకుని బాధపడిందట. అలా మనింటి గుట్టు రట్టు చేసుకోవచ్చా’’ నిష్ఠూరపోతూ అన్నాడు కేశవ్‌.

‘‘నేనూ బాధపడ్డానత్తయ్యా - పూర్ణకు నచ్చినవి కొనుక్కొమ్మని పెట్టలేకపోయినందుకు. కానీ, ఈయన ఉద్యోగం ఆ కంపెనీలో పోయాక మరో మూడు నెలలకుగానీ కొత్త కంపెనీలో దొరకలేదు కదా. అప్పటి మన పరిస్థితి అంత బాగాలేకపోయె. వట్టి చేతులతో ఇంటికొచ్చిన ఆడపడుచునెట్లా పంపాలా అని, నాకూ పిల్లలకూ మా అన్నయ్య పెట్టిన బట్టలుంటే పెట్టేశాగానీ తనంటే చిన్నచూపుతో కాదు’’ అంది శ్యామల నొచ్చుకుంటూ.

***

‘‘నువ్వెలాగూ ఊరెళ్ళనన్నావు కదా... ఈసారి మా చెల్లెలు ప్రియ హైదరాబాద్‌ వస్తోంది పూర్ణా’’ చెప్పాడు శివ.

‘‘వావ్‌... ప్రియత్త పిల్లలతో మేం బాగా ఆడుకుంటామోచ్‌’’ ఎగిరి గంతేశారు పిల్లలు. వాళ్ళ ఆనందాన్ని చిరునవ్వుతో చూసింది పూర్ణ.

‘‘హబ్బబ్బ... రైలు ప్రయాణమైనాగానీ వదినా... ఒళ్ళంతా ఒకటే నొప్పులు, అలసిపోయాననుకో’’ వస్తూనే అంది ప్రియ.

‘‘స్నానం, టిఫిన్‌ అయ్యాక కాస్త రెస్ట్‌ తీసుకో ప్రియా... సాయంత్రానికంతా సర్దుకుంటుంది’’ చెప్పింది పూర్ణ.

‘‘అవునొదినా, అలాగే చేస్తా’’ అని టిఫిన్‌ అవగానే మంచమెక్కింది ప్రియ.

ప్రియ పిల్లలు ఇల్లు పీకి పందిరేయసాగారు. షోకేస్‌ తెరవమని మారాంచేస్తే, తన పుట్టింట్లోలాగా ఉండకూడదని తాళం తీసిందంతే. శివ విదేశాలకెళ్ళినపుడు తెచ్చిన బొమ్మలూ, తను టూరుకి వెళ్ళినప్పుడు ముచ్చటపడి కొనుక్కొచ్చిన బొమ్మలూ, తమ పెళ్ళికొచ్చిన కానుకల బొమ్మలూ అన్నిటినీ పీకి పాకంపెట్టారు. పూసలు రాల్చేసి, విరిచేసి, ఒకట్రెండు విరగ్గొట్టేశారు కూడా. వాటినలా చూస్తుంటే ప్రాణం విలవిల్లాడింది కానీ, పాపం పిల్లలు కదా వాళ్ళకేం తెలుసు, తన పిల్లల్ని వదిన చూసినట్టు వీళ్ళను బాధపెట్టకూడదు’’ అని మనసు కుదుటపరుచుకుంది పూర్ణ.

హాలు మధ్యనున్న ఉయ్యాలబల్లెక్కి దూరానికి ఊగి అల్లరల్లరి చేసి టేబుల్‌ని కాలితో తన్ని దానిమీదున్న పింగాణీ సామానంతా పగలగొట్టి పడేశారు. అయినా పల్లెత్తు మాటనలేదు పూర్ణ.

వస్తువులు ముక్కలైనట్టు మనసులు ముక్కలై బంధాలు దూరం కాకూడదు అనుకుని విసుక్కోకుండా అవన్నీ తీసి శుభ్రం చేసింది.

