close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పెద్దదిక్కు

పెద్దదిక్కు
- హోతా పద్మినీదేవి

కళ్ళల్లో చిప్పిల్లబోతున్న నీటిని బలవంతాన నిగ్రహించుకుంటూ ‘‘వెళ్ళొస్తానమ్మా’’ అంది సత్యవతమ్మ. ఆవిడ స్వరంలో దుఃఖపు జీర.

శ్యామల ‘‘మంచిది’’ అంది ముభావంగా.

‘‘నేనూ నీతో వస్తాను బామ్మా’’ కావ్య ఏడుస్తోంది. ఆమె కావ్యని లోపలికి లాగి తలుపు వేసింది.

ఎదుటి ఫ్లాట్‌ తలుపు తెరుచుకుని వనజ, ఆమె పిల్లలు బయటకొచ్చారు.

‘‘మా అందరికీ పెద్దదిక్కుగా ఉండేవారు పిన్నిగారూ! మీరిక్కడ నుంచి వెళ్ళిపోతున్నారంటే చాలా బాధగా ఉంది’’ అంది వనజ. ఆమె కళ్ళలో నీళ్ళు.

‘‘నేను ఎప్పుడైనా మిమ్మల్ని చూడ్డానికి వస్తాను. మీరూ నా దగ్గరకి రండి’’ అంది సత్యవతమ్మ.

‘‘పదమ్మా, టైమయిపోతోంది’’ సుధాకర్‌ తల్లిని హెచ్చరించాడు.

ఆవిడ లిఫ్ట్‌ వైపు నడిచింది. ఆవిడ మనసు కల్లోల సముద్రంలా ఉంది. తను వేరేచోట ఒంటరిగా ఉండాలనే ఊహే ఆమె మనశ్శరీరాలను వణికింపచేస్తోంది.

లిఫ్టు బయటకొచ్చి అపార్ట్‌మెంటు సెల్లార్‌లో పార్కు చేసి ఉంచిన కారు దగ్గరకి నడుస్తుంటే ఆ అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్న ఆడా మగా, పిల్లా పెద్దా ఆవిడకి చెమ్మగిల్లిన కళ్ళతో వీడ్కోలు పలికారు.

‘‘ఆరోగ్యం జాగ్రత్త పిన్నిగారూ!’’
‘‘మమ్మల్ని మరచిపోకండి!’’
సుధాకర్‌ తల్లిని మరోసారి హెచ్చరించాడు. ఆవిడ కారెక్కింది. కారు ముందుకి సాగిపోతోంది. కొడుకు పక్కనే కూర్చున్న ఆవిడ కళ్ళల్లో నీటితెరలు. మనసులో గతం తాలూకు జ్ఞాపకాల దొంతరలు.

సుధాకర్‌కి పద్దెనిమిదేళ్ళ వయసులో భర్తని కోల్పోయింది సత్యవతమ్మ. కొడుకుని పెంచి అతన్ని ప్రయోజకుణ్ణి చెయ్యడానికి అష్టకష్టాలూ పడింది. భర్త పెన్షన్‌కి సాయం- సరదాగా నేర్చుకున్న కుట్టుపనిని జీవనోపాధిగా మార్చుకుంది. ఉన్నంతలో పొదుపు చేసి, కొడుకు ఉన్నతికోసం అహర్నిశలూ శ్రమించింది. సుధాకర్‌ ఇంజినీరింగ్‌ మంచి మార్కులతో పాసయ్యాడు. అంతకుముందే క్యాంపస్‌ సెలక్షన్స్‌లో విప్రోలో అతనికి ఉద్యోగం వచ్చింది.

అతని ట్రైనింగ్‌ పీరియడ్‌ పూర్తయి హైదరాబదులో పోస్టింగ్‌ రాగానే అతనితోబాటు హైదరాబాదుకి మకాం మార్చింది. రెండేళ్ళ తరవాత సత్యవతమ్మ కొడుకు దగ్గర వివాహ ప్రస్తావన తెచ్చింది. సుధాకర్‌ తన కొలీగ్‌ శ్యామలని ప్రేమించాననీ ఆమెను పెళ్ళి చేసుకుంటాననీ చెప్పాడు. ఆవిడ అభ్యంతరపెట్టలేదు. శ్యామలని కూతురిలా చూసుకుందామని నిండు మనసుతో స్వాగతించిందామెని. కానీ, ఆమె ఆవిడలో అత్తగారినే చూసింది. తరాల అంతరాలు ఆ ఇద్దరిమధ్య తెలియని అడ్డుగోడని ఏర్పరిచాయి. ఆహారంలోనే కాదు, ఆహార్యంలో కూడా ఈతరం అమ్మాయి శ్యామల. ఆఫీసు నుంచి వస్తూ పిజ్జా ఆర్డర్‌ చేసి ఇంటికి తెస్తుంది. సుధాకర్‌ భార్య అభిరుచులకి అనుగుణంగా మారిపోవడం తన వంటని పాతకాలం వంట అని విమర్శించడం చూసి ఆవిడ కొత్తలో బాధపడినా, కాలక్రమేణా అలవాటు పడిపోయింది.

