close
బైకుమీద వెళ్లి అవార్డులు తెచ్చుకుంటున్నా!

బైకుమీద వెళ్లి అవార్డులు తెచ్చుకుంటున్నా!

నేటి మన సంగీతదర్శకులంతా ఓ రకంగా పెళ్ళిళ్ళ పేరయ్యలు. ఇక్కడ పుట్టిన కర్ణాటక సంగీతానికి, ఐరోపాకి చెందిన పాశ్చాత్య సంగీతంతో ముడిపెట్టి పాటల పీటనెక్కిస్తారు. అమెరికా హిప్‌హాప్‌నీ, జమైకా రెగ్గెనీ ఈ పెళ్లికి పెద్దల్ని చేస్తారు. కొత్తా, పాతా అనిలేదు. ఆధునిక సింథసైజర్‌ సాయంతో సంగీతదర్శకులందరూ ఇదే చేస్తున్నారు. అందరూ అదే చేస్తున్నప్పుడు, రధన్‌ సంగీతం మాత్రం అంత తాజాగా ఎందుకు వినిపిస్తోంది?  ‘అందాల రాక్షసి’ నుంచి ‘మనసుకి నచ్చింది’ దాకా ఆ సంగీతం ఇంత విభిన్నంగా ఎలా ఉంది? అదే అడిగితే ఇలా చెప్పుకొచ్చాడు..

సంగీతదర్శకుణ్ణనగానే నన్నేదో పెద్దగా ఊహించుకోకండి. సంప్రదాయబద్ధంగా నేను సంగీతాన్ని నేర్చుకోనేలేదు. ఇంటర్‌ తర్వాత కేవలం ఆసక్తితో ఇటువైపు వచ్చానంతే! ఇప్పటికీ నా దగ్గర పనిచేసే వాయిద్యకారులంతా స్వరాలని వివరించి చెప్పమంటే కళ్లు తేలేస్తాను. నాకు వచ్చిన భాషలోనే ఏదో చెబుతాను. ఆ అర్థంకాని అంశాల్లో ఒకటి.. మా అమ్మ నాకు అందించిన స్ఫూర్తి. రెండోది రెహ్మాన్‌ పరోక్షంగా నాకు అందించిన ప్రేరణ. నా తల్లి తర్వాత తల్లిలాంటివారాయన!

నా పేరు ఆమెదే
రధన్‌ అన్నది మా అమ్మ పేరే. ఆమె పేరు రాధ. ఆంగ్లంలో తన ఇనిషియల్‌ సహా.. ‘రాధ.ఎన్‌’ అని రాసుకుంటుంది. దాన్నే నేను రధన్‌గా మార్చుకుని నా సినిమా జీవితానికి వాడుకుంటున్నా. శర్వానంద్‌ హీరోగా గత ఏడాది ‘రాధ’ సినిమా అవకాశం వచ్చినప్పుడు ఎగిరిగంతేశా. అమ్మ పేరు కదా.. నా ప్రాణం పెట్టి మరీ దానికి సంగీతం అందించా. ఆ మాటకొస్తే నేను వినిపించే ప్రతి పాటలోనూ అమ్మ నాకు అందించిన ప్రేరణే ఉంటుంది. సంగీతంలో ఓనమాలూ కూడా నేర్చుకోని నేను ఓ రోజు ‘అమ్మా నేను సంగీత దర్శకుడిని కావాలనుకుంటున్నా..’ అనంటే ‘నీ మొహం నువ్వేం చేస్తావ్‌? ముందు డిగ్రీ ఏడువు!’ అనకుండా ‘కచ్చితంగా అవుతావ్‌రా.. నాన్నా!’ అని ప్రోత్సహించడం చిన్న విషయమేం కాదు. ఏదో మాటలు చెప్పి ఊరుకోలేదు. నాకోసం తన తాళిబొట్టు తాకట్టుపెట్టి మరీ కీబోర్డు కొనిచ్చింది. తాళికి బదులు పసుపుదారం వేసుకున్న అమ్మ రూపమే ఇప్పటికీ నాకు ప్రేరణ.

