close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఒక్క అడుగు... లక్షమంది ఆకలి తీరుస్తోంది!

ఒక్క అడుగు... లక్షమంది ఆకలి తీరుస్తోంది!

కడలి ఆనంద్‌ కుమార్‌... విశాఖ నుంచి వెళ్లి బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తున్నారు. ఓ రోజు తాను పనిచేస్తున్న ప్రాంతం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ బడికి వెళ్లారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సమస్యల్ని పరిశీలించాలన్నది ఆయన ఆలోచన. అప్పుడు ఎదురైన ఓ అనుభవమే ఆ ఒక్క అడుగు వేసేలా చేసింది. అదే శ్రీసత్యసాయి అన్నపూర్ణ సేవా ట్రస్టుకి నాందిగా నిలిచింది. ఇప్పుడా ట్రస్టు లక్షపైచిలుకు నిరుపేద చిన్నారులకి ఉదయాన్నే అల్పాహారం అందిస్తోంది.

దయం అల్పాహారం తీసుకుంటేనే విద్యార్థుల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. చదివే సహనం, విశ్లేషించే తర్కం అలవాటవుతాయి. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో చాలామందికి పొద్దున ఇంత ముద్ద పెట్టేవాళ్లు ఉండరనే విషయం ఆనంద్‌కి ఆరోజు బడిలో ఎదురైన ఆ సంఘటన ద్వారానే తెలిసింది. 2011 డిసెంబరునాటి మాట.. బెంగళూరు శివారులో ఉన్న దొడ్డెబెలే ప్రాంతంలోని సర్కారు బడి అది. ఆనంద్‌ అక్కడికి వెళ్లే సమయానికి విద్యార్థులు జాతీయ గీతం పాడుతున్నారు. గీతం పూర్తికావస్తోందనగా ఐదుగురు  పిల్లలు ఉన్నపళంగా కళ్లు తిరిగి పడిపోయారు. అందులో ఒకమ్మాయి కూడా ఉంది. ఆనంద్‌ ఉపాధ్యాయులతోపాటే వాళ్ల దగ్గరకి పరుగెత్తుకుంటూ వెళ్లి పైకిలేపి నీళ్లు తాగించారు. ఆ పిల్లలు పొద్దున ఖాళీ కడుపుతో రావడం వల్లే ఇలా జరిగిందని తెలుసుకున్నారు ఆనంద్‌. తల్లిదండ్రులు వేకువనే కూలీనాలికి వెళ్లడం వల్ల వీళ్లకింత ముద్ద పెట్టేవాళ్లు లేక పగటిపూట పస్తుండిపోతున్నారట. ఈ విషయాలన్నీ తెలుసుకున్న ఆనంద్‌ అప్పటికప్పుడే ఆ పాఠశాల విద్యార్థులకి వారానికో రోజు అల్పాహారం అందిస్తానని చెప్పి వచ్చారు. నెలపాటు ఇడ్లీ, వడ, పాలూ అందించారు. అప్పుడే ‘ఈ పిల్లల ఆకలి ఒక్కరోజు తీరిస్తే చాలా? మిగతా రోజులు ఏం చేయాలి?’ అనే ఆలోచన ఆనంద్‌లో మొదలైంది. దాంతో స్నేహితులనూ ఇందులో భాగస్వాముల్ని చేసి వారంలో మిగతా ఐదు రోజులూ ఆ బడి పిల్లలకి అల్పాహారం అందించడం ప్రారంభించారు. ఆ తర్వాత వచ్చిన మరోప్రశ్నే శ్రీ సత్యసాయి అన్నపూర్ణ సేవా ట్రస్టుకి శ్రీకారం చుట్టేలా చేసింది.