శ్యామలకి రానురానూ అత్తగారి ఉనికి కంటకప్రాయంగా మారింది. ఆధునికమైన త్రీ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌లో అత్తగారు దిష్టిబొమ్మలా కనిపించసాగింది. ఆవిడని తమ ఇంట్లోంచి ఎలా వెళ్ళగొట్టాలా అని ఆలోచించసాగింది.

* * *

ఒంటరిగా ఉన్న సత్యవతమ్మ కొడుకుని తలచుకుని కన్నీళ్ళు పెట్టుకుంటూనే ఉంది. పంచప్రాణాలూ కొడుకుపైనే పెట్టుకుని బతికింది. ఇప్పుడు ఆ కొడుకే తనని దూరంగా ఉంచాడు. ‘కోడలిపట్ల తనేమైనా తప్పు చేసిందా?’ అనే ఆత్మవిమర్శ మొదలైంది ఆవిడలో.

చాలామంది అత్తల్లా తనేమీ ఆమెని సాధించలేదు. నెలలో ఆ మూడు రోజులూ ఆమెని దేవుడి గదిలోకి రావద్దంది. శ్యామల వినలేదు. పంతంగా ఏదో పని ఉన్నట్టు ఆ గదిలోకి వచ్చేది. రెండు మూడుసార్లు కోడలికి మృదువుగానే చెప్పింది. అయినా ఆమె వినకపోవడంతో కొడుక్కి చెప్పింది భార్యకి నచ్చచెబుతాడని. సుధాకర్‌ తల్లినే కేకలేశాడు.

‘‘ఎక్కడా సర్దుకోలేవు. అంతా నీ హయాంలో జరిగినట్టే జరగాలంటావ్‌! అయినా, ఈ రోజుల్లో కూడా ఈ చాదస్తాలేమిటి?’’

సత్యవతమ్మ మారుమాట్లాడలేకపోయింది.

కొడుక్కీ కోడలికీ పిజ్జా తినాలనిపించడం తప్పుకాదు. ఆ విషయం ముందే చెప్తే వాళ్ళకోసం వంట వండేది కాదు. వాళ్ళకోసం వండిన అన్నాన్నీ కూరనీ ఫ్రిజ్‌లో పెట్టి మరునాడు వేడి చేసుకుని తను తినేది. మిగిలిన అన్నాన్ని పనిమనిషికిస్తే అది దుబారా ఖర్చు- శ్యామల దృష్టిలో.
‘‘మేము ఆఫీసు నుంచి వచ్చాక వంట చెయ్యకూడదా? సాయంకాలం ఆరింటికే వండెయ్యాలా? రోజూ అవే కూరలు తినలేక చస్తున్నాం’’ సుధాకర్‌ విసుగ్గా అన్నాడొకసారి.

‘‘మీకు ఎప్పుడైనా బయట తినాలనిపిస్తే నాకు ఫోన్‌ చేసి చెప్పండిరా. కావ్య చిన్నపిల్ల, రాత్రి తొమ్మిదింటిదాకా అన్నం తినకుండా ఉండలేదు’’ అందావిడ. అయినా కొడుకూ కోడలు ఆవిడ మాటని ఖాతరు చెయ్యలేదు.

ఆ అపార్ట్‌మెంట్స్‌లో అందరూ సత్యవతమ్మని పెద్దదిక్కుగా భావించేవారు. చిన్నచిన్న అనారోగ్యాలకి తనకి తెలిసిన చిట్కా వైద్యాన్ని చెప్పేదావిడ. వాళ్ళు ఆవిడ చెప్పినట్టు చేసి స్వస్థత పొందేవారు. తను చిన్నతనంలో నేర్చుకున్న రామదాసు కీర్తనల్నీ అన్నమాచార్య కీర్తనల్నీ ఆ అపార్ట్‌మెంట్స్‌లోని పిల్లలకి నేర్పేది.