ఆమె అభిరుచి అది..
మా కుటుంబంలో ఏ తరంలోనూ సంగీతం తెలిసినవాళ్లు లేరు. నాన్న అనాథ. తమిళనాడులోని ఏదో మారుమూల గ్రామం నుంచి చెన్నై వచ్చి చిన్నాచితక ఉద్యోగాలు చేసేవారు. ఇక్కడో ఫ్యాక్టరీలో ఉద్యోగం సాధించారు. ఆయన కష్టపడే తత్వం నచ్చి అమ్మమ్మవాళ్లు అమ్మనిచ్చి చేశారు. ఇంట్లో ఇద్దరం పిల్లలం. అన్నయ్య తర్వాత నేను. అమ్మకి సంగీతం రాకున్నా పీబీ శ్రీనివాస్‌, ఘంటసాల, ఎ.ఎం.రాజా.. పాటలంటే చెవికోసుకునేది. తన పిల్లల్లో ఒక్కరైనా సంగీత రంగంలో ఉండాలని కోరుకుంది. అన్నయ్యకి ఏడేళ్లున్నప్పుడే తబలా కొనిచ్చింది. వాడు దాన్ని కాస్త నేర్చుకుని ఆలయాల్లో చిన్నపాటి కచేరీలు చేస్తుండేవాడు కానీ అదే ప్రపంచం అనుకోలేదు. నిజానికి సంగీతమే జీవితమనుకునే పరిస్థితీ, ఆ స్థోమతా మాకులేవు. నేను ఇంటర్‌ రెండో ఏడాది చదివేదాకా నాన్న జీతం ఐదువేల రూపాయలే. అమ్మ తనకున్న పదోతరగతి చదువుల్తోనే ట్యూషన్‌లు చెప్పి ఇంటిభారాన్ని నెట్టుకొచ్చేది. అలాంటప్పుడే తబలాపై నాకూ ఆసక్తి కలిగింది. అన్నయ్య వాయించడం చూస్తూనే నేను నేర్చుకున్నా. ఆ ఆసక్తికి ‘రెహ్మానియా’ ఆజ్యం పోసింది.

ఏమిటీ రెహ్మానియా?
ఏఆర్‌ రెహ్మాన్‌పై ఉన్న పిచ్చి అభిమానం, ప్రేమా, వెర్రీ.. వీటన్నింటినీ కలిపే ‘రెహ్మానియా’ అని పిలుస్తుంటాం చెన్నైలో. పదో తరగతిలోనే నాకు అది అంటుకుంది. ఆయన బాణీలేకాదు.. పాటల్లోని వాయిద్య సంగీతాన్ని వివిధ పొరలుగా మార్చి వినిపించే శబ్ద నైపుణ్యం నన్ను కట్టిపడేసేది. అదెలా సాధ్యమవుతోంది.. అని అడిగితే ‘సౌండ్‌ ఇంజినీరింగ్‌ మహిమ’ అన్నారెవరో. అప్పటి నుంచీ నేను సౌండ్‌ ఇంజినీర్‌ని కావాలని కలలుకన్నా. సంగీతం వైపు రావడానికి అదే దగ్గరిదారన్నది నా ఆలోచన. కానీ ఇంట్లో పరిస్థితి వేరు. నాన్నకి షుగర్‌, బీపీ పెరిగి ఒళ్లు గుల్లైపోయింది. ఉద్యోగం చేయలేని పరిస్థితి. అమ్మకి మూర్ఛవ్యాధి ప్రారంభమైంది. అన్నయ్య పనికెళ్లడం మొదలుపెట్టాడు. నేను ఇంటర్‌ చదువుతూ పెద్దవాళ్లిద్దరినీ కనిపెట్టుకుని ఉండేవాణ్ణి. ఇంటరయ్యాక లుకాస్‌ అనే పెద్ద ఆటోమొబైల్‌ కంపెనీలో ఉద్యోగ ఆఫర్‌ కూడా తలుపుతట్టింది. కానీ అమ్మ ‘ఉద్యోగంలో చేరిపోతే జీవితాంతం గానుగెద్దులా ఉండిపోతావ్‌. నీ మనసుకి నచ్చిందే చెయ్‌. సౌండ్‌ ఇంజినీరింగ్‌ కోర్సు చదువు..’ అని చెప్పింది. పుస్తెలమ్మి నాకు కీబోర్డు కొనిచ్చింది కూడా అప్పుడే!