ఇటు పుల్ల తీసి అటు పెట్టకుండా, పర్సులోంచి ఒక్క రూపాయైనా బయటకు తీయకుండా హైదరాబాద్‌లో చూడవలసిన ప్రదేశాలన్నీ చూసి, షాపింగ్‌ చేసింది ప్రియ. చివరగా ఊరెళ్ళేరోజు పూర్ణ- ప్రియనీ పిల్లల్నీ కావలసిన బట్టలు కొనుక్కొమ్మంటే, ఆరువేలు పెట్టి వర్క్‌శారీ, పిల్లలకు చెరో రెండువేలతో కుర్తా పైజమాలు కొనుక్కుంది ప్రియ.

‘‘అబ్బ! అదసలే బోల్డంత ఖర్చు పెట్టించింది పూర్ణా. మరీ నువ్విలా తెలుగు సీరియళ్ళలో హీరోయిన్‌లా మెతకగా, నీలాగా అది కొరతగా ఫీలవకూడదని చూస్తుంటే అది పేట్రేగిపోయింది. మనమే బట్టలు తెచ్చేసి ఓ అయిదువేలతో సరిపెడితే పోయేది’’ అన్నాడు అయిన ఖర్చు లెక్కేసి చూసుకుని కళ్ళు తిరిగిన శివ.

‘‘పోన్లెండి పాపం, సంవత్సరానికోసారేగా. ఒక్కోసారి మీ అన్నయ్య దగ్గరికెళ్తుంది కూడా. తను తృప్తిగా సంతోషిస్తే చాలు’’ అంది పూర్ణ.

‘‘రాత్రికి ట్రైన్‌లో తినడానికి చపాతీలు కావాలో, పులిహోర కట్టాలో ప్రియను అడుగుదామని వచ్చిన పూర్ణ- ఫోన్‌లో మాట్లాడుతున్న ప్రియ గొంతు వినిపించి గుమ్మం దగ్గరే ఆగిపోయింది.

‘‘ఆ... పెట్టిందిలే పేద్ద... ఆరువేల వర్కుశారీ. అప్పటికే ముఖంలో కళ లేకుండా పోయిందావిడకి... తన సొమ్మంతా నేను దోచుకెళ్తున్నట్టు.

అంతకన్నా ఎక్కువలో అడిగితే కళ్ళు తిరిగి పడేలా ఉందని అదే చాలని సర్దుకున్నాననుకో. అయినా, ఈ వదినలంతా ఇంతేనే... ఆడపడుచుకు పెట్టాలంటే మనసొప్పదు’’ అంటోంది ప్రియ.

***

‘‘చూశారా, ప్రియ చివరికెట్లా చెప్పుకుందో అందరితో’’ ఆ రాత్రి భర్తతో చెప్పి బాధపడింది పూర్ణ.

‘‘అందుకే తల్లీ, ఆడపడుచంటే అర్ధమొగుడంటారు. అల్లుడు దశమగ్రహమైతే ఆడపడుచులు పంచమగ్రహాలే కదా మరి’’ అని నవ్వాడు శివ.

‘‘నిజమే కానీ, మా అన్నావదినలు నన్నలా అనుకోకూడదంటే నేను మా పుట్టింటికెళ్ళాల్సిందే. పిల్లలకింకా పదిరోజులు సెలవులున్నాయిగా. వాళ్ళేం పెట్టినా పెట్టకపోయినా ఫర్వాలేదు’’

అంది ప్రియ దెబ్బతో పుట్టింటి మీదికి మనసుమళ్ళిన పూర్ణ.

‘‘సంతోషం. పుట్టిల్లంటే ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయంగా ఒకర్నొకరు ఆటపట్టించుకుంటూ అర్థంచేసుకుంటూ సరదాగా గడిపామో దాన్ని ఆస్వాదించి రావాలిగానీ, ‘ఇది పెట్టారు అది పెట్టలేదు’ అంటూ అరకొరమనసుతో మనం బాధపడుతూ, వాళ్ళను దుయ్యబడుతూ ఉండకూడదని ఇప్పటికైనా గ్రహించినందుకు హ్యాట్సాఫ్‌ పూర్ణా’’ అన్నాడు శివ తృప్తిగా నవ్వుతూ ఆన్‌లైన్లో టిక్కెట్లు బుక్‌ చేస్తూ.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.