ఒకరోజు సుధాకర్‌, శ్యామల ఆఫీసు నుంచి వచ్చేటప్పటికి ఆవిడ ఎదుటి ఫ్లాట్‌లో ఉంటున్న వనజకి ‘చరణములే నమ్మితి’ అనే రామదాసు కీర్తనని నేర్పిస్తోంది. కావ్య కూడా అక్కడే కూర్చుని వాళ్ళతో గొంతు కలిపి పాడుతోంది.

శ్యామలకి ఆ దృశ్యం చూసి అరికాలిమంట నెత్తికెక్కినట్టయింది.

‘‘ఈవిడగారు తనో ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి అనుకుంటోంది’’ విసురుగా గదిలోకి వెళ్తూ ‘‘కావ్యా!’’ అని గావుకేక వేసింది. కావ్య వణికిపోతూ లేచి గదిలోకెళ్ళింది.

‘‘చదువుకోకుండా లొల్లాయి పాటలు పాడుతున్నావా’’ ఛెళ్ళుమంటూ కొట్టిన శబ్దం. వెనువెంటనే కావ్య ఏడుపు వినిపించాయి.

‘‘నేను వెళ్ళొస్తాను పిన్నిగారూ!’’ వనజ మొహమాటపడుతూ లేచి వెళ్ళిపోయింది.

సత్యవతమ్మ పాలిపోయిన ముఖంతో కోడలి దగ్గరకెళ్ళి సంజాయిషీ చెబుతున్నట్టు అంది ‘‘కావ్య హోమ్‌వర్కు చేసేసిందమ్మా!’’

శ్యామల ఆవిడని మాడ్చేసేలా చూసి గది తలుపు ధడాల్న వేసింది. ఆ రాత్రి శ్యామల భర్తతో నిర్మొహమాటంగా సూటిగా తన మనసులోని ఉద్దేశాన్ని చెప్పింది.

‘‘మీ అమ్మని వృద్ధాశ్రమంలో చేర్పిస్తారో లేక వేరే ఇంట్లో ఉండమంటారో మీరే నిర్ణయించుకోండి. ఆవిడ కారణంగా మనమధ్య గొడవలు జరిగితే మీరు నన్ను నిందిస్తే సహించను.’’

సుధాకర్‌కి భార్య మాటలు బాగా తలకెక్కాయి. తల్లిని వృద్ధాశ్రమంలో చేర్పించి, లోకం దృష్టిలో తను విలన్‌ అవ్వాలనుకోలేదు. అందుకే కూకట్‌పల్లిలో చిన్న ఫ్లాటు చూసి తల్లిని అక్కడ ఉండమన్నాడు.

* * *

ఏడేళ్ళ కావ్యకి నాయనమ్మంటే ప్రాణం. ఆవిడ చెప్పే భారత భాగవతాలలోని కథలు వింటూ, ఆవిడ పక్కలో నిద్రపోయేది. రోజూ తను స్కూల్‌ నుంచి ఇంటికొచ్చేప్పటికి ఆవిడ గేటు దగ్గర కాచుకుని ఉండేది. ఇప్పుడావిడ వేరే ఇంట్లో ఉంటుందట. తను స్కూల్‌ నుంచి వచ్చి ఫస్ట్‌ఫ్లోర్‌లో ఉంటున్న భక్తవత్సలం తాతగారి దగ్గర కూర్చుని చదువుకోవాలట. రాత్రి ఎనిమిదిన్నరకి ఇంటికొచ్చి అమ్మ పొద్దుట వండిన అన్నాన్నీ కూరనీ వేడిచేసి నాలుగు ముద్దలు తినిపించి పడుకోబెడుతుంది. నాన్నమ్మలేని ఇల్లు నచ్చలేదు కావ్యకి. వారంరోజుల తరవాత ఎవరో ఆయా తమ ఇంట్లో ఉండి తనకి కావలసినవన్నీ చూస్తుందట.