అక్కడ మొదలుపెట్టి..
ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో సౌండ్‌ ఇంజినీరింగ్‌ కోర్సులో చేరాను. ఏడాది కోర్సు తర్వాత చెన్నైలోని భరణి స్టూడియో సౌండ్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించా. డీటీఎస్‌ మిక్సింగ్‌ నిపుణుడిగా మారా. కాకపోతే, ఇదంతా శబ్దాలని అందంగా చెక్కే వ్యవహారమే తప్ప సంగీతంతో పెద్ద పనిలేదు. ఆ అసంతృప్తిని పోగొట్టుకోవడానికి రాత్రుళ్లు మేల్కొని మూడింటిదాకా కీబోర్డు సాధన చేసేవాడిని. ముఖ్యంగా యూట్యూబ్‌ నా సంగీత గురువైంది. స్వరాలని రాయడం దగ్గర్నుంచి.. కర్ణాటక, హిందుస్థానీ, పాశ్చాత్య శైలి దాకా అన్నీ దాని ద్వారానే నేర్చుకున్నా. తొలిసారి నాకు నేనే బాణీలు కట్టడం మొదలుపెట్టిందీ అప్పుడే. మూడేళ్లు గడిచాక.. సంగీతానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నాననే అసంతృప్తి ఎక్కువైపోయింది. అమ్మకి నా బాధ అర్థమయ్యిందేమో. ‘నువ్వు ఓ ఏడాదిపాటు ఉద్యోగం చేయకున్నా ఫర్వాలేదు. నేనూ, అన్నయ్య ఇంటిని నెట్టుకురాగలం..’ అంది. అమ్మ చెప్పినట్టే చేశా. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి సంగీతంపై దృష్టిపెట్టాను. కొన్ని లఘుచిత్రాలకి పనిచేశాను. అవి తప్ప అంతకన్నా అవకాశాలు రాలేదు. చూస్తుండగానే ఏడాది గడిచింది. చేసేదేమీ లేక ఓ ఎఫ్‌.ఎం.ఛానెల్‌లో ప్రొగ్రామ్‌ ప్రొడ్యూసర్‌గా నెలకి పదివేల జీతంతో కుదిరాను.

రెహ్మాన్‌తో భేటీ!
ఎఫ్‌.ఎం. ఛానెల్‌లో ‘రెహ్మానియా’ అనే కార్యక్రమాన్ని రూపొందించా. రెహ్మాన్‌ పాటల్లోని ప్రయోగాలని పరిచయం చేసే కార్యక్రమం అది. తీవ్రమైన అసంతృప్తితో ఉన్న నాకు.. ఆ కార్యక్రమం పెద్ద ఊరట. మా కార్యక్రమానికి రెహ్మాన్‌గారి అక్కయ్య రెహానా యాంకర్‌గా ఉండేవారు. ఆమె ద్వారా ఎంతో ప్రయత్నించాక.. ఓ రోజు ఏఆర్‌ రెహ్మాన్‌ మాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. రెహానాగారితోపాటూ నేనూ ఆయన స్టూడియోకి వెళ్లాను. ఆయన్ని చూశాక ఉద్వేగంతో నాకు నోట మాట రాలేదు. అది అర్థం చేసుకున్నారేమో రెహానాగారు ‘నువ్వంటే ఇతనికి పిచ్చిరా! కొన్ని షార్ట్‌ఫిల్మ్స్‌కీ పనిచేశాడు. ప్రతిభావంతుడు..’ అంటూ నన్ను ఆయనకి పరిచయం చేశారు. ‘ఓ.. ఈజిట్‌!’ అని కరచాలనం చేశారు రెహ్మాన్‌. దాదాపు 40 నిమిషాల సంభాషణ. నేను సెలవు తీసుకోబోతుంటే ‘నువ్వు తప్పకుండా సంగీతదర్శకుడివి అవుతావ్‌. అందుకోసం ప్రయత్నించడం మానొద్దు!’ అన్నారు. తర్వాతి రోజే నా ఎఫ్‌.ఎం. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశా! నా బాణీలనీ, నేను చేసిన లఘుచిత్రాలనీ ఓ డీవీడీగా చేసి ప్రతి స్టూడియోకీ వెళ్లి ఇవ్వడం మొదలుపెట్టా. అందుకోసమే ఓ సెకెండ్‌హ్యాండ్‌ బైకు కొన్నా.

