close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నింగీ నేలా మావే!

నింగీ నేలా మావే!

ఆధునిక యుగంలో స్త్రీ వంటింటికి మాత్రమే పరిమితమైపోవడం లేదు. అందుకే ఆమె వేసిన ప్రతి అడుగూ ప్రపంచ గతికీ, ప్రగతికీ మూలాధారంగా నిలుస్తోంది. అయినా నేటికీ తన ఉనికి కోసం, ఉన్నతి కోసం అలుపెరగని పోరాటం చేయాల్సి వస్తూనే ఉంది. కష్టాలకు వెరవకుండా, ‘ఆకాశంలో సగం అవకాశాల్లో సగం’ అనే మాటలను చెరిపి అన్నీ తానై అంతా తానై నిలవడానికి సమర శంఖం మోగిస్తోంది. మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ఆమె ప్రగతి ప్రస్థానంలో కొన్ని మైలు రాళ్లు...

రాజస్థాన్‌లోని గాంధీనగర్‌ రైల్వేస్టేషన్‌లో సిబ్బంది మొత్తం మహిళలే. ఆడవాళ్లు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్న దేశంలోని తొలి మహిళా రైల్వేస్టేషన్‌ ఇది. రోజుకు సుమారు ఏడువేలమంది ప్రయాణించే ఈ స్టేషన్‌లో సూపరింటెండెంట్‌ దగ్గర్నించి కానిస్టేబుల్‌ వరకూ అందరూ మహిళా ఉద్యోగులే ఉంటారు. ఇదే బాటలో ముంబయి సమీపంలోని మాతుంగా రైల్వేస్టేషన్‌ కూడా ప్రయాణిస్తోంది. మొత్తం 41 మంది సిబ్బంది ఉన్న ఈ స్టేషన్‌లో అన్ని విభాగాల్లోనూ మహిళలే విధులు నిర్వహిస్తున్నారు.

మొదటి రైలు డ్రైవర్‌
ఆసియాలోనే అత్యధిక ఉద్యోగులను కలిగిన రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. 1988లో రైలు డ్రైవర్‌గా ఉద్యోగంలో చేరిన సురేఖా యాదవ్‌ ఆసియాలోనే మొట్టమొదటి మహిళా ట్రైన్‌ డ్రైవర్‌గా రికార్డు సృష్టించారు. రైల్వే శాఖ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మహిళా ప్రత్యేక రైలును నడిపింది కూడా సురేఖనే. అంతేకాదు 2011 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలోనే అత్యంత కఠినమార్గంలో ప్రయాణించే ఫుణె-ముంబయి డెక్కన్‌ క్వీన్‌ ఎక్స్‌ప్రెస్‌కి లోకో పైలట్‌గా వ్యవహరించారు సురేఖ.

తొలి మహిళా పోస్టాఫీస్‌
తపాలా శాఖ 2013 మార్చి 8న మొత్తం మహిళా ఉద్యోగులే ఉండే విధంగా ఒక పోస్టాఫీసుని ఏర్పాటు చేసింది. పోస్టల్‌ స్టాంపులు అందించే వారి నుంచి నిర్వహణాధికారి వరకూ ఇక్కడ అంతా మహిళలే పనిచేస్తారు. తపాలా శాఖ అందించే అనేక పొదుపు పథకాల గురించి వినియోగదారులకు వివరంగా చెప్పడం, వారిని పొదుపు వైపు మళ్లించడంలో ఈ పోస్టాఫీసు మిగతా వాటికంటే మంచి రికార్డును నమోదు చేయడం గమనార్హం.

నింగిలోనూ...
ఎయిర్‌ ఇండియా మొదటిసారి అచ్చంగా మహిళా సిబ్బందితోనే ఏఐ174 విమానాన్ని నడిపింది. 2017 మహిళా దినోత్సవం సందర్భంగా ఇలా మొత్తం మహిళా ఉద్యోగులతోనే విమానాన్ని నింగిలోకి పంపించి రికార్డు సృష్టించింది. పైలట్‌ నుంచి ఎయిర్‌ హోస్టెస్‌ వరకూ మొత్తం 16 మంది సిబ్బంది, 250 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ విమానం సురక్షితంగా గమ్యస్థానాన్ని చేరుకుంది. దిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వరకూ సుమారు 15 గంటల పాటు సాగిన ఈ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందీ తలెత్తలేదన్నారు ఆ మహిళా సిబ్బంది.

దటీజ్‌ దివ్య...
అవకాశాలను ఆకాశంలో వెతుక్కుంది విజయవాడకు చెందిన దివ్య. ఆడవాళ్లు ఎందులోనూ తక్కువ కాదంటూ అతి పెద్ద బోయింగ్‌ 777 విమానాన్ని కమాండర్‌గా ఒంటిచేత్తో నడిపిందీ అమ్మాయి. అప్పటికే చిన్న వయసులో బోయింగ్‌ను నడిపిన వ్యక్తిగా రికార్డును సృష్టించింది దివ్య. అతిపెద్ద విమానంలో లోకమంతా చుట్టేస్తూ ఆకాశంలో చెరిగిపోని గెలుపు సంతకాన్ని చేసింది. ముప్ఫై ఏళ్ల వయసున్న అన్నె దివ్య బోయింగ్‌ విమానాలను నడిపే మహిళా ఆఫీసర్లలో ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలు.

నీటిలోనూ...
నేలపైనే కాదు నీటిలోనూ మహిళ తన సత్తా చాటింది. 2017 సెప్టెంబరులో ఆరుగురు మహిళా నేవీ సిబ్బంది పడవపై ప్రపంచ యాత్ర చేపట్టారు. మహిళలందరిలోనూ స్ఫూర్తినింపడానికి లెఫ్టినెంట్‌ కమాండర్‌ వర్తికా జోషి నాయకత్వంలో
గోవా నుంచి మొదలుపెట్టిన ఈ యాత్ర త్వరలో మారిషస్‌ చేరడంతో పూర్తవుతుంది. సముద్రంమీద సుదీర్ఘ యాత్రను ప్రారంభించిన ఈ బృందం ఇందుకోసం మూడేళ్లు కసరత్తు చేసింది.

రెండో మంత్రి...
ఏదేశానికైనా రక్షణ శాఖ ఎంతో కీలకం. దేశం లోపలా బయటా పొంచి ఉన్న ప్రమాదాలను పసిగట్టడంతోపాటు దేశానికి నిరంతరం భద్రత కల్పించడం దీని బాధ్యత. ఎంతో కీలకమైన ఈ శాఖను 35 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక మహిళ నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మలా సీతారామన్‌ భారతదేశంలో ఇందిరాగాంధీ తర్వాత రక్షణశాఖ బాధ్యతలు చేపట్టిన రెండో మహిళగా రికార్డు సృష్టించారు. ఇలా చెప్పుకుంటూపోతే లెక్కకు మిక్కిలి విజయాలు మహిళల సొంతం. అవకాశం రావాలే కానీ గెలుపు జెండా ఎగరేయడానికి ఎప్పుడూ మేం సిద్ధమే అంటున్న ఈతరం ధీరవనితలకు సెల్యూట్‌ చెయ్యాల్సిందే!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.