కావ్య కోసమే ఎదురుచూస్తున్నాడు భక్తవత్సలం. ఆయన వయసు అరవై సంవత్సరాలు. నెరిసిన జుట్టుకి డై వేసుకోవడంతో వయసుని కనిపించనివ్వకూడదనే తాపత్రయం కనిపిస్తుంది. నాలుగేళ్ళ కిందట భార్య పోయాక, ఒంటరిగా ఉంటున్నాడు. పొద్దుటే పనిమనిషి వచ్చి ఇంటిపనితోబాటు వంట వండి వెళ్తుంది. రాత్రి ఎలక్ట్రిక్‌ కుక్కర్‌లో అన్నం వండుకుంటాడు. ఆయన కొడుకులిద్దరూ అమెరికాలో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. భార్య సంవత్సరీకం అవగానే మళ్ళీ పెళ్ళి చేసుకుందామనుకున్నాడాయన. మనుమల్ని ఎత్తుకోవలసిన వయసులో పెళ్ళికి సిద్ధపడ్డాడని లోకం ఆడిపోసుకుంటుందని భయపడి ఆ ఆలోచనని విరమించుకున్నాడు.

కావ్యని చూస్తూనే ‘‘రా కావ్యా!’’ అన్నాడు భక్తవత్సలం.

‘‘గుడీవెనింగ్‌ తాతగారూ!’’ అంది చేతిలోని స్కూలు బ్యాగుని కిందపెడుతూ.

‘‘గుడీవెనింగ్‌ బంగారూ! కాళ్ళూ చేతులూ కడుక్కునిరా, నీకు పాలు కలిపి ఇస్తాను’’ అన్నాడు.

‘‘బాత్‌రూమ్‌ ఎక్కడ?’’ అని అటూ ఇటూ చూస్తున్న కావ్యకి బాత్‌రూమ్‌ చూపించి ఆయన కిచెన్‌లోకి నడిచాడు.

కావ్య ఆయన కలిపి ఇచ్చిన హార్లిక్స్‌ తాగి పుస్తకాల ముందు కూర్చుంది.

‘‘ఇప్పుడేగా స్కూలు నుంచి వచ్చావ్‌, మళ్ళీ చదువా?’’

‘‘బోలెడు హోమ్‌వర్కు ఉంది తాతయ్యా’’ అంది పుస్తకాలలో నుంచి తలెత్తకుండానే.

ఆయన ఐపాడ్‌ ఓపెన్‌ చేసి అందులోకి చూస్తున్నాడు. కావ్య హోమ్‌వర్కు పూర్తిచేసి, ఆయన్ని టీవీలో కార్టూన్‌ చానల్‌ పెట్టమని అడిగింది.

మరో అరగంట తరవాత డోర్‌ బెల్‌ మోగిన శబ్దం విని తలుపు తీశాడు. ఎదురుగా శ్యామల.

‘‘కావ్యా, మీ అమ్మ వచ్చింది’’ పిలిచాడు.

కావ్య తన పుస్తకాల బ్యాగుని తీసుకుని బయటకొచ్చింది.

‘‘కావ్య మిమ్మల్ని విసిగించిందా బాబాయ్‌గారూ’’ అడిగింది శ్యామల మొహమాటంగా.

‘‘లేదు. స్కూలు నుంచి రాగానే హోమ్‌వర్కు చేసింది. కావ్య చాలా మంచిపిల్ల. బ్రిలియంట్‌ కూడా’’ అన్నాడాయన చిరునవ్వుతో.

‘‘బై తాతయ్యా’’ అంది కావ్య.

‘‘బై’’ అన్నాడాయన.

‘‘థాంక్స్‌ బాబాయ్‌గారూ’’ అంది శ్యామల.

ఆ రాత్రి శ్యామల సుధాకర్‌తో అంది- ‘‘భక్తవత్సలంగారు చాలా మంచి మనిషండీ. కావ్య చేత పాలు తాగించి, హోమ్‌వర్కు చేయించారు. ఈ రోజుల్లో సొంత పిల్లలకి చెయ్యడమే కష్టం. పక్కింటివాళ్ళకి ఎవరు చేస్తారు?’’

‘‘అవును. అయినా ఒక వారం రోజులు ఓపికపడితే పనిమనిషి వస్తుంది. ఇంటినీ కావ్యనీ ఆమెకి వదిలేసి మనం నిశ్చింతగా ఉండొచ్చు.’’