తెలుగే ఆదుకుంది..
సరిగ్గా అప్పుడే అమ్మా, నాన్నలిద్దరినీ ఒకేసారి ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. నాన్నకి బీపీ పెరిగి ప్రాణంమీదకొస్తే, అమ్మ ఉన్నపళంగా అపస్మారకంలోకి వెళ్లిపోయింది. మెదడులో కణితి ఉందని నిర్ధారించారు. చేతిలో డబ్బేమీ లేదు, ఏం చేయాలో పాలుపోలేదు. ఆ సమయంలోనే హైదరాబాద్‌ నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. నాకప్పట్లో తెలుగు బొత్తిగా రాదు. అటువైపాయన ‘నేను యేలేటి చంద్రశేఖర్‌. మా ప్రొడక్షన్‌కి సంగీతం అందించాలి..’ అన్నారు. ఇదివరకు నేను పనిచేసిన ‘ఫ్యూచర్‌’ అనే లఘుచిత్రం లండన్‌ చిత్రోత్సవంలో అవార్డు తీసుకుంది. అది చంద్రశేఖర్‌గారి దృష్టికొచ్చి నాకు ఫోన్‌ చేశారట. తొలిసారి సినిమా అవకాశం అనే ఉద్వేగం కన్నా అమ్మానాన్నల చికిత్సకి కలిసొస్తుందనే ఆలోచనే.. నన్ను హైదరాబాద్‌కి  రప్పించింది. అలా చంద్రశేఖర్‌ యేలేటి శిష్యుడు హను రాఘవపూడి సినిమా ‘అందాల రాక్షసి’కి సంగీతదర్శకుణ్ణయ్యాను! ఆ  విజయమే నన్నూ, నా కుటుంబాన్నీ నిలబెట్టింది.

ప్రతి సినిమాకీ అంతే!
రాశిపరంగా ఈ ఏడేళ్లలో నేను చేసిన సినిమాలు ఎనిమిదే! ప్రతి సినిమాకీ ప్రారంభం నుంచి చివరి దాకా అడుగడుగునా తోడుంటాను. ప్రొడక్షన్‌లోనూ భాగం కావడం వల్లే నా పాటలు సందర్భానికి తగ్గట్టుంటాయి. ‘అందాల రాక్షసి’ తర్వాత ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘రాధ’, ‘అర్జున్‌రెడి’్డదాకా ఇలాగే పనిచేశాన్నేను. ‘అర్జున్‌రెడ్డి’కి ఏకంగా రెండేళ్లు శ్రమించా! ఇందువల్లేనేమో ఆర్థికంగా పెద్దగా నిలదొక్కుకోలేదు. అవార్డు ఫంక్షన్‌లైనా, ఆడియో లాంచ్‌లైనా నాబైక్‌పైనే ప్రయాణం!