ఏమిటా ప్రశ్న?
‘మనమంతా ఈ బెంగళూరు నగరంలో ఉద్యోగం చేస్తున్నంత వరకూ వీళ్లకి టిఫిన్‌ సరఫరా చేస్తాం. ఆ తర్వాత పరిస్థితేమిటీ?’ అన్నది ఆ ప్రశ్న. ఇందుకోసం మిత్రులతో చర్చించి ఓ సేవాపథకాన్ని రూపొందించారాయన. దానివల్ల ఆ బడి ఉన్న గ్రామంలోని స్థానికులకే అల్పాహారం వండే బాధ్యత
అప్పగిస్తారు. అందుక్కావాల్సిన సరకులు వీళ్లే అందిస్తారు. ఇందువల్ల పిల్లలకి ఆహారం వేడిగా పెట్టొచ్చు. ఈ ఆలోచనని అమలు చేస్తే అందరూ అద్భుతమన్నారు. ఎంతోమంది గ్రామస్థులు తమకి వంటచేసినందుకు కూలీ అక్కర్లేదంటూ స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఇది చూశాక తమ పాఠశాలల్లోనూ ఇలాంటి కార్యక్రమం చేపట్టాలని కోరుతూ ఇరుగుపొరుగు గ్రామాల ప్రజలూ అడిగారు. ఎంతోమంది స్వచ్ఛంద కార్యకర్తలుగా వచ్చారు. వీళ్లందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చేందుకే శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు 2015లో మొదలైంది. అప్పటికి వలంటీర్ల సంఖ్య 80 దాటింది. అల్పాహారం అందించే పాఠశాలల సంఖ్య 90కి చేరింది. గత ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, తెలంగాణలో యాదాద్రి, మహబూబ్‌నగర్‌, జగిత్యాలలో మాత్రమే కాకుండా మహరాష్ట్ర, తమిళనాడు, ఛŸత్తీస్‌గఢ్‌, హరియాణా, పశ్చిమబెంగాల్‌కి ఈ సేవని విస్తరించారు. అల్పాహారానికయ్యే ఖర్చులో అరవై శాతాన్ని ట్రస్టు అందిస్తే.. మిగతా నిధులు స్థానికులే ఏర్పాటుచేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ట్రస్టు అల్పాహారం అందిస్తున్న పాఠశాలల సంఖ్య 1504. లక్షకుపైచిలుకు విద్యార్థులు లబ్ధిదారులు!

చిన్నప్పటి నుంచే...
తనలో సేవాభావం చాలా చిన్నప్పటి నుంచే మొదలైందంటున్నారు ఆనంద్‌. టీనేజీలోనే తల్లిదండ్రులతోపాటూ విశాఖలోని మర్రిపాలెం సత్యసాయి సేవా సమితి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారట. ప్రతి ఆదివారం చీపుర్లు పట్టుకుని కింగ్‌ జార్జి ఆసుపత్రిని శుభ్రం చేసేవారు. వారాంతంలో మానసిక వికలాంగుల ఆసుపత్రికి వెళ్లి, వాళ్ల దుస్తులు ఉతికి ఇస్త్రీ చేసి ఇచ్చేవారు. ఐటీలో ఇంజినీరింగ్‌ చేశాక  బెంగళూరులో  స్థిరపడ్డారు. అక్కడా తన సేవా కార్యక్రమాలు అందించాలన్న ఆలోచనే ఇప్పుడింతగా విస్తరించింది. ట్రస్టు కార్యక్రమాలు భవిష్యత్తులో అల్పాహారాన్ని దాటి ముందుకెళ్లాలని ఆయన కోరుకుంటున్నారు. అందులో భాగంగా 40 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చారు. బడుల్లో మరుగుదొడ్లు నిర్మించి ఇస్తున్నారు, తాగునీటి సదుపాయాలూ కల్పించారు. చుట్టుపక్కల ఎన్నో సమస్యలు చూసి ‘మనవల్ల ఏమవుతుందిలే!’ అనుకుని మిన్నకుండిపోయేవారికి ఒక్క వ్యక్తి సదాశయంతో మొదలైన ఈ ట్రస్టు ప్రస్థానం... ఓ స్ఫూర్తిపాఠం!

- నర్సింగోజ్‌ మనోజ్‌కుమార్‌, ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.