సుధాకర్‌ ఫ్రెండ్‌ నవీన్‌ ప్రాజెక్టు పని మీద అమెరికా వెళ్తూ వాళ్ళింట్లో పనిచేస్తున్న మనిషిని సుధాకర్‌కీ శ్యామలకీ పరిచయం చేశాడు. ఆమెకి నలభై అయిదేళ్ళ వయసు ఉంటుంది. మనిషి చురుగ్గా శుభ్రంగా ఉంది. పైగా ఆవిడ నమ్మకస్తురాలని నవీన్‌ సర్టిఫై చేశాడు.

కానీ, వారంరోజులలో వస్తానని చెప్పిన ఆమె, తల్లికి ఒంట్లో బాగులేని కారణంగా నెలరోజులదాకా రాలేనని చెప్పింది. ఆమె వచ్చేదాకా కావ్యని తమ ఇంట్లో ఉంచుకుంటానని భక్తవత్సలంగారు చెప్పారు.

వనజ కావ్యని తన పిల్లలతోబాటు చూసుకుంటానని శ్యామలతో చెప్పినా ఆమె అంగీకరించలేదు. వనజకీ శ్యామలకీ వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలూ లేవు. తన అత్తగారికి ఆత్మీయురాలైన ఆమెపై శ్యామల అకారణ ద్వేషాన్ని పెంచుకుంది.

* * *

సత్యవతమ్మకి కావ్యని చూడాలని మరీమరీ అనిపించసాగింది. ఆవిడ మనుమరాలికి ఇష్టమని జంతికలూ మైసూర్‌పాక్‌ చేసింది. కావ్య స్కూలు నుంచి రాగానే దాన్ని చూసి తిరిగి రావాలని ఆవిడ ఆలోచన.
ఆటో దిగి గేటు లోపలికి వస్తున్న ఆవిడని వాచ్‌మేన్‌ పలుకరించాడు ‘‘అమ్మా, బాగున్నారా?’’

ఆవిడ చిరునవ్వుతో అతన్ని పలుకరించి ‘‘కావ్య స్కూల్‌ నుంచి వచ్చిందా?’’ అనడిగింది.

‘‘వచ్చిందమ్మా. భక్తవత్సలంగారింట్లో ఉంది’’ చెప్పాడతను.

ఆవిడ మెట్లెక్కి పైకి వచ్చి, ఆ ఇంటి కాలింగ్‌బెల్‌ నొక్కింది. కొన్ని క్షణాల తరవాత తలుపు తెరుచుకుంది. అనూహ్యంగా అక్కడ ఆవిడని చూసిన భక్తవత్సలం ముఖంలో షాక్‌ తిన్న ఫీలింగ్‌.

‘‘బాగున్నారా?’’ ఆవిడ చిరునవ్వుతో పలుకరించింది.

‘‘ఆఁ!’’ అన్నాడాయన ముక్తసరిగా.

‘‘కావ్యని పిలుస్తారా?’’

‘‘లోపలికి రండి’’ ఆయన స్వరంలో ఇబ్బందికరమైన ఫీలింగ్‌. హాల్లో కావ్య పుస్తకాల బ్యాగ్‌ ఉంది. కావ్య కనిపించక ఆవిడ అటూ ఇటూ చూస్తూ కావ్య ఎక్కడుందని అడిగింది.

‘‘నిద్రపోతోంది’’ అన్నాడాయన.

కావ్యకి నాన్నమ్మ స్వరం వినిపించి ఒక్కంగలో బయటకొచ్చి ‘‘నాన్నమ్మా’’ అని ఆనందాతిరేకంతో చిరుకేక వేసింది.

కావ్య ముఖాన్ని పరిశీలనగా చూసిందావిడ. ఆమె ముఖం నిద్రలో నుంచి మేల్కొన్నదానిలా లేకపోవడం, భక్తవత్సలం చూపులలోని ఆశాభంగం, అసహనం చూసి ఆవిడ మనసు కీడు శంకించింది.

‘‘కావ్యా, నీ బ్యాగు తీసుకో... మనింటికి వెళ్దాం’’ అంది.

కావ్య హుషారుగా బ్యాగు అందుకుని ‘‘బై తాతయ్యా’’ అంది.

ఇద్దరూ సెకండ్‌ ఫ్లోర్‌లో ఉన్న తమ ఫ్లాట్‌ దగ్గరికొచ్చారు. ఫ్లాట్‌ తాళంపెట్టి ఉంది.

ఆవిడ తమ ఫ్లాట్‌ బయట కూర్చుని, మనుమరాలిని దగ్గరకి తీసుకుంది.

‘‘నీకు నిద్రొస్తోందా కావ్యా?’’