అమ్మ ఇప్పుడు ఐసీయూలోనే..
‘మనసుకి నచ్చింది..’ పాటలు చేస్తున్నప్పుడే అమ్మకి ఆరేళ్ల కిందటి పరిస్థితి మళ్లీ తిరగబెట్టింది. మెదడులోని కణితి చితికిపోయే దశలో ఉందన్నారు. ముందుగా తీసుకొచ్చాం కాబట్టి.. పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. కనీసం నెలన్నా ఆసుపత్రిలో ఉంటేకానీ మామూలు మనిషి కాదన్నారు. కానీ ఈలోపు ‘మనసుకి నచ్చింది’ రిలీజ్‌ డేట్‌ ప్రకటించేశారు. దర్శకురాలిగా మంజులగారి తొలి చిత్రం కాబట్టి ఆలస్యం కాకూడదు. పగలు అమ్మని చూసుకుంటూ రాత్రుళ్లు స్టూడియోలకి వెళ్లి రీరికార్డింగ్‌ పనులు ముగించా. అది కూడా అమ్మ బలవంతంమీదే. తన కారణంగా నేను ఏ అవకాశాలూ కోల్పోకూడదన్నది అమ్మ పట్టుదల. మాట్లాడలేకున్నా అతికష్టంపై సైగలు చేస్తూ నన్ను స్టూడియోకి వెళ్లమని పోరుతోంది. సంగీతదర్శకుడిగా నా ప్రతి అడుగుకీ స్ఫూర్తి అమ్మే కాబట్టి ఇలా మనసు రాయి చేసుకుంటున్నా!


‘మధురమే’ వెనక...

‘అర్జున్‌రెడ్డి’లోని ‘మధురమే..’ పాటని విన్న తెలుగు అభిమానులే కాదు అందరూ అభినందిస్తున్నారు. ‘ఈ మధ్యకాలంలో కర్ణాటక సంగీత ఛాయలతో ఇంత మోడర్న్‌ పాట వినలేదు..’ అంటున్నారు. ఆ పాట కోసం నేనూ, ఆ దర్శకుడూ మూడునెలలు శ్రమించాల్సి వచ్చింది. ఎంతో మథనం తర్వాత ఈ బాణీ వచ్చింది. నాకైతే బాగా నచ్చిందికానీ.. దర్శకుడికి ఏదో అసంతృప్తి. ‘వెంకటేశ్వర సుప్రభాతంలా ఉంది. యువతకి నచ్చకపోవచ్చు..’ అన్నారు. అతికష్టంపై ఆయన్ని ఒప్పించాను. వాయిద్య సంగీతం, గాత్రంతో హంగులు అద్దాక ‘చాలా బాగుందబ్బాయ్‌!’ అని మెచ్చుకున్నారాయన. ఆయనలా ఒప్పుకోకుంటే నా కెరీర్‌లో ఇంత మంచి పాట దక్కేది కాదేమో!


కళ్లనిండా నీళ్లే!

రెండు నెలలకిందటి మాట.. ‘వాలిబ రాజా’ అనే తమిళ సినిమా ఆడియో రిలీజ్‌. నేనే సంగీతదర్శకుణ్ని. కమల్‌హాసనే ఆవిష్కరించారు. ఆ రోజు నన్ను వేదికనెక్కి మాట్లాడమంటే మా అమ్మ గురించే చెప్పా! అమ్మ నాకోసం పడ్డ కష్టాలు కమల్‌హాసన్‌ని కదిలించినట్టే ఉన్నాయి. ఆయన ప్రసంగించేటప్పుడు అక్కడ ఆడిటోరియంలో ఉన్న మా అమ్మని ఉద్దేశించి.. ‘ ఈ వేడుక్కి హీరో మీవాడేనమ్మా! మీ కష్టం ఊరికే పోదు. తనలోని అణకువా, ప్రతిభా అతనికి గొప్ప పేరుతెస్తాయి...!’ అని చెప్పారు.అమ్మకయితే ఆ రోజు ఆనందంతో కళ్లనిండా నీళ్లే. నా పరిస్థితీ అదే.

- జె.రాజు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.