‘‘లేదు. నాకు నిద్ర రావడంలేదన్నా వినకుండా తాతయ్య పడుకోమని బలవంతపెట్టాడు’’ అంది కావ్య.

* * *

శ్యామల, సుధాకర్‌ ఇంటికొచ్చి ఎదురుగా ఉన్న సత్యవతమ్మని చూసి నిటారుగా అయ్యారు.

తల్లి రాకలోని ఆంతర్యాన్ని ఊహిస్తూ సుధాకర్‌, ‘మళ్ళీ ఈవిడెందుకొచ్చినట్టు’ అనుకుంటూ శ్యామల... ఇద్దరూ ఒక క్షణం ఆవిడని పలుకరించలేదు.

‘‘నువ్వెప్పుడొచ్చావమ్మా?’’ అడిగాడు సుధాకర్‌.

‘‘చాలాసేపయింది’’ అంది. ఈలోగా శ్యామల తలుపు తాళం తీసింది. అందరూ లోపలకి వెళ్ళారు.

‘‘వీధి తలుపు వేసిరా సుధా. శ్యామలా, ఇలా వచ్చి కూర్చో. మీ ఇద్దరితో నేను మాట్లాడాలి.’’

వీధి తలుపు వేసిన సుధాకర్‌ తల్లి పక్కన కూర్చున్నాడు. శ్యామల ముఖం చిట్లిస్తూ వచ్చి కూర్చుంది.

‘‘కావ్యని మీరు ఆఫీసు నుంచి వచ్చేవరకూ భక్తవత్సలంగారింట్లో ఎందుకుండమన్నారు?’’

‘‘పనిమనిషి ఇంకో పదిహేను రోజుల్లో వస్తుంది. అందాకా...’’ నసిగాడు సుధాకర్‌.

‘‘పోనీ, మీ అమ్మగారిని ఇంట్లో ఉండమనలేకపోయావా... కావ్యని చూసుకునేవారుగా?’’

‘‘కావ్యని చూసుకోవడానికి మా అమ్మ బెంగళూరు నుంచి ఇక్కడికి రావాలా? మా అన్నయ్యకి ఇద్దరు ఎదిగిన ఆడపిల్లలున్నారు. మా అన్నావదినలు ఆఫీసు నుంచి వచ్చేవరకూ వాళ్ళ బాధ్యత ఆవిడదే.

అయినా ఎందుకలా అడుగుతున్నారు’’

చిరాగ్గా అంది శ్యామల.

‘‘కావ్యా, ఆ తాతగారు నిన్నేం చేశారో చెప్పు. ఇందాక నాకు చెప్పినదంతా మీ అమ్మకి చెప్పు.’’

‘‘ఒకరోజు నా బుగ్గమీద ముద్దుపెట్టుకున్నారు. ఇంకోరోజు నా పెదాల మీద ముద్దుపెట్టుకున్నారు.’’

‘‘మొన్న ఏం జరిగిందో చెప్పు’’

‘‘నన్ను ఇక్కడ ముట్టుకున్నారు’’ కావ్య చూపించిన వైపు చూసి శ్యామల కళ్ళు భయోత్పాతంతో వెడల్పయ్యాయి. సుధాకర్‌ కాళ్ళకింద భూమి కంపించింది.

‘‘మరి ఆ విషయం మీ అమ్మతో చెప్పలేదా?’’ అడిగిందావిడ.

‘‘నేను ఆ తాతగారింట్లో ఉండనని చెప్తే మా అమ్మ విసుక్కుంది. మీ నాన్నమ్మ వెళ్ళిపోయిందని నీ ఏడుపు’’ అంది.

శ్యామల ముఖం పాలిపోయింది. శరీరంలో వణుకు.

‘‘ఇవాళ... ఇవాళేం జరిగిందో చెప్పు.’’

‘‘నేను స్కూలు నుంచి రాగానే ‘కాసేపు పడుకో’ అన్నారు. ‘నాకు నిద్ర రావడంలేదు తాతగారూ’ అన్నాను. వినకుండా నన్ను బలవంతంగా బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్ళి నన్ను పడుకోబెట్టి నా పక్కన ఆయన పడుకున్నారు.’’

‘‘తరవాత ఏం జరిగింది?’’ శ్యామల స్వరం కీచుగా ధ్వనించింది.

‘‘ఈలోగా కాలింగ్‌బెల్‌ మోగింది.

‘నువ్వు బయటకి రాకు, ఎవరొచ్చారో నేను చూసి వస్తాను’ అని బయటకి వెళ్ళారు. ఈలోగా నాన్నమ్మ గొంతు విని నేను బయటకొచ్చాను. నేనింక ఆ తాతగారింట్లో ఉండను. నాన్నా, నాన్నమ్మని మన దగ్గరే ఉంచుకుందాం. ప్లీజ్‌ నాన్నా’’ అమాయకంగా చెబుతున్న కావ్య, చివరి మాటలని దీనంగా అడిగింది.

శ్యామల వణికిపోతూ అప్రయత్నంగానే కూర్చున్నచోట నుంచి లేచి నిలబడింది.

‘‘కావ్యా, నీకిష్టమని మైసూర్‌పాక్‌ చేసి తెచ్చాను. తింటూ టీవీ చూడు’’ అని చేతిలోని డబ్బాని మనుమరాలికిచ్చింది. కావ్య టీవీ చూస్తుండగా కొడుకునీ కోడలినీ గదిలోకి రమ్మని సైగ చేసింది. యాంత్రికంగా ఆవిడని అనుసరించారిద్దరూ.

‘‘ఇవాళ ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో అర్థమయిందా? సెక్స్‌ అంటే ఊహామాత్రంగానైనా తెలియని, ఆ పసిపిల్ల తనకేం జరిగిందో కూడా తెలియని స్థితిలో వాడి పశువాంఛకి బలైపోయి... అసలు బతుకుతుందా?’’

శ్యామల వెక్కివెక్కి ఏడుస్తోంది.

‘‘ఆడదయితే చాలు... వయసుతో నిమిత్తం లేదు. పసిమొగ్గ, పండు ముసలి ఎవరూ మినహాయింపు కాదు. స్కూల్లో, ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు... ప్రమాదం పక్కింటి అంకుల్‌ రూపంలోనో, క్లాస్‌మేట్‌ రూపంలోనో పొంచి ఉంటుంది. ఆడపిల్లకి రక్షణ ఎక్కడుంది?’’ ఆవేదన ధ్వనించింది ఆవిడ స్వరంలో.

శ్యామల మనసులో పశ్చాత్తాపం. కావ్య మూడు నెలల పసికందుగా ఉండగా దాన్ని అత్తగారికి అప్పగించి, ఆఫీసుకి వెళ్ళిపోయేది. కన్నతల్లికంటే మిన్నగా, కంటికి రెప్పలా దాన్ని కాపాడిన అత్తగారిని తమ మధ్య వచ్చిన చిన్నచిన్న విభేదాలని భూతద్దంలోనుంచి చూసి, ఇంట్లోంచి వెళ్ళగొట్టింది. ఇవాళ సమయానికి ఆవిడ రాకపోయి ఉంటే... శ్యామల ఆపై ఊహించలేకపోయింది.

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగైపోయింది. అత్తమామలు ఊరిలో, కొడుకులూ కోడళ్ళూ సిటీలో.

‘‘ఇద్దరూ ఉద్యోగం చేయకపోతే మనలాంటి వాళ్ళకి ఇల్లు నడవదు. ఎదుగుతున్న ఆడపిల్లని పనిమనిషి మీద వదిలేసి వెళ్ళడం ఎంతవరకూ సబబు? ఎవరూ లేకపోతే తప్పదు... నేనుండీ పనికిరానిదాన్నయ్యాను’’ ఆవిడ స్వరం గాద్గదికమయింది.

శ్యామల, సుధాకర్‌ ఆవిడ పాదాలని పట్టుకున్నారు. ఆ ఇద్దరి కన్నీళ్ళు ఆవిడ పాదాలని అభిషేకిస్తున్నాయి.

‘‘నన్ను క్షమించండత్తయ్యా! మాకు పెద్దదిక్కుగా ఉన్న మిమ్మల్ని తూలనాడాను. అహంకారంతో మీ విలువ తెలుసుకోలేకపోయాను. కావ్య కోసమైనా మమ్మల్ని క్షమించి మీరు ఇక్కడే ఉండాలి. కాదనకండత్తయ్యా!’’

సత్యవతమ్మ కోడల్ని లేవదీసి గుండెలకి హత్తుకుంది. ఆవిడ స్పర్శలో ఓదార్పు, మీకు నేనున్నాననే భరోసా!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.